అరనవ్వు సుందరి..

ఆ మధ్య ఎప్పుడో పవన్‍కల్యాణ్‍తో కలిసి ప్రేక్షకులను ‘ఖుషీ’ చేసిన భూమిక గుర్తుందా?!. ‘అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా..’ అంటూ గిలిగింతలు పెట్టిన ఆమె తాజాగా చాలా కాలం తరువాత ‘యుఫోరియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె నటనకు మంచి ప్రశంసలే వస్తున్నాయి. మరి, ఈ ఢిల్లీ భామ ఏం చెబుతుందంటే..

అలా పరిచయమయ్యా..
నా సినీ ఎంట్రీ విచిత్రంగా జరిగింది. నేను నటించిన ఓ వాణిజ్య ప్రకటనను నాగార్జున గారి మేనకోడలు సుప్రియ చూసి ఉన్నపళంగా హైదరాబాద్‍కు రప్పించారు. అక్కడకు వెళ్లాక అప్పటికప్పుడే స్క్రీన్‍ టెస్ట్ చేసి వాళ్లు తీయబోయే ‘యువకుడు’ సినిమాకు నన్ను హీరోయిన్‍గా ఎంపిక చేశారు. అలా తెలుగు సినీ పరిశ్రమ ద్వారానే వెండితెరకు పరిచయం అయ్యాను.

నా అసలు పేరు అది కాదు..
చదువులో టాపర్‍ని కాకపోయినా.. డిస్టింక్షన్‍లో పాసయ్యే దానిని. తొమ్మిదవ తరగతిలో ఉండగానే గుర్రపు స్వారీ నేర్చుకున్నా. స్కూలులో జరిగే డిబేట్లూ, ఫ్యాషన్‍ ఫోలు అన్నింట్లో కచ్చితంగా పాల్గొనేదానిని. బొమ్మలా ముద్దుగా కనిపించే నన్ను చూసి అందరూ ‘గుడియా’ అని పిలిచేవారు. దాంతో ఇంట్లోనూ అదే పేరుతో పిలవసాగారు. ఇంకో విషయం ఏమి•ంటే నా అసలు పేరు రచనా చావ్లా. సినిమాల్లోకి వచ్చాక భూమికగా మారింది.

ఆ పాటొచ్చి పాతికేళ్లయినా..
మూడు సంవత్సరాల క్రితం నా స్నేహితురాలు, డబ్బింగ్‍ ఆర్టిస్ట్ సవితా రాధాకృష్ణన్‍ను అనుకోకుండా కలిశాను. అప్పుడు మాటల సందర్భంలో ‘ఖుషీ’ సినిమా రోజులను గుర్తుచేసుకున్నాం. అందులోని ‘అమ్మాయే సన్నగా.. ’ పాటకు సరదాగా ఇద్దరం కలిసి స్టెప్పులు వేశాం. ఆ వీడియోను సోషల్‍ మీడియాలో ఇలా పెట్టానో లేదో అలా విపరీతమైన స్పందన వచ్చింది. ఆ సినిమా వచ్చి పాతిక సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రంపైనా, నాపైనా చూపుతున్న అభిమానాన్ని నమ్మలేకపోయా.

అమ్మ నుంచి నేర్చుకున్నా..
మొదటి నుంచీ నేను కాస్త ఓపిగ్గా ఉండే మనిషినే. కానీ, బాబు పుట్టాక వాడి అల్లరికి ఒక్కోసారి చాలా కోపం వస్తుండేది. అప్పుడు అమ్మే నాకు సర్దిచెప్పేది. అలా అమ్మ ద్వారా తిట్టడం, కొట్టడం కంటే ఓర్పూ, సహనంతోనే పిల్లలను దారిలోకి తెచ్చుకోవచ్చని తెలుసుకున్నా.
నా భర్త భరత్‍ యోగీ టీచర్‍. రచయిత కూడా. ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నా సినిమాలను బాగా ఎంజాయ్‍ చేస్తారు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్లకు భోజనం పెట్టకుండా అసలు పంపించరు.

మనపై మనకు నమ్మకమే..
మొదటి నుంచీ నాకు స్వతంత్ర భావాలు ఎక్కువ. అందుకే చదువు అయిపోగానే నా కాళ్ల మీద నేను నిలబడాలని ఓ హార్డ్వేర్‍ కంపెనీలో కొన్నాళ్లు పనిచేశాను. అక్కడ నా సహోద్యోగులంతా నేను చాలా అందంగా ఉన్నానని, సినిమాల్లో ప్రయత్నించాలని చెప్పడంతో గ్లామర్‍ ఫీల్డ్లోకి రావాలనే ఆలోచన వచ్చింది. జీవితంలో ఏ విషయంలోనైనా సరే.. నిర్ణయాలు తీసుకునేటపుడు మంచిచెడు ఆలోచించాలి. స్వతంత్రంగా ఉండాలి. మనపై మనం నమ్మకంతో వ్యవహరించాలి. అదే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది.

Review అరనవ్వు సుందరి...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top