Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

అదిగో శ్రీశైలం,, అదియే కైలాసం
శైవ క్షేత్రాల్లో తలమానికమైనది- శ్రీశైలం. ఆది, మధ్యాంత రహిత పరబ్రహ్మకు పవిత్ర చిహ్నంగా లింగాన్ని పూజించడం మన సనాతన ధర్మం. శివుడిని నిగమాగమ పద్ధతుల్లో ఆరాధించే సంప్రదాయంలో లింగార్చనకు విశిష్ట స్థానం ఉంది. అనాది నుంచి రుషులూ, మునులూ శివలింగాన్ని జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మన దేశంలో పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ‘సౌరాష్ట్రే సోమనాథంచ..’ అంటూ ఆరంభమయ్యే శ్లోకంలో ‘శ్రీశైలే మల్లికార్జునం..’ అంటూ భ్రమరాంబికా సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. జ్యోతిర్లింగ, శక్తి పీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలసిన పుణ్యక్షేత్రం- శ్రీశైలం. ఇది సకలారాధ్య క్షేత్రం. మరే క్షేత్రానికీ లేని ప్రత్యేకత శ్రీశైలానికి ఉంది. పూజారంభంలో చెప్పుకునే సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిశలో కూర్చుని తాము భగవదారాధన చేస్తున్నదీ విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన చరణ కింకిణుల సవ్వడితో వేదఘోషను స్ఫురింపచేసే కృష్ణవేణి పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తోందిక్కడ. కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకున్నాడనీ, త్రేతాయుగంలో రామచంద్రుడు రావణుడిని వధించిన తరువాత బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీసమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి సహస్ర లింగాలను ప్రతిష్ఠించి, అర్చించాడనీ ప్రతీతి. ద్వాపర యుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి లింగ ప్రతిష్ఠ చేసినట్టు ప్రాచుర్యంలో ఉంది. శివరాత్రి సందర్భంగా 2025, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు నేత్రపర్వం గావించనున్నాయి. నిరంతరం వినిపించే ‘ఓం నమ:శివాయ’ మంత్రం.. రోజుకొకటి చొప్పున పార్వతీ పరమేశ్వరులకు జరిపే సేవలూ.. ఆది దంపతులకు అంగరంగ వైభవంగా నిర్వహించే కల్యాణం.. పాహిమాం పరమేశ్వరా అంటూ ప్రార్థించే భక్తులూ... ఈ వేడుకలన్నీ శ్రీశైలంలో మహా శివరాత్రి సందర్భంగా పదకొండు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో కనిపించే విశేషాలు. 2025, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాల విశేషాలు, అవి జరిగే తీరుపై ప్రత్యేక కథనం..
దట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది తీరాన జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోక కైలాసమే శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున లింగంగా కొలువైతే, పార్వతీదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా దేవిగా దర్శనమిస్తోంది. మహా శివరాత్రి సమయంలో ఇక్కడ జరిపే బ్రహ్మోత్సవాలనూ, శివపార్వతుల కల్యాణాన్నీ చూసేందుకు సుమారు పది లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఎందరో శివభక్తులు పాదయాత్ర చేస్తూ మరీ శ్రీగిరిని చేరుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.
శివశక్తి సమ్మేళనం..
కృతయుగంలో శిలాద అనే మహర్షి సంతానం కోసం శివుడిని పూజించాడట. పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ మహర్షికి ఇద్దరు కుమారులను అనుగ్రహించాడు. వారికి నందికేశ్వరుడు, పర్వతుడు అనే పేర్లు పెట్టాడు శిలాద ముని. కొంతకాలానికి నందికేశుడు శివుడిని పూజించి స్వామికి వాహనంగా మారితే పర్వతుడు కూడా తపస్సు చేసి తనపైన కొలువుదీరాలని స్వామిని వేడుకున్నాడు. అతడి కోరిక మేరకు శివుడు ఆ పర్వతంపైనే స్వయంభూగా కొలువుదీరాడని, అదే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటనీ అంటారు.
ఇక దక్షయజ్ఞం సమయంలో తండ్రి వల్ల అవమానానికి గురైన సతీదేవి అగ్నిలో దూకి ఆత్మాహుతికి యత్నించగా శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని విలయతాండవం చేశాడు. ఆ ప్రళయాన్ని ఆపడం కోసం మహా విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ భాగాలు పలుచోట్ల పడి ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. వాటిల్లో మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలమని, అందుకే ఈ ప్రాంతాన్ని శివశక్తి క్షేత్రమనీ అంటారు.
అమ్మవారికి ఆ పేరెలా వచ్చిందంటే..
ఇక్కడి ఆదిపరాశక్తికి భ్రమరాంబికా అనే పేరు రావడం వెనుకా ఒక కథ ఉంది.
ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు గాయత్రి మంత్రాన్ని జపించి మరణం లేకుండా వరం పొందాడట. అది తెలిసి దేవతలు జగన్మాతను ప్రార్థించడంతో గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకూ అతడిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పిందట. దీంతో దేవతలు ఒక పథకం ప్రకారం తమ గురువైన బృహస్పతిని అరుణాసురుడి వద్దకు పంపించారు. అలా వెళ్లిన బృహస్పతి తాను కూగా గాయత్రీ మాత భక్తుడినని అరుణాసురుడితో చెప్పాడు. దేవతలు పూజించే అమ్మవారిని తాను పూజించనంటూ ఆ రాక్షసుడు మంత్ర జపాన్ని ఆపేశాడు. అప్పుడు ఆదిపరాశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టించిందట. అవన్నీ అరుణాసురుడినీ, అతడి సైన్యాన్నీ సంహరించడంతో అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చిందనీ చెబుతారు.
ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు..
భూలోక కైలాసంగా పేరొందిన శ్రీ క్షేత్రంలో
సంవత్సరానికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మొదటి ఉత్సవాలను సంక్రాంతి సమయంలో, రెండోసారి ఆ తరువాత వచ్చే మాఘ మాసంలోని మహా శివరాత్రి పర్వదిన సందర్భంలోనూ నిర్వహిస్తారు. మొదటి రోజు సాయంత్రం ధ్వజారోహణ, భేరీ పూజ చేసి దేవతలను ఆహ్వానించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆ మర్నాటి నుంచీ ఆది దంపతులకు రోజుకో వాహన సేవను నిర్వహిస్తారు. మహా శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో వేద పండితులూ, అర్చకులూ కలిసి మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం, ఆ తరువాత శివపార్వతుల కల్యాణం, చివరగా ప్రభోత్సవం, తెప్పోత్సవం నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు.
పట్టు వస్త్రాల సమర్పణ.. పాగా అలంకరణ
శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో పార్వతీ పరమేశ్వరులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి సన్నిధానం, కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు వస్తాయి. అలాగే శివపార్వతుల కల్యాణానికి ముందు అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత పాగా అలంకరణ పేరుతో 365 మూరల పొడవు ఉన్న పాగాను స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖ మండపంపైన ఉండే నందులను కలుపుతూ అలంకరిస్తారు. కొన్ని సంవత్సరాల నుంచీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల పరిధిలోని హస్తినాపురానికి చెందిన పృథ్వి వెంకటేశ్వర్లు కుటుంబమే ఈ పాగాలంకరణ చేస్తోంది. వెంకటేశ్వరుల కుటుంబం రోజుకో మూర చొప్పున ఏడాది మొత్తం దీన్ని నేసి బ్రహ్మోత్సవాల సమయానికి ఆలయానికి తెస్తారు. ఇక, ఈ వేడుకలను చూసి తరించేందుకు ఎందరో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు.
పాదయాత్రతో పునీతం..
పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. శ్రీశైలం చుట్టూ ఉన్న అడవి ఆ తల్లి అవతారమేనని భావిస్తారు భక్తులు. ఆ అడవిలో కాలినడకన ప్రయాణించడం అంటే పార్వతమ్మ వెచ్చటి పొత్తిళ్లలో తలదాచుకోవడమనని.. ఆ పాదయాత్ర తరువాత మల్లికార్జునుడిని కొలవడం అంటే అమ్మ ఒడి నుంచి వచ్చి అయ్య దీవెనలు నిండారా అందుకోవడమేనని నమ్ముతారు. అందుకే శివరాత్రికి కాస్త ముందు ఈ పాదయాత్రకు అటవీశాఖ అనుమతించగానే వేలాది మంది తరలివస్తుంటారు. అటవీ శాఖ ప్రస్తుతం అనుమతిస్తున్న వెంకటాపురం - నాగలూటి - భీముని కొలను పాదయాత్ర మార్గం.. శ్రీశైలాన్ని చేరుకునే ప్రాచీన దారుల్లో ఒకటి. రాయలసీమ నలువైపుల నుంచీ వచ్చే వారు కర్నూలు జిల్లా వెంకటాపురానికి వాహనాల్లో చేరుకుంటారు. అక్కడి నుంచే పాదయాత్ర మొదలవుతుంది. అలా ఓ మూడు కిలోమీటర్లు పంటపొలాల దారిలో నడిచి ముర్తుజావలి దర్గా వద్దకు చేరుకుంటారు భక్తులు. హిందూ ముస్లింల ఐక్యతకు సంకేతంలా ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకోవాలనేది ఐతిహ్యం. ఇక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే.. దట్టమైన అరణ్యంలోకి అడుగు పెడుతున్నామనడానికి సంకేతంగా కీచురాళ్ల రొద మొదలవుతుంది.
వెదురు చెట్ల గొడుగులు
కాలిబాటన వెళ్తున్న వారికి గొడుగు పడుతున్నట్టు దారికి ఇరువైపులా ఎత్తయిన, దట్టమైన వెదురుచెట్లు పలకరిస్తాయి. ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎనిమిది కిలోమీటర్లు నడిస్తే నాగలూటి వీరభద్ర స్వామి ఆలయం వస్తుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయం ఇది. ఇక్కడి దాకా వచ్చిన భక్తులకు శ్రీశైలం ఆలయ సిబ్బంది రూ.200 శీఘ్ర దర్శన టికెట్లు అందిస్తారు. ఈ యాత్రలో తొలి కొండ మెట్ల మార్గం ఇక్కడి నుంచే మొదలవుతుంది. సుమారు వెయ్యి వరకు మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కే క్రమంలో ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయినా.. చల్లగాలి సేదదీరుస్తూ ఉంటుందీ మెట్ల మార్గంలో. ఇక్కడి నుంచి ఓ పది కిలోమీటర్లు నడిస్తే కొండ కింది ‘పెద్దచెరువు’ అనే గిరిజన గ్రామం వస్తుంది. కర్నూలులో మనం ఎనిమిది గంటలకు బయల్దేరితే ఇక్కడికి సాయంత్రం ఆరు గంటలకు చేరుకుంటాం. ఆ తర్వాత అడవి మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరం కాబట్టి ఇక్కడే మజిలీ చేస్తారు భక్తులు. వాళ్ల కోసం శ్రీశైలం ఆలయ ట్రస్టు ఉచిత భోజనం సహా అన్ని వసతులూ కల్పిస్తుంది.
ఇక్కడ చీకటి ముదిరే కొద్దీ అడవిలో కీచురాళ్ల రొదకి జంతువుల అరుపులూ తోడై గమ్మత్తయిన అనుభూతినిస్తాయి. వేకువనే ఇక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే మెట్ల మార్గం ప్రారంభం అవుతుంది. ఈ మెట్ల మార్గం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కిందట కట్టించినవని చెబుతారు. అలా నడుస్తూ అడవి పక్షుల కిలకిలల మధ్య.. చీకటి తెరలను తొలగించుకుంటూ వచ్చే ఉదయభానుడిని చూడటం ఓ అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది. అక్కడి నుంచి భీముని కొలను మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ, అది ఓ పెద్ద లోయ అడుగున ఉంటుంది. చుట్టూ నిండిన పచ్చదనానికి లేత ఎండ అద్దే బంగారు మెరుగులూ, మన చుట్టూ చేరి తారట్లాడే మేఘాల పలకరింపులూ.. రెండ్రోజుల శ్రమనంతా ఇట్టే మరిచిపోయేలా చేస్తాయి ఇక్కడ. భీముని కొలనులో భీముడి విగ్రహమూ, ఓ కొలనూ ఉంటాయి. మరో రెండు కిలోమీటర్లు మెట్ల మార్గంలో పైకి ఎక్కాక.. శ్రీశైలం కైలాస ద్వారం కనిపిస్తుంది. అక్కడి నుంచి అరగంటలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు.
44 నదులు.. 60 తీర్థరాజాలు..
లక్షా నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, ఎనిమిది శృంగాలతో అలరారే శ్రీశైలంలో నలభై నాలుగు నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు, చంద్రకుండ, సూర్యకుండాది పుష్కరిణులు, స్పర్శవేదులైన లతలు, వృక్ష సంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయని ప్రతీతి. గిరుల బారులను దాటి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. పౌరాణిక ప్రశస్తికి గుర్తుగా సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాతి లింగం, పంచ పాండవ లింగాలు ఇక్కడ పూజలందుకుంటున్నాయి.
శ్రీశైలం ఎప్పుడు వెలసిందీ స్పష్టంగా తెలియచేసే ఆధారాలు లేవని అంటారు. అష్టాదశ పురాణాల్లోనూ, భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకుంది. సంస్క•త, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్రం గురించి వర్ణనలు ఉన్నాయి. ఆయా భాషల కవులు శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యా సుందర నృత్యాన్ని సుమనోజ్ఞంగా అభివర్ణించారు. అరవైనాలుగు అధ్యాయాలు ఉన్న స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరాచార్యులు కొంతకాలం ఇక్కడే తపస్సు చేసి ‘శివానంద లహరి(ని రచించి, మల్లికార్జునుడికి పూజాసుమాలుగా అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించినది ఆదిశంకర జగద్గురువే.
దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకునే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకలను పట్టుకున్న తంతుడు అఏ భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్టు ‘గురుచరిత్ర’ చెబుతోంది. ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడి పాతాళగంగలో పరిసమాప్తి గావించి, కదలీవనంలో గుప్తరూపంలో ఉన్నట్టు దత్తభక్తులు విశ్వసిస్తారు.
శ్రీశైల క్షేత్ర దర్శనం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. కురుక్షేత్రంలో లక్షలకొద్దీ దానాలు చేస్తే, గంగలో రెండువేల సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే పుణ్యం శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా పొందగలమని ధార్మికులు విశ్వసిస్తారు.
ఈ క్షేత్రాలు.. నటరాజు నర్తనశాలలు
శివ స్వరూపాలలో నటరాజ స్వరూపం ప్రత్యేకమైనది. సృష్టి క్రమానికి ఆ నట విన్యాసం ఓ సంకేతం. ఆయన శివతాండవం భక్తకోటికి ఆనందదాయకం. ఎర్రటి శిరోజాలతో హిమపర్వతాలపై ఆయన తాండవం చేసినట్టు పురాణాలలో ఉంది. శివుడు తన నాట్య విన్యాసంలో చేతుల్లో ఢమరుకం, అగ్ని, అభయముద్రతో పాటు ఒక చేతిని తన చరణాల దిశగా చూపిస్తుంటాడు. తన పాదాలను నిర్మలమైన మనసుతో ప్రార్థిస్తే చాలని దీని అర్థం.
జటాజూటధారి ఈ భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. అలా ఆయన నాట్యం చేసిన ఐదు క్షేత్రాలు తమిళనాడులోనే ఉండటం విశేషం.
నటరాజు అంటే నాట్యంతో ప్రకాశించేవాడని అర్థం. ఆయన నాట్య విన్యాసాలతో పునీతమైన తమిళనాడులోని ఐదు క్షేత్రాలు ఇవే..
వాద ఆరణ్యేశ్వర్ ఆలయం: ఇది చెన్నై సమీపంలోని తిరువళన్గడు సమీపంలో ఉంది. ఇక్కడ శివుడు చేసిన నాట్యానికి కాళి తాండవం అని పేరు.
నటరాజ ఆలయం: ఇది చిదంబరంలో ఉంది. ఇక్కడ శివుడు చేసింది ఆనంద తాండవం.
మీనాక్షి అమ్మవారి ఆలయం: మధురైలో గల ఈ ఆలయంలో శివుడు చేసిన నాట్యాన్ని సంధ్యా తాండవం అని పిలుస్తారు.
నెల్లైఅప్పార్ ఆలయం: ఇది తిరునల్వేనిలో ఉంది. ఇక్కడ శివుడు ముని తాండవం చేశాడని అంటారు.
కుట్రాళనాథర్ ఆలయం: ఇది కుట్రాళంలో గల ఆలయం. ఇక్కడ శివుడు చేసిన నాట్యం.. త్రిపుర తాండవం.
పరమేశ్వరుని దశావతారాలు
విష్ణుమూర్తి దశావతారాల గురించి అందరికీ తెలుసు. కానీ, శివుడు కూడా భిన్న సందర్భాలలో పది అవతారాలను దాల్చాడు. ఒక్కో అవతార సమయంలో శక్తి (అమ్మవారు) కూడా ఒక్కొక్క పేరుతో ఆయన దేవేరిగా అవతరించింది. ఈ అవతారాలను నిత్యం మననం చేసుకునే భక్తులకు శివుడు, శివాని సర్వ శుభాలనూ చేకూరుస్తారని ఈ కింది కథ తెలుపుతుంది. ఇది శివ మహాపురాణంలోని శతరుద్ర సంహిత పదిహేడో అధ్యాయంలో ఉన్న విశేషం. శివభక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివ దశావతారాల గురించి విశేషాలను విన్నా, చదివినా విశేష సుఖాలు లభిస్తాయి. ఆ దశావతరాల వివరాలివీ..
మహా కాలావతారం: శివుడి దశావతారాలలో ఇది మొదటిది. ఈ అవతారంలో పార్వతీదేవి (శక్తి) మహాకాలి (మహాకాళి)గా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది. మహాకాలుడు భుక్తిని, ముక్తిని కల్పిస్తాడు.
తార్: ఇది శివుడి రెండో అవతారం. ఆయన యొక్క ఈ అవతార సమయంలో శక్తి (అమ్మవారు) తారా అనే పేరును ఆ స్వామిని అనుసరించి ఉంటుంది. ఇద్దరూ తమ భక్తులకు భుక్తి, ముక్తులను ప్రసాదిస్తారు.
బాలభువనేశుడు: ఇది శివుడి మూడో అవతారం. ఈ అవతారంలో శివుడి ఇల్లాలు పార్వతి బాల భువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి ఉంటుంది. ఈ రూపంలో అమ్మవారు తన భక్తులకు సుఖాలను ప్రసాదిస్తుంటుంది.
షోడశ శ్రీవిద్యేశుడు: శివుని ఈ అవతారంలో పార్వతి షోడశీ శ్రీవిద్యాదేవిగా ఉంటుంది. వీరిద్దరి ఆరాధనతో భక్తులకు భుక్తి, ముక్తి, సుఖాలు లభిస్తాయి.
భైరవ అవతారం: ఇది శివుడి ఐదో అవతారం. పార్వతీదేవి ఈ అవతార సమయంలో భైరవిగా స్వామిని అనుసరించి ఉంటుంది. ఉపాసకులను, భక్తులను సర్వకాలాలలోనూ అనుగ్రహిస్తుంటారీ దంపతులు.
చిన్న మస్తకుడు: ఇది ఆరో అవతారం. అమ్మవారు పార్వతీదేవి చిన్నమస్తకిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటారు.
ధూమవంతుడు: ఇది శివుడి ఏడో అవతారం. ఈ అవతార సమయంలో పార్వతి ధూమావతి అనే పేరున ఉంటుంది. ఉపాసకుల కొంగుబంగారంగా ఈ అవతారంలో ఆదిదంపతులు ఉంటారు.
బగలాముఖుడు: ఇది శివుడి ఎనిమిదో అవతారం పేరు. అప్పుడా తల్లి బగలాముఖీ, మహానంద అనే పేర్లతో ఉంటుంది. శక్తి ఉపాసకులకు బగలాముఖీ దేవత చాలా ముఖ్య దైవతం. ఈమె ఆలయం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది.
మాతంగుడు: ఇది శివుడి తొమ్మిదో అవతారం. ఈ అవతార సమయంలో పార్వతీదేవి మాతంగిగా ఉంటుంది.
కమలుడు: ఇది పదో అవతారం. చివరిది. ఈ సమయంలో పార్వతి కమల అనే పేరుతో శివుడి సరసన ఉంటుంది.
ఈ అవతారాలన్నీ విడిగా కన్నా తంత్ర శాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ తంత్ర శాస్త్రాలలో కనిపించే పార్వతీదేవి అవతారాలు తమ భక్తుల శత్రువులను సంహరించడం, దుష్టులను శిక్షించడం, నిత్యం బ్రహ్మవర్చస్సును పెంపొందిస్తూ ఉండటం చేస్తుంటాయి. మహాకాలాది శివ దశావతారాలు శక్తితో కూడి ఉండి భక్తులను ఆదుకుంటుంటాయి. తంత్ర శాస్త్రానుసారం ధూమావతి, బగలాముఖి లాంటి శక్తులన్నింటికీ విడివిడిగా మంత్రాలు, ఉపాసనా విధులు ఉంటాయి. అవన్నీ సంపూర్ణంగా తెలిసినా, తెలియకపోయినా నిత్యం ఉదయం వేళ ఈ దశావతారాలలోని శివశక్తులను స్మరించడం పుణ్యప్రదమని శివపురాణం చెబుతోంది.
శివుని అష్టరూపాలు
భూనంభాస్యనలో నిలోమ్బర మహార్నాథో
హిమాంశు: పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో:
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలోని ఒక పాదం ఇది. దీని అర్థం ఏమిటంటే..
‘అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనబడే విధంగా అష్టమూర్తి తత్త్వంగా ప్రకాశిస్తుంది’ అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాలలో దర్శించగలమట. ఆయన తత్వమంతా ఎనిమిది అంకె మీదే నడుస్తుంది. పృథివీ, ఆపస్తేజో, వాయు, జల, ఆకాశములు పంచభూతాలు. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు.. ఈ మూడూ కలిపి మొత్తం ఎనిమిది శివ స్వరూపాలు.
వీటిని శివ స్వరూపాలుగా నిర్ధారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి..
- కంచిలో పృథ్వీలింగం,
- జంబుకేశ్వరంలో జల లింగం
- అరుణాచలంలో అగ్ని లింగం
- చిదంబరంలో ఆకాశ లింగం
- శ్రీకాళహస్తిలో వాయులింగం
- కోణార్క్‌లో సూర్య లింగం
- సీతాకుండంలో చంద్రలింగం
- కాఠ్మండ్లో యజమాన లింగం
వీటిలో అరుణాచలం, శ్రీకాళహస్తి, చిదంబరం, కంచి, జంబుకేశ్వరంలో గలవి పంచభూత లింగాలుగా ప్రసిద్ధి. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని చెబుతారు. శివరాత్రి పర్వదినం ఆయా క్షేత్రాల్లో విశేషంగా నిర్వహిస్తారు.
శివుడి నిజస్థానం
కైలాసమా? వారణాసా?
విశ్వేశ్వరుడికి ఈ విశ్వమే ఆవాసం. ఆయన విశ్వవ్యాప్తంగా కొలువై ఉంటాడు. కానీ, అంతటా నిండి ఉన్న దేవుడి తత్త్వాన్ని తెలియచేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్నే. అందులో ప్రముఖమైనది వారణాసి. కైలాస సదనంలో కులాసాగా ఉంటున్న శంకరుడికి ఒకసారి హిమగిరులు దాటి ఆవల ఉండాలనే మనసు పుట్టిందట. పార్వతీదేవితో కలిసి ఏదైనా సిద్ధక్షేత్రంలో నివసించాలని కోరుకున్నాడట. చివరికి అలా కాశీ తనకు తగిన ఆవాసమని ఎంచుకున్నాడట. అప్పటికే కాశీని రాజధానికిగా చేసుకుని ఆ ప్రాంతాన్ని దివోదాసు అనే రాజు పరిపాలిస్తున్నాడు. పరమేశ్వరనుడి ఆనతితో నికుంభుడనే రాక్షసుడు వారణాసికి వెళ్లి అక్కడి ప్రజలను, రాజును తరలించి శివుడు నివసించడానికి అనువైన ఏర్పాట్లు చేస్తాడు. తన రాజ్యం పోయిందన్న బాధతో దివోదాసు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కాశీరాజు ‘దేవతలు దేవలోకంలో, నాగులు పాతాళంలో, భూలోకంలో మనుషులు మాత్రమే ఉండే విధంగా వరం ఇవ్వాలని కోరుతాడు. బ్రహ్మ తథాస్తు అంటాడు. దీంతో కాశీనాథుడు మళ్లీ కైలాసానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లినా శివుడి మనసు మనసులో ఉండదు. కాశీలో ఉండటానికి మార్గం చేయాలంటూ 64 మంది యోగినులను పంపిస్తాడు. ఆ వచ్చిన దేవతలను గంగాతీరంలో ప్రతిష్ఠిస్తాడు దివోదాసు. శివాజ్ఞ మేరకు సూర్యుడు రాగా, ద్వాదశాదిత్య రూపాలుగా గంగ ఒడ్డున ప్రతిష్ఠిస్తాడు. దివోదాసును ఒప్పించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే వారణాసికి వెళ్తాడు. ఆయననూ మచ్చిక చేసుకున్న దివోదాసు.. బ్రహ్మతో గంగాతీరంలో దశాశ్వమేథ హోమం చేయిస్తాడు. చివరకు విష్ణుమూర్తి కాశీకి వెళ్లి, దివోదాసుకు జ్ఞానోపదేశం చేస్తాడు. అలా శివుడు మళ్లీ కాశీ విశ్వనాథుడు అయ్యాడని కాశీ (వారణాసి) స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది.

సంపాదకీయం ‘మాఘ’ సందేశం!
మహా శివరాత్రి నాటికి చలి.. ‘శివ.. శివా’ అంటూ వెళ్లిపోతుందట. రథ సప్తమి నాటికి మొదలయ్యే సూర్య కిరణాల తీక్షణత మరుసటి వారం నాటి శివరాత్రికి వేడిని సంతరించుకుంటాయి. అంటే, శివరాత్రి నాటికి చలి-వేడి ఒకే స్థాయిలో ఉంటాయన్న మాట. ఎండాకాలం ఉపవాసం ఉండటం కష్టం. చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా అనుకూలించాలి. అటువంటి సమ శీతోష్ణస్థితి ఉండేది మహా శివరాత్రి నాడే. మానవ జీవనం భోగమయం కాదు.. త్యాగమయం అని చాటుతుంది శివతత్త్వం. ఈ ప్రపంచంలోని సంపదలన్నీ స్వార్థం కోసం కాదు..సమస్త ప్రాణుల సుఖ సంతోషాల కోసం పరమేశ్వరుడు సృష్టించినవే. అను నిత్యం మంగళకరమైన భావాలను మనిషి తన ఎదలో పదిలం చేసుకోవాలి. జీవితాన్ని ఒక పూజా కుసుమంగా రూపొందించుకోవాలి. తనలో అందరినీ, అందరిలో తననూ చూసుకుని ఈ ప్రపంచాన్ని శివమయంగా భావించడమే మనిషి యొక్క కర్తవ్యం. మహా శివరాత్రి పర్వదినం అందచేసే సందేశం ఇదే. ఈ శివ భావనతో పరమశివుడిని ఆరాధిస్తేనే లోకమంతా శివ (మంగళ)మయం అవుతుంది.
•••
‘సర:’ అంటే కాంతి. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. జన జీవితాలను జ్ఞాన, కాంతిమంతం చేసే మాతృశక్తి, అక్షరజ్ఞానాన్ని ఒసగే మంత్రశక్తి- శ్రీ సరస్వతీమాత. సాహిత్యం, సంగీతం అనే రెండు అమృత కలశాలను మానవాళికి ప్రసాదిస్తున్న జగన్మాత ఆమె. సకల కళారూపిణి అయిన సరస్వతీదేవి అక్షరానికి అధిదేవత. ప్రణవ స్వరూపిణి. జ్ఞానానంద శక్తి. లౌకిక, అలౌకిక విజ్ఞాన ప్రదాయిని. శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు. మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణి సరస్వతి. సరస్వతిదేవి జన్మించిన రోజుగా శ్రీపంచమిని భావిస్తారు. అందుకే ఆనాడు ఆ దేవిని భక్తిప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆమె ప్రతిమ ముందు ఉంచి, పూజించి, సాయంకాలం ఊరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు. వసంత పంచమి నాడే సరస్వతీదేవిని పూజించాలని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది.
•••
దేవుళ్లు ఎందరో ఉన్నా.. మనకు నిత్యం కనిపించే దైవం మాత్రం ఒక్క సూర్యభగవానుడే. ఆయన ఎన్నటికీ ఆగిపోడు. అలసిపోడు. ఆలస్యం చేయడు. నిరీక్షించడు. నిరంతరం సంచరిస్తూనే ఉంటాడు. ఆ సంచార గమనం వల్లనే కాలంలో, రుతువుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. యుగయుగాలుగా నిర్విరామంగా సాగుతున్న ఆయన గమనమే ఈ సృష్టిలో గల చరాచర జీవకోటి ఆహార చక్రానికి ఆధారభూతం. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడని కీర్తిస్తోంది మానవాళి. సూర్యోదయం ప్రాణుల్ని నిద్రలేపి కర్తవ్యోన్ముఖుల్ని చేస్తే.. సూర్యాస్తమయం అలసిన జీవకోటికి విశ్రాంతినిచ్చి సేదదీరుస్తుంది. విశ్రమించని సూర్యుడి ప్రయాణం మనిషికి ఆదర్శం. లక్ష్యం సిద్ధించే వరకు విశ్రమించకూడదని సూర్యుడి గమనం మనకు చెబుతోంది. చల్లబడి పడమటి కొండల్లో వాలిన ఆ సూరీడే మళ్లీ మర్నాడు సరికొత్త తేజస్సుతో ఉదయించి ప్రాణుల్లో ఉత్తేజాన్ని నింపుతాడు. ప్రతిరోజూ ప్రభాత సూర్యుడిలా వెలుగొందాలని మనిషికి ప్రేరణనిస్తాడు.
•••
పరిస్థితుల ప్రభావంతో శత్రుపక్షం వహించినా.. ఆయనెప్పుడూ హరిపక్షమే. కొన్ని సందర్భాల్లో మౌనం వహించినా.. అవసరమైనపుడు ధర్మాన్ని లోకమంతా ఎలుగెత్తేలా చాటాడు. ఒళ్లంతా బాణాలు గుచ్చుకుని.. దేహమంతా రక్తపుధారలు.. కళ్లలో ప్రాణం మిణుకు మిణుకుమంటోన్న సందర్భం.. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏది ధర్మం? ఏది అధర్మం? ఏది నీతి? ఏది రీతి? పాలకుడు, మనిషనేవాడు ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి మంచి విషయాలు బోధించగలరా? కానీ, అటువంటి పరిస్థితుల్లోనూ ఆయన సత్యాన్ని చాటారు. ధర్మాన్ని అనుసరించారు. తాను అవన్నీ చెప్పగలిగినా.. ఆయన చెప్పినంత స్పష్టంగా చెప్పలేనని ఆ పరమాత్మే స్వయంగా ఆయన చేత చెప్పించాడు.
ఆ కురు వృద్ధుడే.. భీష్మ పితామహుడు.
•••
మాఘ మాసం మహా పుణ్య మాసం.
మహా శివరాత్రి, శ్రీపంచమి, భీష్మ ఏకాదశి, రథసప్తమి.. ఇంకా ఎన్నో పుణ్యపర్వాలకు నెలవు ఈ మాసం. ఒక్కో పర్వం మనకు అనేక పాఠాలను, పరమార్థాలను బోధిస్తుంది.
ఆ విశేషాల ‘మాఘ’ సందేశ మాలిక..
ఈ మాసం తెలుగుపత్రిక
- డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
పండగ సందర్భం
‘పండగంటే పిండివంటలు చేసుకుని, కొత్తబట్టలు వేసుకునే సంబరం కాదు.. నిన్నూ నన్నూ ఏకం చేసే ఒక సందర్భం..’ అంటూ తెలుగు పత్రిక 2025, జనవరి సంచికలో సంక్రాంతిని పురస్కరించుకుని అందించిన ముఖచిత్ర కథనం భలే ఉంది. పండగలు నేడు పరమ రొటీన్‌గా మారిపోయాయి. వాటిని అందంగా, ఆనందంగా ఎలా మలుచుకోవాలో చక్కగా వివరించారు.
- సి.కృష్ణకాంత్‌రెడ్డి, పి.విశ్వనాథరావు, టి.ఎస్.రవి, కడెం రామచంద్ర, పి.భార్గవి, ఎల్.ఆర్.రుషి మరికొందరు ఆన్లైన్ పాఠకులు
పిల్లల పాటలు
మనం మరిచిపోయిన పిల్లల పాటలను మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఈ కాలం పిల్లలకు తెలియన పాత పాటలను అందించడం చాలా అర్ధవంతమైన విషయం. పిల్లల పేర్లు కూడా చాలా ఆధునికంగా ఉంటున్నాయి. ఇలాంటివే మరిన్ని శీర్షికలు పిల్లల కోసం ప్రవేశపెట్టండి.
- రాజేశ్వరరావు, తిరునగరి వాసు, సీహెచ్.వెంకటేశ్
వస్తు గుణాలు
తెలుగు పత్రికలో అందిస్తున్న వస్తుగుణ దీపిక శీర్షిక చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయా పదార్థాల లక్షణాలను తెలుపుతూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను క్లుప్తంగా తెలపడం బాగుంది. అలాగే పురాతన వంటకాలనూ పరిచయం చేయండి.
- ఆర్.దీపిక, రామ్ టీ.ఎస్., (ఈ-మెయిల్ ద్వారా)

సూర్యారాధన..శివార్చన
ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో రెండో మాసం- ఫిబ్రవరి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మాఘ మాసం. కేవలం ఒక్కరోజు మాత్రమే ఫాల్గుణ మాస తిథి కలుస్తుంది. ఫిబ్రవరి 1, శనివారం, మాఘ శుద్ధ తదియ నుంచి ఫిబ్రవరి 27, గురువారం, మాఘ బహుళ చతుర్దశి/అమావాస్య వరకు మాఘ మాస తిథులు కొనసాగుతాయి. ఆపై ఫిబ్రవరి 28, శుక్రవారం, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి ఫాల్గుణ మాస ఆరంభ దినం. మాఘ మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో మహా శివరాత్రి, రథ సప్తమి ప్రధాన పర్వాలు. ఇంకా భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి, వసంత పంచమి వంటివి మాఘ మాసంలోని ప్రధాన పర్వాలు, పండుగలు.
2025- ఫిబ్రవరి 1, శనివారం, మాఘ శుద్ధ తదియ నుంచి
2025- ఫిబ్రవరి 28, శుక్రవారం, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం - మాఘం - ఫాల్గుణం - శిశిర రుతువు - ఉత్తరాయణం
చంద్రుడు మఘ (మఖ) నక్షత్రాన ఉండే మాసం కనుక దీనిని ‘మాఘ మాసం’ అన్నారు. యజ్ఞ యాగాదులకు శ్రేష్ఠమైనది మాఘ మాసం. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మఘవుడు’ అనీ అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ‘మాఘం’ అయ్యింది. మన పురాణాలలో మాఘ మాసాన్ని జ్ఞాన మాసంగా కూడా అభివర్ణించారు. అహం అనే పాపాన్ని తొలగించేది, అజ్ఞానమనే మృత్యువును హరించేది, నశింప చేసేదీ మాఘమని వేదాలు చెబుతున్నాయి. అందువల్లనే మాఘ మాసాన్ని వేద మాసమని కూడా అంటారు.
ఇది శిశిర రుతువు కాలం. చెట్లు ఆకులు రాలుస్తాయి. ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. మాఘ మాసానికి వచ్చే సరికి చలి అంతగా ఉండదు. వానలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టి వాతావరణం ఈ మాసంలో అమోఘంగా ఉంటుంది. శూన్యమాసంగా పరిగణించే పుష్యం తరువాత వచ్చే మాఘం కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకూ, భగవచ్ఛింతనకూ నెలవైన ఉత్క•ష్టమైన కాలమిది. వైశాఖ - కార్తీక మాసాల మాదిరిగా మాఘ స్నానాలూ పవిత్రమైనవి. మృకండ ముని, మనిస్విని దంపతుల మాఘ స్నాన పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుడి అప మృత్యువును తొలగించిందని పురాణ వచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరడం సంప్రదాయం. ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పురాణం మాఘ మాస మహిమలను వివరిస్తోంది. అలాగే, మాఘ స్నానం మహాత్మ్యాన్ని గురించి బ్రహ్మాండ పురాణంలో విపులంగా ఉంది.పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ మాస సంప్రదాయం.
సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయాల్లో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమైనవనీ చెబుతారు. ఇక, మాఘ మాసంలో వచ్చే ఆదివారాలు (ఫిబ్రవరి 2, 9, 16, 23, 2025) విశేషమైనవి. ఈ కాలంలో ఉదయ స్నానం అత్యంత శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక, అరుణోదయాన దీపారాధన, తిలహోమ తిలదానం, తిలభక్షణం మాఘ స్నానాల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్య విధులు. శివుడు,. సూర్యనారాయణాదులను మాఘ మాసంలో పూజించడం అమితమైన ఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
మాఘ మాస స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.
మాఘ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనవృద్ధి అని మత్స్య పురాణం చెబుతోంది.
ఇంకా ఈ మాసంలో తిథానుసారం వచ్చే ప్రధాన పర్వాలు, పండుగల విశేషాలు..
మాఘ శుద్ధ తదియ
ఫిబ్రవరి 1, శనివారం
మాఘ శుద్ధ తదియ మార్కండేయ మహర్షి జయంతి తిథిగా ప్రసిద్ధి. మృకండుడు, మనస్విని దంపతుల కుమారుడు మార్కండేయుడు. గొప్ప శివభక్తుడు. ఆయువు తీరినా.. తన శివదీక్షతో యముడిని సైతం జయించిన బాలుడీ మార్కండేయుడు. ఆయన జన్మించినదీ ఈ మాఘమాసంలోనేనని అంటారు. ఇంకా మాఘ శుద్ధ తదియ నాడు గుడలవణ దానం చేయాలని అంటారు. ఇంకా ఈనాడు ఉమాపూజ, లలితా వ్రతం, హరతృతీయా వ్రతం, దేవ్యా ఆందోళన వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మాఘ శుద్ధ చవితి
ఫిబ్రవరి 2, ఆదివారం
మాఘ శుద్ధ చతుర్థి నాడు శాన్తా (శాంతా) చతుర్థీ వ్రతం ఆచరించాలని అంటారు. చవితి తిథి కావడం వల్ల ఈనాడు గణేశ్ పూజ చేస్తారు. ఈ రోజున డుంఠి గణపతిని పూజించాలి. కుంద చతుర్థి నాడు శివుడిని మొల్ల పూవులతో పూజించాలి. అలాగే, పుష్య మాస తిథులు శనీశ్వరుడికి ప్రధానమైనవి కాబట్టి ఈ తిథిని తిల చతుర్థిగానూ వ్యవహరిస్తారు. ఈనాడు తిల (నువ్వులు) దానం చేస్తే కోటిరెట్ల ఫలాన్ని ఇస్తుందని అంటారు. ఇంకా చవితి తిథి నాడు ఉమాపూజ చేయాలని నీలమత పురాణం చెబుతోంది. అలాగే వరద గౌరీపూజ కూడా చేస్తారు. చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఈ పూజా విశేషాల వివరాలు ఉన్నాయి.
మాఘ శుద్ధ పంచమి
ఫిబ్రవరి 3, సోమవారం
మాఘ శుద్ధ పంచమి చదువుల తల్లి సరస్వతీ దేవికి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథిని ఇంకా మదన పంచమి అనీ, వసంతోత్సవారంభః, వసంత పంచమి, రతికామ దమనోత్సవం, సరస్వతీ జయంతి అని కూడా వ్యవహరిస్తారు. శిశిర రుతువు ప్రారంభంలో వచ్చే ఈ తిథిని వసంత పంచమి అనడాన్ని బట్టి ఇది రుతు సంబంధమైన పండుగగా భావించాల్సి ఉంటుంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువు. చైత్ర వైశాఖాలు వసంత రుతువు. శిశిర రుతువు ప్రారంభంలోనే వసంత రుతు సంబంధంగా ఈ వసంత పంచమి పర్వాన్ని నిర్వహించడానికి గల కారణం ఏమిటో ఇతమిద్ధంగా తెలియదు. బహుశా రాగల వసంత రుతు సూచనలకు స్వాగత సన్నాహాంగా ఈ పర్వం ఏర్పడి ఉండవచ్చు. మాఘ మాస శుక్ల పంచమి నాడు హరి పూజ చేయాలని, దాంతో పాటు వసంత పంచమి పర్వం కూడా నిర్వహించుకోవాలని హేమాద్రి అనే పండితుడు చెప్పారు. ఈనాటి కృత్యాలలో తైల స్నానం, నూతన వస్త్రధారణం ముఖ్యం. దక్షిణాదిన
వసంత పంచమి అంతగా ప్రాముఖ్యమై లేదు.
రాజవంశములలో దీని ప్రాభవం ఎక్కువ.
ఈనాడు వారు రంగుబట్టలు
ధరించి బుక్కా, వసంతం
చల్లుకుంటారు.
పూర్వం ఈ తిథి నాడు ‘యవేష్ఠి’ అనే యజ్ఞం చేసే వారని తెలుస్తోంది. ఇప్పుడిది అంతగా ఆచరణలో లేదు. ‘యవ’ అంటే ఒక ధాన్య విశేషం. ‘ఇష్ఠి’ అనగా యజ్ఞం. సంక్రాంతికి ఇంటికి వచ్చే ధాన్యాన్ని ఈనాడు అన్నం వండి కులదేవతలకు నైవేద్యం పెట్టి తినే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంది. వంగ దేశంలో దీనిని శ్రీపంచమి అంటారు. ఈనాడు సరస్వతీ పూజ చేస్తారు. పుస్తకాలు, కలాలు సరస్వతీదేవి వద్ద ఉంచి, రోజంతా సరదాగా గడుపుతారు. సాయంత్రం దేవి విగ్రహాన్ని సమీపంలోని జలాశయంలో నిమజ్జనం చేస్తారు.
ఏదైమైనా వసంత పంచమి విద్యారంభ దినం. మన తెలుగునాట బాసర, వర్గల్ తదితర సరస్వతీ క్షేత్రాల్లో చదువుల తల్లిని ఈనాడు విశేషంగా పూజిస్తారు. ఇంకా పర్వానికి రతి కామదమనోత్సవం, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈనాడే రతీదేవి కామదేవ పూజ చేసినట్టు కొన్ని పురాణాల్లో ఉంది. రుతు రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మంచి స్నేహం. కాబట్టి ఈనాడు రతీదేవికి కామదేవుడికి వసంతుడికి పూజ చేయాలనే ఆచారం ఏర్పడింది. ఇది వసంతరుతువు ఆగమనాన్ని తెలిపే తిథి పర్వం.
మాఘ శుద్ధ షష్ఠి
ఫిబ్రవరి 3, సోమవారం
మాఘ శుద్ధ షష్ఠి నాడు కుమార స్వామి (స్కందుడు)ని పూజిస్తారు. కాబట్టి ఇది స్కంద షష్ఠి తిథిగా ప్రసిద్ధి. ఇంకా ఈనాడు విశోకాష్టమీ, మందారషష్టి, కామషష్ఠి వ్రతాలను ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాడు వరుణ షష్ఠి. ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, పుష్పాలు, ధూపం, దీపాలతో విష్ణు స్వరూపుడైన వరుణదేవుడిని పూజించాలని నియమం. కాగా, పంచమి తిథి కాలంలోనే షష్ఠి ఘడియలు కూడా కూడి ఉన్నాయి.
కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీనే పంచమి,
షష్ఠి తిథుల్లో వచ్చే పర్వాలను
జరుపుకోవాలి.
మాఘ శుద్ధ సప్తమి
ఫిబ్రవరి 4, మంగళవారం
మాఘ మాసపు తిథులలో ప్రశస్తమైనది మాఘ శుద్ధ సప్తమి. దీనినే తెలుగునాట రథ సప్తమిగా వ్యవహరిస్తారు. దీనినే సూర్య జయంతి పర్వమనీ అంటారు. ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి కావడం వల్ల మాఘ శుద్ధ సప్తమిని మహా సప్తమి అని కూడా వ్యవహరిస్తారు. ఇంకా మాఘ శుద్ధ సప్తమి అనేక పేర్లు ఉన్నాయి. అవేమిటంటే..
మన్వాది దినం: సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ఇదే మన్వాది దినం. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. పితృ దేవతల ప్రీత్యర్థం ఈనాడు తర్పణాదులను విడవాల్సి ఉంటుంది.
సంవత్సరాది: వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు దేశంలో ఉగాది పండుగగా ఉండేదని తెలుస్తోంది.
తెలుగుదేశంలో కూడా రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అయి ఉండేదనడానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా తెలుస్తుంది. నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్రగుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథ సప్తమి నాడే పడతారు. వ్రతాలన్నీ సాధారణంగా ఉగాది నాడే ప్రారంభం కావడం ఆచారం. కాబట్టి ఇన్ని వ్రతాల ప్రారంభ దినమైన రథ సప్తమి కూడా ఒకప్పుడు ఉగాది తిథేనని భావించవచ్చు.
రథసప్తమి: చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు ఆచరించదగిన మంత్ర సహితమైన అనే వ్రతాలను గురించి పేర్కొన్నారు. అవన్నీ సూర్యునికి, తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవే. ప్రాచీన కాలంలో ఇది మనకు ఉగాది అయినా, కాకున్నా మిక్కిలి ప్రాచీనమైన మన పండుగలలో రథ సప్తమి ఒకటి. ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదిస్తారు. చిక్కుడు కాయలతో చేసిన దానిని సూర్య రథం అంటారు. చిక్కుడు ఆకులపై వేడి వేడి పొంగళిని పరచడం, జిల్లేడు ఆకుల్ని నెత్తి మీద పెట్టుకుని సూర్యుడికి అభిముఖంగా నిలిచి స్నానం చేయడం, అంతకుముందు పెద్దలు పిల్లల తల మీదుగా రేగుపండ్లు పోయడం వంటి వాటి వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి.
సూర్య జయంతి: రథ సప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతిగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని రాజపుటానాలో సౌర సప్తమి అనీ, వంగ దేశంలో భాస్కర సప్తమి అనీ, కొన్ని చోట్ల జయంతి సప్తమి అనీ, మరికొన్ని ప్రాంతాల్లో మహా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఈ నామాలను బట్టి మొత్తానికి ఇది సూర్య సంబంధ పర్వమనే విషయం రూఢి అవుతుంది. ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈ దినం సూర్య జయంతి దినం అయ్యింది.
సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు సూర్య జయంతికి పర్యాయపదాలు.
జయంతి/మహా సప్తమి: మాఘ శుద్ధ సప్తమికే జయంతి సప్తమి, మహా సప్తమి అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పర్వాలు మాత్రం సూర్య సంబంధమైనవి కాకపోవచ్చని అంటారు. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని అర్థం. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయనే నమ్మకం ఉండటం వల్ల దీనికి జయంతి సప్తమి అనే పేరు వచ్చి ఉంటుంది. ఇక, మహా సప్తమి విషయానికి వస్తే- ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు సప్తమి తిథుల్లో మాఘ శుద్ధ సప్తమి ప్రశస్తమైనది. కాబట్టి ఈ సప్తమి తిథిని మహా సప్తమి అన్నారు.
నర్మద జయంతి: ఇక, మాఘ శుద్ధ సప్తమికి నర్మద జయంతి అనే మరో పేరు కూడా ఉంది.
మాఘ శుద్ధ అష్టమి
ఫిబ్రవరి 5, బుధవారం
మాఘ శుక్ల (శుద్ధ) అష్టమి భీష్మాష్టమి. పద్మ పురాణంలోనూ, హేమాద్రి వ్రత ఖండంలోనూ దీని గురించి వివరణ ఉంది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి ఇచ్చే వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మాఘ శుద్ధ సప్తమి మొదలు మాఘ శుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు. భీష్ముడు అంపశయ్యపై పరుండి.. ఈనాటి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడిచాడని అంటారు. దీనివల్ల భీష్ముడు ఈ రోజునే మరణించినట్టు తెలుస్తోంది. మహా భారతంలో కూడా ఈ దినమే భీష్ముని నిర్యాణ దినంగా చెప్పారు. భీష్మ ద్వాదశి వ్రతం ఈనాడే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు అనే వ్రత గ్రంథంలో రాశారు. భీష్మాష్టమి ఒక్క వంగ దేశంలోనే చేస్తారు.
మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధం, తర్పణం విడిచిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. పద్మ పురాణంలోనూ, హేమాద్రి వ్రత ఖండంలోనూ కూడా దీనిని గురించి వివరణ ఉంది. ఇంకా ఈనాడు నందినీ దేవిపూజ కూడా నిర్వహించాలని కొందరంటే, ఈనాడు నర్మదా జయంతి ఈనాడేనని మరికొందరు అంటారు.
మాఘ శుద్ధ నవమి
ఫిబ్రవరి 6, గురువారం
మాఘ శుద్ధ నవమి తిథి మహానంద నవమి పర్వదినమని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు నందినీదేవిని పూజించాలని, ఈ ఆచారం వల్లనే ఈ తిథికి మధ్వ నవమి అనే పేరు కూడా ఉందని అంటారు.
మాఘ శుద్ధ దశమి
ఫిబ్రవరి 7, శుక్రవారం
మాఘ శుద్ధ దశమి తిథి సాధారణంగా దుర్గాపూజకు అనువైనది. మాఘ శుద్ధ దశమి నాడు ప్రత్యేకంగా ఆచరించాల్సిన ఇర పూజా విధులేమీ లేవు.
మాఘ శుద్ధ ఏకాదశి
ఫిబ్రవరి 8, శనివారం
మాఘ శుద్ధ ఏకాదశిని జయైకాదశిగా వ్యవహరిస్తారు. తిథి తత్వంలో భీష్మైకాదశీ వ్రతాన్ని ఆచరించాలని ఉంది. ఈ ఏకాదశికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంద్రసభలో పుష్పవంతుడు నాట్యం చేస్తున్నాడు. తన భార్యను చూస్తూ అతను నాట్యం తప్పుగా చేశాడు. దీంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. పుష్పవంతుడిని, అతని భార్యను రాక్షసులు కావాలని శపించాడు. రాక్షసులై తిరుగుతున్న ఆ దంపతులకు మాఘ శుక్ల (శుద్ధ) ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత వారు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆ ఉపవాస ఫలితంగా వారిద్దరు శాప విముక్తులయ్యారు. భీష్ముడు ఈ తిథి నాడే మరణించాడని, కాబట్టి ఇది భీష్మైకాదశి దినమని అంటారు. అలాగే, గోదావరి సంగమ ప్రాంతమైన ఆంధప్రదేశ్‌లోని అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం ఈ తిథి నాడే ఘనంగా నిర్వహిస్తారు. ఈనాడు అక్కడ గొప్ప తీర్థం జరుగుతుంది. దీనినే అంతర్వేది తీర్థమని అంటారు. మాఘ శుద్ధ ఏకాదశినే జయైకాదశిగానూ వ్యవహరిస్తారు.
మాఘ శుద్ధ ద్వాదశి
ఫిబ్రవరి 9, ఆదివారం
మాఘ శుద్ధ ద్వాదశినే షట్తిలా ద్వాదశి (ఆరు తిలల ద్వాదశి) అంటారు. ఇంకా ఈనాడు వరాహ ద్వాదశీ వ్రతం, భీమ ద్వాదశీ వ్రతం కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇక, మాఘ శుద్ధ ద్వాదశి తథి భీష్మ ద్వాదశి పర్వమని పంచాంగకర్తలు పేర్కొంటుంటే.. వివిధ వ్రత గ్రంథాలలో దీనిని భీమ ద్వాదశిగా చెప్పారు. మొత్తానికి భీష్ముడికి సంబంధించిన మూడు పర్వాలు మాఘ మాసంలో వరుసగా వస్తుండటం విశేషం. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.
మాఘ శుద్ధ త్రయోదశి
ఫిబ్రవరి 10, సోమవారం
మాఘ శుద్ధ త్రయోదశి కల్పాది దినం. విశ్వకర్మ జయంతి దినంగా ప్రసిద్ధి. విశ్వకర్మ దేవశిల్పి. ఆయన అన్ని కళలకు, అన్ని శిల్పాలకు, అన్ని విధాలైన చేతి పనులకు, అన్ని రకాలైన వృత్తులకు ఆద్యబ్రహ్మ. ఈయన దేవతలకు కావాల్సిన నగరాలు, మేడలు, మిద్దెలు, రథాలు, ఆయుధాలు తయారు చేసి ఇచ్చాడు.
సూర్యుడిని నేర్పుగా సానబట్టి.. రాలిన ఆ చూర్ణంతో విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఇంకా శివుడికి త్రిశూలాన్ని, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని, రావణుడికి లంకా నగరాన్ని, శ్రీకృష్ణుడికి ద్వారకా బృందావనాన్నీ ఈయనే నిర్మించి ఇచ్చాడు.
విశ్వకర్మ కొడుకు నలుడు సుగ్రీవుని కొలువులో ఉండేవాడు. రాముడు సముద్రాన్ని దాటడానికి కట్టిన వారధికి చీఫ్ ఇంజనీర్ ఇతడే. విశ్వకర్మ పాండవులకు ఇందప్రస్థ నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. మన దేశంలో విశ్వకర్మ విగ్రహాలు పలుచోట్ల చూడవచ్చు. అందులో కొన్నిటికి ఒకే ముఖం ఉంటుంది. మరికొన్నిటికి పంచముఖాలు ఉంటాయి. ఆయన చేతుల్లో ఉత్పత్తి సాధనాలు అనేకం కనిపిస్తాయి. ఈయనది హంస వాహనం.
విశ్వకర్మ జయంతి నాడు కార్మికులు తమ పనులకు విశ్రాంతినిస్తారు. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు.
అలాగే, మాఘ శుద్ధ త్రయోదశి తిథి శనీశ్వరుడికి ప్రీతికరమైన తిథి. ఈనాడు ఆయన ప్రీత్యర్థం తిలలు (నువ్వులు) దానం చేయాలి. ఆయన ఆలయాలు ఉన్నచోట ఈనాడు విశేష పూజలు జరుగుతాయి. శని గ్రహ ప్రభావం ఉన్న వారు శాంతి పూజలు నిర్వహించడానికి ఈ తిథి ఉద్ధిష్టమైనది.
మాఘ శుద్ధ చతుర్దశి
ఫిబ్రవరి 11, మంగళవారం
మాఘ శుద్ధ చతుర్ధశి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన వ్రతాలు, పూజాదులేమీ లేవు. కాకపోతే, చతుర్ధశి తిథి శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆయన ప్రీత్యర్థం అభిషేకాలు, పూజలు చేసుకోవచ్చు.
మాఘ శుద్ధ పూర్ణిమ
ఫిబ్రవరి 12, బుధవారం
ఆకాశవీధిలో గల అనేకానేక నక్షత్రాలలో మఘ ఒకటి. మనకు ప్రధానంగా ఇరవై ఏడు నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులోని ఒక మండలంలో మఘ ప్రధానమైనది. మఘతో పాటుగా మరో నాలుగు నక్షత్రాలు పల్లకి ఆకారంలో చెదిరి ఉంటాయి. నెలకోసారి చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తుంటాడు. కానీ ఏడాదిలో ఒకసారి మాత్రమే అతను పదహారు కళలలో వెలుగొందుతూ మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అదే మాఘ పూర్ణిమ. మన పంచాంగకర్తలు దీనిని మహా మాఘీ అన్నారు. నాడు తిల పాత్ర కంచుక కంబళాది దానాలు చేయాలని పెద్దలంటారు.
మాఘ మాసంలో అరుణోదయాన స్నానం చేయడం మన మత విధులలో ఒకటి. చలికి వెరవక మంచుతో చల్లగా మారిన నదీ జలాల్లో స్నానం చేయాలని మన పెద్దలు మాఘ మాసపు విధిగా నిర్ణయించారు. మాఘ స్నానంతో పాటు తిలహోమం, తిలదానం, తిల భక్షణం కావించాలని చెబుతారు. ఈ ఆచారాలన్నీ ఆరోగ్యప్రదమైనవి. మాఘ మాసం పొడవునా ఈ ఆచారాలను పాటించలేకపోయినా కనీసం ఆ మాసపు పర్వాల్లో అయినా పాటించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇక, మాఘ పూర్ణిమకు కాళహస్తిలో స్వర్ణముఖి నదీ స్నానం మహత్తు కలదని అంటారు. రామేశ్వరం వద్ద సేతువులో రత్నాకరం మహోధుల సంగమం ఒకటుంది. ఇక్కడ స్నానం కూడా విశేషమైనదే. ప్రయాగలో త్రివేణీ సంగమంలో మాఘ పూర్ణిమ స్నానం మహా పాతక నాశినిగా ఉంటుందని అంటారు. అలాగే, మాఘ పూర్ణిమ సతీదేవి ప్రాదుర్భవించిన దినమని పురాణ కథ. మఘతో పాటుగా ఈశ్వరి (పార్వతి) ఒకసారి దక్షిణావర్త శంఖపు ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాళింది మడుగులోని ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి అక్కడ స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం పడుతుంది. ఈ సంగతులు తెలిసిన వాడు కావడం చేత దక్ష ప్రజాపతి ఆ శంఖాన్ని అందుకోబోయాడు.
అతని హస్త స్పర్శ తగలడంతోనే ఆ శంఖం ఒక చక్కని చిన్నారి కన్నెగా మారింది. ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ బిడ్డే సతీదేవి. శంఖం బాలికగా మారిన రోజు మాఘ పూర్ణిమ. అందుచేత మాఘ పూర్ణిమ అత్యంత పవిత్రమైన దినం అయ్యింది.
మఘ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి. కాబట్టి ఈనాడు ఆయనను పూజించాలని అంటారు. గురుడు సింహరాశి గతుడైనపుడు తమిళనాడులోని కుంభకోణంలో మహామాఘి ఉత్సవం అత్యంత వైభవంగా చేస్తారు. మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మవైవర్త పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. మాఘ శుద్ధ పూర్ణిమ నాడే గురు రవిదాస్ జయంతి దినం. అలాగే ఈనాడు కొన్నిచోట్ల లలితా జయంతినీ నిర్వహించే ఆచారం ఉంది.
మాఘ శుద్ధ పూర్ణిమ (ఫిబ్రవరి 12, 2025) నాటి నుంచే తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారంలో సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఇది నాలుగు రోజుల పాటు నిర్వహించే పర్వం. దేశవ్యాప్తంగా గల ఆదివాసీలు, గిరిజనులు తరలివచ్చి ఇక్కడి వనదేవతలను పూజిస్తారు. ఫిబ్రవరి 12న జాతర ప్రారంభమై 15వ తేదీన ముగుస్తుంది.
మాఘ బహుళ పాడ్యమి
ఫిబ్రవరి 13, గురువారం
ఈనాటి నుంచి మాఘ మాసపు బహుళ (కృష్ణ పక్ష) తిథులు ఆరంభం అవుతాయి. మాఘ బహుళ పాడ్యమి తిథి నాడు సౌభాగ్య వ్యాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మాఘ బహుళ విదియ
ఫిబ్రవరి 14, శుక్రవారం
మాఘ బహుళ విదియ నాడు ఆచరించదగిన ప్రత్యేక విధులేమీ లేవు. కాగా, ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) నిర్వహిస్తారు.
మాఘ బహుళ తదియ
ఫిబ్రవరి 15, శనివారం
మాఘ బహుళ తదియ నాడు కూడా ఆచరించదగిన ప్రధాన పూజా విధులేమీ లేవు. ఈనాటితో తెలంగాణలోని మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ముగుస్తుంది.
మాఘ బహుళ చవితి
ఫిబ్రవరి 16, ఆదివారం
మాఘ బహుళ చతుర్థి.. గణేశ పూజకు విశేషమైనది. ఈనాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. అలాగే, విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి దినం ఈనాడే.
మాఘ బహుళ పంచమి
ఫిబ్రవరి 17, సోమవారం
మాఘ బహుళ పంచమి నాడు ఆచరించదగిన విశేష పూజలు, వ్రతాలేమీ లేవు.
మాఘ బహుళ షష్ఠి
ఫిబ్రవరి 18/19, గురువారం
మాఘ కృష్ణ బహుళ షష్ఠి తిథి ఫిబ్రవరి 18వ తేదీన పూర్తి రాత్రి కాలం.. మరుసటి రోజు ఫిబ్రవరి 19న పగటి కాలం కొనసాగుతుంది. షష్ఠి తిథి నాడు కుమారస్వామిని కొలుస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, రామకృష్ణ పరమహంస జయంతులు ఈనాడు. అలాగే ఈనాటి నంచి శతభిష కార్తె ప్రారంభం అవుతుంది.
మాఘ బహుళ సప్తమి
ఫిబ్రవరి 20, గురువారం
మాఘ కృష్ణ సప్తమి తిథి ప్రధానంగా సూర్యారాధనకు ఉద్దేశించినదే. ఈనాడు నిక్షుభార్క సప్తమి, సర్వాప్తి సప్తమి మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.
మాఘ బహుళ అష్టమి
ఫిబ్రవరి 21, శుక్రవారం
మాఘ కృష్ణ అష్టమి నాడు మంగళావ్రతం ఆచరించాలి. దీనినే సీతాష్టమి అనీ, కాలాష్టమీ అని కూడా అంటారని ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఈనాడు జానకి జయంతిని జరుపుకుంటారు.
మాఘ బహుళ అష్టమి
ఫిబ్రవరి 20, ఆదివారం
మాఘ బహుళ దశమిని స్మార్త దశమి అంటారు. అలాగే, విజయ దశమిగా కూడా వ్యవహరిస్తారు. ఇంకా ఈనాడు దయానంద సరస్వతి జయంతి దినం కూడా.
మాఘ బహుళ ఏకాదశి
ఫిబ్రవరి 24, సోమవారం
మాఘ బహుళ ఏకాదశి నాడే శ్రీరాముడు రావణుడి లంకపై దండెత్తడానికి అనువుగా చేపట్టిన సేతువు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని అంటారు. అందుకే ఈ తిథి నాడు వివిధ పనులు విజయవంతానికి శ్రీకారం చుట్టే ఆచారం తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాలలో ఆచరణలో ఉంది. అలాగే, ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో మాఘ బహుళ (కృష్ణ) ఏకాదశి తిథిని విజయైకాదశిగా పేర్కొంది. దీనినే వైష్ణవ విజయ ఏకాదశి అని కూడా అంటారు.
మాఘ మాసానికి రామాయణ ఘట్టాలతో ముడిపడిన అనేక అంశాలు కనిపిస్తాయి. అందుకే మాఘ మాసపు తిథులకు రామాయణానికి చాలా సంబంధం ఉంది. అంగద రాయబారం మొదలుకుని రావణవధకు ముందు వచ్చిన యుద్ధ విరామం వరకు జరిగిన ప్రధాన ఘట్టాలన్నీ మాఘ మాస తిథులతోనే ముడిపడి ఉన్నాయి. మాఘ శుద్ధ ప్రతిపత్తి నాడు అంగద రాయబారం జరిగింది. మాఘ శుద్ధ విదియ మొదలుకుని అష్టమి వరకు వానర సేనకు, రాక్షసులకు మధ్య యుద్ధం భీకరంగా జరిగింది. మాఘ శుద్ధ నవమి నాటి రాత్రి రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు.. రామలక్ష్మణులను నాగపాశంతో బంధించాడు. మాఘ శుద్ధ దశమి నాడు వాయువు శ్రీరాముడి చెవిలో మంత్ర నామం వినిపిస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో గరుత్మంతుడు రామలక్ష్మణులను చేరుకుంటాడు. దీంతో అప్పటి వరకు రామలక్ష్మణులను బంధించిన నాగపాశములు విడివడిపోతాయి. మాఘ శుద్ధ ఏకాదశి, ద్వాదశి తిథుల సమయంలోనే ధూమ్రాక్ష వధ జరుగుతుంది. త్రయోదశి తిథి నాడు అకంపనుడిని వధిస్తారు. మాఘ శుద్ధ చతుర్దశి మొదలు కృష్ణ ప్రతిపత్తు వరకు ప్రహస్తవధ, మరో మూడ్రోజులు సంకుల సమరం జరుగుతాయి. పంచమి మొదలు అష్టమి వరకు కుంభకర్ణుని నిద్ర నుంచి మేల్కొలిపే ఘట్టం.. ఇది జరిగిన తదుపరి ఆరు రోజులకు కుంభకర్ణుడిని రామలక్ష్మణులు వధిస్తారు. అమావాస్య నాడు లంకలో యుద్ధ విరామం.
మాఘ బహుళ ద్వాదశి
ఫిబ్రవరి 25, మంగళవారం
మాఘ కృష్ణ ద్వాదశిని నీల ద్వాదశి అని కూడా అంటారని నీలమత పురాణంలో ఉంది. ఈ తిథికి ముందురోజున ఉపవాసం ఉండి ఈనాడు నువ్వులు దానం చేయాలని నియమం. అయితే, ఈనాడు తిల ద్వాదశీ వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మాఘ బహుళ త్రయోదశి/మహా శివరాత్రి
ఫిబ్రవరి 26, బుధవారం
ఇది ద్వాపర యుగాది తిథి. ఈ యుగ సంధిలోనే వేదవ్యాసుడు అవతరించి వేదాన్ని విభాగించాడని, ధర్మశాస్త్ర పురాణేతిహాసాలను రచించాడని ప్రతీతి. ఈనాడు విరివిగా దానాలు చేయాలని అంటారు. ఈ యుగాన్ని తామ్ర యుగమనీ అంటారు. ప్రజల్లో వైరుధ్య బుద్ధులు, సందేహాలు ఎక్కువవుతాయనీ, ప్రతి విషయంలో ప్రజలు సంశయ పీడితులుగా ఉండటం వల్ల ఈ యుగానికి ద్వాపర యుగం అనే పేరు వచ్చిందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఈ యుగంలోని మనుషులు శరీరంలో రక్తం ఉన్నంత కాలం ప్రాణాలు ధరించి ఉంటారు. మాఘ కృష్ణ త్రయోదశి తిథి నాడు విరివిగా దానాలు చేస్తారు. త్రయోదశి తిథి నాడే ఈసారి మహా శివరాత్రి పర్వం. శివయోగ యుక్తమైన ఈ తిథి మహా శివరాత్రి పర్వదినమని శివరాత్రి మహాత్మ్యం అనే గ్రంథం చెబుతోంది.
శివరాత్రి పర్వం అతి ప్రాచీన కాలం నుంచి ఆచరణలో ఉంది. దీనికి సంబంధించిన కథల్లో విశేషమైనది ఈ కింది కథ.
వింధ్యాద్రి మీద ఒక వేటగాడు ఉండేవాడు. మిక్కిలి క్రూరుడు. ఒకసారి పగలంతా వేటాడి, ఒక చెరువు తీరానికి చేరి అక్కడున్న బిల్వ వృక్షాన్ని ఎక్కాడు. తన తల మీద, తన చుట్టూ ఉన్న మారేడు చెట్టు కొమ్మల్ని నరికి కింద పారవేశాడు. ఆ చెట్టు మొదట్లో బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగం ఉంది. వేటగాడు నరికి పారేసిన మారేడు రెమ్మలు అతని అదృష్టవశాత్తూ శివలింగంపై పడ్డాయి. రోజంతా వేటాడుతూ ఉండటం వల్ల అతను ఆ రోజు ఏం తినకుండా ఉండిపోయాడు. అది ఉపవాసమైంది. పైగా అతను తనకు తెలియకుండానే శివ, హర, శంకర అనే నామాలను ఉచ్ఛరించాడు. అందుచేత అతని పాపాలన్నీ అతన్ని వదిలి వెళ్లిపోయాయి. అప్పుడు శంకరుడు అతని కోసం ప్రత్యేకంగా విమానాన్ని పంపి అతనిని కైలాసానికి రప్పించి దర్శనమిచ్చాడు. ఆ వేటగాడు ఆనాటి రాత్రి చెరువులో నీరు తాగడానికి వచ్చిన నాలుగు లేళ్లను చంపకుండా ఉన్నందున ఆ పుణ్యం కూడా అతను సంపాదించాడు. ఆ నాలుగు లేళ్లలో ఒకటి పూర్వజన్మలో క్షీరసాగర మథన సమయంలో దేవాసురులకు దొరికిన పద్నాలుగు రత్నాలలోనూ ఒకటైన దివ్యాంగనా రత్నం. మిగతా మూడు లేళ్లలోనూ రెండు పూర్వజన్మలో ఆ దివ్యాంగన చెలికత్తెలు. నాలుగో లేడి తొలి పుట్టుకలో హిరణ్యుడనే దైత్యుడు. పైన చెప్పిన దివ్యాంగన తన అంగ సౌందర్యానికి, కంఠమాధుర్యానికి గర్వించి శంకరుడిని పూజించడం మరిచిపోయి హిరణ్యుడనే దైత్యునితో కలిసి కేళీవిలాసాల్లో తప్పతాగి మైమరిచి ఉండేది. ఒకనాడు హిరణ్యుడు లేని సమయంలో ఆమె ఒంటరిగా శంకరుని దర్శనం కోసం కైలాస పర్వతానికి వెళ్లింది. ఆమెను చూసేసరికి శంకరుడికి చాలా కోపం వచ్చింది. ఆయన ఆమెను ఆడలేడి కావాలని శపించాడు. శాపమోక్షం తెలపాలని ఆమె అనేక విధాలుగా ప్రార్థించింది. పన్నెండేళ్ల తరువాత శాపం పోతుందని శివుడు మార్గం చెప్పాడు. ఈ లేళ్లు నక్షత్రాలై ఇప్పటికీ ఆకాశం మీద ఉన్నాయని నమ్మిక.
శివుడు అభిషేకప్రియుడు. శివరాత్రి నాడు అభిషేకాలు విశేషంగా జరుగుతాయి. గంజాయి చెట్టు ఆకుల నుంచి పేయౌషధం తయారు చేసి కానీ లేదా భంగుతో కానీ శివలింగాన్ని కడుగుతారు. ఆపై పువ్వులతో పూజిస్తారు. పిమ్మట శివ సహస్ర నామాలు చదువుతూ సహస్ర బిల్వదళాలు సమర్పిస్తారు. ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు శివపూజ మొదలై తెల్లవారుజామున ఐదు గంటలకు ముగుస్తుంది.
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజలు అతి ప్రాచీనమైనవి. యజుర్వేదంలో శివస్తోత్రం ఉంది. శివరాత్రి చరిత్రలో శివుడే నాయకుడు. మహా శివరాత్రి వ్రతం గురించి లింగ పురాణంలో ఉంది. ఆనాటి రాత్రి జాగారం ఉండటం ముఖ్యం. శివరాత్రి నాడు శివలింగానికే పూజ చేయడానికి గల హేతువుకు పురాణోక్తమైన ఈ కథ చెబుతారు.
దక్ష యజ్ఞంలో సతీదేవి శరీర త్యాగం చేసింది. అప్పుడు శివుడు ఖిన్నుడై పరిభ్రమిస్తున్నాడు. అలా తిరుగుతూ ఒకనాడు ఒక బ్రాహ్మణ పట్టణానికి వెళ్లాడు. ఆయన నగ్న రూపం చూసి అక్కడి స్త్రీలు మోహితులయ్యారు. తమ స్త్రీల ఈ దశ చూసి ఆ ఊరి బ్రాహ్మణ పురుషులు శివుడి లింగం ఊడి కిందపడుగాక అని శపించారు. ఆ ప్రకారం లింగం కిందపడిపోయింది. వెంటనే ముల్లోకాల్లోనూ ఉత్పాతాలు పుట్టాయి. దేవతలు, మునులు అందరూ వ్యాకులపడి బ్రహ్మను శరణుజొచ్చారు. బ్రహ్మ తన యోగదృష్టితో అంతా గ్రహించి శివుని వద్దకు వచ్చాడు. ఆ లింగాన్ని తిరిగి ధరించాలని ప్రార్థించాడు. అప్పుడు శివుడు- ఈ రోజు మొదలు ప్రజలంతా లింగపూజ చేస్తామనే షరతు మీద దానిని తిరిగి ధరిస్తానని అంటాడు. దీంతో బ్రహ్మ బంగారంతో లింగాన్ని చేసి మొదటి పూజ చేశాడు. ఆయన తరువాత ఇంద్రుడు మిగతా వారు విడివిడిగా శివలింగాన్ని నిర్మించుకుని పూజించారు. అప్పటి నుంచి శివలింగానికి పూజ చేయడం ఆచారంగా మొదలైంది.
శివరాత్రి అనే పేరు రావడానికి కారణం ఈశానసంహిత ఇంకో విధంగా చెబుతుంది. శివుడు నేటి అర్ధరాత్రి కాలాన కోటి సూర్య సమప్రభలతో లింగాకారంలో పుట్టడం చేత దీనికి శివరాత్రి అనే పేరు వచ్చిందట. అర్ధరాత్రి లింగోద్భవ కాలం. ఇక, పరమశివుడు లింగాకారంలో పుట్టిన రోజు కావడం చేత ఇది శివుడికి ప్రియకరమైనదని, ఈనాడు లింగరూపి అయిన శివుడిని పూజించాలని శైవాగమనం చెబుతోంది. దేవపూజ పగలు కాక రాత్రిపూట సాగడం ఈ పర్వం ప్రత్యేకత. సాధారణంగా పండుగలు మృష్టాన్న భోజనాలతో జరుగుతాయి. కానీ, శివరాత్రి ఉపవాసాల పండుగ. ఇది కూడా ఈ పర్వం ప్రత్యేకతే.
మహా శివరాత్రి గురించి పురాణేతిహాసాల్లో చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి ఇది.
బ్రహ్మ, విష్ణువు ఒకసారి తమలో ఎవరు అధికులనే విషయమై కలహించుకోసాగారు. అప్పుడు ఒకానొక అర్ధరాత్రి వేళ ఈశ్వరుడు అగ్ని లింగాకారంలో వారి ఎదుట పొడచూపాడు. దానిని చూసి వారిద్దరు విస్తుపోయి దాని కంటే తాము తక్కువ వారమనే సంగతిని గ్రహించారు. తమ అల్పత్వం తమకు అవగతం కాగా, తమలో తాము పోట్లాడుకోవడం మానివేశారు. అర్ధరాత్రి వేళ ఆ లింగాన్ని వారు అధిక భక్తితో పూజించారు. అప్పటి నుంచి అది మహా శివరాత్రి అయ్యింది. మహా శివరాత్రి ఘనత ఇంతటిది కాబట్టే ‘జన్మకో శివరాత్రి’ అనే నానుడి పుట్టింది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలు జన్మ పాపాలు హరిస్తాయని ప్రతీతి.
శివరాత్రి వ్రత ఉద్యాపన..
స్కంద పురాణంలో పేర్కొన్న ప్రకారం శివుడు స్కందునికి శివరాత్రి ఉద్యాపన విధి గురించి ఇలా వివరించాడు-
శివరాత్రి వ్రతం పద్నాలుగు సంవత్సరాల పాటు చేయాలి. త్రయోదశి నాడు ఒంటిపూట భోజనం చేసి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. శివుడికి మండపం ఒకటి కట్టి అలంకరించాలి. బ్రాహ్మణుల్ని శివస్వరూపంగా భావించి పూజించాలి. కలశ స్థాపన చేసి దానిపై పార్వతీ సహితుడైన శివుడిని ప్రతిష్ఠించాలి. బిల్వపత్ర పూజ ప్రధానం. రాత్రి సత్కథా కాలక్షేపంతో జాగారం చేయాలి. మర్నాడు ఉదయాన్నే స్నానం చేసి అర్హ మంత్రాలతో అగ్నికి రెండు వందల ఎనిమిది (208) సార్లు తిలలతో, యవలతో, పాయసంతో ఆహుతి చేయాలి. పూర్ణాహుతి అయిన తరువాత శివ విగ్రహంతో కలశం బ్రాహ్మలకు ఇచ్చి వేయాలి. వారికి గోదానం చేయడం ప్రధానం.
ఈశానసంహిత- ‘శివరాత్రి వ్రతం పాపాల్ని పోగొడుతుంది. చండాలుడికి కూడా భక్తిముక్తినిస్తుంది’ అని చెబుతోంది. శాస్త్రాలు చదవడానికి ఆస్కారం లేని చండాలురు కూడా ఈ వ్రతాచరణకు అర్హులే. ఇందుకు ఇంతకుముందు చెప్పుకున్న వేటగాడి కథే నిదర్శనం. యథాలాపంగా ‘శివా’ అన్నా చాలు.. పాపాలన్నీ శమించిపోతాయి.
మహా శివరాత్రి వ్రతాచరణ విధానం..
లింగ పురాణంలో మహా శివరాత్రి వ్రతాచరణ గురించి ఇలా వివరించారు.
శివరాత్రి నాడు పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేయాలి. శివలింగార్చన చేయాలి. ఈ మూడు రూపాల్లో శివరాత్రి వ్రతం ఆచరిస్తే ఫలదాయకం. శివరాత్రికి ముందు ఒంటిపూట మాత్రమే భక్తులు భోజనం చేస్తారు. ఆ రాత్రి పవిత్రమైన స్థలంలో నిద్రపోతారు. శివరాత్రి నాడు అరుణోదయాన్నే స్నానం చేస్తారు. శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శిస్తారు. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాముల్లోనూ నాలుగు సార్లు శివపూజ సాగిస్తారు.
• తొలిజాములో శివుడిని పాలతో అభిషేకించాలి. పద్మాలతో పూజించాలి. రుగ్వేద మంత్రాలు పఠించాలి.
• రెండో జాములో పెరుగుతో అభిషేకించాలి. పాయసం నైవేద్యంగా నివేదించాలి. యజుర్వేద మంత్రాలు చదవాలి.
• మూడో జాములో నేతితో శివుడిని అభిషేకించాలి. మారేడు దళాలతో శివుడిని పూజించాలి. సామవేద మంత్రాలు పఠించాలి.
• నాలుగో జాములో తేనెతో శివుడిని అభిషేకించాలి. నీలోత్పలాలతో పూజించాలి. అన్నం నైవేద్యం పెట్టి, అధర్వణ వేద మంత్రాలు చదవాలి. శైవమతంలో అతి విశేషమైన, సర్వోత్క•ష్టమైన పండుగ శివరాత్రి. ఈనాడు భక్తులు ఉదయాన్నే లేచి, స్నానాదులు చేసి, శివపూజ చేసి, ఉపవసించి, రాత్రంతా మేల్కొని ఉండి మర్నాటి ఉదయం వరకు శివనామస్మరణ చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథన పఠనాలతో గడుపుతారు. పూర్వం శ్రీశైల క్షేత్రంలో ఈ ఉత్సవం ఎంత గొప్పగా జరిగేదో పాల్కురికి సోమనాథుడు తన పండితారా థ్య చరిత్రలో గ్రంథస్తం చేశాడు. శివరాత్రి నాడు పూజలు, జాగరణాదులు చేసే వారు సర్వపాప విముక్తులై అంతమున శివ సాయుజ్యం పొందుతారని, శివరాత్రి వ్రతాన్ని ఆచరించని వారు జన్మ సహస్రములలో కొట్టుమిట్టాడుతారని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి.
మాఘ బహుళ చతుర్దశి/అమావాస్య
ఫిబ్రవరి 27, గురువారం
మాఘ కృష్ణ చతుర్ధశి తిథి శివుడికి ప్రీతికరమైనది. ఈనాడు విష్ణు చిత్తరామానుజ స్వామి తీర్థం కూడా. మాఘ బహుళ చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం, నువ్వులు, దర్భ, నీరు కలిపి ఇవ్వాలి. ఈనాడు పులగం తినాలి. శివుడిని బిల్వార్చనం, తుమ్మిన పూలతో పూజించాలి. మాఘ కృష్ణ చతుర్దశి నాడు దంతీ చతుర్దశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు అరుణోదయాన్నే స్నానం చేసి యమ తర్పణం చేయాలని శాస్త్ర వచనం. ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేయాలని హేమాద్రి వ్రత ఖండంలో ఉంది.
అలాగే మాఘ బహుళ అమావాస్య కూడా ఈనాడే. అమావాస్య తిథి పితృకర్మలు నిర్వహించడానికి అనువైన తిథి. ఈ దినం మన్వాది అని ఆమాదేర్ జ్యోతిషీ పేర్కొంటుండగా, ఈనాడు నవనీతధేను దానం చేయాలని పురుషార్థ చింతామణిలో ఉంది. అలాగే, ఈనాడు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడిని యథాశక్తి కొలవాలి. మాఘ కృష్ణ అమావాస్య కుంభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్యకాలం. ఈ కాలంలో సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నానం వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇది మాఘ మాసపు చివరి దినం.
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
ఫిబ్రవరి 28, శుక్రవారం
ఈనాటి నుంచి ఫాల్గుణ మాస తిథులు ఆరంభమవుతాయి. తెలుగు చాంద్రమానం ప్రకారం ఫాల్గుణం సంవత్సరంలో పన్నెండవ మాసం. శిశిర రుతువు ఈ మాసంతో ముగుస్తుంది. ఈ మాసపు తొలి దినం- ఫాల్గుణ శుద్ధ పాడ్యమి. ఈనాడు భద్ర చతుష్టయ, గుణావాప్తి, పయో మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.

మరదలు మర్యాద
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక
అక్కతోడా నీవు బండెక్కి వస్తే
ఆనందమౌతుంది అందరికి బావ!
మొలక నవ్వుల నిన్ను పలకరిస్తాను
అమ్మ నాన్నా నిన్ను ఆదరిస్తారు
చుట్టపక్కాలు నిను చూడవస్తారు
మేలైప వాడవని మెచ్చుకుంటారు
అక్కను నీ వెంట కొనిరాక బావ
బిక్కుబిక్కుమంటు ఒక్కడవు వస్తే
చిత్తమొల్లాదోయి క్షేమంబు లడుగ
మనసు పుట్టాదోయి మర్యాద చేయ
అక్క నుంచే గద బావ చుట్టంబు
ఆళ్ల నుంచే గద తిరుగలి చుట్టంబు
అన్న సామెత మనలో ఉన్నదంచూను
ఎరుగవోయీ నీవు వెర్రి మా బావ!
ఉండాలోయ్ ఉండాలి
ఫిలింకు పాట
పిల్లలకు ఆట
రాజుకు కోట
ఉండాలోయ్ ఉండాలి
అత్తకు నోరు
దేవుడికి తేరు
స్టారుకు కారు
ఉండాలోయ్ ఉండాలి
స్టేజీకి తెర
కత్తికి ఒర
చేపకు ఎర
ఉండాలోయ్ ఉండాలి
ఇంటికి అమ్మ
నిమ్మకి చెమ్మ
కొలువుకు బొమ్మ
ఉండాలోయ్ ఉండాలి
తలుపుకు గడి
దేవుడికి గుడి
అవ్వకు మడి
ఉండాలోయ్ ఉండాలి
జూదరికి పేక
గొడ్లకి పాక
గాంధీకి మేక
ఉండాలోయ్ ఉండాలి
అరవలకు పొగాకూ
ఆంధ్రులకు గోగాకూ
మలయాళులకు తేయాకు
ఉండాలోయ్ ఉండాలి
మామయ్య (గుగ్గిళ్ల పాట)
మామయ్యెంతో మంచోడే
మాటాడిస్తే నుంచోడే
నోట్లో నాలుక లేకున్నా
నూటికి సర్దారైనాడే
ఊరూ పేరూ లేకున్నా
ఉండిలే దిగమింగాడే
అట్టే పిలుపే లేకున్నా
అంగలు పంగలు వేస్తాడే
గప్పాలూరక కొడతాడే
తలుపూ మాటుకు లాగండే
తప్పెట దరువూ వేయండే
గోడా చాటుకు దీయండే
గుద్దుల బెల్లం బెట్టండే
తమ్మలపాకు లీయండే
సొమ్మూ సొట్రా లాగండే
మంచీ గంధం పూయండే
మానూ గాయను చేయండే
పని పాటంటే మామయ్యా
పాలుమాలెద వేమయ్యా
తిండీ తిప్పలకుండంటే
గండుబిల్లిలాగొస్తావే
చెయ్యని పెట్టని అయ్యలకే
రొయ్యల మీసం గావాలె
కావాలసిన పని చేయాలె
కడుపుకింత తిని తిరగాలె
మంచీచెడ్డలు తెలియలె
మారాజను పేరుండాలె
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
Other Programs
February 13, 2025
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia