పందెం కోళ్లు

అసలే కొత్త సంవత్సరం ప్రారంభ నెల.. ఆపై మూడు రోజుల సంక్రాంతి పండుగ.. తెలుగు ఇండస్ట్రీ ఆ సందడి ఆనందాన్ని మరింత కిక్కెక్కించనుంది. ఈ సంక్రాంతికి వెండితెర అగ్ర సినీ తారల సినిమాల మెరుపులతో తళుకులీననుంది. మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో..’, రజినీకాంత్ ‘దర్బార్’, విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ ప్రధానంగా బరిలో ఉంటే.. మరో నాలుగైదు సినిమాలు సంక్రాంతి తరువాత విడుదల కానున్నాయి. సంక్రాంతికి ఏటా భారీగా సినిమాలు రిలీజ్ కావడం, వాటి మధ్య పోటీ నెలకొనడం మామూలే. ఈసారీ ఈ పోటీ మరింత రంజుగా మారింది. అభిమానులు తమ హీరోల సినిమాల కోసం ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు. ఈ సంక్రాంతి- 2020కి విడుదల కానున్న సినిమాల విశేషాలు…
అల వైకుంఠపురములో..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘అల వైకుంఠపురములో..’. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో ‘అరవింద సమేత వీర రాఘవ’ రూపొందించిన త్రివిక్రమ్.. ‘అల వైకుంఠపురములో సైతం అదే బ్యాక్డ్రాప్తో తెరకెక్కించడం విశేషం. ఇందులో అల్లు అర్జున్ది పోలీసు పాత్ర అని, తనదైన శైలిలో ఫ్యాక్షనిజాన్ని ఎలా రూపుమాపాడనేదే కథాంశమని అంటున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా పూజాహెగ్డే నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు అన్నిచోట్లా మారుమోగుతున్నాయి. ముఖ్యంగా ‘రాములో.. రాములా..’, ‘సామజవర గమన..’ పాటలు అందరి స్మార్ట్ఫోన్లలో రింగ్ టోన్లుగా మారిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటలు మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకోవడం రికార్డు సృష్టించింది. ఇంకా అలనాటి నటి టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్ వంటి స్టార్స్తో ఈ మూవీకి అమాంతం క్రేజ్ పెరిగిపోయింది.
విడుదల తేదీ: జనవరి 12, 2020
సరిలేరు నీకెవ్వరు..
సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా ఈ సంక్రాంతికి వస్తున్న మరో భారీ చిత్రం.. ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి కథ, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెల కొని ఉన్నాయి. మహేశ్బాబు ఇందులో ఆర్మీ మేజర్ ‘విజయ్ కృష్ణ’ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మండన్నా కథానాయికగా అలరించనుంది. అలనాటి ‘లేడీ అమితాబ్’ విజయశాంతి ఇందులో ప్రత్యేక పాత్రలో కని పించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇంకా •

ప్రకాశ్రాజ్, సత్యదేవ్, ప్రదీప్ రావత్, రాజేందప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక, మిల్క్ బ్యూటీగా పేరొందిన తమన్నా ప్రత్యేక గీతంలో అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఇప్పటికే ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తున్నాయి. మహేశ్బాబు కూడా ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో పాలుపంచుకోవడం విశేషం.
విడుదల తేదీ: జనవరి 11, 2020
రజినీకాంత్ ‘దర్బార్’
మహేశ్బాబు జనవరి 11న, అల్లు అర్జున్ జనవరి 12న వెండితెరపై సవాల్ విసురుతోంటే.. అంతకంటే ఒకరోజు ముందే సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీ కాంత్ ‘దర్బార్’తో సందడి చేయడానికి రెడీ అయిపోయారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి.. రజినీకి ఉన్న క్రేజ్ కూడా తోడవడంతో ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ చేస్తోంది. అనిరుధ్ రవిచంద్ర సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాటలు ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు మాస్ గీతాలు ఫ్యాన్స్ను కేరింతలు కొట్టిస్తున్నాయి. రజినీ సరసన నయనతార నటిస్తుండగా, సునీల్షెట్టి, నివేదా థామస్ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. రజనీ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘ఆదిత్య అరుణాచలం’గా సందడి చేయనున్నారు.
విడుదల: జనవరి 10, 2020
జాతిరత్నాలు
ఈ సంక్రాంతికి అగ్రహీరోల చిత్రాల మధ్యలో విడుదల అవుతున్న చిన్న చిత్రం ‘జాతిరత్నాలు’. ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్. కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో మూడింతలు నవ్వులు పుట్టిస్తారని చిత్ర బృందం చెబుతోంది. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాగ్ అశ్విన్, స్వప్నాదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేనేత కార్మికుడు, పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’లో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించి ఆకట్టుకున్న నేపథ్యంలో.. ‘జాతిరత్నాలు’పై కూడా అంచనాలు నెలకొన్నాయి. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ కావడంతో చిత్ర విజయంపై యూనిట్ నమ్మకంగా ఉంది.
విడుదల: జనవరి 10, 2020
గూఢచారి- 2
అడవి శేశ్ విలక్షణ నటుడు. చిన్న బడ్జెట్తో రూపొందే ఈయన సినిమాలు పెద్ద హిట్ కొడుతుంటాయి. పైగా రొటీన్ జోనర్కు భిన్నంగా సినిమాలను రూపొందించే శేశ్.. గూఢచారి సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా గూఢచారి 2 పేరుతో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలకు సవాల్ విసురుతోందీ చిత్రం. స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూరుస్తున్నారు. రాహుల్ పాకాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విడుదల: జనవరి 11, 2020
ఎంత మంచివాడవురా!
ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగే నందమూరి కల్యాణ్రామ్.. ‘ఎంత మంచివాడవురా!’ అంటూ సంక్రాంతి సినిమాల పోటీలో నిలుస్తున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు సతీశ్ వేగ్నేష దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్పై ఈ సినిమా రూపుదిద్దుకుంది. కల్యాణ్రామ్ సరసన మెహరీన్ కథానాయికగా నటించింది. గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్. సతీస్ వేగ్నశ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో గతంలో అతని సినిమాలను దృష్టిలో పెట్టుకుని హైప్స్ క్రియేట్ అవుతున్నాయి.
విడుదల: జనవరి 15, 2020
శ్రీకారం
శర్వానంద్ మరోసారి కుటుంబ కథాచిత్రంలో నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. కిశోర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మికీ జే మేయర్ సంగీత దర్శకుడు. 14 రీల్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా పెద్ద సినిమాలకు పోటీ ఇవ్వనుంది.
విడుదల: జనవరి 14, 2020

Review పందెం కోళ్లు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top