ఒక్కో ఉగాదికి ఒక్కో పేరెందుకు?

మనం ఏ సంవత్సరంలో పుట్టామో చెప్పగలం. కానీ, ఏ నామ సంవత్సరంలో పుట్టామో ఠక్కున చెప్పలేం. ఎందుకంటే మనకు తెలుగు సంవత్సరాల పేర్లు సరిగా తెలియకపోడమే కారణం. ఇక, సంవత్సరాల పేర్ల నేపథ్యంలోకి వెళ్తే..

చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. అందుకే ఈ తిథి నాడే ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. ఉగ, ఆది అనే పదాల సమ్మేళనమే ఉగాది. అంటే కొత్త శకం లేదా కొత్త సంవత్సరం ప్రారంభమని అర్థం. దీనినే సంవత్సరాది అని కూడా వ్యవహరిస్తారు. ఉగాది పర్వం ప్రతి ఏటా వస్తుంది. అయితే ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో పిలుస్తారు. ఎందుకీ పేర్లు వచ్చాయి? వీటి ఆంతర్యం ఏమిటి? తెలుసుకుందాం.
నారదుడు ఒక సందర్భంలో విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లి చేసుకున్నాడు. వీరికి అరవై (60) మంది సంతానం కలిగారు. ఓసారి రాజు తన అరవై మంది సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొనగా, అందులో వారంతా హతమయ్యారు. దీంతో నారదుడు దు:ఖపడ్డాడు. విష్ణువును ప్రార్థించగా, నీ అరవై మంది పిల్లలు అనంత కాలచక్రంలో అరవై సంవత్సరాలుగా తిరుగుతుంటారని వరమిచ్చాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా వ్యవహారికంలోకి వచ్చాయి. దీంతో ఏటా వచ్చే ప్రతి ఉగాదికి ఒక్కో పేరు వస్తోంది. ఆ లెక్కలో ప్రస్తుత సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం (2024, ఏప్రిల్‍ 9, మంగళవారం-ఉగాది).
ప్రతి అరవై ఏళ్లకు ఒకసారి ఈ పేర్లు తిరిగి పునరావృతమవుతుంటాయి.

1904-05, 1964-65 సంవత్సరాలలో క్రోధి నామ సంవత్సరం వచ్చింది. తిరిగి 2024-25లో వస్తుంది.
బృహత్సంహితలోని 8వ అధ్యాయంలో బృహస్పతి యొక్క అరవై సంవత్సరాల చక్రంలో క్రోధి నామ సంవత్సరం 38వదిగా ఉంది. ఈ నామ సంవత్సరంలో జనులంతా కోప స్వభావంతో ఉంటారని తెలుగు పంచాంగాలు చెబుతున్నాయి. భారతీయ భాషల్లో ‘క్రోధి’ అనే పదానికి దాదాపు పదహారు నిర్వచనాలు ఉన్నాయి. ఈ పదానికి కోపం అనే అర్థంతో పాటు ‘మండే స్వభావం గలది’, ‘వేడి స్వభావం గలది’ అనే అర్థాలు కూడా ఉన్నాయి.

Review ఒక్కో ఉగాదికి ఒక్కో పేరెందుకు?.

Your email address will not be published. Required fields are marked *

Top