తెలుగు సినిమాకు పెట్టని‘కోట’.. కోట శ్రీనివాసరావు. తెలుగుతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ, బాలీవుడ్‍లోనూ తనదైన శైలిలో నటించి, మెప్పించిన లెజండరీ నటుడాయన. ఇటీవలే కన్నుమూసిన ఆయన వెండితెరపై హీరోగా తప్ప మిగతా అన్ని పాత్రల్లోనూ మెప్పించి.. మెరిశారు. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకున్నట్టు నటుడిగా ఆయా పాత్రల్లో ఇమిడిపోయి దానికి ప్రాణం పోయడంలో సిద్ధహస్తుడు కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమా పరిశ్రమలో నలభై సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ ఉన్న కోట నట జీవితం ఎందరికో ఓ జీవిత పాఠం అంటే అతిశయోక్తి కాదు. నేటి యువ నటీనటులతో పాటు సామాన్యులు సైతం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. వివిధ సందర్భాలలో ఆయన వ్యక్తం చేసిన, చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ.. ఆయనకు అర్పించే ‘నివాళి’ ఇదే..
అందరిలో ఒకడిగా ఉంటేనే మనుగడ..
తెలుగు సినీ పరిశ్రమ కావచ్చు.. మరేదైనా ఇతర రంగం కావచ్చు.. ఎక్కడైనా, ఎవరైనా పనిచేసే చోట రెండే క్యాడర్లు ఉంటాయి.
ఒకటి- ‘మనకు ఇండస్ట్రీ అవసరం’ అనే వాళ్లు 90 శాతం మంది ఉంటారు. రెండు- ‘ఇండస్ట్రీకి మనం అవసరం’ అనేవాళ్లు పది శాతం మంది ఉంటారు.
ఆ పది శాతం మందిలో మనం ఉండాలంటే ప్రతిభతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు పడం. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. నేటి యువత కూడా దీనిని ఆకళింపు చేసుకోవాలి. ఎవరు ఏ పని చేస్తున్నా అంకితభావంతో చేయాలి. అందుకు నిరంతర సాధన అవసరం. ‘ఫలానా వాడు పనిలో ఉంటే చిటికెలో అయిపోతుంది’ అనిపించుకోగలిగితే నువ్వు ఆ పది శాతం మందిలో ఒకడిగా ఉండగలుగుతావు. లేకపోతే 90 శాతం మందిలో ఒకడిగా మిగిలిపోతావు.
వయసు కేవలం సంఖ్య మాత్రమే..
నేను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టే సమయానికి నా వయసు సుమారుగా 40 ఏళ్ల వయసులో ఉన్నాను. అంటే అప్పటికే చాలామందికి సగం కెరీర్ అయిపోయి ఉంటుంది. అటువంటి వయసులో నేను పరిశ్రమలోకి వెళ్లి నాకు, నా వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ అందులో వైవిధ్యం చూపడానికి ప్రయత్నించాను. అలా కెరీర్‍లో ముందుకెళ్లాను. కాబట్టే మరో నలభై ఏళ్ల పాటు నటుడిగా కొనసాగగలిగాను. అంతేకాదు, నా పరిధుల్లో నాకు పూర్తి స్పష్టత ఉంది. తొలిరోజుల్లో సైడ్‍రోల్స్ చేస్తూ, విలన్‍గా, ఆ తరువాత హీరోగా ఎదిగిన ఎంతో మంది నటులున్నారు. 20 ఏళ్ల వయసులో కెరీర్ మొదలుపెట్టిన వాళ్లు ప్రయోగాలు చేయవచ్చు. అదే 40-50 ఏళ్లు దాటిన వ్యక్తి హీరోగా చేస్తామంటే అన్నిసార్లు అదృష్టం కలిసి రాకపోవచ్చు. ప్రయోగాత్మక పాత్రలు చేయడం వేరు.. కథానాయకుడిగా సినిమా భారం మోయడం వేరు. ఇప్పటికీ నా ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్తే ‘నటుడు కోట శ్రీనివాసరావు ఇల్లు’ అనుకుంటారు. అదే నేను తదుపరి కాలంలో హీరోగానో, దర్శకుడిగానో, నిర్మాతగానో అయి ఉంటే ‘వీడికెందుకురా ఈ పనులు’ అని పరాచికాలు ఆడి ఉండేవారు. నాకు అది ఇష్టం లేదు. హీరోగా చేయాలన్న ఆలోచన లేదు కాబట్టే ఇంకా జీరో కాకుండా ఉన్నాను. ఎవరికైనా, జీవితంలో ఏదో సందర్భంలో ఆత్మపరిశీలన అవసరం. ఇది నటులకైనా, సామాన్యులకైనా ఎవరికైనా అవసరమే. వయసును అడ్డంకిగా భావించకుండా జీవితంలో ముందుకు సాగాలి. మన స్థాయికి, చదువుకు సరిపోయే అవకాశాలు వచ్చే వరకూ వేచి చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏ రంగంలోనైనా ఎవరైనా రాణించవచ్చు.
కుటుంబమే ముఖ్యం
నేటి ఆధునిక జీవితంలో కుటుంబంతో గడిపే క్షణాలు తగ్గిపోతున్నాయి. అయితే ఆఫీస్.. లేదంటే ఎవరి సెల్‍ఫోన్లలో వాళ్లు మునిగిపోవడం. తల్లిదండ్రులుగా మన పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నామో ఎంతమంది లెక్కపెట్టుకుంటున్నారు? నేను కూడా నా జీవితంలో అతి ముఖ్యమైన కుటుంబాన్ని చాలా కాలం పాటు మిస్ అయ్యాను. సరైన సమయంలో కుటుంబంతో గడపలేకపోయాను. షూటింగ్స్ ఉండి నెలకో, రెండు నెలలుకో ఒకసారి ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒక కొడుకు. పిల్లల చిన్నతనంలో వారి అచ్చటా ముచ్చటా నేను ఇంటిపెద్దగా చూసుకున్నది లేదు. వారి వెనకాల ఉండి నడిపించింది లేదు. నా అదృష్టం ఏమిటంటే పిల్లలు మంచిగా చదువుకుని బుద్ధిమంతులు అయ్యారు. అయితే కాలం నా కొడుకును నాకు దూరం చేసింది. రోడ్డు ప్రమాదంలో నా కుమారుడు మరణించడం నాకు జీవితకాల విషాదం. నేను తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే.. నేటి తల్లిదండ్రులకు తమ పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరిక, ఓపిక ఉండటం లేదు. మనం ఎంతగానో అభిమానించే స్టార్ హీరోలు కూడా తమ కుటుంబానికి సమయం కేటాయిస్తుంటే, వాటిని చాలామంది సోషల్‍మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారే తప్ప, ‘మనం మన కుటుంబంతో ఉంటున్నామా? లేదా?’ అనేది చూసుకోవడం లేదు. ఉద్యోగ జీవితంతో పాటు కుటుంబానికీ సమ ప్రాధాన్యం ఇచ్చినపుడే కెరీర్‍లో మరింత బలంగా ముందుకు వెళ్లగలం. ఇది నేను మాత్రమే కాదు.. మానసిక నిపుణులు, గ్లోబల్ కంపెనీల సీఈవోలు చెప్పేది కూడా!.
చుట్టూ ఏం జరుగుతోందో చూడండి..
నిజంగా చెప్పాలంటే.. నేను జీవితంలో కోల్పోయిన మరో ముఖ్య విషయం- నాకు జనరల్ నాలెజ్డ్ లేకపోవడం. పొద్దునే ఐదింటికో, ఆరింటికో ఇంటి నుంచి షూటింగ్‍కు వెళ్లిపోయే వాడిని. తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటి ఏ రెండో అయ్యేది. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది కూడా తెలిసేది కాదు. నేనూ పట్టించుకోలేదు. ఈ రెండింటి గురించి తలుచుకుని నాలో నేను ఏడుస్తూ గడిపేవాడిని. నా జీవితం ఎలా అయిపోయిందంటే అప్పుడు తినడానికి టైమ్ లేదు. ఇప్పుడు తిందామంటే తినలేను. అప్పట్లో ఎవరు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదు. పుట్టిన రోజులు, పెళ్లి రోజులు.. ఏవీ పట్టేవి కావు. ఎవరికైనా టైమ్ వస్తే టైమ్ ఉండదని అర్థమైంది. ఆ రోజులు అలా గడిచిపోయాయి. నేటి కాలంలో మన పక్క పోర్షన్‍లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియనంత బిజీగా గడిపేస్తున్నాం. ఖాళీ లేదంటూ చిన్న చిన్న సరదాలు, వేడుకలు లేకుండా జీవితం గడిచిపోతోంది. యువకులుగా ఉన్నపుడు నచ్చింది తినడానికి, నచ్చింది కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. ఉద్యోగం వచ్చిన తరువాత తినడానికి సమయం ఉండదు. విశ్రాంతి తీసుకునే సమయంలో తిందామంటే ఆరోగ్యం సహకరించదు. అందుకే అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తేనే పరిపూర్ణ జీవితం ఆస్వాదించగలం.
మన టైమ్ వచ్చే వరకు ఓపిక పట్టాలి..
కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని, మన జీవితాన్ని నాలుగు అడుగులు వెనక్కి నెట్టేస్తుంటాయి. నా జీవితంలోనూ అదే జరిగింది. కెరీర్ తొలినాళ్లలో నాకు ఇష్టం లేకపోయినా, వచ్చిన అవకాశాలను వదులుకోవడం ఇష్టం లేక ధైర్యం చేసి కొన్ని పాత్రలు వేశాను. అలాంటిదే ‘మండలాధీశుడు’లోని ఒక పాత్ర. అది ఎన్టీఆర్‍ను అనుకరిస్తూ పోషించిన పాత్ర. ఆ పాత్ర తాలూకు ప్రభావం నన్ను దాదాపు సంవత్సరం పాటు ఇబ్బందిపడేలా చేసింది. అవమానాలు, దాడులు సరేసరి.. ఆ తరువాత అవకాశాలు రాక చాలా ఇబ్బందిపడ్డాను. అయినా, ధైర్యంతో ముందుకుసాగాను. అంతేకానీ, ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోలేదు. కొన్ని రోజులు మనకు కాలం కలిసి రానపుడు మనవంతు వచ్చే వరకు ఓపికగా వేచి చూడాలి. అదే సమయంలో చేసే ప్రయత్నాన్నీ ఆపకూడదు. నేటి యువతలో లోపిస్తున్న ప్రధాన అంశమిదే. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోతున్న వారందరూ ఇలాంటి వాటి నుంచి నేర్చుకోవాలి.
క్షమాపణ కోరితే తప్పేముంది?
‘సారీ’.. క్షమాపణ.. చిన్న పదమే. కానీ, ఇది చెప్పడానికి చాలామందికి నోరు రాదు. చంద్రుడిపైకి వెళ్లగలుగుతున్నాం కానీ, తోటి వారి హృదయాల్లోకి తొంగిచూడలేకపోతున్నాం. ‘మండలాధీశుడు’లో ఇంకెవరైనా నటించి ఉంటే, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లే సాహసం చేసేవారు కాదు. కానీ, నేను ధైర్యం చేసి, ఆ మహానటుడు ముందుకు వెళ్లి నిలబడ్డాను. ఆయన కాళ్లపై పడ్డాను. నటనను దైవంగా భావించే ఎన్టీఆర్ నన్ను చూడగానే ఆప్యాయంగా పలకరించారు. గొప్ప పాత్రలు పోషించాలని ఆశీర్వదించారు. ఆనాడు ఆయనిచ్చిన ప్రోత్సాహం తరువాత కాలంలో నాకెంతో స్థైర్యాన్ని ఇచ్చింది. ఆ సంఘటనతో గొప్ప నటుడి పాత్రను అనవసరంగా అనుకరించానేమో అనే బాధ తొలగిపోయింది. పొరపాట్లు లేకుండా ఏ ఒక్కరి జీవితమూ సాగదు. అటు కుటుంబం, ఇటు ఉద్యోగ జీవితంలో ఇలాంటివి సహజం. అలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటూ, ఒకవేళ ఎప్పుడైనా జరిగితే, మనస్ఫూర్తిగా సారీ చెబితే ఎదుటి వారిలో మనపై గౌరవం మరింత పెరుగుతుంది. సారీ చెప్పకే ఎన్నో బంధాలు బీటలు వారిపోతున్నాయి.
బాధపడుతూ కూర్చుంటే..
నా కొడుకు మరణం నాకు చాలా పెద్ద దెబ్బ. అదెంతో బాధను మిగిల్చింది. ఆత్రేయ గారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని’. జీవితం వెళ్లిపోయింది. వెళుతోంది.. ఈ వయసులో పితృశోకం భరించవచ్చు. పుత్ర శోకం భరించలేం. తండ్రిగా ఆ బాధను అనుభవిస్తున్నాను. ఈ దు:ఖాన్ని ఎవరూ పూడ్చలేరు. దేవుడు ఈ కష్టం ఇచ్చాడని ఏడుస్తూ కూర్చుంటే నన్ను నమ్ముకున్న వారు ఉన్నారు.. వాళ్లేమైపోతారు. ఎలాగూ తప్పదు కాబట్టి.. నడిపించాలి అంతే. బాధను దిగమింగుకుని ముందుకు సాగడం తప్ప వేరే దారేముంది?










































































































































































































































Review జీవిత పాఠాల ‘కోట’.