తొలి సంపాదన ఎవరికైనా అపురూపమే.. ఎంతైనా ప్రత్యేకమే.. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం కూడా. ప్రత్యేకించి సెలబ్రిటీలు ఒక అవకాశాన్ని దక్కించుకుని స్టార్డమ్ సంపాదించాక వచ్చి పడే సంపాదన వేరు..
ఆ అవకాశాన్ని దక్కించుకోవడానికి కెరీర్ మొదట్లో చేసే ప్రయత్నాలు.. చివరికి చేతికందే మొత్తాన్ని
ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. సినీ పరిశ్రమలో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకుని కోట్లు అందుకుంటున్న
తారలు.. మొదట్లో అందుకున్న పారితోషకం ఎంతో ఇలా చెబుతున్నారు..
సమంత: రూ.500
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. కుటుంబానికి భారం కావద్దని పాకెట్ మనీ కోసం ఏదైనా పని చేయాలనుకున్నా. అప్పుడే ఓ హోటల్లో జరిగిన కాన్ఫరెన్స్‌లో అతిథులకు స్వాగతం చెప్పే అవకాశం లభించింది. అందుకు పారితోషకంగా ఐదు వందల రూపాయలు ఇచ్చారు. అది కొంచెమే అయినా నా తొలి సంపాదన కావడంతో చాలా గర్వంగా అనిపించింది. ఏదో సాధించిన భావన కలిగింది. ఇప్పటికీ అది మంచి జ్ఞాపకమే..
నాని.. రూ.4 వేలు
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నపుడు నా మొదటి సంపాదన నాలుగు వేల రూపాయలు. అప్పుడు మొత్తం వంద రూపాయల నోట్లే ఇచ్చేవారు. ఆ నోట్లన్నీ జేబులో పెట్టుకుని, బైక్‌పైన వెళ్తుంటే నేనెంతో ధనవంతుడిని అయిపోయానని అనిపించింది. వాటితో సగం హైదరాబాద్‌ను కొనేస్తానన్నంత ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఇప్పుడెంత సంపాదిస్తున్నా.. అప్పటి ఫీల్ మాత్రం నాకు చాలా ప్రత్యేకం.
టీలు అందించా: యశ్
ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని.. పదహారేళ్ల వయసులోనే ఇల్లు విడిచి బెంగళూరుకు వెళ్లిపోయా. చిన్న చిన్న అవకాశాల కోసం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండేది కాదు. రాత్రి సమయాల్లో బస్టాండులోనే పడుకునే వాడిని. కడుపు నిండా తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అప్పుడే నటన నేర్చుకోవడంతో పాటు అవసరాలకు డబ్బులు వస్తాయని ఒక నాటక బృందంలో సహాయకుడిగా చేరా. మొదట్లో స్టేజ్‌పైన ఊడవడంతో పాటు బృంద సభ్యులకు టీలూ అందించే వాడిని. ఆ పని చేసినందుకు నాకు రోజుకు ఐదు వందల రూపాయలు ఇచ్చే వారు. డబ్బులు పొదుపుగా ఖర్చు చేయడం అప్పుడే నేర్చుకున్నా.
పాంప్లెట్స్ పంచా..: ఐశ్వర్య రాజేశ్
పాకెట్ మనీ కోసం స్కూలు రోజుల నుంచే పార్ట్‌టైమ్ జాబ్ చేసేదాన్ని. మాల్స్, సూపర్మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో వివిధ బ్రాండ్లకు సంబంధించిన పాంప్లెట్స్ పంచేదాన్ని. ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు ఇదే నా డ్యూటీ. అలా మొదటిసారి ఓ బ్రాండ్ కోసం పాంప్లెట్స్ పంచినపుడు నాకు రూ.225 ఇచ్చారు. అప్పుడు ఆ డబ్బు నాకు ఎన్నో వేల రూపాయల్లా అనిపించింది.
నాన్నకే ఇచ్చా.. కీర్తిసురేశ్
చిన్నప్పుడు ఒక ఫ్యాషన్ షోలో పనిచేశాను. స్టేజ్ వెనుక ఉంటూ మోడళ్లకు కాస్ట్యూమ్స్ అందించే దానిని. అంటే వాళ్లకు సహాయకురాలిగానన్న మాట. ఆ పని చేసినందుకు నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చారు. బాలనటిగా చాలా సినిమాల్లో నటించినా.. నా మొదటి సంపాదన మాత్రం అదే. ఆ డబ్బులను తీసుకెళ్లి మా నాన్నకే ఇచ్చాను.




























































































































































































































































Review తొలి సంపాదన ఎవరికైనా అపురూపమే...