
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే చాలా స్పెషల్. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి కాస్త హిట్ టాక్ వస్తే చాలు వసూళ్లు బాగుంటాయనేది నమ్మకం. ఈ నేపథ్యంలో చాలామంది హీరోలు, దర్శక- నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి పోటీ పడతారు. అయితే ఫైనల్ బెర్త్ దొరికేది కొందరికే. మరి, 2025 సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిత్రాలు ఇప్పటికే ఖరారైపోయాయి.
సంక్రాంతి వస్తోందంటే సినీ ప్రియులకు పండగే. భారీ బడ్జెట్ సినిమాలు, అగ్రహీరోల చిత్రాలు సంక్రాంతి వేదికగానే విడుదలవుతుంటాయి. ఆయా హీరోల అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సంక్రాంతి సినిమాలపై ఎంతో ఆసక్తి, ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. మరి ఈ సంక్రాంతికి ట్రిఫుల్ ధమాకానే.. ఎలాగంటారా? బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’, గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ ‘గేమ్ చేంజర్’ , విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే సంక్రాంతి బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇక కాలు దువ్వడమే తరువాయి. ఇంకా పొంగల్ బరిలో దిగుతున్న చిత్రాల విశేషాలు..
నిజానికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ ఈ ఏడాది సంక్రాంతికి మొదటగా ఖర్చీఫ్ వేసిన సినిమా. అయితే, అనూహ్యంగా ఆయన తనయుడు రామ్‍చరణ్ ‘గేమ్‍చేంజర్’తో సీన్ మొత్తం మారిపోయింది. సంక్రాంతి గేమ్‍నే చేంజ్ చేసేసిన సినిమా ఇది. ఎందుకంటే 2024 డిసెంబర్‍లో గేమ్‍చేంజర్ విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనుకోకుండా చిరంజీవి ‘విశ్వంభర’ స్థానంలోకి ‘గేమ్‍చేంజర్’ చేరింది. దీంతో ఈ ఏడాది చిరంజీవి సినిమా సంక్రాంతికి లేనట్టే. తమిళ అగ్ర దర్శకుడు శంకర్- రామ్‍చరణ్ కాంబోలో వస్తున్న గేమ్‍చేంజర్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రామ్‍చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. దిల్ రాజు ఈ సినిమా నిర్మాత. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‍గా రూపొందిన ఈ సినిమాలో రామ్‍చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తోంది. శ్రీకాంత్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారు.
ఇక దిల్ రాజే నిర్మించిన వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా పొంగల్ బరిలో నిలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే అందరికీ అలరిస్తున్నాయి. అంటే, గేమ్‍చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల నిర్మాత ఒకరే కావడం విశేషం.
‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్ మాజీ పోలీస్ ఆఫీసర్‍గా నటిస్తుండగా, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
ఇక, సంక్రాంతి వస్తోందంటే బాలకృష్ణ సినిమా ఉండటం ఖాయం. ఈసారి ‘డాకు మహారాజ్’ పేరుతో ఈయన బరిలోకి దిగుతున్నారు. బాబి కొల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా జనవరి 12, 2025న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘ది రేజ్ ఆఫ్ డాకు’ పేరుతో ఈ సినిమా తొలి పాటను విడుదల చేశారు. ‘గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా…’ అంటూ సాగే ఈ పాట హీరో పాత్రను వర్ణిస్తే సాగుతుంది.
ఇంకా రవితేజ ‘ఈగల్’, అక్కినేని నాగచైతన్య ‘తండేల్’, సందీప్ కిషన్ ‘మజాకా’, సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ వంటి చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలుస్తాయని అంటున్నా వీటి విడుదల తేదీలపై ఇంకా స్పష్టత లేదు.
ఇక, తమిళ హీరో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా సంక్రాంతికే రానుంది. ఇందులో అజిత్ మూడు వేరియేషన్స్లో కనిపిస్తారని అంటున్నారు. చూడాలి మరి.. సంక్రాంతి విన్నర్ ఎవరో?!.
Review సంక్రాంతి పందెంకోళ్లు.