
చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తుండిపోయే పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటి- సాయిపల్లవి. ఇటీవలే ‘తండేల్’ సినిమాతో నాగచైతన్య సరసన మెరిసిన ఈ సహజ అందాల తార టాలెంట్‍లోనే కాదు పర్సనాలిటీ పరంగానూ చాలా డిఫరెంట్. తనకు నచ్చిన పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ‘నాడి’ పట్టుకోవడంలో ఎక్స్పర్ట్ అయిన సాయిపల్లవితో ఇప్పటి వరకు నటించిన హీరోలు.. ఆమె గురించి ఏమంటున్నారంటే..
ఇంత సహజత్వమా?:సూర్య
సాయిపల్లవి వంటి నటిని నా కెరీర్‍లో ఇంతవరకు చూడలేదు. ఆమె హావభావాలు.. నటన.. ఎంత సహజంగా ఉంటాయో చెప్పలేను. ఒక సన్నివేశాన్ని ఎంత గొప్పగా పండించినా.. ఇంకా మెరుగ్గా ఎలా చేయాలా? అని తపిస్తుంటుంది. ఈ కారణంగా షూటింగ్ సమయం వృథా అవుతుందని బాధపడుతుంటుంది కూడా. నటన పట్ల ఇంతటి అంకితభావం కలిగిన హీరోయిన్లు చాలా అరుదు.
డ్యాన్స్తో దుల్లకొట్టేస్తుంది..: నాగచైతన్య
సాయిపల్లవితో నటించాలన్నా.. డ్యాన్స్ చేయాలన్నా మాటలు కాదు. ముఖ్యంగా ఆమెతో డ్యాన్స్ చేయాలంటే కంగారు వచ్చేస్తుంది. నా డ్యాన్స్ మెరుగుపడటానికి ఆమె ఒక కారణం. సినిమాను మొత్తం స్క్రిప్ట్ స్థాయిలోనే మనసుతో చూసి.. రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పేస్తుంది. ఒక ప్రేక్షకురాలిగా ఆయా సన్నివేశాలను కరెక్ట్గా జడ్జ్ చేస్తుంటుంది.
ఎవరైనా ఫిదా కావాల్సిందే: నాని
నన్ను చాలామంది నాచురల్ స్టార్ అంటారు. కానీ, సాయిపల్లవి ఈ విషయంలో ఇంకా అడ్వాన్స్డ్. తన అద్భుతమైన సహజ నటనతో ఎవరినైనా ఇట్టే ఫిదా చేసేస్తుంది. తను డ్యాన్స్ చేస్తుందంటే అలా చూస్తుండి పోవాల్సిందే. అంతలా మాయ చేస్తుంది. సాయిపల్లవి హైబ్రీడ్ పిల్ల. సెట్స్లో తన వల్ల చిన్న ఇబ్బంది కలిగినా ఏమాత్రం భేషజం లేకుండా ఒకటికి పదిసార్లు సారీ చెబుతుంది. ఆమెది విలక్షణ వ్యక్తిత్వం.
జడ్జిమెంట్ బాగుంటుంది: శర్వానంద్
సాయిపల్లవి నాకు మంచి ఫ్రెండ్. స్క్రిప్ట్ ముందేసుకుని బాగుందా? లేదా? అనేది క్షణంలో చెప్పేస్తుంది. తన జడ్జ్మెంట్ బాగుంటుంది. చాలా కరెక్ట్గా ఉంటుంది. భక్తి ఎక్కువ. షూటింగ్ గ్యాప్‍లో గుడికి వెళ్దామంటే చాలు.. మారు మాట లేకుండా వచ్చేస్తుంది. ఇద్దరం కలిసి చాలా ఆలయాలకు తిరిగాం.
Review ‘పల్లవి’ంచవా నా గొంతులో...