మమితా బైజు.. ఈ అమ్మాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయిల క్రష్ అయిపోయింది. మలయాళ సూపర్‍హిట్ ‘ప్రేమలు’తో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయిన ఈ భామ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి జోరుమీదున్నది. మరి, ఈ మలయాళ కుట్టి చెబుతున్న చిలిపి కబుర్లేమిటో చదివేయండి..
నేను పుట్టింది కేరళలోని కొట్టాయంలో. నాన్న డాక్టర్. అమ్మ గృహిణి. అన్నయ్య ఉన్నాడు. కూచిపూడిలో అభినివేశం ఉంది. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీ చదువుతున్నా.
నా పేరు చెప్పగానే చాలామంది ‘మమతా.. మమితా?’ అని అడుగుతారు. నా పేరు మమితనే. మమిత అంటే మిఠాయి అని అర్థం. నిజానికి నా అసలు పేరు నమిత. కానీ, ఆసుపత్రి సిబ్బంది నా బర్త్ సర్టిఫికెట్‍లో మమిత అని తప్పుగా రాశారు. మా వాళ్లు సరిగా గమనించలేదు. తీరా స్కూల్‍లో చేర్పించడానికి వెళ్తే.. అప్పుడు ఈ పేరు బయటపడింది. చేసేదేమీ లేక ఇక ఆ పేరే ఉంచేశారు. అలా నాది కాని పేరు నాదైపోయింది.
• ‘ప్రేమలు’ నా తొలి సినిమానా అందరూ అడుగుతున్నారు. నాకిది పదహారవ సినిమా. తొమ్మిదో తరగతి నుంచే నటించడం ప్రారంభించాను. ఓసారి స్కూలులో ఇచ్చిన నృత్య ప్రదర్శన చూసిన మా నాన్న స్నేహితుడైన ఓ నిర్మాత ‘సర్వోపరి పాలక్కారన్’ చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తరువాత వరుసగా ‘హానీబీ-2: సెలబ్రేషన్స్’, ‘డాకినీ’, ‘కృష్ణం’, ‘వరతన్’, ‘స్కూల్‍డైరీ’ వంటి విభిన్న చిత్రాల్లో సహాయక పాత్రలు వేశాను.
• 2021లో వచ్చిన ‘ఖో ఖో’ నా కెరీర్‍ను మలుపు తిప్పింది. ఇందులో నేను చేసిన టీమ్ కెప్టెన్ పాత్రకు మంచి పేరొచ్చింది. ఉత్తమ సహాయనటిగా కేరళ ఫిలిమ్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నాను. అలాగే, ‘రెబల్’తో తమిళంలో అరంగేట్రం చేశాను. దానికి ముందు తమిళంలో సూర్యతో ఓ సినిమా చేశాను. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.
• తెలుగు సినిమాలతో చిన్నప్పటి నుంచే నాకు పరిచయం ఉంది. కొన్ని అనువాద చిత్రాలు, మరికొన్ని డైరెక్ట్ సినిమాలు చూశాను. ‘మగధీర’ నా ఫేవరెట్ సినిమా. మలయాళంలో ‘ధీర’ పేరుతో డబ్ అయింది. పరీక్షలున్నా ఆ సినిమా కోసం సమయం కేటాయించేదానిని. నాకు నచ్చిన సినిమాల్లో ‘ఈగ’ కూడా ఉంది. అది ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు.
• బన్నీ (అల్లు అర్జున్)కి నేను వీరాభిమానిని. ఆయన నటించిన ప్రతి సినిమాను పదిసార్లకు మించే చూశా. అల్లు అర్జున్ సినిమాల్లో ఎలాంటి డ్రెస్‍లు వేస్తే అలాంటివే కొని వేసుకునేదాన్ని.
Review బన్నీ అంటే ఇష్టం.