పండంటి ఆరోగ్యానికి 60 సూత్రాలు

ఆరోగ్యం.. ఆరోగ్యం.. ఆరోగ్యం..
ఇదెక్కడ దొరుకుతుందోననేదే అందరి ఆరాటం.
మనలోని ఆనందమయ స్వభావమే ఆరోగ్యమంటే ఎవరూ నమ్మరు.
మెడికల్‍ షాపుల్లోనూ, వైద్యుల వద్దా మాత్రమే ఇది దొరుకుతుందనేది కొందరి నిశ్చితాభిప్రాయం.
కానీ, ఈ అభిప్రాయం సరికాదు.
ఆరోగ్యమనేది మన చేతుల్లోనే ఉన్న ఐశ్వర్యం. ఆరోగ్యభాగ్యం మనకు మనమే కల్పించుకోగల అవకాశం. ఆరోగ్యంగా ఉండటం అంటే మందులు, మాకులు మింగడం కాదు.. చక్కనైన జీవన విధానం. అవును. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన విధానాన్ని ఎంచుకుని, అనుసరిస్తే చాలు. మరి ఆరోగ్యకరమైన జీవన విధానానికి అరవై (60) సూత్రాలున్నాయి. అవేమిటో చదివేయండి..

వెలుగు వచ్చి, సూర్యుడు నడినెత్తికి వచ్చాక కానీ తెల్లారని జీవితాలు ఇప్పుడు జీవన విధానంలో భాగమైపోయాయి. ఒకసారి సూర్యోదయానికి కొద్దిముందు నిద్రలేచి.. ప్రకృతిని ఆస్వాదించి చూడండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో..అందుకే వేకువజామున నిద్రలేవడం ఎంతైనా అవసరం.
• నిద్రలేవగానే బెడ్‍ కాపీలు, టీలు నోట్లో వేసుకోవడం చాలామందికి అలవాటు. దీనిబదులు తగినన్ని మంచినీళ్లు తాగడం వందరెట్లు ఆరోగ్యదాయకం.
• చివరకు సుఖ విరేచనం కావడానికి కూడా మందులు మింగే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. తగినన్ని నీళ్లు తాగుతూ, ఆయా సీజన్లలో లభించే పండ్లు తింటూ, మంచి ఆహారాన్ని తీసుకుంటే సుఖ విరేచనం అవుతుంది. సుఖ విరేచనం అనేది ఆరోగ్యానికి తొలిమెట్టు అనే విషయం మరిచిపోవద్దు.
• ఉదయమే కొద్దిపాటి నడక మేలు. దీనివల్ల శరీరంలోని అన్ని అవయవాల కదలికలు తేలికపడతాయి. అలాగే, యోగా, ప్రాణాయామాల వంటివీ చేయాలి.
• తినేముందు శరీరానికి కొంతైనా చెమట పట్టాలి. అంటే దీనర్థం ఫ్యాన్‍/ఏసీ వేసుకోకుండా భోజనం చేయాలని కాదు. మనం రోజుకు రెండుసార్లు ప్రధానాహారం తీసుకుంటాం కదా! ఇది తీసుకునే ముందు కొంతైనా, కనీసం శరీరానికి చిరు చెమటలు పట్టేలా అయినా శరీరశ్రమ చేయాలని. అంటే తగినంత శరీరశ్రమ ఉన్నప్పుడు తీసుకునే ఆహారం శరీరానికి బాగా ఒంటపడుతుంది.
• వేడి నీళ్ల స్నానం మంచిదే కానీ, ఉదయం చేసే స్నానం మాత్రం చల్లని నీళ్లతోనే చేయాలి. తలకు అయితే చన్నీళ్లనే పోసుకోవాలి. లేకుంటే, గోరువెచ్చని నీళ్లతోనైనా కానివ్వచ్చు.
• సబ్బులు, షాంపూలు ఇప్పుడు అనివార్యమైపోయాయి. అయితే, గుడ్డతో చర్మం మర్దన చేసుకుని ఒకప్పుడు మన పెద్దలు స్నానాన్ని ఆచరించే వారు. అలాగే, అభ్యంగన స్నానం అని ఒకటుంది. శరీరానికి బాగా నూనె పట్టించి, మర్దన చేసిన అనంతరం కొద్దిసేపు ఎండలో నిలుచుని స్నానం చేయడం వలన చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.
• పూరీలు, దోసెల వంటి నూనెలతో తయారుచేసిన అల్పాహారాన్ని కాకుండా, మొలకెత్తిన విత్తనాలను బ్రేక్‍ఫాస్ట్గా తీసుకోవడం మంచిది.
• పచ్చి కొబ్బరిని కొవ్వు పదార్థంగా భావిస్తారు చాలామంది. కానీ సంపూర్ణాహారంలో పచ్చి కొబ్బరి ఒకటి. దీనిని తగినంతగా తీసుకోవడం మంచిది.
• తినేటపుడు నీళ్లు తాగడం మంచిది కాదు. అన్నం తినే అరగంటకు ముందు కనీసం లీటరు నీళ్లు తాగడం మంచిది. అలాగే, తిన్న తరువాత మాత్రమే మళ్లీ నీళ్లు తాగాలి.
• రాత్రిపూట ఆహారంలో తేలికగా జీర్ణమయ్యేవి మాత్రమే తీసుకోవాలి. రాత్రికి శరీరం అలసిపోయి ఉంటుంది. కఠినమైన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమయంలో జీర్ణం కావడం కష్టం. కాబట్టి ఉదయం పూట మాత్రమే కఠినమైన, కష్టంగా జీర్ణమయ్యేవి తీసుకోవాలి.
• పాలిష్‍ చేసిన బియ్యం ఇప్పుడు నిత్య వాడకంలో భాగమైపోయాయి. ముడి బియ్యం ప్రాధాన్యాన్ని ఇప్పుడు అందరూ మరిచిపోయారు. ముడి బియ్యం వినియోగం పెరిగితే శరీరక్రియలు సత్తువను కలిగించుకుంటాయి.
• ఆకుకూరలు, కాయగూరల నుంచి పూర్తిగా కాండాలను, తొక్కలను తొలగించడం మంచిది కాదు. వాటిలోనూ బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ఆకు, కాయగూరలను యథాతథంగా ఆహారంగా తీసుకోవడమే మేలు.
• ఉడకబెట్టిన కూరలే మంచివి. కూరల్ని వేపుళ్లు గా అసలు తినకూడదు. దీనివల్ల నూనె ఎక్కువగా మరగడం వల్ల క్యాన్సర్‍ వంటి అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఉడికించిన కూరలనే తినాలి.
• కొన్ని కూరలను వండేటపుడు వాటిలో వచ్చే నీటిని వార్చేస్తుంటారు. అయితే, ఆ నీటిని తాగడం మంచిది.
• పచ్చి కూరలను తినడం కూడా క్రమంగా అలవాటు చేసుకోవాలి. ఇది కొంచెం కష్టమే అయినా ఎంతో ఆరోగ్యదాయకం. పచ్చికూరలు సహజారోగ్యానికి హేతువులు.
• భోజనం చేసేటపుడు కబుర్లు చెప్పుకోవడం, టీవీ, సెల్‍ఫోన్లు చూడటం మంచిది కాదు. మనసు పెట్టి తినాలి. అప్పుడే ఆ ఆహారం శరీరానికి బాగా ఒంటపడుతుంది.
• అన్నంలో కూర కలుపుకుని తినడం మన అలవాటు. కానీ, మన ప్రాచీన పద్ధతులు మాత్రం.. కూరలోనే అన్నం కలుపుకోవాలని చెబుతున్నాయి. ఇది చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. అంటే అన్నంతో దాదాపు పరిమాణంలో సమానంగా కూరలనూ తినాలని అర్థం.
• ఆహారాన్ని చాలామంది నమలకుండానే మింగేస్తుంటారు. పదేపదే నమలడం మంచిది. బాగా నమిలి మింగిన ఆహారమే ఒంటబడుతుందనే విషయం మరిచిపోవద్దు.
• భోజనం అయిన వెంటనే నీళ్లు తాగవద్దు. తీసుకున్న ఆహారాన్ని శరీరం కొంచెం అరాయించుకుందనుకున్న తరువాత.. అంటే కనీసం పది పదిహేను నిమిషాల తరువాత నీళ్లు తాగాలి.
• పగటి పూట నిద్ర మంచిది కాదని అందరూ చెప్పేదే. అదే నిజం కూడా. రాత్రికి కంటి నిండా నిద్రపోవడం మంచి అలవాటు.
• ఖరీదైన హైబ్రీడు పండ్లు తినడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. అయితే, మన పెరట్లో, మన చుట్టుపక్కల, మనకు స్థానికంగా లభించే పండ్లనే ఆయా సీజన్ల వారీగా తీసుకోవడం ఎంతో మంచిది.
• జలుబు చేస్తేనే వందల రూపాయలు పెట్టి కొన్న పదుల కొద్దీ మందులు మింగడం అలవాటైపోయింది. నిజానికి జలుబు అనేది మంచిదే. అది మనలోని రోగనిరోధకశక్తి బలపడేందుకు దోహదం చేస్తుంది. మందులు వాడితే ఏడు రోజులకు, వాడకుంటే వారానికి జలుబు తగ్గిపోతుందని నానుడి. అంటే జలుబు మందులకు లొంగదు. వేడినీళ్లు కాపడం పెట్టుకోవడం, తదిరత సహజ పద్ధతుల ద్వారా జలుబును తగ్గించుకోవాలి.
• ప్రాచీన ఆయుర్వేద జీవన నియమాల ప్రకారం.. పళ్లు పుక్కిలించిన నీళ్లను ఊసెయ్యకుండా మింగడం మంచిది.
• ఆయా కాలాలలో లభించే పండ్లను పండ్లుగానే తీసుకోవాలి. వాటిని రసాలు చేసుకుని తాగడం అంత మేలు చేయదు.
• కాలక్షేపం కబుర్లు తగ్గించుకుని, దైవచింతనపై దృష్టి మరల్చడం వల్ల మనసుకు సాంత్వన లభిస్తుంది.
• రోజులో కొద్దిసేపైనా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి.
• శరీరానికి కాస్త అయినా చెమట పట్టే పనులు చేయాలి.
• ఉదయం, సాయంత్రం విరేచనాలు అయ్యేలా చూసుకోవాలి.
• రోజుకు రెండు పూటలా స్నానం చేయాలి.
• పొద్దుపోయాక కాకుండా, పొద్దు ఉండగానే రాత్రి భోజనం ముగించాలి.
• మన శరీర శ్రమకు తగిన ఆహారం తీసుకోవాలి.
• రాత్రి పూట ఆహారం సాత్వికమైనదై ఉండాలి.
• రాత్రి కాలక్షేపంగా సినిమాలు, షికార్లు కాకుండా సత్సాంగత్యంలో గడపాలి. దీనవల్ల మనసు తేలికపడుతుంది. మనసులోకి మంచి ఆలోచనలు, మంచి భావాలు స్థిరపడతాయి.
• తిన్న వెంటనే పడుకోకుండా, అరిగిన తరువాత పరుండాలి. అందుకు కొద్దిసేపు నడక అవసరం.
• కృత్రిమమైన ఆహారం మేలు చేయదు. సహజాహారమే మంచిది.
• ఫ్రిజ్‍లో పెట్టినవి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆహార పదార్థాలకు గాలి, వెలుతురు తగలనివ్వాలి. ఫ్రిజ్‍లో పెట్టిన ఆహార పదార్థాల్లే ఈ రోజుల్లో కలుగుతున్న సకల అనారోగ్య లక్షణాలకు కారణం.
• రోజూ కనీసం ఆరు లీటర్ల మంచినీళ్లు తాగాలి.
• ఆహార పదార్థాల్లో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ఉప్పు వాడకం పెరిగితే బీపీ పెరుగుతుంది. ఇది హృద్రోగ సమస్యలకు దారితీస్తుంది.
• పంచదార, బెల్లం బదులు తేనెను వాడటం అలవాటు చేసుకోవాలి.
• చింతపండు కంటే పచ్చి చింతకాయ వాడకం మంచిది.
• ఎండుమిర్చి కంటే గుణాలు గల పచ్చిమిర్చి మేలైనది.
• నూనె వాడకాన్ని కూడా తగ్గించాలి. అలాగే వంట నూనెలను తరచూ మారుస్తుండాలి.
• ఆహారంలో మసాలాలు ఎక్కువైతే ఆరోగ్యానికి చేటే.
• అవసరమైతే తప్ప మందులు ఎక్కువగా వాడకూడదు.
• రోజూ అన్ని రుచులూ రుచి చూసేయాలనే ఆత్రం వద్దు.
• సాత్వికాహారం ఎక్కువగా తీసుకోవాలి.
• రుచికి మనం బానిస కాకూడదు. మనిషిని అదుపులో ఉంచే రుచి ఆరోగ్యానికి మంచిది.
• అది మంచిది.. ఇది మంచిది కాదు అనే జంజాటం లేకుండా.. రోగాలు రాకుండా ఏదైతే మేలు చేస్తుందో అలాంటి ఆహారాన్నే నిత్యం తీసుకోవాలి.
• శరీరానికి ఏదైనా ఇబ్బంది కలిగితే, జ్వరం వంటివి వచ్చినపుడు ఉపవాసం ఉండటం మేలు.
• ఆకలి లేనపుడు కూడా అదేపనిగా తినడం మంచిది కాదు. అటువంటపుడు నీళ్లు తాగాలి.
• ఎనిమా (పేగులను శుభ్రం చేసే పక్రియ) వల్ల శరీరారోగ్యం అదుపులో ఉంటుంది.
• ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతి అందాలను ఆస్వాదించాలి. రోజులో కొంతసేసైనా చెట్టుచేమల మధ్య గడపాలి. దీనివల్ల మన ఆలోచనల్లో సాత్వికత పెరుగుతుంది.
• ప్రకృతి నియమాలను రోగాలు వచ్చినపుడు మాత్రమే కాకుండా జీవితకాలం ఆచరించడానికి ప్రయత్నిస్తే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.
• బాధ్యతలు తీరే వరకు బతికితే చాలనుకునే ఆలోచనా ధోరణి మంచిది కాదు. వందేళ్లు బతకాలనుకోవడం అత్యాశ ఏమీ కాదు. అయితే, అందుకు సానుకూల ఆలోచనా దృక్పథం అలవరుచుకోవాలి. ఆలోచనల్లో, చేతల్లో సానుకూలత వల్ల ఆయుష్షు పెరుగుతుంది. • జీవితంలో ఉన్న దాంతో తృప్తి పడటం, శాంతంగా ఉండటం, ప్రశాంతమైన జీవనశైలి మార్గాలను ఎంచుకోవడం ఎంతైనా అవసరం.
• కోపం, ఈర్శ్య, అసూయ వంటివి శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచివి కావు.
• మనం చేసుకోదగిన పనులను మనమే చేసుకోవాలి. ప్రతి దానికి ఎదుటి వారిపై ఆధారపడటం వల్ల బద్ధకం పెరుగుతుంది.
• సాటి వారితో ప్రేమతో, అభిమానంగా ఉండటం వల్ల చుట్టూ అంతా మంచే కనిపిస్తుంది. మంచి వాతావరణం మంచి ఆరోగ్యానికి హేతువు అవుతుంది.
• ప్రకృతి జీవన విధానాన్ని దురదృష్టవశాత్తూ ఒక వైద్యంగా పరిగణించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకృతి జీవన విధానం అనేది మన ప్రాచీన జీవనశైలి. కాబట్టి ప్రకృతి జీవవాన్ని మన జీవన విధానంగా మలుచుకోవాలి.

Review పండంటి ఆరోగ్యానికి 60 సూత్రాలు.

Your email address will not be published. Required fields are marked *

Top