రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాద
సంవత్సరం మొదటి వారం శుభ ఫలితాలతో మొదలవుతుంది. ఉత్సాహంతో కొత్త పనులు మొదలు పెడతారు. మొదటి నాలుగు రోజులు ఇంట్లో కొంత అశాంతి వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత కొంత సర్దుకుంటుంది. దేవాలయ సందర్శనానికి అవకాశముంది. రెండవ వారంలో కూడా ప్రయాణాలుంటాయి. కానీ, వారం చివరలో వాతావరణం అనుకూలించక పోవడం వల్ల వాయిదా పడతాయి. అనుకోకుండా కొందరితో వివాదాలు వస్తాయి. పెద్ద విషయాలు ప్రారంభానికి కొంత కాలం ఆగటం మేలు. మూడవ వారం బాగా కలసి వచ్చే కాలం. కొత్త పనులు బాగా కలిసి వస్తాయి. చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు ఈ వారంలో పూర్తవుతాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి మంచి కబురు అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతర ముఖ్యమైన పనులలో ప్రగతి ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ప్రభుత్వం తరఫున జరగవలసిన పనులలో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రాప్తికి అవకాశాలుంటాయి. ఇదే విధంగా నెలలోని చివరి నాలుగు రోజులు కూడా గడుస్తాయి. ఆంజ నేయస్వామిని స్మరించండి. ఈనెల 3,4,12,13,14,22,23,31 తేదీలలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
జనవరి మొదటివారం కుటుంబ సభ్యులు మిత్రులతో సరదాగా కాలం గడుపుతారు. ఇంతకు పూర్వం ఉన్న సమస్యలు నెమ్మదిగా దూరం కావటం మొదలవుతుంది. కోరుకున్నది లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. రెండవ వారంలో కార్యభారం తగ్గటం వల్ల విశ్రాంతి, సంతోషం లభిస్తాయి. ఇంట్లో సమస్యలు కూడా ఒక దారికి వస్తాయి. ఉద్యోగంలో బదిలీలు, డిపార్టుమెంటు మార్పులు లాంటివి లభించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల విషయానికి సంబంధించిన కొంత చింత బాధిస్తుంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. మూడవ వారంలో పాత సమస్యలు చాలావరకు పరిష్కార దిశగా ముందుకు కదులుతాయి. వారాంతంలో శుభ సమాచారం లభిస్తుంది. అంతేకాక సామాజిక, ధార్మిక విషయాల్లో పాలుపంచుకుంటారు. ఇంట్లో శుబకార్యాల పనులు మొదలుపెడతారు. నాల్గవ వారం, కూడా మూడో వారంలానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల విషయమై శుభవార్తలు వింటారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. కొత్త వ్యక్తులతో స్నేహం మొదలవుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెల్లతో వాద వివాదాలకు దిగవద్దు. 28 నుంచి 31 వరకు ఎన్నో పనులలో ప్రగతి కనిపిస్తుంది. మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయండి. ఈ నెల 5,6,14,15,16,24,25,26 తారీఖులలో ఇబ్బందులుంటాయి జాగ్రత్త.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
కొత్త సంవత్సరం ఉత్సాహంగా మొదలవుతుంది. కొత్త పరిచయస్తులతో సమయం గడుపుతారు. ఈ వారం మంచి సమాచారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ఇబ్బందులు అంతగా ఉండవు. రెండో వారం శుభా శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఇంటి విషయాలు లేదా, దగ్గరి వ్యక్తుల విషయాల గురించి చింత బాధిస్తుంది. తలచిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వారం చివరిలో అన్నీ సర్దుకొని తిరిగి ముందుకు కదులుతాయి. కార్యభారం వల్ల, ఒత్తిడి వల్ల, నీరసం, అలసట కలుగుతాయి. మూడో వారం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు, సావధానంగా ఉండాలి. ట్రాఫిక్‍ రూల్సు అతిక్రమించే ప్రమాదముంది. ఇతరులను ఎక్కువగా నమ్మొద్దు. వారాంతంలో ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాల్గవ వారంలో కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. స్థాన చలనం ఉండొచ్చు. రూల్స్ అతిక్రమించకుండా ఉండాలి. కర్తవ్యాన్ని మరచిపోకూడదు. చివరి వారంలో విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి మంచి సమాచారం లభిస్తుంది. ఈ నెల 7,8,9,17,18,19,26,27,28 రోజులలో ఆచితూచి అడుగేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త సంవత్సర ఆరంభం అనుకూలంగానే ఉంటుంది. మొదటి రోజునే వీరు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త పనుల సాధన కోసం ఉత్సాహంతో ప్రణాళికలు వేస్తారు. మీ బలహీనతల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోదు. కానీ, కోరుకున్న సహాయం లభించే అవకాశం ఉంది. రెండవ వారంలో ఇతర విషయాలలో అనుకూలతలు ఉన్నప్పటికీ ఇంటి సమస్యలు బాధపెడతాయి. అవసరం లేని వాదులాటల వల్ల ఇబ్బందులు వస్తాయి. నోటి మాట మీద అదుపు అవసరం. ఉద్యోగం కోరుకునే వారికి మంచి వార్త వినవస్తుంది. పోటీ పరీక్షలలో రాణిస్తారు. మూడవ వారంలో, కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఇంటిగొడవలను పట్టించుకోకుండా వదిలేయకండి. జాగ్రత్తగా వ్యవహరించి పరిష్కరించండి. వాద వివాదాలకు దూరంగా ఉండి మంచి సమయం కోసం ఎదురు చూడాలి. ఆహారం, సరిగా తీసుకోవాలి లేకుంటే ఆరోగ్యం కుంటుపడుతుంది. నాల్గవ వారంలో ఉద్యోగస్తుల పనిభారం పెరుతుంది. సహోద్యోగులు లేదా ఉన్నతాధికారులతో మాట తేడా వస్తుంది. అందుచేత, జాగ్రత్తగా వ్యవహరించాలి. నెలలో చివరి రోజులలో కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. పనులలో అనుకోని అవరోధాలు చింతన కలిగిస్తాయి. ఈనెల 1,2,9,10,11,19,20,21,30 అంత అనుకూలంగా ఉండవు. విష్ణు సహస్ర నామ పారాయణ ఉత్తమం.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ జనవరి మొదటి వారం మీకు మంచి బహుమతులను మోసుకువస్తుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న
శుభ సమాచారం వస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థుల చదువుకు ఆటంకముండదు. రెండవ వారం కూడా చక్కగా నడుస్తుంది. కానీ, సంతానానికి సంబంధించిన చింత ఒకటి బాధిస్తుంది. విద్యార్థులు ఇతర విషయాలపై ధ్యాస పెట్టడం వల్ల చదువు కుంటుపడుతుంది. ఉద్యోగస్తులకు తమ సహచరుల, అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. మూడవ వారంలో, ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
కోర్టు వ్యవహారాలతో అనుకూలత పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు చాలా అనుకూలం. నాల్గవ వారం మధ్యమ ఫలితాలు ఉంటాయి. మొదట్లో కంటే వారాంతంలో బావుంటుంది. మొదట్లో కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టినా వారం చివర్లో సర్దుకుంటాయి. సహచరులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. చివరి వారం కూడా అనుకూలంగా, సంతోషంగా గడుస్తుంది. 3,4,12,13,14,22,23,31 తేదీలలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీరాముని పూజించండి.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
ఈ నెల మంచి వార్తలతో ఆనందంగా మొదలవుతుంది. కోరుకున్నది పొందటం వల్ల ఆనందిస్తారు. కొత్త సంవత్సరంలో స్నేహితులతో, హితులతో కలసి పార్టీలలో పాల్గొంటారు. బలహీనతలపై అదుపు వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు బాగా నడుస్తాయి. రెండో వారం బావుంటుంది. వాద వివాదాలలో చిక్కుకోవడం వల్ల చికాకులు పెరుగుతాయి. ఇంట్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. గుండె మరియు ఊపిరి తిత్తుల రోగాలతో బాధపడేవారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవ వారంలో ఇంతకు ముందు కంటే బాగుంటుంది. మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే కాలం. వ్యాపారస్థులకు వేగం మంచిది కాదు. విద్యార్థులు కష్టపడి చదవాలి. నాల్గవ వారం సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. విద్యార్థులకు, ఏకాగ్రత నిలుపుకోవటం కష్టం అవుతుంది. చదువు వదలి ఇతర విషయాలపై శ్రద్ధ పెడతారు. చివరి వారం మధ్యమంగా ఉంటుంది. సంతానం విషయంలో కొన్ని చికాకులు తలెత్తుతాయి. 5,6,14,15,16,24,25,26 తేదీలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గణపతి పూజ చేయాలి.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఈ సంవత్సరం అదృష్టంతో పాటు ఉత్సాహాన్ని కూడా మీకు అందిస్తుంది. మొదటి వారంలో పనులలో కోరుకున్న ప్రగతి లభిస్తుంది. వారం మొదట్లో దేవాలయ సందర్శనం చేస్తారు. వృత్తి ఉద్యోగాలకు అనుకూలం. రెండవ వారం అనుకూల ఫలితాలు లభిస్తాయి. మిత్రులను కలుస్తారు. వారితో కలిసి పార్టీలు చేసుకుంటారు. గొప్ప పనులు చేయాలన్న ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. మంచి పుస్తకాలు చదువుతారు. ధార్మిక చింతన పెరుగుతుంది. మూడవ వారం సామాన్యంగా గడుస్తుంది. వృత్తి ఉద్యోగలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అవసరం. ఇంతరులతో వ్యవహరించేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. నాల్గవ వారం సమస్యలు అదుపులో ఉంటాయి. సంతానం గురించిన శుభవార్తలు వింటారు. కొత్త మనుష్యులతో మిత్రత్వం, సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారులతో వాదన పెట్టుకోకండి. వారి కోపానికి గురయ్యే అవకాశం ఉంది. చివరి వారంలో అనుకోని సమస్యలు ఆకస్మికంగా వచ్చి పడతాయి. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. 7,8,9,17,18,26,27,28 తారీఖులలో జాగ్రత్తగా ఉండండి. చంద్రశేఖరాష్టకం పారాయణ చేయండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
జనవరి మొదటి వారం కొంత అనుకూలతతో పాటు కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. చికాకు పెరుగుతుంది. మాట తూలడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆచార వ్యవహారలలో సావధానత అవసరం. రెండవ వారం అనుకూలంగా ఉంటుంది. దూరం నుంచి శుభ సమాచారం అందుతుంది. భార్య లేదా భర్తకు సంబంధించిన విషయాలలో చింత ఉంటుంది. బలహీనతలు అదుపులో వుంటాయి. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. మూడవ వారం అన్ని విధాల అనుకూలం. అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత పదవిగాని, ఉద్యోగంలో మంచి స్థితిగాని లభిస్తుంది. వ్యాపారస్థులకు అనుకూలం. నాల్గవ వారం ఎంతో అనుకూల సమయం. బుద్ధి చతురతలో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు. ఉద్యోగస్థులకు అధికారు మెప్పు, మన్నన లభిస్తాయి. వ్యాపారస్థులకు ప్రభుత్వ నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. చివరి వారంలో కూడా అన్ని విధాల మేలు జరుగుతుంది. అందరి సహకారం పొందగలుగుతారు. 1,2,9,10,11,18,20,21,30 తారీఖులలో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోండి.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ సంవత్సరం అనుకూలమే అయినప్పటికీ మొదటివారం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వారాంతం నుండి బావుంటుంది. మంచి వార్తలు వింటారు. మిత్రులను కలుసుకుంటారు. వారి సహాయం, సహకారం లభిస్తాయి. వారాంతంలో పార్టీలు జరుగుతాయి. రెండవ వారం వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. కొన్ని బాధలు వాటికి తోడు మనస్సు చెంచలంగా ఉండటం వల్ల వాద వివాదాలు చోటు చేసుకుంటాయి. భార్య లేదా భర్త చెప్పే మాటలను పట్టించుకోవాలి. లేదంటే చిన్న చిన్న విషయాలు చిలికి చిలికి పెద్దదవవుతాయి. మూడవ వారం మొదట్లో ఆరోగ్యం కొద్దిగా బావుండదు, కానీ తొందరగానే కోలుకుంటారు. దైవానుకూలత వల్ల కోరుకున్నది దక్కుతుంది. ఈ వారమంతా డబ్బు వ్యవహారాలు వాటి లెక్కలు చూసుకోవడం జరుగుతుంది. నాల్గవ వారం వాహనాలు నడపటంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతానానికి సంబంధించిన కొన్ని విషయాలు చింతకు కారణమవుతాయి. ఐదవ వారం మొదట్లో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ చివర్లో అనుకూలత పెరుగుతుంది. 3,4,12,13,14, 22,23,31 తేదీలు జాగ్రత్తగా వ్యవహరించండి. దత్తాత్రేయ ఉపాసన చేయండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
జనవరి సామాన్య అనుకూలతతో మొదలవుతుంది. ఆరోగ్యం తగ్గుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సరం కొత్త ప్రణాళికలు వేయడం, వాటి గురించి ఆలోచించటం మొదలైన విషయాల మీద దృష్టి నిలుస్తుంది. మొదటివారం కంటే రెండవ వారం ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనులలో అనుకున్నంత ప్రగతి ఉండదు. ఉద్యోగస్థులకు మార్పులుంటాయి. ఖర్చులు ఎక్కువ. అవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు అవుతుంది. మూడవ వారం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగస్థులకు అనుకూలత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఇతరుల సహకారం లభిస్తుంది. పనులు పూర్తవుతాయి. నాల్గవ వారం పూర్వం ఆగిన పనులు తిరిగి ముందుకు కదులుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రక రకాల ప్రణాళికలు వేసుకోవటానికి అనుకూల సమయం. చివరి వారం అనుకూలంగా ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులుంటాయి. 5,6,14,15,16,24,25,26 తేదీలలో ఇబ్బందులుంటాయి జాగ్రత్త. కాలభైరవాష్టకం పారాయణ చేయండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
జనవరి మొదటి వారం మంచి శకునాలతో మొదలవుతుంది. కొత్త సంవత్సరానికి మిత్రులు, సన్నిహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ స్వాగతం చెప్తారు. మంచి వార్తలు వింటారు. ప్రభుత్వ నిర్ణయాలు మీకు యోగిస్తాయి. పెద్ద పనులు ముందుకు వెళ్లటానికి మార్గం దొరుకుతుంది. రెండవ వారం మొదట్లో రెండు రోజులు ఇబ్బందులు ఏర్పడినప్పటికీ తరువాత బావుంటుంది. కోరుకున్నది లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్థులకు అనుకూల కాలం. మూడవ వారం బావుంటుంది. కానీ, వారంతంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు చేయటానికి ఏర్పాట్లు మొదలు పెడతారు. నాల్గవ వారం మధ్యమంగా ఉంటుంది. మీలో ఉత్సాహం నిండుగా ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం వల్ల కోరుకున్న ప్రగతి లభించదు, మనస్సు చికాకుగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చులు పెరుగుతాయి. డ్రైవింగ్‍ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చివరి నాలుగు రోజులు కూడా సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. బదిలీలు కోరుకున్న చోటకి రావచ్చు. 7,8,9,17,18,19,26,27,28 తేదీలలో చిక్కులు ఎక్కువ, జాగ్రత్త. గణపతి పూజ చేయండి.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
జనవరి మొదటివారం శుభారంభమే. అన్ని వైపులా అనుకూలత ఉంటుంది. అధికారుల, సహోద్యోగుల సహకారం మన్నన లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. రెండవ వారం శుభా శుభ మిశ్రమంగా ఉంటుంది. వారం మొదట్లో కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెరడుతుంది. చివర్లో తిరిగి మెరుగుపడుతుంది. కార్యభారం ఎక్కువున్నప్పటికీ పనులలో పురోగతి ఉంటుంది. కొన్ని పనులలో అడ్డంకులు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా ఓపిక పట్టాలి. మూడవ వారం పై వారం కంటే బావుంటుంది. చిరకాలంగా ఎదురు చూస్తున్న పనులు నెరవేరుతాయి. ఇంట్లో శుభకార్యాల సందడి మొదలవుతుంది. సంతానం గురించిన మంచి వార్తలు మనస్సుకు ఆనందానిస్తాయి. ఆదాయంలో పెరుగుదల వుంటుంది. నాల్గవ వారం పూర్వంలో ఉన్న ఇబ్బందులు తొలిగి పనులలో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగస్థులకు విలువ పెరుగుతుంది. చివరి వారం పనులలో ప్రగతి ఉంటుంది. మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. 1,2,9,10,11,19,20,21,29,30 తేదీలలో జాగ్రత్తగా వ్యవహరించండి. శివుని పూజ చేయండి.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top