
ఏదైనా సినిమా ప్రారంభమైందంటే.. కొన్ని సన్నివేశాలో.. లేదా కొంత షూటింగ్ పార్టో విదేశాల్లో జరగడం రివాజు. ఫలానా చిత్ర యూనిట్ ఫలానా దేశానికి షూటింగ్ నిమిత్తం వెళ్తుందనేది చాలా కామన్. అయితే ఇప్పుడు లోకల్‍గానే చాలా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్ వేదికగా భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. రాజధాని పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని చిత్రాల విశేషాలివీ..
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’ కోసం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ముచ్చింతల్‍లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకమైన సెట్‍ను వేశారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‍ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
• ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‍స్టార్ పవన్‍కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కూడా శంషాబాద్ ముచ్చింతల్‍లో జరుగుతోంది. పవన్‍తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
• రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‍లోని చిత్రం ఆర్‍సీ-16 (వర్కింగ్ టైటిల్)లో రాత్రి వేళ వచ్చే కీలక సన్నివేశాలను హైదరాబాద్‍లోని భూత్ బంగ్లాలో చిత్రీకరిస్తున్నారు. క్రీడా స్టేడియం, ఫ్లడ్‍లైట్స్ వెలుతురులో ఈ క్రీడా నేపథ్యంలో గల సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా విడుదల అవుతుందని సమాచారం.
• బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ రూపొందించిన భారీ సెట్‍లో యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
• పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాజాసాబ్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్‍నగర్‍లో జరుగుతోంది. చిత్ర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
• ఇక, ప్రభాస్ మరో చిత్రం ‘ఫౌజి’ రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‍లో తెరకెక్కిస్తున్నారు. బ్రిటిష్ కాలపు కథాంశం గల ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు.
• మహేశ్‍బాబు, రాజమౌళి కాంబోలోని సినిమా హైదరాబాద్‍లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. అందుకోసం ప్రత్యేక సెట్ వేశారు. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ కెన్యాకు షిఫ్ట్ కానుంది.
• సాయిదుర్గాతేజ్ ‘ఎస్‍వైజీ’(సంబరాల ఏటిగట్టు) సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఇది విడుదల కానుంది.
• హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే నాని ‘హిట్: ది థర్డ్ కేస్’ తెరకెక్కుతోంది. హీరో, హీరోయిన్లు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది మే 1న ఈ సినిమా విడుదల కానుంది.
• ఇంకా పేరు పెట్టని అల్లరి నరేశ్ తాజా చిత్రం షూటింగ్ కూడా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది.
• నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభూ’ షూటింగ్‍లోని కొంత పార్ట్ను హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో జరుపుతున్నారు. గుర్రపు స్వారీ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ వేసవిలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
Review షూట్ ఎట్ హైదరాబాద్.