ఆధ్యాత్మిక వికాస పురుషుడు

శ్రీరాముడంటే ఎవరు?

సకల సద్గుణాల మూర్తి.
ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం. నిష్పక్షపాతి.
తల్లిదండ్రులంటే అమిత గౌరవం గలవాడు.
ప్రజలంటే అంతకుమించిన అభిమానం.
రాజుకే కాదు.. ఒక మనిషికి ఎలాంటి లక్షణాలుండాలో అవన్నీ పోతపోసినట్టు మూర్తీభవించిన రూపం- శ్రీరామచంద్రుడు.
అందుకే ఈ జానకీ నాయకుడు జగదానంద కారకుడయ్యాడు.
జగమంతటికీ నాయకుడయ్యాడు.
ఈ నేల మీద కేవలం మనిషిగా జీవిస్తూనే రాముడు ఎన్నో అద్భుత కార్యాలు సాధించాడు.
ఆయనెప్పుడూ తాను దేవుడినని చెప్పుకోలేదు. అలా ప్రవర్తించనూ లేదు. కష్టనష్టాలను అనుభవించాడు. చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించాడు. జనాన్ని ఆదరించాడు. రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. ఏ ఒక్క సందర్భంలోనూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అదే ఆయనను మహోన్నతుడిగా నిలిపింది.
రాముడే కాదు ఆయన తండ్రి దశరథుడు కూడా మంచి పాలకుడే. సిసలైన ప్రజాస్వామ్యవాది. ఆయన తన రాజ్య ప్రజల మనసెరిగి, మనసులను గెలిచి సుభిక్షంగా పాలించినవాడు. అందుకే తన తరువాత అధికారాన్ని ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఆయన వ్యవహరించిన ప్రజాస్వామ్యయుత పద్ధతి ఎన్నటికీ ఎన్నదగినది. ఆయన రాముడిని తన తదుపరి రాజుగా ఎంపిక చేసే విషయంలో ఎలా వ్యవహరించాడో చూడండి..
దశరథ మహారాజు వృద్ధుడైపోయాడు. తన ముద్దుల తనయుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని తలచి, కులగురువైన వశిష్ఠుడు, ఇతర మంత్రుల వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ‘సకల గుణాభిరాముడిని రాజుగా చేసుకోవడం కంటే మాకు కావాల్సిందేముంది?’ అంటూ అంతా ముక్తకంఠంతో దశరథుని ప్రతిపాదనను బలపరిచారు. కానీ, దశరథుడు అంగీకరించలేదు. ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. ప్రజలందరినీ పిలిచాడు. ‘రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను. అయితే ఇది ప్రతిపాదన మాత్రమే. మీ అందరికీ ఇష్టమైతేనే రాముడు రాజు అవుతాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి. ఒకవేళ రాముడు రాజు కావడం మీకు ఇష్టం లేకపోతే మీ దృష్టిలో ఉత్తములు ఎవరో కూడా చెప్పండి’ అని ప్రకటించాడు దశరథుడు.
‘రాముడే మా రాజు’ అంటూ ప్రజలు ముక్తకంఠంతో ఎలుగెత్తారు. ఆనందంతో నృత్యం చేశారు. కానీ, దశరథుడు అప్పటికీ సంతృప్తి చెందలేదు. మంత్రులందరితో మరోసారి ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుందామని అన్నాడు. పైగా ప్రజలతో ఇలా అన్నాడు-
‘నేను ఇప్పటికే నిబద్ధతతో మిమ్మల్ని, ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాను కదా! అటువంటప్పుడు నా కుమారుడు పట్టాభిషిక్తుడు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు?’.
‘దశరథ మహారాజా! నీ కొడుకు రామచంద్రుడు సకల గుణ సంపన్నుడు. సర్వ ప్రాణుల హితాన్ని కోరుకునే వాడు. ధీమంతుడు. ఆయనను మా రాజుగా చేసుకోవడం నిజంగానే మాకెంతో ఆనందదాయకం’ అన్నారంతా.
అయితే, జరిగింది వేరు. దశరథుని భార్య కైక రాముడు రాజు కాకూడదండి. తన పుత్రుడైన భరతుడికి పట్టాభిషేకం చేయాలంది. రాముడు రాజు కావాలని ప్రజలు ఎంతగా కోరుకున్నారో.. ఆయన అడవుల పాలవడంతో అంతకంటే ఎక్కువగా విలపించారు. అయోధ్యవాసులంతా రాముడి వెంట అడవులకు బయల్దేరారు. వారందరికీ సర్దిచెప్పి వెనక్కి పంపడానికి రాముడు చాలా కష్టపడ్డాడు. ఇదంతా ఆయన సంపాదించుకున్న ఆదరణ. రాముడు మర్యాద పురుషోత్తముడు. తాను సాక్షాత్తూ చక్రవర్తి అయినా.. ఎదురుగా ఎవరొస్తున్నా ముందు తానే పక్కకు తప్పుకునే వాడు. పూర్వభాషి. ఎంత చిన్నవారినైనా ముందుగా తానే పలకరించేవాడు. మృదుస్వభావి. అందరితో చాలా మృదువుగా వ్యవహరించేవాడు.
స్మితభాషి- అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు.
మితభాషి. చాలా తక్కువగా మాట్లాడేవాడు.
మధురభాషి. ఎంతో తియ్యగా, ఎదుటి మనిషికి హాయి కలిగించేలా మాట్లాడగలిగే వాడు. చాలా అణకువ గలవాడు. రాముడు తన జీవితంలో ఏ ప్రాణినీ అవమానించి ఎరుగడట.
ఎన్నడూ ఎవరినీ తూలనాడిన సందర్భమూ ఆయన జీవితంలో లేదు. సీతాన్వేషణలో, రావణ యుద్ధంలో తనకు సాయపడిన వానర, భల్లూకాలను సమాదరించాడు. రాజగురువు వశిష్టుడిని, గిరిపుత్రి శబరిని, పడవ నడిపే గుహుడిని సమానంగా గౌరవించాడు. తనను అడవుల పాల్జేసిన కైకేయిని గురించి ఒక్కమాటా చెడుగా మాట్లాడలేదు. శత్రువైన రావణాసురుడి గురించి చెడుగా మాట్లాడలేదు. పైగా మొదటిసారి రావణుడిని చూసినపుడు, ‘ఆహా ఏమి తేజస్సు? రాజంటే ఇతడు కదా!’ అని ఆశ్చర్యపోయాడు. అతని తేజస్సంపదను ప్రసంశించాడు. చూడగానే అతని శక్తిని అంచనా వేశాడు. సీతను అపహరించకుండా ఉండి ఉంటే దేవలోకానికి కూడా రావణుడు రాజయ్యేవాడేమో! అనుకున్నాడు. నిష్పక్షపాతంగా అతడి శక్తిసామర్థ్యాలను అంచనా వేశాడు. కాబట్టే రావణుడిపై విజయం సాధించగలిగాడు. రాముడికి రావణుడిపై గెలుపును సాధించిపెట్టింది ఆయనలోని మర్యాదా గుణమే.
రాముడిని ఒక్కసారి చూసిన వాళ్లైనా, ఒక్కసారి ఆయనతో మాట్లాడిన వాళ్లెవరైనా జన్మలో ఆయనను మరిచిపోలేరట. దానికి ఆ దివ్య సుందర విగ్రహం ఒక కారణం అయితే, ఆయన మర్యాదే ముఖ్య కారణం. అందుకే సీతను వెతుక్కుంటూ బయల్దేరినపుడు రామలక్ష్మణులిద్దరే ఉన్నారు. కానీ, రావణుడి మీద యుద్ధం ప్రకటించే నాటికి ఆయన వెంట హనుమంతుడూ, జాంబవంతుడూ, విభీషణుడూ సుగ్రీవుడు లాంటి యోధానుయోధులూ, లక్షలాది మంది వానర, భల్లూక వీరులూ ఉన్నారు. నారబట్టలు కట్టుకుని అడవుల్లో పడి తిరుగుతున్న ఆయన వెంట వీరంతా ఏ పదవులూ ఆశించి అనుసరించలేదు. వారంతా ఆయన నుంచి ఏ అందలాలూ ఆశించలేదు. వాళ్లలో ఉన్నది కేవలం స్వామిభక్తి మాత్రమే. నదులన్నీ సముద్రాన్ని చేరినట్టు మంచివాళ్లంతా రాముడిని ఆశ్రయిస్తారని రామాయణంలో వాల్మీకి రాశాడు. అందుకే కాబోలు ఎప్పుడూ రామచంద్రుడి చుట్టూ మునులూ, రుషులూ, జ్ఞానులూ, మేధావులూ, సత్కర్మలు ఆచరించే వారూ, ఆయన నుంచి న్యాయం కోరి వచ్చే బాధితులూ ఉండేవారట.
శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. ఆయన అబద్ధాలాడటం తెలియని వాడు. ఆయన మాటంటే మాటే. ధర్మమంటే ధర్మమే. అరిషడ్వర్గాలను జయించిన వాడు. సత్యప్రియుడు. సత్యనిష్ఠా వ్రతుడు. ఎన్ని కష్టాలెదురైనా ధర్మాన్ని తప్పని మహనీయుడు. పదహారేళ్లప్పుడే తండ్రి విశ్వామిత్రుడి వెంట పంపాడు. ఆయన అనుజ్ఞ మేరకు తాటకిని సంహరించి మునులు, రుషుల యజ్ఞయాగాదులకు కలుగుతున్న విఘ్నాలను తొలగించాడు రాముడు. పట్టాభిషేకం చేసుకొమ్మంటే చేసుకొంటానన్నాడు. మరుక్షణమే నారబట్టలు కట్టుకుని అడవులకు వెళ్లు అంటే మారు మాట్లాడకుండా అడవులకు వెళ్లాడు. ఎక్కడా తండ్రి మాట జవదాటలేదు.
‘నాయనా! నేను చేసింది క్షమించరాని తప్పు. నిన్ను అన్యాయంగా అడవులకు పంపుతున్నాను. కాబట్టి నన్ను బందీగా చేసుకుని నువ్వు పట్టాభిషేకాన్ని చేసుకో. నా మీద యుద్ధం ప్రకటించు. నేను వృద్ధుడైన రాజుని కాబట్టి నీతో పోరాడలేదు. ఎలాగూ ఓడిపోతాను. అప్పుడు రాజ్యాన్ని నీ చేతుల్లోకి తీసుకో’ అని తండ్రి దశరథుడు అన్నా రాముడు వినలేదు. ఆ మాటలన్నీ కేవలం తనపై వాత్సల్యం కొద్దీ అంటున్నవే తప్ప న్యాయసమ్మతమైనవి కావని రాముడు నమ్మాడు.
భరతుడు అడవులకు వచ్చి, ‘నువ్వే మా రాజువి. నువ్వే మమ్మల్ని పరిపాలించాలి’ అని కాళ్లకు అడ్డంపడినా రాముడు సున్నితంగా తిరస్కరించాడు. రాజగురువులూ, మహర్షులూ, పురప్రజలూ అందరూ రాజ్యాన్ని ఏలుకోవాలని కోరినా, అభ్యర్థించినా సుతారంగా తోసిపుచ్చాడు. తండ్రి మాట నిలపడమే తన ధర్మమని అంటాడు రాముడు.
‘ధర్మం వెంటే సంపద వస్తుంది. ధర్మం వెంటే సుఖం వస్తుంది. ధర్మాన్ని ఆచరించే వాడు సకలం పొందుతాడు. ప్రపంచానికి ధర్మమే పునాది’ అని రామాయణంలో వాల్మీకి చెప్పాడు.
రాముడు ఆ ధర్మాన్ని అంత నిష్టగా అనుసరించడం వల్లనే అఖండ సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఎన్నో సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలించాడు. అతడి వంశానికీ, అతడితో నడిచిన వ్యక్తుల వ్యక్తిత్వాలకూ వన్నెతెచ్చి వారికి శాశ్వత కీర్తినందించాడు.

Review ఆధ్యాత్మిక వికాస పురుషుడు.

Your email address will not be published. Required fields are marked *

Top