సుందోపసుందులు

ఇద్దరు తమలో తాము పోట్లాడుకుని ఇద్దరూ నాశనం కావడాన్ని ‘సుందోప సుందుల న్యాయం’ అంటారు.
ఈనాటికీ మారుమూల పల్లెలలోనే కాక, మహా నగరాలలో కూడా భారతదేశ సంస్కారం కలిగిన వారు ఈ సామెతను వాడుతుంటారు. ఎవరైనా ఇద్దరు వివేకం మరిచి పోట్లాడుకుంటుంటే, వారిని సుందోపసుందుల్లా కొట్టుకుంటున్నారని అనడం కద్దు. ఈ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు చెప్పింది.
ఒకనాడు నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. తన వద్దకు అతిథులుగా వచ్చిన వారి నుంచి ధర్మసూక్ష్మాలు నేర్చుకోవడం ధర్మరాజుకు అలవాటు. దీంతో నారదుడిని ధర్మం గురించి ఉపదేశించాల్సిందిగా ధర్మరాజు కోరాడు.
అప్పుడు నారదుడు ఈ కథ చెప్పడం ప్రారంభించాడు.

‘ధర్మరాజా! హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల కథ ఎరుగుదువు కదా! వారి వంశంలోనే కుంభుడనే పేరు గల రాక్షసుడు ఉండేవాడు. వీడు మహా బలశాలి. ఈ బలశాలికి ఇద్దరు కుమారులు.
ఈ ఇద్దరు కుమారులు భయంకర దేహులు. పెద్దవాడు సుందుడు. వాడి తమ్ముడు ఉపసుందుడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏ విషయంలోనూ వారికి అభిప్రాయ భేదం ఉండేది కాదు.
నిరంతరం ఒకరినొకరు విడువకుండా కలిసి తిరిగే వారు.

అలా ఉండగా, వారికి తమ పూర్వీకుల వలే త్రిలోకాలనూ జయించాలనే కోరిక కలిగింది. ఆ కోరిక తలెత్తగానే వింధ్య పర్వతం మీదకు చేరి ఆ గిరి శిఖరం మీద పద్మాసనం వేసుకుని కూర్చుని తపస్సు ఆరంభించారు. అన్నపానాలు విడిచేశారు.
వాయువునే ఆహారంగా గ్రహిస్తూ, ఒంటి కాలి బొటనవేలి మీద నిలబడి తీవ్రదీక్షతో సాధన చేస్తున్నారు. ఆ తపస్సు వేడికి మంటలు
చెలరేగేవి. ఇలాగే వదిలేస్తే లోకంలో కల్లోలం చెలరేగుతుందని భావించిన దేవతలు వారి తపస్సును భగ్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా సుందోపసుందులు తమ తపస్సు చాలించలేదు. చలించలేదు. ఇద్దరూ అలాగే ధ్యాన సమాధిలో ఉన్నారు.
చివరకు వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండని అన్నాడు.

ఈ ప్రపంచంలో ఉన్న అస్త్ర, శస్త్ర విద్య అంతా తమకు రావాలనీ, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలన్నీ తమ ఆధీనంలో ఉండాలనీ, మా ఇద్దరిలో మాకూ మాకూ వైరం వచ్చి ఒకరినొకరు చంపుకుంటే తప్ప మరెవరి వల్లా తమకు చావు రాకూడదనీ వారిద్దరూ బ్రహ్మను వరం కోరుకున్నారు.
సరేనంటూ బ్రహ్మ అనుగ్రహించి అదృశ్యమయ్యాడు.

సుందోపసుందులు బ్రహ్మ నుంచి వరాలు పొందిన ఆనందంతో తమ నగరానికి చేరుకున్నారు. రావడంతోనే తమ సేనలతో విజయయాత్రకు బయల్దేరారు.

ముందుగా దేవేంద్రుని నగరమైన అమరావతిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి దేవతలందరినీ తరిమికొట్టారు. అనంతరం భూలోకం, నాగలోకం, యక్ష, రాక్షస లోకాలన్నీ వశపరుచుకున్నారు.

పెద్దపులి రూపాలతో, సింహాకారాలతో గుహలలో దూరి అక్కడ తపస్సు చేసుకునే మునులను, మహర్షులను హింసించేవారు.

ఆశ్రమాలలోకి ప్రవేశించి యజ్ఞ సామగ్రిని విసిరి వేసేవారు. యజ్ఞ వాటికలను చెల్లాచెదురు చేసేవారు.

అలా ప్రపంచం అంతా తిరుగుతూ సాధు, సజ్జన హింసతో, పరస్త్రీ బలాత్కారాలతో జీవితం గడపసాగారు సుందోపసుందులు.

ఈ అన్నదమ్ముల ఆగడాలతో లోకంలో ఏ ప్రాణికీ శాంతి లేకుండా పోయింది. అంతటా దీనారావాలు, హాహాకారాలు వినిపించసాగాయి. ఏ పూట ఎవరికి కీడు మూడుతుందో తెలియని పరిస్థితి. ఏ రాత్రి ఏ నగరం శ్మశానవాటిక అవుతుందో తెలియదు.
అలా భయానకంగా ఉన్న సమయంలో దేవతలూ, మునులూ కలిసి బ్రహ్మను ప్రార్థించి విషయం చెప్పారు.

ఆయన విశ్వకర్మను పిలిపించాడు.

‘మహాశిల్పీ! ప్రపంచంలో ఎంతటి వారినైనా సరే కనుచూపుతోనే ఆకర్షించి పాదాక్రాంతం చేసుకోగల ఒక సుందరీమణిని సృష్టించు’ అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ.
ఆలోచించాడు విశ్వకర్మ.

ఇంతకుముందు తాను నిర్మించిన సుందర రూపాలన్నింటి నుంచి ఒక్కో అందాన్ని నువ్వు గింజంత (తిలాంశ) తీసి ఒక అపురూప సౌందర్యవతిని సృష్టించాడు.
కాలిగోరు నుంచి కనురెప్పల వరకు అంతా లావణ్యం జాలువారుతున్నది ఆ సుందరికి.

ఆయా అందమైన శిల్పాల నుంచి ఒక్కో అందాన్ని తిలాంశ (నువ్వు గింజంత) పరిమాణంలో తీసి ఈ సుందరాంగిని సృష్టించిన విశ్వకర్మ, ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టాడు.
ఆమె బయల్దేరింది.

ఆమెను చూసి దేవతా నాయకులందరికీ కళ్లు చెదిరాయి. దేవేంద్రుడు తన వెయ్యి కళ్లనూ విప్పి చూశాడు. అంతటి అందగత్తె తన నడకలతో, కాలిఅందెల రవళితో ఎందరెందరినో మోహింప చేస్తూ సుందోపసుందులు ఉన్న వనానికి వచ్చి విలాసంగా విహరించసాగింది.
అది వింధ్యగిరి శిఖరం.అక్కడ విశాలమైన సాలవృక్షం ఉంది.

ఆ చెట్టు నీడలో రకరకాల పానపాత్రలు ఉన్నాయి.

కనులు మిరుమిట్లుగొలిపే కామినీ జనం మూగి ఉన్నారు.

ఎటుచూసినా హంసతూలికా తల్పాలు.. సుందోపసుందులకు వింజామరలు వీస్తూ సుందరీమణులు.. కమ్మని కంఠాలతో పాటలు పాడుతూ ఉన్నారు.

ఆ పాటలకు అనుగుణంగా అందెల రవళులతో, గాజుల గలగలలతో, చూపుల మిలమిలలతో, సుందరాంగుల నాట్యాలతో ఆ సోదరులు ఇద్దరూ పరమ సంతోషంగా ఉన్నారు.

అటువంటి వారికి కంటికి అల్లంత దూరంలో వయ్యారంగా పయిట జారుస్తూ, కనులు తిప్పుతూ, తన అందాన్ని ఒలకబోస్తూ నిలిచింది తిలోత్తమ.

అంత మైకంలో ఉన్న అన్నదమ్ములిద్దరూ ఆ సుందరిని చూస్తూనే, తమ కోరమీసాలు ఎగదువ్వుతూ, చేతుల్లోని పాన పాత్రలు జారవిడిచి, ఆశ నిండిన కనులతో, రాచఠీవీతో ఆమె వైపు అడుగులు వేశారు.

ఇద్దరూ ఆమె దగ్గరకు చేరారు.

ఆమె భయాన్నీ, సిగ్గునూ అభినయిస్తూ, జారుతున్న పైట సరిచేసుకుంటున్నట్టు నటిస్తూ, వెనుదిరిగి ఓరచూపుతో ఇద్దరినీ రెచ్చగొట్టింది.

సుందుడు తిలోత్తమ కుడిచేయి అందుకోగా, ఉపసుందుడు ఆమె ఎడమ చేతిని పట్టుకున్నాడు.

బలమదం, ధనమదం, రాజ్యమదం, వరమదం.. అన్నిటికీ మించి మద్యపాన మదంలో ఉన్న ఇద్దరినీ చూసి తిలోత్తమ ఒక కంటితో సుందుడిని, మరోకంటితో ఉపసుందుడిని మరోసారి రెచ్చగొట్టింది.

ఇద్దరూ ఆమె మైకంలో పడిపోయారు.

‘తమ్ముడూ! అన్న గారి భార్య తల్లితో సమానం. నువ్వు ఈమెను తాకకూడదు’ అన్నాడు సుందుడు.

‘తమ్ముడి భార్య కోడలితో సమానం. నువ్వు దూరంగా వెళ్లు’ అన్నాడు ఉపసుందుడు.

‘మీరిద్దరిలో ఎవరో తేల్చుకోండి’ అని దూరంగా నిలబడింది తిలోత్తమ.

ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే కోరికతో రెచ్చిపోయిన అన్నదమ్ములిద్దరూ ఒళ్లు తెలియకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకరినొకరు పిడిగుద్దులతో, మోకాటి పోటులతో కొంతసేపు పోట్లాట సాగించారు.

ఎంతకీ తెగని యుద్ధంలో ఇద్దరూ గదలు అందుకున్నారు.

ఆ గదా ఘాతాలతో వారి శరీరాలు చీలి రక్తధారలు సెలయేరుల్లా ప్రవహించాయి.

అంతే, పర్వతదేహులైన ఆ రాక్షసులిద్దరూ ఒకరినొకరు కొట్టుకున్న దెబ్బలతో నదీ ప్రవాహంలో బండరాళ్లలా కూలిపోయారు.

ఇక్కడితో నారదుడు కథ చెప్పడం ముగించాడు.

‘నాయనా! ధర్మరాజా! కామపిశాచి ఎంత చెడ్డదో చూశావా?!’ అని బోధించాడు.

Review సుందోపసుందులు.

Your email address will not be published. Required fields are marked *

Top