మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..
జామాతా దశమ గ్రహ: అని సంస్క•త లోకోక్తి. మన తెలుగునాట కూడా అల్లుడు, అత్తమామలపై ఎన్నో సామెతలు ఉన్నాయి.
(పిల్లను) ఇచ్చిన వాడు కుక్క.. చేసుకున్న వాడు చుక్క, పిల్లనిచ్చిన వాడు పిల్లి, పుచ్చుకొన్న వాడు పులి అనే సామెతలు అత్తమామల యొక్క స్థితికి అద్దం పడుతుంటాయి.
అల్లుడు అంటే వంకర తాడే (తాటి చెట్టు) లేని నిలుచుంటుందట, పూచిక పుల్లను అల్లుడు అంటే గూటమై బిగిసి కూర్చుందట, అల్లుని మంచితనము, పొల్లున దంచిన బియ్యము లేవు, అల్లుడు చుట్టము కాదు.. ఆముదం చెట్టు నీడ నీడా కాదు.. ఈ సామెతలు అల్లుళ్లను ఉద్దేశించి అత్తమామలు స్వగతంగా అనుకునే మాటలు.
అల్లుడికి అడిగినవన్నీ సమకూర్చడమే కాక, అతని అప్పకు (ఆడపడుచు) కూడా అన్నీ సమకూర్చాలి. లేకుంటే రుసరుసలు తప్పవు. అల్లుడి కత్తికి రెండువైపులా పదునైతే అతని అప్ప (సోదరి)కు ఆరువైపులా పదును అనే సామెత పుట్టింది.
కొత్త అల్లుడికి మనుగుడుపులు తినిపిస్తారు అత్తగారు. ‘ఆల్లెడం తినడం’ అని మనుగుడుపులకు మరోపేరు. తమకు తాహతు ఉన్నా లేకపోయినా అల్లుడికి మాత్రం పిండివంటలు, మాంసం వంటివన్నీ సమకూరుస్తారు. ఆ ఇంటి అబ్బాయి, మామగారు నోళ్లు కట్టుకుని అల్లుడికి విందులు తినిపించడం అరుదు కాదు. ఈ సత్యాన్ని మొగుడికి మోదుగాకు, అల్లుడికి అరటాకు, అల్లుడికి వండిన అన్నం కొడుకుకు పెట్టి కొట్టుకున్నదట అనే సామెతలు తెలుపుతాయి.
అత్త వారింట్లో సుష్టుగా తిని, పుష్టిగా తయారవుతాడు అల్లుడు. అందుకే అల్లుడు పుష్టిగా ఉండేది అత్తగారింటనే, అత్తవారింట అల్లుడిని చూడాలి.. ఆముదాల చేనులో ఆంబోతును చూడాలి (ఆముదపు చేనులో గరిక బాగా పెరిగి ఉంటుంది. ఆంబోతు ఎంత తిన్నా అడ్డే లేదు. ఎవరూ అడ్డుకోరు కూడా. అందుకే ఈ సామెతను ఉదహరిస్తారు) అంటూ అత్తారింట ఉండే అల్లుళ్లను ఉద్దేశించిన పై సామెతలను వాడతారు.
పెళ్లి సమయంలో తోడి పెండ్లికొడుకు కూడా ఉంటాడు కదా!. ఈయనను మేపడం కూడా అత్తమామలకు ఒకింత కష్టమైన పనే. దాదాపు అల్లుడిని చూసుకున్నట్టుగానే ఈ చిన్నారి తోడి పెండ్లికొడుకును కూడా బాగా చూసుకోవాలి. అందుకే ఓ మామగారు, అల్లుడిని చూపి ‘ఈయన నా కూతురు మొగుడు. తోడి పెండ్లికొడుకును చూపి ఈయన నా మొగుడు. ఆరు నెలల నుంచి ఉన్నాడు’ అన్నాడట ఉక్రోషంతో.
ప్రత్యేకించి కొందరు అల్లుళ్లు అత్తలకు బాగా నచ్చేస్తుంటారు. ఈ క్రమంలోనే అల్లుడికి అత్తాశ, గొడ్డుకు దూడాశ, అత్తనుంచుకొన్న వాడు ఆయుష్మంతుడు అనే సామెతలు పుట్టుకొచ్చాయి.
కొందరు అల్లుళ్లు తేరగా తిని తిరగొచ్చని ఇల్లరికానికి పోతుంటారు. ఇలాంటి అల్లుళ్లను ఉద్దేశించి అత్తమామలు- ఇల్లరికపుటల్లుడు ఇంటిల్ల పాదికి మొగుడు అని ఫిర్యాదు చేస్తుంటారు.
ఇక, ఇల్లరికం కన్న మాలరికం మేలు అని ఇల్లరికపు అల్లుళ్లు ఆక్రోశించడమూ కద్దు. ఇల్లరికపు అల్లుడికి అత్తమామలు సరిగా గౌరవించరనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే కాబోలు- కట్టే లేదు కంపా లేదు కాచీ పోయా నీళ్లూ లేవు పదవోయి అల్లుడా నూతిగట్టుకు అనే సామెత అత్తగారి చులకనతనాన్ని తెలుపుతుంది.
ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అల్లుడు, అత్తమామలు, మరదళ్లు ఇతరత్రా సంబంధ బాంధవ్యాలపై చాలా సామెతలు ఈనాటికీ వాడుకలో ఉన్నాయి. వాటిలో కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉన్నాయి.
వచ్చే సంచికలో ‘కోడలు – ఆడపడుచు’లపై ఉన్న సామెతల గురించి తెలుసుకుందాం.








Review ఇల్లరికపుటల్లుడు.. ఇంటిల్లిపాదికీ మొగుడు.