ఈ ఏడాది కొత్త తారల సందడి

సాధారణంగా కొత్త సినిమా వస్తుందంటేనే అభిమానులు, ప్రేక్షకులకు బోలెడంత ఆసక్తి. ఇక ఆ కొత్త సినిమాలో కొత్త తారలు నటించబోతున్నారంటే.. పైగా ఆ కొత్త తారలు నట వారసులైతే ఏర్పడే ఆసక్తి, అంచనాలు అంతా ఇంతా కాదు. 2025లో తెలుగు తెరపై పలువురు కొత్త స్టార్లు తళుకులీనబోతున్నారు. వారెవరో.. వారి నేపథ్యమేంటో ఓ లుక్కేయండి..

• నందమూరి కుటుంబం నుంచి కొత్త తారల రాక కొనసాగుతోంది. ఇప్పటికే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ గ్రాండ్‍ ఎంట్రీ సినిమా ప్రశాంతవర్మ దర్శకత్వంలో సెట్‍ కాగా. మరో రెండు కథలు కూడా కొలిక్కి వచ్చాయి. వీటిలో ఒకటి బాలకృష్ణ కథ సమకూరుస్తున్న ‘ఆదిత్య999 మ్యాక్స్’ కావడం విశేషం.
• నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‍ కుమారుడు తారక రామారావు ఎంట్రీ కూడా ఓకే అయింది. ‘సీతయ్య’, ‘దేవదాసు’ వంటి హిట్స్ అందించిన వైవీఎస్‍ చౌదరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే స్లాన్‍లో చిత్ర యూనిట్‍ ఉంది.
• దివంగత సూపర్‍స్టార్‍ కృష్ణ మనవడు, మహేశ్‍బాబు మేనల్లుడు అశోక్‍ గల్లా ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ కుటుంబం నుంచి మహేశ్‍ రెండో మేనల్లుడు సిద్ధార్థ్ గల్లాను హీరోగా పరిచయం చేసేందుకు కథకుడు గోపీమోహన్‍ ఇప్పటికే స్క్రిప్ట్ను సిద్ధం చేసుకున్నారు. ఈయనే దీనికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.
• అలాగే, మహేశ్‍ అన్న కుమారుడు, రమేశ్‍బాబు తనయుడు జయకృష్ణను తెరపైకి తెచ్చే సన్నాహాలు జరుగుతున్నాయని ఫిల్మ్నగర్‍ టాక్‍. జయకృష్ణ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిసింది.
• ఈ ఏడాది తెలుగు తెరపై సందడి చేయనున్న కథానాయికల్లో మన తెలుగు అమ్మాయిల హవా కనిపించనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‍ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‍గా ఇమాన్వీ ఎంపికైంది. మోడల్‍గా, ఇన్‍ఫ్లూయెన్సర్‍గా ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే ప్రభాస్‍ సరసన నటించే చాన్స్ కొట్టేయడం విశేషం.
• నందమూరి జానకిరామ్‍ తనయుడు తారక రామారావు కొత్త సినిమాలో ఓ తెలుగమ్మాయి కథానాయికగా పరిచయం అవుతోంది. స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి అయిన వీణారావు ఈ సినిమాలో తారక రామారావుకు జోడీగా కనువిందు చేయనుంది.
• ఈ ఫిబ్రవరి 14కు వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న విష్వక్‍సేన్‍ ‘లైలా’ ద్వారా తెలుగు తెరకు పరిచయవుతోంది ఆకాంక్షశర్మ. గతంలో మహేశ్‍బాబు, కార్తి, వరుణ్‍ధావన్‍ తదితరులతో వాణిజ్య ప్రకటనల్లో సందడి చేసిన ఈ భామ ‘త్రివిక్రమ’ అనే కన్నడ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
• తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‍ కుమారుడు జాసన్‍ సంజయ్‍ ఈ ఏడాది దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అదీ తెలుగు హీరో సందీప్‍ కిషన్‍తో ఈ సినిమా చేయనుండటం విశేషం.
• ఏపీ డిప్యూటీ సీఎం పవన్‍కల్యాణ్‍ ‘ఓజీ’లో ఆయన తనయుడు అకీరానందన్‍ కనిపించనున్నాడా? ఈ సినిమా ఫ్లాష్‍బ్యాక్‍లో పవన్‍ పాత్రలో అకీరా కనిపించనున్నారనే టాక్‍ నడుస్తోంది. అయితే దీనిపై స్పష్టత లేదు.
• ‘కన్నప్ప’ సినిమాతో ఈ ఏడాది పలకరించనున్న మంచు విష్ణు తన వారసులను ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారు. ఇందులో ఆయన తనయుడు అవ్రామ్‍, కుమార్తెలు అరియానా, వివియానా బాలనటులుగా పరిచయం కానున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‍ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Review ఈ ఏడాది కొత్త తారల సందడి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top