కచుడి విద్యాదీక్ష

ఈ కథ మహాభారతంలోని ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో ఇతర వ్యవహారాల మీదకు మనసు పోనివ్వకుండా చదివితే మంచి ఫలితాలు సాధించగలమని ఈ కథ ద్వారా మహాభారతం చేస్తోన్న హితబోధ ఇది. ఇక, కథలోకి వెళ్దాం.

చాలా కాలం క్రితం నాటి మాట!

కశ్యపుడు అనే ముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు.
ఈ అన్నదమ్ములు (రాక్షసులు, దేవతలు) నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండేవారు. ఒకసారి వారు, ఇంకోసారి వీరు గెలుస్తుండేవారు.
వీరిలో రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. దేవతల గురువు బృహస్పతి. శుక్రాచార్యుడు చాలా కాలం తపస్సు చేసి మృత సంజీవనీ అనే విద్య సాధించాడు. దానివల్ల యుద్ధంలో మరణించిన రాక్షసులందరినీ తిరిగి బతికించేవాడు.
అప్పటికి ఇంకా దేవతలు అమృతపానం చేయలేదు. కనుక వారు యుద్ధంలో చచ్చిపోయేవారు. అది చూసి బృహస్పతి తన కుమారుడైన కచుడిని పిలిచి శుక్రాచార్యుల వద్ద మృత సంజీవనీ విద్యను నేర్చుకురమ్మని పంపాడు.
కచుడు శుక్రాచార్యుడి వద్దకు వచ్చి, ‘శ్రీ గురుభ్యో నమ:’ అని పాదాలపై పడ్డాడు.
‘నేను అంగీరస వంశస్తుడను. బృహస్పతి తనయుడను. నన్ను కచుడు అని పిలుస్తారు. మీ వద్ద విద్యాభ్యాసం నిమిత్తం వచ్చాను’ అని తన గురించి చెప్పాడు.
శుక్రాచార్యుడు ఆ కుర్రవాడి వినయానికి మిక్కిలి సంతోషించాడు.

‘నాయనా! చాలా ఆనందం.’ అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో కచుడిని ఉండమన్నాడు.
కచుడు రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు ముగించుకుని సంధ్యా వందనాలు యథావిధిగా సాగించి గురు శుశ్రూష చేయసాగాడు.
శుక్రాచార్యుడికి దేవయాని అనే అందమైన కుమార్తె ఉంది. ఆమె అతిలోక సౌందర్యవతి. అందులోనూ వయసు పదహారు దాటింది.
ఆ పిల్లకు కచుడి మీద మనసు మళ్లింది. అనేక విధాలుగా తన ప్రేమను అతడి ముందు వ్యక్తం చేసేది. కచుడికి తను వచ్చిన పని, విద్యాభ్యాసం తప్ప మరో ధ్యాస లేదు. పైగా గురువు గారి పుత్రిక కాబట్టి ఆమెను సోదర భావంతోనే చూసేవాడు.
ఇలా ఉండగా, మరోపక్క ఒకనాడు రాక్షసులందరూ సమావేశమై దీర్ఘంగా ఆలోచించారు.

‘దేవతల గురువైన బృహస్పతి కొడుకు కచుడు మన గురువు వద్ద విద్యాభ్యాసానికి వచ్చాడు. శత్రువర్గం వారి దగ్గర ఏం చదువుదామని వచ్చాడు? ఓహో! మన గురువు గారి వద్ద మృత సంజీవనీ విద్య ఉంది. అది వీడు నేర్చుకుని వెళితే మన వంశానికే ప్రమాదం. కనుక వీడిని అడవిలో చంపి పారేద్దాం’ అని రాక్షసులంతా కూడబలుక్కున్నారు.
ఒకనాడు గురు సేవాభావంతో అడవిలో ఆవులను మేపి తిరిగి వస్తున్న కచుడిని రాక్షసులు చంపేశారు.
పొద్దుగూకింది. చీకటి ముసురుతోంది. రోజూ సాయం సంధ్యవేళకే ఆశ్రమానికి తిరిగి వచ్చే కచుడు అప్పటికీ రాకపోవడంతో కీడు శంకించిన దేవయాని తండ్రి వద్దకు వెళ్లి విషయం చెప్పి రోదించింది. కూతురి దు:ఖం చూడలేక శుక్రాచార్యుడు తన దివ్యదృష్టితో చూసి, జరిగింది గ్రహించారు. తన మృత సంజీవనీ విద్యతో కచుడిని తిరిగి బతికించారు.
ఈ విషయం తెలుసుకున్న రాక్షసులకు కడుపు మండిపోయింది. బాగా ఆలోచించారు. కచుడిని సంహరించి ఆనవాళ్లు లేకుండా చేసేయాలని, తద్వారా అతడిని తిరిగి బతికించడం గురువు గారి వల్ల కూడా కాదని అనుకున్నారు.
అలా అనుకున్నదే తడవుగా కచుడిని సంహరించి, కాల్చేశారు. ఆ బూడిదను కల్లులో కలిపారు. దాన్ని తెచ్చి వినయంగా తమ గురువైన శుక్రాచార్యుడికి అందించారు.
ఆయన వెనుకా ముందూ ఆలోచించకుండా ఆ కల్లును తాగేశాడు. రాక్షసులు కచుడి పీడ విరగడైందనే ఆనందంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మళ్లీ చీకటి పడింది. కచుడు అంటే వల్లమాలిన ప్రేమ కలిగిన దేవయాని ఆ వేళకు ఇంకా కచుడు ఆశ్రమానికి రాకపోవడంతో మళ్లీ దీనంగా ముఖం పెట్టుకుని తండ్రి వద్దకు వెళ్లింది. కచుడు మళ్లీ ఏదో ప్రమాదంలో పడినట్టు ఉన్నాడని, అతడిని రక్షించాలని తండ్రిని వేడుకుంది.
శుక్రాచార్యుడు కుమార్తెపై జాలిపడి, తన దివ్యదృష్టితో చూశాడు. జరిగింది తెలుసుకుని గతుక్కుమన్నాడు.

‘అమ్మా! దేవయానీ! ఈ రాక్షసులు పరమ కిరాతకం చేశారు. ఆ బాలుడిని చంపి, అతడి చితాభస్మాన్ని కలిపిన కల్లు నా చేత తాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు బతకాలంటే నా పొట్ట చీల్చుకుని రావాలి. అదే జరిగితే నేను చనిపోతాను. అతడు బయటకు వచ్చాక నన్ను బతికించగలగాలి. అది జరగాలంటే నా గర్భంలో సూక్ష్మరూపంలో ఉన్న ఆ ప్రాణికి (కచుడికి) నా మృత సంజీవనీ విద్యను నేర్పాలి. వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా కచుడికి మేలు చేశారు. అతడికి నేను మృత సంజీవనీ విద్యను నేర్పక తప్పని పరిస్థితిని సృష్టించారు’ అని శుక్రాచార్యుడు కూతురి వద్ద వాపోయాడు.
కుమార్తె కోరిక మేరకు కచుడిని బతికించడానికి సిద్ధమయ్యాడు శుక్రాచార్యుడు. పద్మాసనం వేసి కూర్చున్నాడు. తన లోపల ఉన్న కచుడికి మృత సంజీవనీ మంత్రాన్ని ఉపదేశించాడు.
శుక్రాచార్యుడి గర్భంలో బూడిదగా పడి ఉన్న కచుడు, మృత సంజీవనీ విద్య ప్రభావంతో ఆయన ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు.
వస్తూనే, తాను నేర్చిన విద్యతో గురువు గారిని బతికించాడు. ఆయన వద్ద సెలవు తీసుకుని, తను వచ్చిన పని పూర్తి కావడంతో తిరిగి వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు.
వెంటనే అక్కడికి దేవయాని వచ్చి, ‘ఏమయ్యా! ఇంతకాలం నిన్నే ప్రాణంగా ప్రేమించిన నన్ను విడిచి వెళ్తావా?’ అంది.
‘సోదరీ! గురువు తండ్రితో సమానం. ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లెలివి అవుతావు. మన మధ్య ప్రేమకు చోటులేదు’ అన్నాడు కచుడు.
దేవయానికి కోపం వచ్చింది.

‘నా ప్రేమను తృణీకరించిన ఫలితంగా నువ్వు నా తండ్రి వద్ద నేర్చుకున్న మృత సంజీవనీ విద్య నీకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇక వెళ్లు’ అని శపించింది.
‘సోదరీ! నేర్చుకున్న విద్య ఎప్పటికీ నిరుపయోగం కాదు. నీ తండ్రి వద్ద నేను నేర్చుకున్న ఈ మృతసంజీవనీ విద్య నీ శాపం ప్రకారం నాకు ఉపయోగపడకపోయినా, నేను ఎవరికైతే బోధిస్తానో వాళ్లకు ఉపయోగపడుతుంది’ అంటూ కచుడు అక్కడి నుంచి దేవలోకానికి వెళ్లిపోయాడు.
ఈ కథలో నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే- మనం ఏ పనిపై దృష్టి, ధ్యాస పెడతామో, ఏ పనిపై ఎక్కడికి వెళ్తామో ఆ పని (లక్ష్యం)లోనే నిమగ్నం కావాలి. మధ్యలో కలిగే ప్రలోభాలకు లొంగిపోకూడదు. కచుడు కేవలం మృత సంజీవనీ విద్య నేర్వడానికే శుక్రాచార్యుడి వద్దకు వచ్చాడు. అది నేర్చుకునే వరకు రాక్షసుల నుంచి హత్యాయత్నాలు ఎదుర్కొన్నాడు. దేవయాని నుంచి ప్రేమ రూపంలో ఒత్తిడి కలిగింది. అయినా అతడు తన విద్యాభ్యాస లక్ష్యం నుంచి ఇంచు కూడా పక్కకు జరగలేదు. కాబట్టే అతను నేర్చిన విద్య దేవతల పాలిట వరమైంది. విద్యాబుద్ధులు నేర్చుకోవడంలో అతడు చూపిన శ్రద్ధ ఫలితంగానే తరువాత కాలంలో రాక్షసులపై దేవతలు విజయం సాధించారు. ఆ యుద్ధంలో హతులైనా కూడా మృత సంజీవనీ విద్యతో తిరిగి ప్రాణాలు కాపాడుకోగలిగారు.

Review కచుడి విద్యాదీక్ష.

Your email address will not be published. Required fields are marked *

Top