
హిట్ కాంబినేషన్లు మళ్లీ జట్టు కడుతున్నాయి. అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య (దర్శకుడు: బాబీ), ‘వీరసింహారెడ్డి (దర్శకుడు: గోపీచంద్ మలినేని) చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. మళ్లీ వీరి కలయికలో కొత్త సినిమాలకు రంగం సిద్ధమైంది. ఇటీవలే బాలకృష్ణతో ‘డాకూ మహారాజ్’ తీసిన బాబీ.. మళ్లీ చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేశారని ఫిల్మ్నగర్ సమాచారం. వీరిద్దరి కలయికలోని ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. చిరంజీవి కోసమే బాబీ మంచి యాక్షన్ కథను ఖరారు చేయడంపై దృష్టి పెట్టినట్టు టాక్. ఇక, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ తీసి హిట్ కొట్టిన గోపీచంద్.. తాజాగా ఆయనతో కలిసి మరో చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. గోపీచంద్‍ను ఉద్దేశించి మరో సినిమా చిత్రీకరణకు రెడీ కావాలంటూ బాలకృష్ణ ఇటీవల ఓ వేడుకలో ప్రకటించడంతో ఈ కాంబినేషన్ త్వరలోనే రిపీటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’తో బిజీగా ఉండగా, శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి లైన్‍లో ఉన్నారు. బాలకృష్ణ ‘అఖండ-2: తాండవం’ సెట్స్పై ఉంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకుడు.
Review ‘హిట్టు’ దర్శకులతో జట్టు.