ఆధ్యాత్మిక వెలుగుల వీచిక

ఆంగ్లమానం ప్రకారం మే నెల సంవత్సరంలో ఐదవ నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర – వైశాఖ మాసాల తిథుల కలయిక. మే నెలలో చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. మే 1, బుధవారం, చైత్ర బహుళ అష్టమి నుంచి మే 8, బుధవారం, చైత్ర బహుళ అమావాస్య వరకు చైత్ర మాస తిథులు, మే 9, గురువారం, వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి మే 31, శుక్రవారం, వైశాఖ బహుళ అష్టమి వరకు వైశాఖ మాస తిథులు ఉంటాయి. అక్షయ తృతీయ, పరశురామ జయంతి, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, బుద్ధ పూర్ణిమ వంటి పర్వదినాలు ఈ మాసంలో ప్రత్యేకమైనవి.

2024- మే 1, బుధవారం, చైత్ర బహుళ అష్టమి నుంచి
2024- మే 31, శుక్రవారం, వైశాఖ బహుళ అష్టమి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం – చైత్రం – వైశాఖ మాసం- వసంత రుతువు- ఉత్తరాయణ

చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసమనే పేరు వచ్చింది. ‘వైశాఖ’ అంటే మిక్కిలి కాంతిని ప్రసరించేదని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి కొన్ని మాసాలను మన పెద్దలు ప్రత్యేకంగా నిర్దేశించారు. అటువంటి వాటిలో మాఘ మాసం, కార్తీక మాసం ముఖ్యమైనవైతే ఆ వరుసలో నిలిచే మరో మాసం.. వైశాఖం. ఆధ్యాత్మిక సాధనకు అన్ని రకాలుగా అనువైన మాసం కావడం వల్లే వైశాఖానికి ‘సాధన మాసం’గానూ పేరు. ఈ మాసానికి మరో ప్రత్యేకతా ఉంది. మాఘ, కార్తీక మాసాల పేరిట మాఘ పురాణం, కార్తీక పురాణం ఉన్నట్టే వైశాఖ పురాణం కూడా ఒకప్పుడు మిక్కిలి ప్రాచుర్యంలో ఉండేది. దీనిని వ్యాసదేవుడు రచించాడు. వసంత రుతువులో రెండో మాసమైన వైశాఖంలో ఎండలు మెండుగా కాస్తాయి. క్రమంగా వాతావరణం వేడెక్కుతుంది. అటు వాసంత సమీరాలు.. ఇటు వేడిగాలుల ప్రభావంతో వాతావరణం కాస్త రంజింప చేయడంతో పాటు కొంచెం ఇబ్బంది పెట్టేదిగానూ ఉంటుంది. విరబూసిన పూలతో చెట్లు కొన్నిచోట్ల కనువిందు చేస్తే.. ఆకులు రాల్చిన వృక్షాలు మరికొన్ని చోట్ల కనిపిస్తాయి. ఇక, వైదికంగా ఇది శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైన మాసం. అందుకే దీనిని ‘మాధవ మాసం’ అనీ అంటారు. ఆయన దశావతారాల్లోని విశిష్టమైన మూడు అవతారాల జయంతులు వైశాఖ మాసంలోనే వస్తాయి. చైత్ర మాసానికి ‘మధు మాస’మని పేరైతే.. వైశాఖానికి ‘మాధవ మాస’మనీ పేరు. వైశాఖం లక్ష్మీ నారాయణుల ఆరాధనకు ఉద్ధిష్టమైనది. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో ఆరాధించాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి అయి ఉండాలి. దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్ఠమని ధర్మశాస్త్ర ఉవాచ. అలాగే, విష్ణు సహస్ర నామ పారాయణకు వైశాఖ మాసం చాలా అనువైనది.

ఈ మాసం పొడవునా అశ్వత్థ వృక్షానికి నిండుగా నీళ్లుపోసి ప్రదక్షిణలు చేయడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని, పితృదేవతలు సంతృప్తి చెందుతారని పెద్దలు చెబుతారు. నారాయణుడికి అభిషేక ప్రియుడైన శివుడికి ఈ నెలంతా అభిషేకాలు చేయడం వలన శివకేశవులకు ప్రీతి కలుగుతుందని అంటారు. వైశాఖ మాసంలో ఆచరించే అభిషేకాలు ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతిని కలిగిస్తాయని ప్రతీతి. శివాలయాల్లో లింగానికి పైన ధారాపాత్ర ఏర్పాటు చేయాలి. దీని నుంచి ధారగా నీరు శివలింగంపై పడేలా చేయాలి. దీనివల్ల సృష్టిలో ఉన్న వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని అంటారు. అందుకే ఈ నెలంతా శివారాధన శ్రేష్ఠం. వైశాఖ మాసంలో ఎండలు మండిపోతుంటాయి. . అందుకే ఈ నెలలో చేయాల్సిన కొన్ని దానాల గురించి కూడా మన పెద్దలు నియమాలు విధించారు. నీటితో నింపిన పాత్రలను ఈ మాసంలో దానం చేయాలని అంటారు. ఈ కారణంగానే వైశాఖాన్ని ‘ఉదకుంభ మాసం’గానూ పిలుస్తారు. ఉదకుంభం అంటే నీటితో నింపిన పాత్ర అని అర్థం. చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తులకు నీటిని దానం చేయడం వైశాఖంలో ముఖ్యమైన ఉద్యుక్త ధర్మం. మన పండుగలు, తిథులు, వాటిని అనుసరించి వచ్చే మాసాలు ఆధ్యాత్మికంగానే కాదు సామాజికంగానూ మనం నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి ఉద్బోధిస్తాయి. ఈ క్రమంలోనే వైశాఖంలో కలిగే వేసవితాపం నుంచి మనుషులను, పశుపక్ష్యాదులను రక్షించేందుకు నీటిని దానం చేయాలనే నియమం ఏర్పడింది.

చైత్ర బహుళ అష్టమి
మే 1, బుధవారం

చైత్ర బహుళ అష్టమి మే నెలలోని మొదటి రోజు. సాధారణంగా అష్టమి తిథి నాడు దుర్గాపూజలు చేస్తుంటారు. నర్మదా నది పుష్కరాలు ఈనాటి నుంచే ప్రారంభమవుతాయి. భారతీయ నదుల్లో నర్మద ప్రధానమైనది. మన దేశంలోని నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఉత్సవాలను నిర్వహిస్తారు. దీనినే పుష్కరాలు అంటారు. మే 1న బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆనాటి నుంచి పన్నెండు రోజుల పాటు (మే 12 వరకు) నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. మధ్య భారతదేశంలో నర్మదా నది ప్రధానమైనది. దేశానికి ఉత్తర, దక్షిణ సరిహద్దుగా గల ఈ నది 1,289 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. మధ్యప్రదేశ్‍ రాష్ట్రంలోని అమర్‍కంటక్‍ పర్వతాల్లో పుట్టిన ఈ నది మధ్యప్రదేశ్‍, మహారాష్ట్ర, గుజరాత్‍ రాష్ట్రాల మీదుగా ప్రహించి, గుజరాత్‍లోని బారూచ్‍ జిల్లాలో అరేబియా సముద్రలో కలుస్తోంది. ఉంటుంది. పుష్కర సమయంలో నదులు పరమ పవిత్రతను సంరించుకుని ఉంటాయి. పుష్కరాలు జరిగే పన్నెండు రోజులు భక్తులు వివిధ దానాలను చేస్తారు. పరమేశ్వరుడి జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఈ నదీ తారానే ఉంది. పుష్కరాల సందర్భంగా భక్తులు స్నానాలు చేయడానికి తొమ్మిది ప్రధాన ఘాట్‍లు ఉన్నాయి. వీటిలో అమరకంటక్‍ ఘాట్‍, ఓంకారేశ్వర ఘాట్‍ ముఖ్యమైనవి. ఆలయం చుట్టుపక్కల ఏడు ప్రధాన శైవ, వైష్ణవాలయాలు ఉన్నాయి.
ఇక, మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పాటిస్తారు.

చైత్ర బహుళ నవమి
మే 2, గురువారం

చైత్ర బహుళ నవమి శక్తి ఆరాధన తిథి. దుర్గాదేవిని, ఆదిపరాశక్తిని ఈనాడు విశేషంగా పూజిస్తారు.

చైత్ర బహుళ ఏకాదశి
మే 4, శనివారం

చైత్ర బహుళ ఏకాదశి వరూథిన్యేకాదశిగా ప్రతీతి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ పర్వం గురించిన వివరాలు ఉన్నాయి. దీనినే మన పంచాంగకర్తలు వరూథిని వ్రతం అనీ అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసాదులు ఉండి వ్రతం చేసిన వారికి వేయి గోదానములు చేసిన ఫలం కలుగుతుందని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. వరూధిని ఏకాదశినే సర్వ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. చైత్ర కృష్ణ ఏకాదశి తిథి వల్లభాచార్యుల వారి జన్మదిన తిథి కూడా. అలాగే, ఈనాటి నుంచే డొల్లు కర్తరీ ప్రారంభమవుతుంది.

చైత్ర బహుళ ద్వాదశి
మే 5, ఆదివారం

చైత్ర బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలని అంటారు. అలాగే, మే 5న ప్రపంచ నవ్వుల దినోత్సవం పాటిస్తారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి, జీవన నాణ్యతకు నవ్వు అనేది చాలా ముఖ్యం అని చెప్పడానికి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

చైత్ర బహుళ త్రయోదంశి
మే 6, సోమవారం

చైత్ర బహుళ త్రయోదశి మాస శివరాత్రి దినం. అలాగే, ఈనాడు వరాహ జయంతి దినం. వరాహ జయంతి తిథిపై కొంత వివాదం ఉన్నా.. తెలుగు పంచాంగాల ప్రకారం వరాహ అవతారం చైత్ర బహుళ త్రయోదశి నాడే ఆవిర్భవించిందని తెలుస్తోంది. దశావతారాల్లో వరాహావతారం ఒకటి. హిరణ్యాక్షుడు రాక్షసుడు. బలగర్వితుడై భూమిని చాపగా చుట్ట చుట్టి పట్టుకుపోయి పాతాళంలో దాక్కున్నాడు. భూదేవి తన బాధను శ్రీహరికి చెప్పుకుంది. దీంతో విష్ణువు ఒక పెద్ద వరాహం (పంది) రూపాన్ని దాల్చి అవతరించాడు. దారి శరీరం నల్లని పర్వతంలా ఉంది. కోరలు తెల్లగా, వాడిగా ఉన్నాయి. కళ్లు పెద్ద జ్యోతులుగా వెలుగొందుతున్నాయి. అది గర్జిస్తే ఉరుము ఉరిమినట్టు ఉంది. ఈ రూపంతో విష్ణువు హిరణ్యాక్షుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. రాక్షసుడిని చివరకు సంహరించిన వరాహమూర్తి.. పాతాళంలో పడి ఉన్న భూమిని తన బలిష్టమైన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ఉంచాడు. ఈ అవతారం ప్రాదుర్భవించింది చైత్ర బహుళ త్రయోదశి తిథినాడే. అందుకే ఈనాడు వరాహ జయంతి దినం అయ్యింది. వరాహావతారం విష్ణువు దశావతారాల్లో మూడవది. ఈ అవతారానికి సంబంధించి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది.
కల్పాంతంలో ఒకసారి సమస్తం జలమయమైపోయింది. బ్రహ్మాండమంతా చీకట్లు కమ్ముకున్నాయి. విష్ణుమూర్తి ఆ జలార్ణవంలో వటపత్రశాయి అయి యోగనిద్రలో ఉండిపోయాడు. మహర్లోక వాసుల వేడుకోలుతో విష్ణు మేల్కొన్నాడు. తిరిగి జగత్‍ సృష్టికి పూనుకున్నాడు. మళ్లీ ప్రకాశింప చేసే ఉద్దేశంతో బ్రహ్మాండాన్ని రెండుగా చేశాడు. వాటిని పద్నాలుగు లోకాలుగా చేశాడు. అధోభాగాంఢ ఛిద్రం నుంచి యుల్బము భూమిపై పడింది. అది మేరు పర్వతమైంది. అనంతరం నానా విధాలైన పర్వతాలు, చెట్టు చేమలు, జంతువులు, మనుష్యుల భారానికి భూమి పాతాళానికి కుంగింది. అప్పటి భూదేవి స్థితి బురదలో కూరుకుపోయిన ఆవు మాదిరి ఉంది. ఆమె తన బాధను విష్ణువుకు చెప్పుకోవడంతో విష్ణువు వరాహావతారం దాల్చాడు. యజ్ఞ స్వరూపంలో ఉన్న ఆ వరాహం పాతాళ లోకానికి వెళ్లి తన కోరలతో భూమిని పైకి ఎత్తాడు. తిరిగి భూమి స్వస్థలానికి చేరింది. కాగా, త్రయోదశి తిథి నాడు శనికి విశేషాభిషేకాలు కూడా చేస్తారు.

చైత్ర బహుళ చతుర్దశి
మే 7, మంగళవారం

చైత్ర బహుళ చతుర్దశి పర్వం భౌమ వారం (మంగళవారం)తో కూడి వస్తే మరీ ఫలప్రదమైనది. అ తిథి సరిగ్గా అదేరోజు వచ్చింది. ఈ తిథి నాడు గంగా స్నానం చేస్తే పిశాచత్వం పోతుందని అంటారు. ఆంధప్రదేశ్‍లోని పూర్వ చిత్తూరు జిల్లాలో ఈనాటి నుంచి గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఏపీలో జరిగే ప్రసిద్ధ జాతర్లలో ఇదీ ఒకటి. అలాగే, ఈనాడు విశ్వకవి రవీంద్రనాథ్‍ ఠాగూర్‍ జయంతి దినం. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి దినం.

చైత్ర బహుళ అమావాస్య
మే 8, బుధవారం

చైత్ర బహుళ అమవాస్య నాడు వహ్ని వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు పితృ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈ అమావాస్య వెనుక ఉన్న నేపథ్యంలోకి వెళ్తే.. పూర్వం అచ్ఛోదం అనే కొలను ఉండేది. సోమవులనే పితరుల మానస పుత్రిక దాని ఒడ్డున తపం చేస్తుండేది. దీంతో ఆమె పేరు అచ్ఛోద అయ్యింది. ఆమె తన పితరులను చిరకాలం వరకు చూడకుండా ఉండిపోయింది. అందుచేత వారిని చూడాలని ఆమెకు మనసు పుట్టింది. పితరులు ఒకనాడు ఆమెకు దర్శనమిచ్చారు. అందులో మావసుడు అనే పితృదేవుడు చాలా అందంగా ఉన్నాడు. పైగా అతను దివ్యాలంకార భూషితుడై ఉన్నాడు. అతనిని అచ్ఛోద మోహించింది. కానీ అతను చలించలేదు. ఆమె కోరికను నిరాకరించాడు. ఈ కారణం వల్ల ఆనాటికి అమావాస్య అనే పేరు వచ్చింది. అది పితరుల పాలిట పర్వదినంగా చెలామణిలోకి వచ్చింది. ఈనాడు మానవులు పితరులకు భక్తి ప్రపత్తులతో తిల తర్పణాదులను ఇవ్వడం ఆచారంగా వస్తోంది.

వైశాఖ శుద్ధ పాడ్యమి
మే 9, గురువారం

వైశాఖ శుద్ధ పాడ్యమి తిథితోనే వైశాఖ మాసం ఆరంభమవుతుంది. ఈనాటి నుంచే వైశాఖ స్నాన వ్రతం ఆరంభమవుతుంది. వైశాఖ స్నానంతో సర్వ పాపాలు హరిస్తాయని ప్రతీతి. ప్రాత కాలంలో నియమంగా స్నానం చేస్తే విష్ణువుకి ప్రీతి కలుగుతుంది. స్నానానంతరం రావిచెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి. ఈ మాసం పొడవునా ఈనాటి నుంచి తులసి దళాలతో విష్ణువును పూజించాలి.

వైశాఖ శుద్ధ విదియ
మే 9, గురువారం

వైశాఖ శుద్ధ పాడ్యమి ఘడియల్లోనే విదియ ఘడియలు కూడా కూడి ఉన్నాయి. వైశాఖ శుద్ధ విదియ నాడు రోహిణి వ్రతాన్ని ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది.

వైశాఖ శుద్ధ తదియ
మే 10, శుక్రవారం

వైశాఖ మాసంలో రెండు తిథులు అతి ప్రధానమైనవి. అందులో ఒకటి శుద్ధ తదియ కాగా, రెండోది శుద్ధ పూర్ణిమ. ఈ రెండు తిథుల్లోనూ విశేష పర్వాలు ఉన్నాయి. ఇక, వైశాఖంలో వైశాఖ శుద్ధ తదియ నాటి నుంచే ఈ మాసపు ప్రధాన పర్వాలన్నీ ఆరంభమవుతాయి. తదియ మొదలుకుని అన్నీ పర్వదినాలే.
అక్షయ తృతీయ
వైశాఖ శుద్ధ వైశాఖ శుద్ధ తదియ ఇంకా చాలా విధాలుగా ప్రశస్తమై ఉంది. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయగా ప్రసిద్ధి. ఇది గొప్ప పుణ్య దినం. అక్షయ తదియ సోమవారం కానీ, బుధవారం కానీ వస్తే మరీ పవిత్రమైనది. కృత్తిక రోహిణీ నక్షత్రంతో కూడిన ఈ పర్వం అతి ప్రశస్తమైనదిగా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తిథి నాడు చేసే దానాలు, దేవతలకు, పితరులకు చేసే పూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని అంటారు. అందుకే ఈ పర్వానికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది.
అక్షయ తృతీయ నాడు పెరుగన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉదకుంభము మొదలైనవి దానం చేయాలని నియమం. వైశాఖ మాసంలో వైశాఖ పూజ అనే పేరుతో సంపన్నులు ఒక వ్రతం చేస్తుంటారట. అందులో వేసవికి అవసరమైనవి వేసవిలో బాగా దొరికే మామిడిపండ్లు, పనస తొనలు మొదలైనవి కూడా వ్రతం చివరిలో పంచి పెట్టే వారు. వేసవికి అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా దానం చేయడం అక్షయ తృతీయ వ్రతం విధాయ కృత్యాలలో ఒకటి.
స్మ•తి కౌస్తుభంలో, తిథి తత్వంలో, పురుషార్థ చింతామణి తదితర వ్రత గ్రంథాలలో ఈనాడు విష్ణువును పూజించాలని ఉంది.
చైత్ర శుక్ల తృతీయ నాడు ప్రారంభించిన గౌరీ పూజ వ్రతం కొన్ని ప్రాంతాలలో నెల రోజులు కొనసాగి ఈనాడు ముగుస్తుంది. కాబట్టే పంచాంగాలలో ఈనాడు గౌరీపూజ, త్రిలోచన గౌరీ వ్రతం అని పేర్కొన్నారు.
అక్షయ తృతీయ ఉగాది తిథి. కృత, త్రేత, ద్వాపర, కలియుగం అనే నాలుగు యుగాల్లోనూ త్రేతాయుగానికి ఇది మొదటి రోజు. శ్రీరామావతారం త్రేతా యుగానికి చెందినది. అప్పటి మానవ ఆయుర్ధాయం మూడు వేల సంవత్సరాలు. శరీరంలో మాంసం ఉండే వరకు మనుషులు ప్రాణాలు ధరించి ఉంటారట. త్రేతా యుగం రజత యుగం. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణములనే త్రేతాగ్నులను పూజించిన కాలం కావడం చేత అది త్రేతాయుగం అయ్యింది.
అక్షయ తృతీయ నాడే కృత యుగం ఆరంభమైందని, కాబట్టి ఈ కృత యుగాదినే అక్షయ తృతీయ పర్వంగా నిర్వహించుకుంటారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిష్యోత్తర పురాణంలో వివరంగా ఉంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయ నాడు బదరీ నారాయణుడిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా చాలాచోట్ల కనిపిస్తోంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం ఆచారం.
బలరామ జయంతి
వైశాఖ శుద్ధ తదియ బలరామ జయంతిగానూ ప్రసిద్ధి. రోహిణికి ఆదిశేషుడు బలరాముడుగా పుట్టాడని పురాణగాథ. విష్ణుమూర్తి కృష్ణావతారం ధరించినపుడు బలరాముడూ అవతరించాడు.

కృష్ణుని కంటే ఒక విధంగా బలరాముడే గొప్పవాడనే వర్ణణలూ మన కవుల రచనలలో ఉన్నాయి. ఈయన ఆయుధం నాగలి. ఒకసారి దుర్యోధనుడి కూతురైన లక్ష్మణను కృష్ణుడి కుమారుడైన సాంబుడు వివాహార్థం తీసుకునిపోతుండగా, కౌరవ సైనికులు అతనిని బంధించి హస్తినాపురంలో చెరలో ఉంచారు. సాంబుడిని విడిపించడానికి బలరాముడు వెళ్లాడు. ఎంతగా హెచ్చరించినా కౌరవులు సాంబుడిని విడిచి పెట్టలేదు. దీంతో బలరాముడు తన నాగలితో హస్తినాపురాన్ని పెళ్లగించడానికి సిద్ధమయ్యాడు. దీంతో హస్తినాపురమంతా అల్లల్లాడింది. భయపడిన కౌరవులు సాంబుడిని విడిచి పెట్టారు. ద్వివిదుడనే వానరుడు తన కోతి చేష్టలతో పచ్చని పొలాలను నాశనం చేయసాగాడు. అతనిని ఎంతగా బెదిరించినా వినకపోయే సరికి.. బలరాముడు తన హలాయుధంతో అతనిని సంహరించాడు.
బలరాముడు గదా యుద్ధవిద్యలో దుర్యోధనుడికి గురువు. కురుక్షేత్రంలో భీమ దుర్యోధనుల గదా యుద్ధంలో భీముడు దుర్యోధనుని యూరువుల మీద కొట్టాడు. అలా కొట్టడం అధర్మం కాబట్టి భీముడిని శిక్షించడానికి బలరాముడు తన హలాన్ని ఎత్తాడు. కృష్ణుడు అడ్డుపడి అన్నను శాంతపరిచాడు.
బలరాముడు ఒకసారి గోపికలతో కలిసి యమునా నదికి స్నానానికి వెళ్లాడు. ఆ సందర్భంలో అతను యమునా నదిని పిలిచాడు. కానీ ఆమె రాలేదు. దీంతో నదిని చీల్చి వేస్తానని నాగలిని ఎత్తాడు. దీంతో యమున పరుగున వచ్చిన అతనికి వినీల వస్త్రాలు కానుకగా ఇచ్చింది.
బలరాముడి నాగలితో ‘నాగావళి’ పుట్టుక:బలరాముడు తన నాగలితో ఆంధ్రులకు మహోపకారం చేశాడు. తన నాగలి చాలుతో ఆయన ఆంధ్రభూమిలో ఒక నదిని పుట్టించాడు. మహేంద్ర పర్వత శాఖ అయిన నిమ్మగిరుల నుంచి నూట పదిహేను మైళ్లు నడిపించి మోపసు బందరు వద్ద తూర్పు సముద్రంలో పడేటట్టుగా ఒక నదిని సృష్టించాడు. నాగలి వలన పుట్టిన నది కాబట్టి అది ‘నాగావళి’ అయ్యింది. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది.
బలరాముని కేతన చిహ్నం.. కర్షకుల కల్పవృక్షమైన తాటి చెట్టు.
బలరాముడిని ఆంధ్రులు, ముఖ్యంగా రైతులు విశేషంగా కొలుస్తారు. ఈనాడు ఆంధ్ర కర్షకులు తమ పొలాల్లో, తమ పెరళ్లలో కూరపాదులు పెడతారు. అవి యథా కాలాన మొలకెత్తి భరణి, కృత్తిక కార్తుల్లోని ఎండలను తట్టుకుంటూ నెమ్మదిగా ఎదిగి మృగశిర కార్తె నాటికి ముంగిళ్లు చల్లబడటంతోనే ఏపుగా ఎదిగి అప్పటి నుంచి అక్షయంగా కాస్తాయి.
సింహాచల నృసింహుని చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ ఇంకా చాలా విధాలుగా ప్రశస్తమై ఉంది. ఈనాడు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షయ తృతీయ నాడు సాధారణంగా కృత్తికా నక్షత్రం కూడి ఉంటుంది. కృత్తిక అగ్ని సంబంధమైనది. అగ్ని వల్ల తీక్షణత పుడుతుంది. ఆ తీక్షణం తగ్గించడానికి చందన చర్చ ఒక శైత్యోపచారం. సింహాచల స్వామికి విదియ నాటి రాత్రి గంధమును ఒలిచి వేస్తారు. తదియ నాటి ఉదయాన సహస్ర ఘటాభిషేకము చేస్తారు. అనంతరం స్వామి నిజరూప దర్శనం. స్వామి రూపం లింగాకృతిలో కనిపిస్తుంది. అనంతరం తిరిగి స్వామికి చందన చర్చ. ఈ గంధం ఒలుపు సహస్ర ఘటాభిషేకం, చందన సేవతో కూడి ఉంటుంది.
చందనాను లేపనం మంగళ ప్రదమైనది. ఆరోగ్యప్రదమైనది. చందనం అమూల్యమైన మూలిక. ప్రియమైన వాసన కలిగి ఇది దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. విషాహారంగా, క్రిమిహరంగానూ పని చేస్తుంది. అంతస్తాపాన్ని పోగొట్టి మిక్కిలి చలవ చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో దీనిని విరివిగా వాడతారు.
పరశురామ జయంతి: వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతి దినంగానూ ప్రసిద్ధి. ఇది దశావతారాల్లో ఆరవ అవతారం.

వైశాఖ శుద్ధ చవితి
మే 11, శనివారం

వైశాఖ శుద్ధ చతుర్థి నాడు చతుర్థి వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. ఇది ప్రధానంగా గణపతి సంబంధిత పూజ. ఈనాడు నిజ కర్తరి.

వైశాఖ శుద్ధ పంచమి
మే 12, ఆదివారం

వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి తిథిగా ప్రసిద్ధి. అద్వైతాన్ని ఈ లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరులు మన హైందవ ధర్మానికి పట్టుగొమ్మ. ఆదిశంకరులు చిన్ననాడే దరిద్ర నారాయణులను చూసి.. వారి కోసం కరుణా సముద్రుడై లక్ష్మీదేవిని స్తుతించి పేదల ఇళ్లను సౌభాగ్యాలకు నెలవు చేశాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. కాశ్మీర దేశంలో శారదా దేవి పీఠం ఒకటి ఉందనీ, దానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయనీ, తూర్పు, పడమటి, ఉత్తర ద్వారాలను ఆయా దిక్కుల నుంచి వచ్చిన సర్వజ్ఞులైన పండితులు తెరిచారనీ, దక్షిణ ద్వారం తెరవగల పండితుడు లేనందున ఆ ద్వారం అలాగే మూసి ఉందని జనం చెప్పుకోవడం శంకరులు విన్నారు. దీంతో ఆయన కాశ్మీరానికి వెళ్లి, అక్కడి పండితులతో వాదించి దక్షిణ ద్వారం తెరుచుకునేలా చేసి విశేష కీర్తిని పొందారు. బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసాశ్రమం స్వీకరించిన శంకరులు సన్యాసి అయి ఉండీ తల్లికి అంత్యకర్మలు నిర్వహించారు. తన పండిత శక్తితో డెబ్బయి రెండు మతాల వారిని జయించారు. అనేక ఉద్గ్రంథాలను రచించారు. శంకరాచార్యులు అద్వైత మత స్థాపనాచార్యుడు. అద్వైత మతం మన వేదాలలో, ఉపనిషత్తులతో, భగవద్గీతలో ఉన్నదే. ప్రజలు దానిని మరిచిపోగా భారతాన ఆ కొస నుంచి ఈ కొస వరకు తిరిగి దానిని వెలుగులోకి తెచ్చారు. ఆయన జయంతి తిథి నాడు శృంగేరి తదితర జగద్గురు పీఠాలలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తారు.
సూరదాస్‍ జయంతి
వైశాఖ శుద్ధ పంచమి నాడే సూరదాస్‍ జయంతి కూడా నిర్వహిస్తారు. అంధుడైన ఈయన 16వ శతాబ్దానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక కవి. సంకీర్తనాకారుడు. తన కృతులన్నీ కృష్ణుడిపై రచించి పాడిన ఈయన కృష్ణుడికి గొప్ప భక్తుడు. కృష్ణుడు.. సూరదాస్‍ అంధుడైనప్పటికీ తన దర్శనంతో ఆయనకు నేత్రపర్వం చేశాడని అంటారు.
అంతర్జాతీయ
మాతృ దినోత్సవం
మాతృమూర్తి నిత్య పూజనీయురాలు. కానీ, ఆమెను స్మరించుకోవడానికి, ప్రతి ఒక్కరి జీవితాల కోసం ఆమె చేసే త్యాగాలను మననం చేసుకోవడానికి గుర్తుగా ప్రతి ఏటా మే నెలలోని రెండో ఆదివారం నాడు అంతర్జాతీయంగా మాతృ దినోత్సవం నిర్వహిస్తారు.

వైశాఖ శుద్ధ షష్ఠి
మే 13, సోమవారం

వైశాఖ శుద్ధ షష్ఠి రామానుజాచార్య జయంతి తిథి. శంకర, రామానుజ, మధ్వ అనే త్రిమతాచార్యులలో రామానుజాచార్య రెండవ వారు. మొదటి వారైన ఆదిశంకరుల జయంతి తరువాతే రామానుజుల జయంతి తిథి రావడం విశేషం. రామానుజులు విశిష్టాద్వైత మతోద్ధారకుడు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం చెప్పిన ఈయన షష్ఠి నాడు జన్మించిన కారణంగా ఈ తిథి నాడు విశేష పూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షప్రాప్తి కోసం తీసుకున్న రహస్య మంత్ర రాజాన్ని శ్రీరంగంలోని రంగనాథుని ఆలయ శిఖరంపైకి ఎక్కి.. లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దానిని బహిరంగపరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకుల కోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పదనం అందరూ తెలుసుకోదగినది. ఇంకా వైశాఖ శుద్ధ షష్ఠి నాడు పుత్ర ప్రాప్తి వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. సోమవారం వ్రతం కూడా ఈనాడే ఆచరిస్తారు.

వైశాఖ శుద్ధ సప్తమి
మే 14, మంగళవారం

వైశాఖ శుద్ధ సప్తమి గంగా సప్తమిగా ప్రసిద్ధి. గంగా నది జహ్నుముని చెవి నుంచి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పూజ చేయాలి. శర్కరా సప్తమి, నింబా సప్తమి, అనోదన సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలను కూడా ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో రాశారు. తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద కావడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, తపస్సు చేసి కైలాసనాథుని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకుని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖ మాస సప్తమి నాడే జరిగింది. దీనిని పురస్కరించుకుని ఈనాడు గంగా స్నానం, గంగాస్తుతి చేసిన వారికి పతితపావన గంగ సకల పాపపు రాశిని హరిస్తుందని పండితులు చెబుతారు.

వైశాఖ శుద్ధ అష్టమి
మే 15/16, బుధ/గురువారాలు

సాధారణంగా ప్రతి నెలలో వచ్చే శుద్ధ అష్టమి, బహుళ అష్టమి తిథులలో దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. దేవిని పూజించడం ఈనాటి విధాయకృత్యం. ఈనాడు దుర్గాష్టమి వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. వైశాఖ శుద్ధ అష్టమిని బుద్ధ అష్టమిగానూ పరిగణిస్తారు.

వైశాఖ శుద్ధ నవమి
మే 17, శుక్రవారం

ప్రతి నెలలో వచ్చే శుద్ధ, బహుళ నవమి తిథులు కూడా శక్త్యారాధనకు ఉద్దేశించినవి. వైశాఖ శుద్ధ నవమి ద్వాపర యుగాంతం.

వైశాఖ శుద్ధ ఏకాదశి
మే 19, ఆదివారం

వైశాఖ శుద్ధ ఏకాదశి మోహినీ ఏకాదశిగా ప్రతీతి. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి మహా విష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణులోక ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం.
మోహినీ ఏకాదశికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. ధనవంతుడైన ఒక వైశ్యుడు తన ధనాన్ని అంతా దుర్వ్యయం చేశాడు. దీంతో అతనిని బంధువులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో అతను ఒక అడవికి వెళ్లి తిరుగుతుండగా, ఒక ముని కనిపించాడు. ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించి ఆచరించాలని చెప్పాడు. ఆ వైశ్యుడు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పుణ్యం సంపాదించి, తిరిగి ధనవంతుడు అయ్యాడు. ఈ ఏకాదశి మిక్కిలి ఫలకారి.
ఆంధప్రదేశ్‍లోని అన్నవరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడి రత్నగిరిపై వెలసిన సత్యనారాయణమూర్తి ప్రతి తెలుగింటా నిత్య ఆరాధనీయుడు. ఈనాడే అన్నవరం సత్యదేవుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు జరగని తెలుగిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.

వైశాఖ శుద్ధ ద్వాదశి
మే 20, సోమవారం

వైశాఖ శుద్ధ పరశురామ ద్వాదశి తిథి. వైశాఖ మాసంలో పరశురాముడికి సంబంధించి రెండు పర్వాలు వస్తాయి. పరశురామ జయంతి దినం (వైశాఖ శుద్ధ తదియ, మే 10, 2024) కూడా ఈ నెలలోనే ఉంటుంది. రత్నగిరిలో పరశురామ మందిరం ఉంది. అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంటుంది. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు పరశురామునికి అర్ఘ్యం ఇస్తే శత్రు నాశనమవుతుంది. తండ్రి మాటను జవదాటకుండా పితృవాక్య పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్న జమదగ్ని కుమారుడే పరశురాముడు. ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువు (గొడ్డలి)ని పట్టుకుని ఇరవై ఒక్కసార్లు రాజులపై దండయాత్ర చేశాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు, రాముడు శివచాపాన్ని విరిచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకుందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నిటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోతాడు. ఈ ప్రాంతం ప్రస్తుత ఒరిస్సాలో ఉంది. అక్కడి నుంచి ఆయన మలబారు ప్రాంతానికి వలస వెళ్లాడని అంటారు. అస్సాంలోని కామాక్షి దేవి ఆలయం ఉంది. అదే జమదగ్ని ఆశ్రమం అని అంటారు. ఈ ప్రాంతంలో పరశురామాలయం కూడా ఉందని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో మలబారు భూమి ఉన్న చోట కరువు ఉండదట. అలాగే, ఈనాడు సోమా ప్రదోష వ్రతం కూడా ఆచరిస్తారు.

వైశాఖ శుద్ధ త్రయోదశి
మే 21, మంగళవారం

వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.

వైశాఖ శుద్ధ చతుర్దశి
మే 22, బుధవారం

వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి తిథి. రాక్షస రాజైన హిరణ్య కశిపుడిని అంతమొందించడానికి శ్రీ మహా విష్ణువు అవతరించింది వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే. అందుకే ఈ తిథి నాడు నృసింహ జయంతి నిర్వహిస్తారు. ఈ తిథి నాడు ఉపవాసం ఉండి స్వామిని పూజించడం వల్ల లేదా స్వామి వారి వ్రతం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈనాడు స్వామి వారు ఉద్భవించిన స్తంభం, ఇంటి గడపలను పూజించడం కూడా ఆచారం. తన భక్తుడైన ప్రహ్లాదుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహా విష్ణువు నృసింహుడై స్తంభం నుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ విధంగా లోకాలను కాపాడిన రోజు శుద్ధ చతుర్దశిగా భావించి నృసింహ జయంతిని నిర్వహిస్తారు.
అలాగే, ఈనాడు తరిగొండ వెంగమాంబ జయంతి దినం కూడా. ఈమె 18వ శతాబ్దికి చెందిన తెలుగు కవయిత్రి. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తురాలు. వేంకటాచల మహాత్మ్యము, ద్విపద భాగవతం ఈమె ప్రసిద్ధ రచనలు. వెంగమాంబ ఇంకా పలు ఆధ్యాత్మిక కావ్యాలు రచించారు.

వైశాఖ శుద్ధ పూర్ణిమ
మే 23, గురువారం

మహా వైశాఖి: ఇరవై ఏడు నక్షత్రాలలో విశాఖ నక్షత్రం పదహారవది. ఇది ఐదు నక్షత్రాల కూటమి. ఇది కుమ్మరి సారెలా ఉంటుంది. ‘విశాఖ’ అంటే కాంతిని వ్యాపింప చేసేది అని అర్థం. అటువంటి విశాఖ నక్షత్రంతో కూడిన పూర్ణిమకు వైశాఖి అని పేరు. ఏ మాసంలో వైశాఖి పూర్ణిమ వస్తుందో ఆ మాసానికి వైశాఖ మాసమని పేరు. వైశాఖిని మహా వైశాఖి అనీ అంటారు. ఈనాడు సముద్ర స్నానం చేయాలి. ధర్మరాజు ప్రీత్యర్థం నానావిధ దానాలు చేయాలి.
బుద్ధ పూర్ణిమ: వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే బుద్ధుని జన్మ మహోత్సవమని నీలమత పురాణంలో ఉంది. సిద్ధార్థుడు శాక్య వంశంలో జన్మించాడు. ఆ రాజ కుమారుడు భవిష్యత్తులో సన్యాసి అవుతాడని అతను పుట్టగానే పండితులు చెప్పారు. దీంతో కష్టం, దు:ఖం తెలియకుండా తండ్రి ఆ బాలుడిని పెంచాడు. అయినా నాలుగు దృశ్యాలు సిద్ధార్థుడి కంటపడ్డాయి. అవి.. వృద్ధుడు, రోగి, శవం (మరణం), సన్యాసి.
ఆ స్థితుల్ని చూసి చలించిన సిద్ధార్థుడు అంతర్ముఖుడయ్యాడు. ఇల్లు వదిలి,
భార్యాబిడ్డలను వదిలి వెళ్లిపోయాడు. బిహార్‍లోని బుద్ధగయలో బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయమైంది. అక్కడే ఆర్య సత్యాలు వెల్లడించాడు. అష్టాంగ యోగమార్గం బోధించాడు. బుద్ధుడిగా మారి, తన మొదటి జ్ఞానబోధను సారనాథ్‍లో ప్రారంభించాడు. దాన్ని ‘ధర్మచక్రం’ అంటారు. కొన్నేళ్ల పాటు ధర్మబోధ చేసిన బుద్ధుడి తరువాత బౌద్ధ మతం హీనయాన, మహాయాన అనే రెండు శాఖలుగా విడిపోయింది. ఆయన ఉండగానే ఆ మతం చైనా, సింహళ, టిబెట్‍ వంటి దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం అది విశ్వమంతా ఉంది. వైశాఖ పూర్ణిమ నాడు మహాపరి నిర్వాణం. బుద్ధుడిది విశేష ధర్మ సిద్ధాంతం. అహింస, కరుణ ఉండాలని, కోరికలు లేకుండా జీవించాలని మానవాళికి బోధించాడు. అందుకే ఆయనను లోకం ‘ప్రపంచ జ్యోతి’గా వర్ణించింది. బోధ గయలో జరిగే బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో యాత్రికులు వస్తారు. బోధ్‍ గయ తరువాత బౌద్ధ మతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సారనాథ్‍లోనూ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఇంకా వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే సుబ్రహ్మణ్య స్వామి అవతారం దాల్చినట్టు చెబుతారు.
శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల్లో రెండవదైన కూర్మావతారం కూడా మహా వైశాఖి నాడే ఆవిర్భవించింది. పాల సముద్రాన్ని మథించిన సందర్భంలో మందర పర్వతాన్ని కవ్వంగా దేవతలు, రాక్షసులు (అమృతం కోసం) చేసుకున్నారు. ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోయడానికి విష్ణువు పెద్ద తాబేలు ఆకారాన్ని ధరించాడు. కూర్మావతారం ఆంధ్ర దేశమంతటా పూజితం.
అన్నమయ్య జయంతి: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి దినం కూడా ఈనాడే. ఆంధప్రదేశ్‍లోని తాళ్లపాకలో జన్మించాడు. వాగ్గేయకారుడికి వినుతికెక్కిన ఈయన దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని, అహోబిలం నృసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. ఈయన పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం మిళితమై ఉంటాయి.శ్రీమహావిష్ణువు ఖడ్గానికి ‘నందకం’ అని పేరు. ఆ నందకం అంశతోనే అన్నమాచార్యులు జన్మించారని అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

వైశాఖ బహుళ పాడ్యమి
మే 24, శుక్రవారం

వైశాఖ బహుళ పాడ్యమి నారద మహర్షి జయంతి తిథి. ఆయన గొప్ప హరి భక్తుడు. ‘నారాయణ.. నారాయణ’ అంటూ ముల్లోకాలు తిరుగుతూ హరిభక్తిని జనులకు చాటేవాడు. ఇంకా ఈనాడు భూత మాత్రుత్సవం’ ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు మొదలుకుని జ్యేష్ఠ పూర్ణిమ చివరి వరకు శ్రీ ప్రాప్తి వ్రతం ఆచరించాలని కూడా నియమం.

వైశాఖ బహుళ విదియ
మే 25, శనివారం

నారద జయంతి గురించి రెండు విధాలుగా ఉంది. తెలుగు క్యాలెండర్‍ ప్రకారం నారద జయంతి దినం మే 24 అని పేర్కొనగా, తిథులను అనుసరించి అయితే, వైశాఖ బహుళ విదియ నాదర జయంతి దినంగా ఉంది. ఈనాడు వీణా దానం చేయాలని అంటారు. నారదుడు గొప్ప గాన విద్యా కుశలుడు. ఆయన చేతిలో ఉండే వీణకు ‘మహతి’ అని పేరు. ఈ వీణ ఆధారంగానే ఆయన నిత్యం విష్ణుగానం చేస్తూ ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఉంటాడు. నారదుడు గడిచిన కల్పంలో ఉపబర్హణుడునే గంధర్వుడిగా పుట్టాడట. అతను ఆ కాలంలో నారాయణ కథలు గానం చేసేవాడు. తరువాత కల్పంలో బ్రహ్మ మానసపుత్రుడైనాడు. ఈనాటి నుంచే రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. ఎండలు బాగా ముదిరిపోతాయి. అందుకే రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయనే వాడుక పుట్టింది.

వైశాఖ బహుళ చవితి
మే 27, సోమవారం

వైశాఖ బహుళ చతుర్థి నాడు సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. విఘ్నేశ్వరుడిని ఈనాడు పూజిస్తే సకల సంకటాలు తొలగిపోతాయని అంటారు.

వైశాఖ బహుళ షష్ఠి
మే 29, బుధవారం

సాధారణంగా షష్టి తిథి కుమార స్వామి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈయననే మనం సుబ్రహ్మణ్యస్వామిగా పిలుస్తాం. తమిళనాట కార్తికేయుడని, కుమారస్వామి అని పిలుస్తారు.

Review ఆధ్యాత్మిక వెలుగుల వీచిక.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top