చైత్రమా.. స్వాగతం

ఆంగ్లమానం ప్రకారం ఏప్రిల్‍ నెల సంవత్సరంలో నాలుగో నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ – చైత్ర మాసాల తిథుల కలయిక. చైత్ర మాసం తెలుగు సంవత్సరాల లెక్కలో మొదటిది. ఈ మాసంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి తిథి.. సంవత్సరాది దినం. వసంత మాసం చైత్రం నుంచే ఆరంభమవుతుంది. ఏప్రిల్‍ నెలలో ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు, చైత్ర మాసంలోని మరికొన్ని రోజులు కలుస్తాయి. ఏప్రిల్‍ 1, సోమవారం, ఫాల్గుణ బహుళ సప్తమి నుంచి ఏప్రిల్‍ 8, సోమవారం, ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఫాల్గుణ మాస తిథులు, ఏప్రిల్‍ 9, మంగళవారం, చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ఏప్రిల్‍ 30, మంగళవారం, చైత్ర బహుళ షష్ఠి వరకు చైత్ర మాస తిథులు కొనసాగుతాయి.

2024- ఏప్రిల్‍ 1, సోమవారం, ఫాల్గుణ బహుళ సప్తమి నుంచి
2024- ఏప్రిల్‍ 30, మంగళవారం, చైత్ర బహుళ షష్టి/సప్తమి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం- ఫాల్గుణం – చైత్ర మాసం-వసంత రుతువు-ఉత్తరాయణం

చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి ఆయా మాసాలకు ఆయా పేర్లు వస్తాయి. చంద్రుని గతి ఆధారంగా నక్షత్ర మండలానికి ఆయా పేర్లు పెట్టుకుని ఆ మండలాలలో చంద్రుడు ప్రవేశించినపుడు ఆ నెలకు ఆయా నక్షత్రాల పేర్లను మన పెద్దలు పెట్టారు. చిత్త నక్షత్రంలో పూర్ణ చంద్రుడున్న మాసం చైత్రమవుతుంది. తెలుగు పంచాంగాల ప్రకారం చైత్రం సంవత్సరారంభ మాసం. ఈ మాసంలోని తొలి తిథి (పాడ్యమి) సంవత్సరారంభ దినం. అదే ఉగాది. ఇది తెలుగు వారి అచ్చ తెనుగు పర్వం. ఈ నెలలో ప్రాధాన్యం వహించే పండుగ ఇది. యుగాది అనే పదం నుంచి ఉగాది పుట్టింది. యుగమంటే ఒక కాల విభాగం. నూతన కాలం. దానికి ఆది యుగాది. దూరాన్ని కొలిచేందుకు ‘గజము’ బద్ద వలే, ధనమును లెక్కించడానికి ‘రూపాయి’ నాణెం వలే, అనంతమైన కాలాన్ని, దాని పరిమితిని తెలుసుకునేందుకు ‘సంవత్సరం’ ఉపయోగపడుతుంది. కాబట్టి కాలాన్ని కొలిచే కొలబద్ద వంటిది ‘సంవత్సరం’. ఆ సంవత్సరానికి ప్రామాణికంగా నిలిచేది ఉగాది. భారతీయ పండుగలు, పర్వాలకు కూడా ఆరంభ పండుగ- ఉగాది. ఆ సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలకు ఇది ఆరంభ పర్వం కాబట్టి దీనిని సంవత్సరాదిగానూ వ్యవహరిస్తారు. చైత్ర మాసం నిండారా వసంత కాలం. ఒకపక్క చెట్లు ఆకులు రాలుస్తాయి. మరోపక్క కొత్త చిగుళ్లు తొడుగుతాయి. పచ్చని ఆకులు.. రంగు రంగుల పూలు ప్రకృతిని, మనసులను కూడా శోభాయమానం చేస్తాయి. ఉగాది సమయంలో పితృకర్మలు, వ్రతాలు చేయడం మన భారతీయ సంప్రదాయం. ఇంకా రమణీయమైన సీతారామ కల్యాణానికి ఈ మాసమే వేదిక..
ఉగాదిని కొన్నిచోట్ల వైశాఖ మాసంలోనూ, మరి కొన్నిచోట్ల కార్తీక మాసంలోనూ, ఇంకొన్ని చోట్ల మార్గశిర మాసంలోనూ, ఇంకా కొన్ని చోట్ల ఫాల్గుణ మాసంలోనూ నిర్వహించుకుంటారు. ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ మాసాలలో సంవత్సరాదులు రావడానికి కారణం.. సంవత్సర పరిగణనం వేర్వేరు మాసాలతో జరగడమే. తెలుగు వారు తమ సంవత్సరాదిని చాంద్రమాన పరిగణనగా నిర్ణయిస్తారు. చాంద్రమాన సంవత్సరం చైత్ర శుక్ల ప్రతిపత్తు (చైత్ర శుద్ధ పాడ్యమి)తో ప్రారంభమవుతుంది. శాస్త్రీయ, లౌకిక ఆచారాలను బట్టి చైత్ర మాసాదే ఆర్యుల సంవత్సరాదిగా వ్యావహారికంలో ఉంది. చైత్ర శుక్ల (శుద్ధ) పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మ పురాణం కంఠోక్తిగా చెబుతోంది. వసంత కాలం ఆరంభ దినాల్లో చైత్ర శుక్ల పాడ్యమి నాడు సంవత్సరాది పర్వం జరిపే ఆచారం ఆర్యుల్లో అతి ప్రాచీన కాలం నుంచీ ఉన్నట్టు కనిపిస్తుంది.
మన ఉగాది పర్వదినమే కొంచెం ఇంచుమించుగా పార్సీలకు కూడా కొత్త పండుగగా ఉంది. అగ్ని పూజకులైన పార్శీలు ఒకప్పుడు ఆర్యులతో కలిసి ఉండేవారని, వీరిద్దరు కలిసి ఉన్న కాలంలోనే కొత్త సంవత్సర పండుగ ఏర్పడి ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సర పండుగే మనకు సంవత్సరాది (ఉగాది) కాగా, పార్శీలకు ‘నౌరోజ్‍’ అయ్యింది. ‘నౌరోజ్‍’ అంటే ‘కొత్త దినం’ అని అర్థం.

బహుళ సప్తమి
ఏప్రిల్‍ 1, సోమవారం

ఫాల్గుణ బహుళ సప్తమి ఏప్రిల్‍ నెల మొదటి రోజు. ఈనాడు దేశవ్యాప్తంగా గల బ్యాంకులన్నీ సెలవు దినంగా పాటిస్తాయి. అలాగే, ఏప్రిల్‍ 1ని.. పాశ్చాత్యులు ‘ఏప్రిల్‍ ఫూల్స్ డే’గా పాటిస్తారు.

ఫాల్గుణ బహుళ అష్టమి
ఏప్రిల్‍ 2, మంగళవారం

ఫాల్గుణ బహుళ అష్టమి తిథి నాడు శీతలాష్టమి పర్వం జరుపుకుంటారు. అంటే ఈనాడు సీతాదేవి పుట్టిన రోజు. ప్రధానంగా ఉత్తర భారతంలో ఈ పర్వం ప్రసిద్ధమై ఉంది. ఈనాడు సీతాదేవిని పూజించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. సీతాష్టమికి సంబంధించి ఆసక్తికరమైన కథ ఉంది.
సీత పూర్వజన్మలో వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి దంపతుల ముద్దులపట్టి. కుశధ్వజుడు వేదాలు అధ్యయనం చేస్తుండగా శిశువు పుట్టడం వల్ల ఆ శిశువుకు వేదవతి అనే పేరు పెట్టారు. తన కుమార్తెను శ్రీహరికి ఇచ్చి పెళ్లి చేస్తానని కుశధ్వజుడు అంటుండేవాడు. ఒకసారి దంభుడు అనే రాక్షసుడు వేదవతిని తనకిచ్చి వివాహం చేయాలని అడగగా, కుశధ్వజుడు నిరాకరించాడు. దీంతో ఆ రాక్షసుడు ఒకనాడు నిద్రలో ఉన్న కుశధ్వజ మునిని హతమార్చాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య మాలవతి సైతం ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి.. తండ్రి కోరిక మేరకు శ్రీహరినే పెళ్లాడాలని నిశ్చయించుకుని తపస్సుకు దిగింది. దీక్షలో ఉన్న ఆమెను ఒకసారి రావణుడు చూసి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. విష్ణువును తప్ప వేరెవరినీ పెళ్లాడనని వేదవతి చెప్పింది. అయినా రావణుడు మోహావేశంతో వేదవతిని తాకాడు. ‘నీచుడవైన నువ్వు తాకిన నా శరీరాన్ని ఇప్పుడే త్యజిస్తున్నాను. నేను అయోనిజగా తిరిగి భూమ్మీద పుట్టి నిన్ను పుత్ర, మిత్ర కళత్రంగా నాశనం చేస్తాను’ అని శపించి వేదవతి యోగాగ్నిలో దహనమైంది. అనంతరం వేదవతి శిశువుగా జన్మించి లంకలోని తామర కొలనులో ఒక తామరపువ్వు బొడ్డులో సూక్ష్మరూపంలో దాగుండి తపస్సు చేసుకోసాగింది. శివపూజకు ఒకనాడు లంకాధీశుడైన రావణుడు తామరపూలను కోస్తూ కాస్త బరువుగా ఉన్న ఈ పువ్వును తన మందిరానికి తీసుకెళ్లాడు. అక్కడి ఆస్థాన జ్యోతిష్యులు పరిశీలించి.. ఆమె పుట్టుక అరిష్టమని చెబుతారు. దీంతో శిశువును ఒక బంగారు •ట్టెలో పెట్టి రావణుడు సముద్రంలోకి విడుస్తాడు. అది కొట్టుకెళ్లి జనక మహారాజు రాజ్యంలో భూస్థాపితమైంది. జనకుడు ఒకనాడు భూమి దున్నుతుండగా ఈ పెట్టె బయటపడింది. దానిని తెరవగా శిశువు కనిపించింది. ఆ రోజు ఫాల్గుణ బహుళ అష్టమి. నాగలి చాలుకు తగిలిన కారణంగా పెట్టెలో నుంచి బయటపడిన ఆ శిశువుకు ‘సీత’ అనే పేరు పెట్టి జనకుడు పెంచుకున్నాడు. నాగలిచాలునే సంస్క•తంలో ‘సీత’ అంటారు. తరువాత ఆమెను రాముడికి ఇచ్చి వివాహం చేయడం, రావణుడు అపహరించడం.. సీతాన్వేషణలో భాగంగా రాముడు లంకకు వెళ్లి రావణుడిని హతమార్చడం తెలిసిందే. ఇంకా ఫాల్గుణ బహుళ అష్టమి నాడు శీతలాష్టమి, కాలాష్టమి వ్రతాలు కూడా ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.

ఫాల్గుణ బహుళ నవమి
ఏప్రిల్‍ 3, బుధవారం

నాడు దుర్గాదేవిని పూజించడం ఆచారం.

ఫాల్గుణ బహుళ ఏకాదశి
ఏప్రిల్‍ 5, శుక్రవారం

ఫాల్గుణ బహుళ ఏకాదశిని పాపవిమోచన ఏకాదశి అంటారు. మంజుఘోష అనే అప్సర.. మేధావి అనే మునికి తపోభంగం కలిగించి శాపానికి గురైంది. చివరకు ఆమె ఈ ఏకాదశి నాడే ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తనకు శాపాన్ని కలిగించిన పాపాన్ని పోగొట్టుకుంది. శాప, పాప విమోచనం పొందిన ఏకాదశి కాబట్టి ఫాల్గుణ బహుళ ఏకాదశి ‘పాప విమోచన ఏకాదశి’ అయ్యిందని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా ఈనాడు ఛందో దేవపూజ ఆచరించాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా ఫాల్గుణ బహుళ ఏకాదశిని కృష్ణైకాదశిగానూ వ్యవహరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాన్ని బట్టి తెలుస్తోంది. కశ్మీర్‍లో ఈనాడు ఛందో దేవపూజ ఆచరిస్తారని నీలమత పురాణంలో ఉంది. అలాగే, ఈ తిథి నాడే శ్రీ చైతన్య మహాప్రభు జన్మించారు.

ఫాల్గుణ బహుళ ద్వాదశి
ఏప్రిల్‍ 6, శనివారం

ఫాల్గుణ బహుళ ద్వాదశి తిథి సాధారణంగా పుష్యమితో కూడి వస్తే ఆ ద్వాదశిని గోవింద ద్వాదశిగా పరిగణిస్తారు. ఈ ద్వాదశి నాడు మనోరథ ద్వాదశి, సుకృత ద్వాదశి, సుగతి ద్వాదశి, విజయా ద్వాదశి వంటి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఈనాడు ఆమలకి వ్రతం చేయాలని మరికొందరు అంటారు. ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు గంగా స్నానం మహా పాపాలను హరిస్తుందని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ప్రస్తావించారు. మరికొన్ని వ్రత గ్రంథాల ప్రకారం ఈనాడు నృసింహ ద్వాదశి వ్రతం చేయాలని, యోగేశ్వర భగవానుడిని పూజించాలని నియమం.

ఫాల్గుణ బహుళ త్రయోదశి
ఏప్రిల్‍ 7, ఆదివారం

ఫాల్గుణ బహుళ త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. అలాగే, త్రయోదశి తిథి శనిదేవుడికి ప్రీతికరమైనది. ఆయన ప్రీత్యర్థం ఈనాడు విశేష పూజలు చేస్తారు.
ఫాల్గుణ బహుళ చతుర్దశి తిథి కూడా త్రయోదశి కాలంలోనే వస్తోంది. కాబట్టి చతుర్దశిని ఈనాడే జరుపుకోవాలని చతుర్దశి తిథిని పిశాచి చతుర్దశి అంటారు. ఈ తిథి నాడు పరమశివుడిని పూజించి, పిశాచాల శాంతి కోసం బలి ఇవ్వాలని అంటారు. అలాగే, మరికొన్ని వ్రత గ్రంథాల ప్రకారం ఈ తిథి నాడు లలిత కాంత్యాఖ్యదేవి వ్రతం చేయాలని, మహేశ్వర వ్రతం ఆచరించాలని అంటారు. అలాగే, ఇది ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి దినం కూడా.
ఇక, ఏప్రిల్‍ 7.. ప్రపంచ ఆరోగ్య దినంగా పాటిస్తారు. ఆరోగ్యంపై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని ఏటా ఈ తేదీన నిర్వహిస్తుంటారు.

ఫాల్గుణ బహుళ అమావాస్య
ఏప్రిల్‍ 8, సోమవారం

ఫాల్గుణ బహుళ అమావాస్యను వివిధ ప్రాంతాలలో కొత్త అమావాస్యగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఆంధప్రదేశ్‍లోని గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో ఫాల్గుణ బహుళ అమావాస్య నాటి రాత్రి శుభాశుభాలను విచారించకుండానే ‘ఏరువాక’ సాగుతారనీ, దీనికి దొంగ ఏరువాక అని పేరనీ అంటారు. పలుచోట్ల ఈనాడు గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. జాతరలు జరుపుతారు. ఈనాడు పల్లెల్లోని వీధి వీధుల్లో ఉండే అమ్మవార్లు విశేష పూజలు అందుకుంటారు. ఈనాడు వత్సరాంత శ్రాద్ధం చేయాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో ఉంది. ‘ఆరంభమనేదే ప్రాయకంగా అంతం కూడా’. ఒకటి అంతం చేయడం అంటే మరొకటి ఆరంభం చేయడమే. ఒకదానిని మనం అంతం చేస్తే మరొకటి ఆరంభం చేస్తున్నామన్న మాట. ఈ తిథి మీన సంక్రాంతి. అనగా, మీన సంక్రమణం. అంటే సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించే రోజు. అందుకే దీనిని మీన సంక్రమణం అంటారు. షడతీతి సంక్రాంతి అని కూడా అంటారు. ఈ తిథి నాడు చేసే జపదానాలు విశేష ఫలప్రదమని అంటారు. ఈ తిథి నాడు ఆ సంవత్సరాంత శ్రాద్ధ కార్యాలు నిర్వహించాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. మత్స్య, వాసుదేవులను పూజించాలని, ఉపవాసం ఉండాలని హేమాద్రి వ్రత ఖండం చెబుతోంది. ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

చైత్ర శుద్ధ పాడ్యమి/ఉగాది/వసంత నవరాత్రోత్సవం
ఏప్రిల్‍ 9, మంగళవారం

ఇది చైత్ర మాసపు తొలి తిథి. ఈనాడే (ఏప్రిల్‍ 9, మంగళవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం-2024) ఉగాది. కొత్త సంవత్సర ఆరంభ దినం. అందుకే సంవత్సరాది అయ్యింది. వసంత నవరాత్రులు కూడా ఈనాటి నుంచే ఆరంభమవుతాయి. ఈనాడే చంద్ర దర్శనం. సాధారణంగా మన దేశంలో పుష్య, మాఘ మాసాల్లో పంటలు పండి ప్రకృతి పంటల బరువుతో, పచ్చదనపు సొగసులతో తులతూగే కాలం. రైతులు తమ శ్రమ ఫలాన్ని కళ్లెదుట చూసుకుని పొంగి పోతుంటారు. ఈ సమయంలో వచ్చేదే సంక్రాంతి పర్వం. సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలమని, విషువత్పుణ్య కాలమని అంటారు. విషువత్తంటే పగలు, రాత్రి సమానంగా ఉండే కాలం. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖపై ఉంటాడు. ఈనాటి నుంచి ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి సంక్రాంతినే పూర్వం ఉగాదిగా భావించేవారు. అయితే, నక్షత్ర గణకులు, సిద్ధాంతకర్తలు చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది తిథిగా తరువాత కాలంలో నిర్ణయించారు. అలా ఉగాది పుష్య, మాఘ మాసాలను దాటుకుని చైత్రంలో నిర్ణయమైంది. చైత్రంలోని తొలి తిథి అయిన శుద్ధ పాడ్యమి ఈ పర్వానికి నెలవైంది. ప్రస్తుతం మనకు ఇదే సంవత్సరారంభ దినం. ఇక ఈ పర్వం పూర్వాపరాల్లోకి వెళ్తే..
ఉగాది పండుగ ఆర్యావర్తనం అని పిలిచే ఉత్తర హిందూస్థానంలో ప్రస్తుతం నామమాత్రమైపోయింది. వ్రతోత్సవ చంద్రికాకారుని రాతలను బట్టి ప్రస్తుతం వింధ్య పర్వతానికి ఉత్తరాన ఒక్క మాళవ దేశంలోనే చైత్రాది పర్వం ఆచరణలో కొద్దిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈనాడు గృహాలంకరణం, పంచాంగ శ్రవణం అక్కడి విధాయ కృత్యాలు. ఉత్తర హిందూ దేశాన ఇతర ప్రాంతాలో ఈ మాత్రం పర్వం కూడా నిర్వహించరు. ఆర్యావర్తంలో ఈ ఆర్యాచారం ఎందుకు లుప్తమైపోయిందంటే.. కాలాంతరాన అమల్లోకి వచ్చిన సౌరబార్హ్యస్పత్య మన్వాది కాల పరిగణనలో గల తేడాలు ఇందుకు ఒక కారణం కావచ్చు. వింధ్యకు దక్షిణాన శాలివాహన శకము, ఉత్తరాన విక్రమార్క శకమూ ప్రచారంలోకి రావడం ఇందుకు మరో కారణం కావచ్చు. ఈ రెండు శకాల సందర్భంలో మహారాష్ట్రలో ప్రచారంలో ఉన్న గాథ గురించి తెలుసుకోవాలి.
పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి నలుగురు కొడుకులు. చనిపోయే ముందు అతను తన కొడుకులకు నాలుగు సీళ్లు వేసిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కాని సీళ్లు తెరవద్దని అతను కొడుకులను ఆదేశించాడు. అలాగే, ఆ కొడుకులు తండ్రి మరణానంతరం ఆ పాత్రల సీళ్లు తొలగించి చూపారు. మొదటి పాత్రలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు ఉన్నాయి. దీనికి అర్థం వారికి తెలియలేదు. ఆనాటి హైందవ చక్రవర్తి విక్రమార్కుడు. ఆ కుమారులు నలుగురూ దాని అర్థాన్ని బోధించాల్సిందిగా విక్రమార్కుడిని కోరారు. కానీ విక్రమార్కునికి కూడా అందులోని అంతరార్థం తెలియలేదు. అప్పుడు వారు ప్రతిష్ఠానపురానికి వెళ్లారు. అక్కడ కూడా రాజు కానీ మరెవ్వరూ కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కాని ఆ ఊరిలోని వింత బాలుడు ఒకడు ఆ సమస్యను విడమరిచి చెప్పాడు. ఆ వింత బాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. ఆ బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు ఇద్దరు సోదరులు. నాగ కుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. ఇందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. దిక్కులేని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయమిచ్చాడు. ఆ కుమ్మరి ఇంట్లోనే ఆమె ఒక కుమారుడిని ప్రసవించింది. ఆ బాలుడికి ఆమె శాలివాహనుడు అని పేరు పెట్టింది. ఆ బాలుడు వర్తకుని నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్లి ఇలా చెప్పాడు.
‘మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమినీ, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపనూ, ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువుల్నీ, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్నీ పంచుకోవాలనేది వర్తకుని తాత్పర్యం’ అని శాలివాహనుడు చెప్పాడు. శాలివాహనుడు ఇంత సముచితంగా సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతనిని చూడ్డానికి కుతూహలపడి కబురంపాడు. కానీ, శాలివాహనుడు రాజు వద్దకు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన విక్రమార్కుడు శాలివాహనుడిని మట్టుబెట్టడానికి అపార బలసమేతుడై దండెత్తి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనలపైకి వదిలాడు. శాలివాహనుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి విక్రముని సేనల్ని నిద్రపోయేటట్టు చేశాడు. అందుకు విక్రముడు వాసుకి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకుని సేనల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఉభయ పక్షాలకూ మధ్య రాజీ కుదిరింది. ఆకాశవాణి.. నర్మదా నదికి ఉత్తర ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షిణాన్ని శాలివాహనుడు ఏలాలని ఆదేశించింది. దీంతో మన ఆంధ్రులకు, దక్షిణాదులకు శాలివాహనుడు శక స్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి. దీంతో ఉగాది పర్వం అతని శక స్థాపనతో ముడిపడినదైంది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వారికి చైత్రాది దినమే సంవత్సరాది. ఆదిలో ఈనాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఈనాడే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు వినియోగించాడు. నాటి నుంచి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఆదిలో ఈనాడు ఆరంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా, దిన దిన క్రమాభివృద్ధిగా సాగుతోంది.

చైత్ర శుద్ధ విదియ
ఏప్రిల్‍ 10, బుధవారం

చైత్ర శుద్ధ విదియ తెలుగు పంచాంగ క్యాలెండర్ల ప్రకారం మత్స్య జయంతి దినం. అలాగే, ఈనాటి నుంచే మహమ్మదీయుల పవిత్ర మాసమైన రంజాన్‍ నెల ఆరంభమవుతుంది. చైత్ర శుద్ధ విదియ వేదవ్యాస తీర్థానాం పుణ్యదినం అని శ్రీమధ్వ పుణ్యతీర్థమనీ ప్రసిద్ధి. పెరియ పెరుమాల్‍ తిరు నక్షత్రం ఈనాడేనని ఆళ్వాచార్యుల చరిత్ర చెబుతోంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు ‘ఉమా శివాగ్ని పూజ’ అని రాస్తారు. ఈనాడు బాలేందు వ్రతం చేస్తారని, ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలకు దమనంతో పూజ జరగాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం చెబుతోంది. బ్రహ్మ పురాణంలో ఈ ముగ్గురికీ సంబంధించిన కథ ఒకటుంది. ఒకనాడు పార్వతి భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి అగ్ని భట్టారకుడు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా వెళ్లిపోయాడు. అప్పుడు శివుడికి వీర్య పతనమైంది. క్రీడాభంగానికి భగ్నం చెందిన పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాల్సిందిగా అగ్నిని ఆజ్ఞాపించింది. అగ్ని ఈ వీర్యాన్ని ధరించి కుమారస్వామి జననానికి కారణభూతుడు అయ్యాడు.
కాగా, స్కంద పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. ఇది స్త్రీల సౌభాగ్య వ్రతం.

చైత్ర శుద్ధ తదియ
ఏప్రిల్‍ 11, గురువారం

చైత్ర శుద్ధ పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రుల తొమ్మిది రోజులలో ఈ తదియ మూడవ రోజు. ఈనాడు శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం చేస్తారని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శివ డోలోత్సవం నాడు ఉమా శివులను దమనములతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మశాస్త్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ తదియను మహారాష్ట్ర పంచాంగాలు గౌరీ తృతీయ అని పేర్కొంటున్నాయి. వ్రత గ్రంథాలను బట్టి చూస్తే చైత్ర శుక్ల తృతీయ నాడు మహాదేవుడితో కూడిన గౌరిని పూజించాలి. దీనినే డోలా గౌరీ వ్రతం అంటారు. ఈ పూజలో కుంకుమ, అగరు, కర్పూరం హెచ్చుగా వాడాలి. అలంకారానికి మణులు, మంచి వస్త్రాలు వాడాలి. రాత్రి జాగరణం చేయాలి.
అలాగే, ఈనాడు సౌభాగ్య శయన వ్రతాన్ని కూడా ఆచరించాలని, ఈ వ్రతాన్ని గురించి మత్స్యుడు మనువుకు చెప్పినట్టు మత్స్య పురాణంలో ఉంది. చైత్ర శుద్ధ తృతీయ పూర్వాహ్న వేళ ఉమా మహేశ్వర ప్రతిమలకు వివాహం చేసి కల్పోక్త ప్రకారం పూజలు, దానాలు చేస్తే శివలోకప్రాప్తి కలుగుతుంది. ఈనాడు రామచంద్ర డోలోత్సవం చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో రాశారు.

చైత్ర శుద్ధ చతుర్థి
ఏప్రిల్‍ 12, శుక్రవారం

చైత్ర శుద్ధ చతుర్థి తిథి నాడు గణపతిని దమనములతో పూజించాలని నియమం. ఈనాడు ఆశ్రమ, చతుర్మూర్తి వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. సాధారణ పంచాంగాలలో ఈనాడు చతుర్థి వ్రతం, రోహిణి వ్రతం ఆచరించాలని ఉంది.

చైత్ర శుద్ధ పంచమి
ఏప్రిల్‍ 13, శనివారం

చైత్ర శుద్ధ పంచమి తిథి శాలి హోత్రయ పంచమి దినం. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలలో ఉన్నాయి. ఈనాడు హయపూజ చేయాలని నియమం. శాలిహోత్రుడు అశ్వశాస్త్రం రాసిన రుషి. మన రాజులు ఆశ్విక దళాన్ని బాగా పోషించే రోజుల్లో ఈ శాలిహోత్రహయ పంచమి వ్రతం బాగా ఆచారంలో ఉండేదని తెలుస్తోంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు శ్రీపంచమి, శ్రీ వ్రతం అని రాస్తారు. మాఘ మాసంలో ఒక శ్రీ పంచమి ఉంది. ఈ పంచమి కంటే అది బాగా ప్రచారంలో ఉన్న పండుగగా కనిపిస్తుంది. ఈనాడు లక్ష్మీపూజ చేయలని, ఈ పక్రియనే ‘శ్రీ వ్రతం’గా వ్యవహరిస్తారని అంటారు. కొన్ని ప్రాంతాలలో ఇది లక్ష్మీ పంచమిగానూ పరిగణనలో ఉంది.

చైత్ర శుద్ధ షష్ఠి
ఏప్రిల్‍ 14, ఆదివారం

చైత్ర శుద్ధ షష్ఠి నాడు స్కంద షష్ఠి వ్రతం ఆచరిస్తారు. ఇది కుమారస్వామి సంబంధమైన పర్వం. ఈనాడు ఆచరించే పూజను స్కంద పూజ అంటారు. అర్క, కుమారషష్ఠి వ్రతాలు కూడా ఈనాడు చేస్తారని చతుర్వర్గ చింతామణి, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథాలలో ఉంది.

చైత్ర శుద్ధ సప్తమి
ఏప్రిల్‍ 15, సోమవారం

చైత్ర శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని దమనాలతో పూజించాలి. సప్తమి తిథి నాడు ఇంకా గోమయాది సప్తమి, నామ సప్తమి, సూర్య, మరుత్‍, తురగ సప్తమీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు వాసంతీ పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. అలాగే, ఈనాడు అర్క వ్రతం ఆచరించే వారు రాత్రి భోజనం చేయకూడదు. పైన పేర్కొన్న వ్రతాలన్నీ సూర్య సంబంధమైనవే.

చైత్ర శుద్ధ అష్టమి
ఏప్రిల్‍ 16, మంగళవారం

చైత్ర శుద్ధ అష్టమి పార్వతీ దేవి జన్మ తిథి. అందుకే ఈ తిథిని భవానీ అష్టమిగా, అశోకాష్టమిగా పరిగణిస్తున్నారు. భవానీ అనేది పార్వతీదేవికి గల మరో పేరు. ఆమె శివుని భార్య. శివుని మొదటి భార్య సతీదేవి. ఆమె దక్షుని పెద్ద కుమార్తె. శివుడు ఒకసారి దక్షుడిని ఆక్షేపించాడు. ఆ కోపంతో దక్షుడు కూతురిని పుట్టింటికి తీసుకురావడం మానేశాడు. ఆమె చెల్లెళ్లను మాత్రం తరచూ పుట్టింటికి పిలుస్తూ చీరలు, సారెలు పెట్టి పంపించే వాడు. ఈ క్రమంలోనే దక్షుడు ఒకసారి మహా క్రతువు తలపెట్టాడు. దీనికి పార్వతిని తప్ప అందరినీ పిలిచాడు. కానీ పార్వతి పుట్టింటిపై మమకారంతో వెళ్లింది. అక్కడ ఆమెను తండ్రితో సహా ఎవరూ పలకరించలేదు. ఈ అవమానం భరించలేక కాలి బొటనవేలితో నేలరాచింది. యోగాగ్ని పుట్టింది. అందులో ఆమె భస్మమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుడిని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. యోగాగ్నిలో దేహాన్ని త్యజించిన సతీదేవి మరుజన్మలో హిమవంతుని భార్య అయిన మేనకాదేవి గర్భంలో చైత్ర శుద్ధ అష్టమి నాడు పుట్టింది. పర్వతరాజు కుమార్తె కాబట్టి ఆమెకు పార్వతి అనే నామం సార్థకమైంది. భవానీ అనేది పర్యాయ పదం. ఇంకా ఈ తిథి సందర్భంలో భవానీ యాత్ర, అశోకాష్టమి, అశోక రుద్రపూజ, అశోకకలికా ప్రాశనం అనే వ్రతాలు ఆచరించాలని కూడా మన పంచాంగకర్తలు రాశారు.

చైత్ర శుద్ధ నవమి
ఏప్రిల్‍ 17, బుధవారం

చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి పర్వదినం. ధర్మ సంస్థాపకుడైన శ్రీరామచంద్రుడు పుట్టింది ఈ తిథి నాడే. చై•త్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర యుక్తాన రాముడు జన్మించాడు. అందుకే ఇది శ్రీరాముని జన్మతిథి. శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రామావతారం ఏడవది. శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథుడికి కౌసల్య గర్భంలో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం వేళ పుట్టాడు. అందుచేత ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి దినమైంది. విష్ణువు పది అవతారాల్లో మూడు అవతారాల జయంతులు చైత్ర మాసంలోనే రావడం విశేషం. ఇందులో ఇంకో విశేషం ఉంది. ఏటేటా వచ్చే ఈ పది జయంతులలోనూ ఉగాది తరువాత మొదట వచ్చే జయంతి పర్వం శ్రీరామ నవమే. శ్రీరామ నవమి పండుగ తొమ్మిది రోజులు చేస్తారు. ఆ తొమ్మిది రోజులలో ఉగాది పాడ్యమి మొదటి రోజు. ఈ తొలి రోజున ప్రారంభించి శ్రీరామ నవమి వరకు రామాయణ పారాయణ మొదలైనవి ఆచరిస్తారు. ఈ తొమ్మిది రోజులను గర్భ నవరాత్రులు అంటారు. ఈనాడు తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం, ఒంటిమిట్ట తదితర రామాలయాలతో పాటు ఊరూవాడా గల అన్ని చిన్నా పెద్దా ఆలయాల్లోనూ రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

చైత్ర శుద్ధ దశమి
ఏప్రిల్‍ 18, గురువారం

చైత్ర శుద్ధ దశమి తిథి ఇది శాలివాహన జయంతి తిథి. శాలివాహనుడు శాతవాహన పర్యామాభిధానుడు. ఆంధ్రభూమి ప్రసవించిన మహా పురుషులలో ఈయన ఒకరు. విక్రమార్కుడిని సంహరించాడని అంటారు. ఉగాది పర్వం ఈయనకు సంబంధించిన కథతో కూడా ముడి పడి ఉంది. అలాగే, ఈనాడు పాండవ అగ్రజుడైన ధర్మరాజును దమనముతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. రెండు ప్రధాన పర్వాలతో కూడిన చైత్ర శుద్ధ దశమి కాబట్టే ఈనాడు మన పంచాంగకర్తలు ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అని రాస్తారు. ఇంకా, రామ నవమి ప్రతాంగ హోమం ఈనాడే నిర్వహించాలని అంటారు.

చైత్ర శుద్ధ ఏకాదశి
ఏప్రిల్‍ 19, శుక్రవారం

చైత్ర శుద్ధ ఏకాదశి అనేది సాధారణంగా ఉపవాసాల రోజు. అందుకే తిథులన్నిటిలోకీ ఏకాదశి చాలా పవిత్రమైనది. చైత్ర శుద్ధ ఏకాదశిని పంచాంగకర్తలు కామద ఏకాదశిగా వ్యవహరిస్తున్నారు. ఏకాదశి పర్వం విశేషాల్లోకి వెళ్తే.. ఏకాదశి తిథి నెలలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది. పక్షానికి ఒకటి, మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు. ఈ ఇరవై నాలుగు ఏకాదశులూ ఇరవై నాలుగు పర్వాలుగా ఉన్నాయి. ‘ఏకాదశి’ అనేది పౌరాణిక గాథల్లో ఒక దేవత పేరు. మురాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు వైకుంఠం నుంచి గరుడ వాహనం మీద భూమికి దిగి వచ్చాడు. అసురుడితో ఆయన బాగా యుద్ధం చేశాడు. యుద్ధం మధ్యలో అతను అలసిపోయి మూర్ఛపోయాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక సౌందర్యవతి ఆవిర్భవించి అసురుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది. ఆ సౌందర్యవతికి దేవతలు ‘ఏకాదశి’ అనే పేరు పెట్టారు. ఏకాదశి పొందిన విజయాన్ని స్మరించడం కోసం ఈ పర్వం ఏర్పడిందని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించే వారిని ఆ దేవత రక్షిస్తుందని అంటారు. ఈనాడు ఏ కోరికలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ కోరికలు తీరుతాయి కాబట్టి ఈ ఏకాదశి పర్వాన్ని కామద ఏకాదశి అన్నారు. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. లలిత అనే గంధర్వ స్త్రీ ఈ తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, తన కోరికలను తీర్చుకుందట. ఆమె మనసులోని కామితం (కోరిక) నెరవేరింది కాబట్టి ఇది కామదౌకాదశి (కామద ఏకాదశి) అయ్యింది. గోదావరి తీర ప్రాంతంలో ఈ ఏకాదశిని వాడపల్లి ఏకాదశి పేరుతో జరుపుకుంటారు. ఈనాడు అక్కడి వేంకటేశ్వరస్వామికి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈనాడు లక్ష్మీనారాయణులను దమనములతో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు.

చైత్ర శుద్ధద్వాదశి
ఏప్రిల్‍ 20, శనివారం

చైత్ర శుద్ధ ద్వాదశి విశిష్టత గురించి పద్మ పురాణంలో కొంత ప్రస్తావన ఉంది. ఏకాదశి నాడే క్షీరసాగర మథనం ప్రారంభమైంది. ఏకాదశి మర్నాడు ద్వాదశి నాడు ఈ పక్రియలో భాగంగా దేవతలు పాల సముద్రాన్ని మథించగా లక్ష్మీదేవి నాలుగు చేతులలో రెండు చేతులతో బంగారు పద్మాలను, మిగతా రెండు చేతులతో ఒక సువర్ణ పాత్రను, మాదీ ఫలాన్ని పట్టుకుని ఆవిర్భవించింది. అనంతరం చంద్రుడు పుట్టాడు. ఆ సందర్భంలో నారాయణుడు దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు- ‘ద్వాదశి నాడు లక్ష్మీసహితుడనైన నన్ను తులసీ దళాలతో విశేషంగా పూజించారు. కాబట్టి ద్వాదశి తిథి నాకు మిక్కిలి ప్రియమైనది. ఇది మొదలు జనులు ఏ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాటి ప్రాత కాలాన శ్రద్ధాభక్తులతో లక్ష్మీసహితుడనైన నన్ను తులసితో పూజిస్తారో వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ద్వాదశి ధర్మార్థ కామ మోక్షాలను నాలుగింటిని ఇచ్చేది’ అని పలికాడు. అందుకే చైత్ర శుద్ధ ద్వాదశి నాడు విష్ణు దమనోత్సవం నిర్వహించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. దీనినే వాసుదేవార్చనగా వ్యవహరిస్తారు. మన పంచాంగకర్తలు మాత్రం ఈనాటి వివరణలో వామన ద్వాదశి అని రాస్తారు. వామనుడిని లేదా విష్ణువును లేదా వాసుదేవుడిని ఈనాడు దమనంతో పూజించాలని నియమం.

చైత్ర శుద్ధ త్రయోదశి
ఏప్రిల్‍ 21, ఆదివారం

చైత్ర శుద్ధ త్రయోదశిని అనంగ త్రయోదశి అనీ లేదా మదన త్రయోదశి అనీ అంటారు. అనంగుడన్నా, మదనుడన్నా మన్మథుడని అర్థం. దీనిని బట్టి ఇది మదనుడికి సంబంధించిన పర్వమని అర్థమవుతోంది. మన్మథుడు శివాగ్రహానికి గురై అనంగుడిగా మారాడు. అనంగుడు అంటే దేహం లేని వాడు. దీనికి సంబంధించి పురాణాలలో రెండు కథలు ఉన్నాయి. అలాగే, ఈనాడు శివుడిని దమనాలతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు చేసే శివపూజ మిక్కిలి ఫలప్రదమైనదని అంటారు. ఈ ఒక్కనాటి పూజ వలన సంవత్సరం మొత్తం శివుడిని పూజించిన ఫలం కలుగుతుంది.

చైత్ర శుద్ధ చతుర్దశి
ఏప్రిల్‍ 22, సోమవారం

చైత్ర శుద్ధ తిథి రౌచ్య మన్వాదిగా ప్రతీతి. చతుర్దశి తిథి శివుడికి ప్రీత్యర్థమైనది కాబట్టి దీనిని శైవ చతుర్దశి అనీ అంటారు. ఇక, రౌచ్యుడి వివరాల్లోకి వెళ్తే.. రౌచ్యుడు రుచి కుమారుడు. రుచి భార్య మాలిని. రుచికి పితృ దేవతలు అతని కొడుకు మనువు కాగలడని చెప్పారు. ఆ విధంగానే రౌచ్యుడు మనువు అయ్యాడు. ఈయన మన్వంతరంలో బృహస్పతి ఇంద్రుడు అయ్యాడు. అతని కుమారులైన చిత్రసేనుడు, దృఢుడు, సురధుడు మొదలైన వారు రాజులు అయి పాలించారు. ఈనాడు కూడా శివపూజ చేయగదగినది. ఈనాడు ఇంకా నృసింమ డోలోత్సవం చేస్తారని స్మ•తి కౌస్తుభం, మహోత్సవం వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

చైత్ర శుద్ధ పూర్ణిమ
ఏప్రిల్‍ 23, మంగళవారం

చైత్ర శుద్ధ పూర్ణిమను మహాచైత్రి అని కూడా ఉంటారు. ఈనాడు చిత్ర వస్త్ర దానం, దమన పూజ విహితకృత్యాలుగా ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్దేశించాయి. చిత్ర వస్త్రదానం అంటే రంగురంగుల బట్టలను దానం చేయడం. ఈ పర్వ సందర్భంలో ఇంద్రాది సమస్త దేవతలకు దమన పూజ చేయడం మహా ఫలాన్నిస్తుంది. అలాగే చిత్రా పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. పూర్ణిమలు రెండు రకాలు. ఒక కళ చేత తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ ఒకటి. ఈ పూర్ణిమను ‘అనుమతి’ అంటారు. పదహారు కళలతో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ మరొకటి. ఇది రాకా పూర్ణిమ. సూర్యేందు సంగమ కాలం అమావాస్య. అమావాస్య నుంచి పూర్ణిమకు పదహారు రోజులు. అమావాస్య నుంచి పున్నమికి, పున్నమి నుంచి అమావాస్యకు గల కాలాన్ని పర్వసంధి అంటారు. అమావాస్య నుంచి పూర్ణిమాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క దినానికి చంద్రుడికి ఒక్కో కళ హెచ్చుతూ ఉంటుంది. పూర్ణిమాస్య నుంచి అమావాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కో దినానికి చంద్రునికి ఒక్కో కళ తగ్గుతూ ఉంటుంది. పదహారు కళలలో ఒప్పుతూ పూర్ణిమ నాడు చంద్రుడు కాంతివంతుడై ఉంటాడు. ఇలా చంద్రుడు కాంతివంతంగా ప్రకాశించే దినాలు ఏడాదికి పన్నెండు ఉంటాయి. అనగా, ఏడాదికి పన్నెండు పూర్ణిమలన్న మాట. ఈ పన్నెండు పూర్ణిమలలోనూ చంద్రుడు ఒక్కో నక్షత్రంతో కూడి ఉంటాడు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పూర్ణిమకు పేరు వస్తుంది. మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో చిత్ర ఒకటి. అటువంటి చిత్తా నక్షత్రంతో కూడిన పూర్ణిమకు ‘చైత్రీ’ అని పేరు. ఈనాడు మధుర కవి ఆళ్వారు తిరు నక్షత్రం కూడా. అలాగే ఒక ఏడాదిలోని పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా కూడా ఉన్నాయి.
చైత్ర పూర్ణిమ తిథి హనుమజ్జయంతి పర్వంగా కూడా ప్రసిద్ధి. ఆంధ్రులలో మధ్వ మతస్తులకు ఇది మరీ ముఖ్యమైన పండుగ. హనుమంతుడు అంజనాదేవి పుత్రుడు. అంజన కేసరి అనే వానరుని భార్య. సంసారంలో విసుగుపుట్టి కేసరి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు. తపస్సుకు వెళ్తూ అతను తన భార్యను వాయుదేవునికి అప్పగించాడు. ఆమె శ్రద్ధాభక్తులకు మెచ్చి, వాయువు తన గర్భమందున్న శివుని వీర్యాన్ని ఆమెకు ఇచ్చాడు. దాంతో ఆమె గర్భం ధరించి కుమారుడిని ప్రసవించింది. అతనే ఆంజనేయుడు. వాయు ప్రసాదితం కావడం చేత అతనికి వాయుపుత్రుడు అనే పేరు కూడా వచ్చింది.
చైత్ర పూర్ణిమ నాడు వరాహ పురాణాన్ని దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈనాడు పశుపతవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామని అనే వ్రత గ్రంథంలో రాశారు.

చైత్ర బహుళ పాడ్యమి
ఏప్రిల్‍ 24/25, బుధ/గురువారాలు

చైత్ర బహుళ పాడ్యమి నాడు పాతాళ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు జ్ఞానావాప్తి వ్రతం కూడా చేస్తారని తెలుస్తోంది. అయితే, ఈ వ్రతాచరణలకు సంబంధించి వివరాలు అందుబాటులో లేవు. ఈ తిథి నాడు ప్రపాదానం చేయాలని, ధర్మఘటాది దినమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

చైత్ర బహుళ చతుర్థి
ఏప్రిల్‍ 28, ఆదివారం

చైత్ర బహుళ చతుర్థి తిథి సంకష్ట హర చతుర్థి. సాధారణంగా చతుర్థి తిథి గణపతి ఆరాధనకు ఉద్ధిష్టమైనది.

చైత్ర బహుళ పంచమి
ఏప్రిల్‍ 29, సోమవారం

విష్ణుమూర్తి దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. ఈ అవతార జయంతి దినం ఎప్పుడనేది కొంత వివాదమై ఉంది. అయితే, ఒకటి రెండు ప్రమాణ గ్రంథాలను బట్టి చైత్ర బహుళ పంచమి నాడే మత్స్య జయంతి దినమని అంటున్నారు. ఏదేమైనా మత్స్యావతార గాథ ముచ్చటైనది. ఆ కాలంలో సోమకుడు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. వాడు బ్రహ్మ నిద్రపోతున్న సమయం చూసి బ్రహ్మ ముఖంనందు ఉంటే నాలుగు వేదాలను ఎత్తుకుని పోయి సముద్రంలో దాక్కున్నాడు. వేదాల తోడ్పాటు లేక బ్రహ్మకు సృష్టి కార్యం సరిగా సాగలేదు. ఆ విషయం ఆయన విష్ణుమూర్తితో చెప్పుకున్నాడు. అప్పుడు మత్స్యమూర్తిగా ఉన్న జనార్థనుడు నీటిలో వెదకి సోమకుడిని సంహరించాడు. తన నాలుగు చేతులతో నాలుగు వేదాలు తెచ్చి బ్రహ్మకు ఇచ్చాడు.
ఇది మరో గాథ. వైవస్వత మనువు పితృ తర్పణం చేస్తూ ఉన్నాడు. అతని దోసిట్లో ఒక చిన్న చేప పడింది. కరుణించి ఆయన దానిని తన కమండలువులో వేశాడు. అందులో అది ఒక పగలు, ఒక రాత్రి ఉండి పదహారు అంగుళాలు పెరిగింది. తను ఉండటానికి ఆ కమండలం చాలకుండా ఉందని అది గోల పెట్టింది. అప్పుడు మనువు దానిని ఎత్తి ఒక నీళ్ల కాలువలో ఉంచాడు. అందులో అది ఒక రాత్రి ఉంది. ఆ రాత్రికి రాత్రి అది మూడు మూరల పొడవు పెరిగింది. నాకీ చోటు చాలక చచ్చిపోతున్నాను.. నన్ను రక్షింపవలసింది అని ఆ చేప మనువుకు మొర పెట్టుకుంది. అప్పుడు మనువు దానిని ఒక నూతిలో వేశాడు. అది ఆ నుయ్యి కూడా సరిపోనంత పెద్దగా పెరిగింది. అందుమీద మనువు దానిని ఒక చెరువులో వదిలాడు. అది ఆ చెరువు పట్టనంతటి పెద్ద చేపగా మారింది. అంతట ఆయన దానిని ఒక నదిలో వదిలాడు. పెరుగుతూ వచ్చిన చేపకు ఆ నది కూడా సరిగా సరిపోలేదు. ఆ పిమ్మట మనువు దానిని సముద్రంలో ఉంచాడు. అది సముద్రంలోకి చేరడంతోనే కడలి అంతా అల్లకల్లోలమైంది. ఆ అల్లకల్లోలంలో ఆ మీనం మేను రెండు లక్షల యోజనాల ప్రమాణానికి పెరిగింది. అంత బ్రహ్మాండంగా పెరిగి కూడా అది ‘నన్ను రక్షించు.. నన్ను రక్షించు’ అని మొర పెట్టుకోవడం మానలేదు.
మనువుకి ఇదంతా చూసి ఆశ్చర్యం వేసింది. ‘ఓ మత్స్యమా! నీ లీలలు లోగడ చూచి ఉండనివిగా ఉన్నాయి. కనీసం విని అయినా ఉండనివి ఉన్నాయి. నీవు నిజానికి వాసుదేవుడవో, కాకపోతే అసురుడవో అయి ఉండాలి’ అన్నాడు.
అప్పుడు ఆ చేప ‘ఓ వైవస్వతా! నీవు నన్ను గుర్తించావు. కాబట్టి నీకు ఒక సంగతి చెబుతున్నాను. ఇదిగో ఈ నావను చూడు. ప్రళయ కాలం సమీపించింది. ఇప్పుడు చాక్షుష మన్వంతరం నడుస్తోంది. ఆ మన్వంతరం నూరేండ్లలో ముగుస్తుంది. ఆ ముగింపునకు ముందు అనావృష్టి దోషం కలుగుతుంది. ఆ కారణంగా కరువు ఏర్పడుతుంది. ఆ పిమ్మట సంవర్తం, భీమనాదం, ద్రోణము, ఇంద్రము, వలాహకము, విద్యుత్పతాకము, శోణము అనే ఏడు మేఘాలు విజృంభించి అధిక వ••ష్టిని కలిగిస్తాయి. ఆ వానకు సప్త సముద్రాలు ఏకమై జళ ప్రళయం కలుగుతుంది. భూమి వనసర్వత సహితంగా జలార్ణవంలో మునిగిపోతుంది. కాబట్టి ముందుగానే వేదములు, విద్యలు, బీజములు మున్నగునవి- నేను, బ్రహ్మ, దేవతలు మున్నగు వారు నీచే రక్షితులు కావాలి. ఆ జల ప్రళయంలో అనంతుడనే పాము నీటి మీద తేలుతూ ఉంటుంది. ఆ పామును తాడుగా చేసి ఈ నావను నా కొమ్ముకు కట్టివేయి. అప్పుడు ప్రళయ మారుతం వీచి ఈ ఓడను కుదుపి వేస్తుంది. ఆ అల్లకల్లోలానికి నీవు ఏమీ భయపడవద్దు’ అని చెప్పి ఆ చేప అంతర్థానమైంది.
ప్రళయ కాలంలో మనువు ఆ చేప చెప్పినట్టే చేశాడు. మత్స్యమూర్తి అయి ఆనాడు ఇట్లు వేదాలు తెచ్చి బ్రహ్మకు ఇచ్చి లోకాన్ని కాపాడినాడు. కావున ఆనాడు మత్స్యమూర్తి ప్రతిమను పూజించాలనే నియమం ఏర్పడింది.
క్రైస్తవులలో మత్స్యం శాంతి దేవతగా, మహమ్మదీయులలో చేప భగవానుడిగా పేర్కొని ఉంది. బౌద్ధ జాతక కథలలో బుద్ధుడు చేపగా పుట్టినట్టు ఉంది.

Review చైత్రమా.. స్వాగతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top