ఇచ్ఛాపథ్యం.. నిశిక్రందం

ఆయుర్వేద గ్రంథాలలో వైద్యం, రోగం, చికిత్స, రోగ లక్షణాలకు సంబంధించి అనేక పారిభాషిక పదాలు ఉన్నాయి. ఆయా పదాలకు అర్థాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
వేలి మీద ఏదైనా ఉబ్బెత్తు వాపు కనిపిస్తే కణుపు వచ్చింది అంటాం. కానీ ఆయుర్వేద పరిభాషలో దీన్ని ‘అంగుళిపర్వ’ అంటారు. ఒళ్లంతా ఒకటే ‘నొప్పులు’ అంటాం. ఆయుర్వేదంలో దీన్ని ‘అంగమర్దం’గా చెప్పారు. శరీరం స్పర్శ జ్ఞానం కోల్పేతే దాన్ని ఆయుర్వేదం ‘అంగసుప్తి’ అని పేర్కొంది. ఇంకా గర్భిణిని ఏమంటారు? అంత:కరణం అంటే ఏమిటి?.. ఇలాంటివే ఆసక్తికరమైన ఆయుర్వేద వైద్య భాషా పదాలు మరెన్నో ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆయా వాటిని ఏమని పిలుస్తున్నాం.. ఆయుర్వేదంలో వాటిని ఏమని పేర్కొన్నారో తెలుసుకుందాం. దీనివల్ల ఆయుర్వేద పరిభాషపై ఒక అవగాహన కలుగుతుంది.

అంగదాహం: శరీరమంతా మంటలు పెట్టడం

అంగశోషణం: శరీరం శుష్కించిపోవడం

అంత:కరణం: మనసు

అంతరాపత్య (అంతర్వత్ని): గర్భిణి

అంత్రం: పెద్ద పేగు

అంధమూష: ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగించే ఒక మూస. దీనికే వజ్రమూష అనే మరోపేరు కూడా ఉంది.

అకాలజం: కాలం కాని కాలంలో, అంటే అకాలంలో పండిన పంటను అకాలజం అంటారు. ఇలా అకాలంలో పండిన ధాన్యం, కాయలు, పండ్లు ఏవైనా సరే మంచివి కావు. ఇవి శరీరానికి దుర్గుణాలు కలుగచేస్తాయి. ఇవి గుణకారి కావు.

అగదంకారుడు: చికిత్స చేసే వాడిని వైద్యుడు లేదా డాక్టరు అంటాం. కానీ, ఆయుర్వేదంలో వైద్యుడిని అగదంకారుడు అన్నారు.

అగదతంత్రం: ఆయుర్వేదంలో ఎనిమిది తంత్రాలు ఉన్నాయి. వాటిలో ఇదొకటి. ఇది విషచికిత్సా విధానం గురించి వివరించే తంత్రం. తేళ్లు, పాములు, ఎలుకలు ఇత్యాది విషజంతువుల విషాలూ, స్థావర విషాలూ తగ్గించే పక్రియలు ఈ తంత్రంలో ఉన్నాయి.

అజాతదంతుడు: ఆరు నెలలైనా ఇంకా దంతాలు రాని శిశువును అజాతదంతుడు అంటారు.

అట్టం: అన్నం

అతిఘార్ణత: అతినిద్ర.

అతిరోగం: క్షయ

అతిలంఘితం: ఎక్కువగా లంఖనాలు, ఉపవాసాలూ చేయడం. దీనివల్ల దేహసంధుల్లో పోటూ, శరీరం అంతటా నొప్పులు, దగ్గూ, ముఖం శుష్కించడం, ఆకలి తగ్గిపోవడం, అరుచి, దప్పిక, చూపు మందగించడం, చెవులకు గ్రహణశక్తి తగ్గిపోవడం, మనస్సుకు సంభ్రమం కలగడం, తలనొప్పి, కళ్లు బైర్లు కమ్మడం, జీర్ణశక్తి తగ్గిపోవడం వంటి బాధలు కలుగుతాయి.

అత్యగ్ని: ఎక్కువగా ఆకలి వేయడం.

అధ్యశనం: తిన్నది అరగకపోవడం. అజీర్తి చేయడం.

అనులేపనం: చందనం మొదలైన మైపూత. ఇది చాలా మంచిది. దీనివల్ల దప్పిక, మూర్ఛ, దేహదుర్గంధం, శ్రమ, వాత ప్రకోపం వంటివి తగ్గిపోతాయి. సౌభాగ్యమూ, తేజస్సూ కలుగుతాయి.

అనువేల్లితం: వ్రణాలకు (కురుపులు, పుండ్లు) కట్టే కట్లలో ఒక రకం.

అన్వాశనం: ఔషధాలు తయారు చేసే కర్మశాల.

అపాటవం: వ్యాధిని ఆయుర్వేదంలో అపాటవం అంటారు.

అభగ్నుడు: రోగం లేనివాడు.

అభ్యంతుడు: రోగి. అభ్యమితుడు అన్నా కూడా రోగి అని అర్థం.

అభుక్తం: ఉపవాసం

అభ్యంగం: నూనె మొదలైన చమురులు శరీరానికి పట్టించి మర్దన చేసుకోవడం. దీనినే మనం ప్రస్తుతం తలంటు అంటున్నాం. కానీ పూర్వం తలంటుకు ముందు శరీరాన్ని మొత్తం నూనెలతో మర్దన చేసుకునేవారు.

అశిశ్విక: సంతానం లేని స్త్రీని అశిశ్విక అంటారు.

అష్టధాతువులు: బంగారం, వెండి, రాగి, నాగం, ఇత్తడి, వంగం, కాంతం, మాండూరం, ఖడ్గలోహం.. ఈ ఎనిమిదింటికీ అష్టధాతువులని పేరు.

అష్టధాతు స్థానాలు: రోగ నిర్ణయం చేయడానికి వీలయిన నాడులు మనిషి శరీరంలో ఎనిమిది ఉన్నాయి. అవి- రెండు చేతులు, రెండు పాదాలు, కంఠానికి ఇరుపక్కలా, ముక్కుకు ఇరువైపులా.. ఈ ఎనిమిదీ కలిసి అష్టధాతువులు.

అష్టభావం: మనిషికి కలిగే వికారాలు ఎనిమిది. అవి- స్తంభం, స్వేదం, రోమాంచం, స్వరభంగం, వైస్వర్యం, కంపం, వైవర్ణ్యం, అశ్రుపాతం.

అష్టాంగం: ఆయుర్వేదానికి ఎనిమిది అంగాలున్నాయి. అవి- శల్యతంత్రం, శాలాక్య తంత్రం, కాయచికిత్స, భూతవైద్యం, కౌమార భృత్యం, అగదతంత్రం, రసాయనం, వాజీకరణం.

అంతర రోగాలు: కోష్టం ఆశ్రయించి పుట్టే ఛర్ధి, అతిసారం, శాసకాసలు, ఉదరాలు, జ్వరం, శోఫ మూలశంకలు, గుల్మం, విసర్పం, విద్రధి.. వీటిని అంతర రోగాలు అంటారు.

అంటే శరీరం లోపల పుట్టే రోగాలు.

ఆధి: మనోవ్యాధి. దీనినే మనం ప్రస్తుతం మానసిక వ్యాధి అని పిలుస్తున్నాం. కుంగుబాటు, చింత, అధికంగా ఆలోచించడం, మనో వ్యాకులతతో బాధపడటం వంటివన్నీ మనోవ్యాధులు.

ఆయుర్వేదం: ఇది రుగ్వేదానికి ఉప వేదం. అధర్వ వేదానికి ఉపాంగం. ఎనిమిది అంగాలు గలది. ధన్వంతరి మొదలైన ఎందరో దీనికి సంబంధించిన గ్రంథాలు రచించారు. ఆయుర్వేద విధానాలను అనుసరించి, చికిత్స చేసే వైద్యుడిని ఆయుర్వేది అంటారు.

ఆరోగ్యం: ఏ రోగమూ లేకపోవడం.

ఆలోచకం: ఇదొక అగ్ని. ఇది కళ్లలో ఉంటుంది. వస్తువులను చూసే శక్తి మనకు కల్పించేది ఆలోచకమే.

ఇచ్ఛాపథ్యం: చాలా జబ్బులు మందులు పుచ్చుకోకుండానే ఆహార నియమాల వల్లనే పోగొట్టుకోవచ్చును. ప్రతి వ్యాధికీ ఆహార విహారాల విషయమై విధి నిషేధాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి. సమర్థులైన వైద్యులు ప్రతి రోగికీ హితాహార విహారాలు నిక్కచ్చిగా చెబుతుంటారు. రోగులు కూడా కొన్ని ఆరోగ్య నియమాలను స్వయంగా తెలుసుకోవచ్చు. అంటే, ఏ వస్తువు తింటే శరీరానికి అసౌకర్యం కలుగుతుందో, ఏది తింటే శరీరానికి తేలికగా, హాయిగా ఉంటుందో, ఏ పని చేస్తే. ఏ భంగిమలో కూర్చుంటే ఏయే నొప్పులు తగ్గుతున్నాయో.. పెరుగుతున్నాయో.. ఇలాంటివి ఎవరికి వారు గ్రహించవచ్చు. గ్రహించి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడాన్నే ఇచ్ఛాపథ్యం అంటారు.

ఉచ్ఛాదనం: సుగంధ ద్రవ్యాలతో శరీరానికి నలుగు పెట్టుకోవడం.

ఉత్కారిక: జొన్నపిండి, బియ్యప్పిండి, మినప్పిండి, గోధుమపిండి మొదలైన వాటితో చేసే రొట్టెను ఉత్కారిక అంటారు.

ఉత్ల్కేశం: దీనినే మనం వాంతి (వమనం) వచ్చినట్టు ఉండే స్థితి (వామిటింగ్‍ సెన్సేషన్‍) అంటున్నాం. కడుపులో తిప్పుతుంది. వికారం వస్తుంది. నోట్లో నీళ్లూరుతాయి. అసహ్యంగా ఉంటుంది. కడుపులో ఉన్నది బయటకు వచ్చేస్తుందా అన్నట్లు అనిపిస్తుంది. కానీ, వాంతి మాత్రం కాదు. దీనినే ఉత్ల్కేశం అంటారు. ఓకిరింత అని కూడా అంటారు.

ఉపభోగం: మోతాదుకు మించి భోజనం చేయడం.

ఉపశరం: తొలిసారి గర్భం దాల్చడం. తొలిచూలు.

ఉపాసనం: రోగికి పరిచర్య చేయడం. శుశ్రూష అనీ అంటారు.

ఏకభక్తవ్రతం: అంటే రోజుకు ఒక్కసారే భోజనం చేయాలనే నియమం. ఈ నియమాన్ని అనుసరించే వారు రాత్రి భుజించకూడదు. పగటి పూట రెండు జాములు దాటాక ఒక్కసారి మాత్రమే భుజించాలి.

ముహూర్ముహువు: అంటే మాటిమాటికీ మందులు తీసుకోవాల్సిన పరిస్థితి. దప్పిక, ఛర్ది, ఎక్కిళ్లు, శ్వాస, విషవ్యాపత్తు.. ఈ బాధలుంటే మాటిమాటికీ, అన్నంతో కూడా కలిపి ఔషధాలు తీసుకోవాల్సి ఉంటుంది.

కండూఘ్ని వర్గం: దురదలు పోగొట్టే వస్తువులను కండూఘ్ని వర్గం అంటారు. అవి- చందనం, వట్టివేరు, రేల, కానుగు, కొడిశపాల, ఆవాలు, యష్టిమధుకం, మానుపసుపు, తుంగగడ్డలు.

పంచలక్షణం: వ్యాధి లక్షణాలు అయిదు. అవి- వాత, పిత్త, కఫ, సన్నిపాత, ఆగంతుకాలు.

పంచకర్మలు
వయనం, విరేచకం, నశ్యం, నిరూహవస్తి, అనువాసన వస్తి. ఈ ఐదూ శరీరంలో ఉండే మలాదులను బయటకు పంపి, శరీరం పరిశుద్ధం అయ్యేటట్టు చేస్తాయి. కందసారాలు: మనకు లభించే దుంపల్లో కొన్ని సారమైన ద్రవ్యాలు కలిగి ఉంటాయి. వాటినే కందమూలాలు అంటారు. అవి- మంజిష్ట, చెంగల్వకోష్టు, తచ్చూరాలు, నేలగుమ్మడి, పసుపు, పొత్తిదుంప, భద్రముస్తలు, పిల్లితేగలు, సన్నరాస్న, అతివస, సుగంధి, అల్లం, నేలతాడి, వస, తుంగ, అడవి కంద, తెగడ, చాగ, పుల్లబచ్చలి, పెన్నేరు, చామ, వేగిస.. ఇవి మంచి సారమైన దుంపలు.

కటు: కారం. ఇది ఆరు రసాలలో ఒకటి. ఇది నోటికి తగలడంతోనే నాలుక మండుతుంది. ఉద్వేగం కలుగుతుంది. నషాళం ఎక్కుతుంది. ముక్కు స్రవిస్తుంది.

కథాస్రసంగుడు: విష వైద్యం చేసేవాడు.

కఫ ప్రకృతి: ఇది కలవారికి చిత్తం స్థిరంగా ఉంటుంది. కేశాలు నల్లగా ఉంటాయి.

కల్లత: చెవులు వినిపించకపోవడం. చెవుడు.

కల్పం: రోగం నుంచి విముక్తి పొందిన వాడిని, అంటే స్వస్థత చేకూరడాన్ని కల్పం అంటారు.

కుండలిక: పాము చుట్టలాగా ఉండే పిండివంట. జిలేబి, జంతికలు వంటి వాటిని కుండలిక అంటారు.

కుంభసర్పి: నూట పదకొండు సంవత్సరాల నాటి నెయ్యి.

కృతాన్నం: లడ్డూ మొదలైన పిండివంటలు.

కృసరం: నువ్వులూ, వరి బియ్యమూ సమంగా కలిపి వండిన అన్నం.

గదాగ్రణి: క్షయ రోగం.

గ్లాని: ఓజస్సు క్షీణించడం వల్ల కలిగే వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలలో- నోరు తియ్యగా ఉంటుంది. కునికిపాట్లు వస్తుంటాయి. రొమ్ము భాగం ఈడ్చినట్టుంటుంది. అన్నం తినాలని ఉండదు.

గురుత్వం: శరీరం భారంగా ఉండటం. శరీరం అంతా తడిచర్మం కప్పినట్టు జడంగా ఉంటుంది. తల మిక్కిలి బరువుగా ఉంటుంది. ఇదే గురుత్వం.

గృష్టి క్షీరం: అరుదుగా ఈనే ఆవు నుంచి వచ్చే పాలు.

చంక్రమణం: అంటే తిరగడం. అదేపనిగా తిరగడం చాలా చెడ్డది. అది అనాయుష్యమూ, అనారోగ్యకమూ. కళ్లకు కూడా హాని చేస్తుంది. అయితే, కాళ్లకు చెప్పులు వేసుకుని, శరీరానికి ఆయాసం కలగకుండా మితంగా తిరగడం చాలా అవసరం. దాని వల్ల ఆయువు పెరుగుతుంది. దేహబలం, బుద్ధి బలం, జఠరదీప్తి కలుగుతాయి. ఇంద్రియ పాటవం కలుగుతుంది. కొవ్వూ, కఫమూ, స్థౌల్యమూ తగ్గుతాయి.

చక్రతైలం: అప్పుడే గానుగాడిన నువ్వుల నూనె.

చతుష్పాద: చికిత్సలో భాగమయ్యే నాలుగు వ్యవస్థలు లేదా వ్యక్తులు. అవి/వారు- వైద్యుడు, రోగి, ద్రవ్యాలు, ఉపస్థాత.

జాడ్యం: ఇది వ్యాధికి పర్యాయపదం. ఈ స్థితిలో శరీరం జడంగా ఉంటుంది. అంటే అలసటగా ఉంటుంది.

జృంభ: అవులింతను జృంభ అంటారు. నోటితో గాలి లోపలికి పీల్చి నోరు బాగా విప్పి మళ్లీ ఆ గాలిని విడిచిపెట్టడం. ఈ పక్రియ పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు చిప్పిళ్లుతాయి.

తిక్త వర్గం: చేదు రుచి కలిగించే ద్రవ్యాలను తిక్త వర్గం అంటారు. తిక్త అంటే చేదు. అవి- సరస్వతీ తీగ, వెదురుబోడు, పసుపు, మాను పసుపు, కొడిశపాల విత్తులు, ఉలిమిరి, కాండ్రేగు, సప్తపర్ణి, వాకుడు, పెద్దములక, చోరపుష్పిక, ఎలుకు చెవి ఆకు, తెగడ, చేదు బీర, కాకర, జాపత్రి, శంఖపుష్పి, ఉత్తరేణి, కానుగు, శోకరోహిణి, జయంతి, సువర్చల, గలిజేరు, వృశ్చికాలి, జ్యోతిష్మతి.

తిల పిష్టకం: తెలకపిండి.

తోదనం: సూదులతో గుచ్చుతున్నట్టూ, కత్తితో కోస్తున్నట్టూ కలిగే బాధ.

దివాస్వాసం: అంటే పగటి నిద్ర. ఒక్క గ్రీష్మ కాలంలో తప్ప తక్కిన సర్వకాలాల్లోనూ పగటి నిద్ర నిషిద్ధం. స్త్రీ లంపటులు, ఎక్కువగా నడిచేవారు, వాహనాలపై ఎక్కువగా తిరిగే వారు, అతిసార రోగులు, దప్పిక గలవారు, ఎక్కువ శ్రమ చేసేవారు, శూల, శ్వాసవ్యాధి, ఎక్కిళ్లు, వాతవ్యాధులూ కలవారు, పిల్లలు, మత్తులు, వృద్ధులు, రసాజీర్ణం కలవారు, భోజనం చేయని వారు- వీరికి మాత్రం పగటి నిద్ర నిషిద్ధం కాదు.

దోష త్రయం: వాతం, పిత్తం, కఫం.

ద్వితీయ మదం: మద్యపానం వల్ల కలిగే అనేక అవస్థల్లో ఇది ఒకటి. ఈ అవస్థకు గురైన మద్యపాన బాధితుడి మాటలు, బుద్ధి, స్మ•తి అన్నీ అస్పష్టంగా ఉంటాయి. పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. ఉంటే శాంతం, లేకపోతే కోపమూ కలుగుతాయి. అలసటభావమూ, నిద్రమత్తులో జోగుతుంటాడు.

నక్తాంధ్యం: రేచీకటి.

నఖచ్ఛేదనం: గోళ్లు కత్తిరించుకోవడం. ఎప్పటికప్పుడు నఖాలు (గోళ్లు) కత్తిరించుకోవడం చాలా అవసరం. దీనివల్ల పుష్టి, బలం, ఆయుష్షు, శుచి, సౌందర్యం కలుగుతాయి.

నరనామిక/నరమానిని: కొందరు ఆడవారికి మీసాలు వస్తాయి. గడ్డంపై వెంట్రుకలు ఉంటాయి. ఇటువంటి వారిని ఈ పేరుతో పిలుస్తారు.

నాసత్యులు: అశ్వినీ కుమారులకు గల మరో పేరు. వీరు దేవ వైద్యులని ప్రతీతి.

నైదానికుడు: రోగాన్ని కుదర్చడంలో చాలా కౌశలం గలవాడు.

దౌహృద వాంఛలు
గర్భిణి అయిన స్త్రీ హృదయానికి, ఆమె గర్భంలో ఉన్న శిశువు హృదయానికి సంబంధం ఉంది. అంచేతనే గర్భిణిని దౌహృదిని అంటారు. అంటే రెండు హృదయాలు కలదని అర్థం. స్త్రీలు గర్భం దాల్చిన కాలంలో అనేక రకాల కోరికలు కోరతారు. వాటన్నిటినీ తీరుస్తారు కూడా. లేకపోతే ఆమె గర్భంలోని శిశువుకు అనేక వికారాలు ఏర్పడతాయని అంటారు.

Review ఇచ్ఛాపథ్యం.. నిశిక్రందం.

Your email address will not be published. Required fields are marked *

Top