
కథానాయకులు అప్పుడప్పుడూ గతాన్ని నెమరువేసుకుంటారు. ఏళ్ల క్రితం నాటి సినిమా సంగతులను అభిమానులతో పంచుకోవడానికి ఒక్కోసారి ఏమాత్రం సంకోచించరు. అభిమానులకు మాత్రం వారేం మాట్లాడినా వినేందుకు ఇంపుగానే ఉంటుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇలాగే గతాన్ని పంచుకున్నారు. ‘తేజ్ ఐ లవ్‍యూ’ పాటల విడుదల వేడుక హైదరాబాద్‍లో జరిగింది. ఈ చిత్ర నిర్మాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత కేఎస్ రామారావు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి ఇలా గుర్తు చేసుకున్నారు- ‘ఈ సినిమా ఫంక్షన్‍కు రామారావు గారి కారణంగానే వచ్చాను. 80వ దశకంలో నాకు అత్యధిక హిట్లొచ్చినా, సూపర్‍హిట్ సాంగ్స్ వచ్చినా, నవలా కథానాయకుడిగా నేను పేరు తెచ్చుకున్నా, నాకు ‘మెగాస్టార్’ బిరుదొచ్చినా వాటన్నింటికీ కారణం కేఎస్ రామారావు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం.. అన్నీ వరుస విజయాలే. ‘స్టూవర్ట్పురం పోలీస్‍స్టేషన్’ సినిమాతో ఈ సంస్థకు పరాజయం ఎదురైంది. అందుకు కారణం నేనే. ఈ సినిమా దర్శకుడు అంతకుముందు ప్లాఫ్ సినిమా ఇచ్చారు. ఆయనను దర్శకుడిగా తీసుకోవాలని నేనే సజెస్ట్ చేసి ఈ సినిమా పరాజయానికి కారణమయ్యా. నిజానికి రామారావు మరో దర్శకుడిని తీసుకుందామా? అని అడిగారు. నేనే కాదని ప్లాఫ్‍కు కారణమయ్యాననే బాధ ఇప్పటికీ వెంటాడుతుంటుంది’ అంటూ చిరంజీవి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ‘చరణ్ కూడా ఈ బ్యానర్‍లో ఓ సినిమా చేయాలని ఉందని అన్నాడు. దర్శకుడు ఎవరైనా కానీ, కేఎస్ రామారావు బ్యానర్‍లో చరణ్ సినిమా ఉండి తీరుతుంది’ అని ఇదే వేదికపై మెగాస్టార్ ప్రకటించి అభిమానుల చేత కేరింతలు కొట్టించారు.
Review ఆ ప్లాఫ్‍కు నేనే కారణమేమో.