రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
ఈ నెల మొదటి సగభాగం చాలా బావుంటుంది. డబ్బుతో ముడిపడ్డ పనులు, సరైన ప్రణాళిక, పెద్దల సలహాలు వినకుండా చేయరాదు. ఉద్యోగస్థులకు ప్రమోషన్‍ రావచ్చు. ఉన్నత పదవులు వున్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆగిన పనులు పూర్తి చేయటానికి వ్యక్తుల అవసరం పడుతుంది. వ్యాపారస్థులకు కూడా ఈ నెల బావుంటుంది. 1-7 ఈ మొదటి వారంలో గొప్ప వ్యక్తులతో కలిసి చేయాలనుకున్న పనులకు ప్రణాళికలు రచిస్తారు. డబ్బు విషయాలలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. యాత్రలు, అతి తిరుగుడు వల్ల పనులలో విజయం ఆలస్యం అవుతుంది. ఇంట్లోని పెద్దల సహకారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. వారం మొదట్లో ఖర్చులు ఎక్కువవుతాయి. 8-14 రెండవ వారంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. చేయవలసిన పనులపై మనస్సు నిలవదు. అనుకోకుండా ధ•నహాని కనిపిస్తోంది. విద్వాంసులతో పరిచయం ఏర్పడుతుంది. తండ్రిగారి ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చులపై నియంత్రణ అవసరం. 15-21 వ్యాపారస్థులకు కలిసివచ్చే కాలం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. కోర్టు వ్యవహారంలో జయం లభిస్తుంది. వారం చివర్లో ఆదాయం తగ్గే సూచనలు వున్నాయి. 22-31 ఈ చివరి వారంలో అనుకున్నది సాధించడానికి విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. ఏకాగ్రత తగ్గుతుంది. మీ నాయకత్వంలో పనులు చక్కగా పూర్తవుతాయి. కానీ, క్రోధావేశాలకు లోనుకావటం మంచిదికాదు. భౌతిక సుఖాలు లభిస్తాయి. ఈ మాసంలో హనుమత్‍ ఆరాధన శుభాలను చేకూరుస్తుంది. శుభదినాలు: 9,10,14,15,17,18 అశుభ దినాలు: 1,2,3,11,12,20,21,28,29,30.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఈ నెల మొదటినుంచీ పాత ఆరోగ్య సమస్యలు తగ్గటం మొదలవుతాయి. ప్రభుత్వం పన్నుల వ్యవహారంలో ఆలస్యం చేయరాదు. అకస్మాత్తు దుర్ఘటనలకు అవకాశం వుండచ్చు. కొత్త ప్రేమలు చిగురించవచ్చు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఆదాయాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. 1-7 ఈ వారంలో, ప్రభుత్వపరంగా ఖర్చులు ఎక్కువవుతాయి. సంతానానికి సంబంధించిన చింత వుంటుంది. సరదాల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. అహంకారం, అవిశ్వాసం పెరిగి, ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. 8-14 రెండవవారం రియల్‍ ఎస్టేట్‍ వ్యవహారాలు చూసేవాళ్ళకి మంచి అవకాశాలు లాభిస్తాయి. భార్య లేదా భర్త ఆరోగ్యం సరిగా చూసుకోవటం, వారం మధ్యలో జీవిత భాగస్వామితో మాట తేడాగానీ, వారికి దూరంగా వుండటం గానీ జరుగుతుంది. తమ్ముడు, చెల్లెలు వరస వారిని కలిసే అవకాశం వుంది. అత్తమామల వల్ల లాభం వచ్చే సూచనలు వున్నాయి. 15-21 మూడవవారం పని భారం పెరుగుతుంది. డబ్బు పరంగా బావుంటుంది. వారం మధ్యలో కొత్త పనులు మొదలు పెట్టడానికి మంచి సమయం. ఆ పనులు బహుశ స్థిరాస్థికి సంబంధించినవి కావచ్చు. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువవుతాయి. తల్లిగారితో చక్కటి సమయం గడుపుతారు. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. 22-31 చివరి వారం మొదట్లో మానసిక చింత ఎక్కువవుతుంది. వ్యాపారస్థులు పెద్ద పెద్ద పనులలో, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. లేకుంటే ధనహాని తప్పదు. ఉద్యోగంలో చేసే పనులు నిదానంగా నడుస్తాయి. ధర్మకార్యాలు, దైవ కార్యాలయాలందు ఆసక్తి పెరుగుతుంది. ఈ నెల దుర్గా అమ్మవారి పూజ చేసుకోవాలి. అనుకూల దినాలు: 11,12,16,17,19,20,21 అశుభదినాలు: 3,4,5,14,22,23,31.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
నెల మొదటి నుంచీ లాభాపేక్ష ఎక్కువగా ఉంటుంది. ప్రేమికులకు సరదాలు అంతగా తీరవు. మనస్సు చెంచలంగా వుంటుంది. దూరపు ప్రాంతాలనుంచి, విదేశాల నుంచి డబ్బు అందే అవకాశాలున్నాయి. కుటుంబంలో గొడవలు మూలంగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. భూములు, భవనాలు కొనుగోలు, అమ్మకాలు మంచి లాభం చేతికందుతుంది. 1 నుంచి 7, ఈ మొదటి వారంలో వ్యాపార ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు. భాగస్వామ్యంలో వున్నవారు జాగ్రత్తగా వుండవలసిన సమయం. ఉద్యోగంలో తీరిక లేని పనులవల్ల, తిరుగుడు వల్ల నీరసం వస్తుంది. సంతానపరంగా ఇబ్బందులు వస్తాయి. అనుకున్నది జరగకపోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. 7-14 ఈ వారంలో తమకింద పనిచేసే సేవకుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆహారం విషయంలో శుచి, శుభ్రత చూసుకోవాలి. పెద్ద నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. విద్యార్థులకు కూడా అనుకూల సమయం. ప్రభుత్వ పనులు చక్కగానే పూర్తవుతాయి. 15-21 ఈ మూడవ వారంలో, భూసంబంధ విష•యాలలో లాభం వస్తుంది. కుటుంబ విషయాలలో అభిప్రాయ భేదాలుంటాయి. పాత ఆస్థుల గురించిన చర్చ చేయకుండా వుండటం మంచిది. ఆదాయం తక్కువ వుంటుంది. కష్టపడ్డ తర్వాత మంచి పనులు పూర్తవుతాయి. ఖర్చులమీద అదుపు వుంచుకోవాలి. వ్యాపార పరంగా దూరపు ప్రయాణాలు చేయవలసి వుంటుంది. 21-30 చివరి వారం ఉద్యోగంలో పరిస్థితులు బావుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఇంతకుముందున్న అడ్డుగోడలు తొలగుతాయి. కుటుంబంతో కలిసి విదేశీ యాత్రలు చేస్తారు. ఈ నెల మసాలాతో కూడిన ఆహారానికి, ఆల్కహాల్‍కు సాధ్యమైనంత దూరంగా వుండటం మంచిది. శివపూజ చేసుకోవటం మంచిది.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ నెలలో ఉద్యోగ మార్పులకు, వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలిస్తుంది. వ్యాపార సమావేశాలలో ప్రసంగం చేస్తారు. సామాజిక కార్యకలాపాలలో పాలు పంచుకుంటారు. కుటుంబం, డబ్బు వ్యవహారాలలో అపనమ్మకం తగ్గించుకోవాలి. నెల మధ్యలో విద్యార్థులకు అనుకూలం. 1 నుంచి 7 వారం మొదట్లో డబ్బు ఇబ్బందులు వుంటాయి. కాస్మోటిక్స్ వ్యాపారం చేసేవాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. ఆదాయం – ఖర్చు రెండు సమానంగా వుంటాయి. విద్యార్థులు కష్టపడి చదవాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. 8-14 రెండవవారం మొదట్లో ఉత్సాహం ఎక్కువగా వుంటుంది. పనులు మొదలు పెడతారుగానీ, మధ్యలో వదిలేస్తారు. ఇచ్చిన బాకీలు వసూలవుతాయి. వాహనాలు, మెషీన్లు వాడేటప్పుడు జాగ్రత్త అవసరం. దెబ్బలు తగిలే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. 15-21 మూడవవారం వ్యాపారస్థులకు మొదట్లో అంత అనుకూలం కాదు. ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం పొందలేరు. పనిభారం ఎక్కువై కుటుంబంపై దృష్టి పెట్టలేరు. ప్రభుత్వ చట్టాలవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వారం చివరి రెండు రోజులు ఆరోగ్యం జాగ్రత్త. 22-31 చివరి వారం వ్యాపారంలో ఇబ్బందులు కొనసాగుతాయి. ప్రతి పనిలోనూ అధిక శ్రమ, ఆలస్యం వుంటాయి. కష్టానికి తగ్గ ఫలితం చాలా రోజుల తరువాతగానీ లభించదు. ధార్మిక విషయాల పట్ల జీవిత తత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి పూజ చేసుకోవాలి. శుభదినాలు: 15,16,20,21,24,25.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ నెల మొదటి 15 రోజులలో మిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో ప్రగతి కనిపిస్తుంది. సేవకులు చక్కగా వుంటారు. అనుకోని సంఘటనలు కొన్ని మనస్సును ఇబ్బంది పెడతాయి. ఉదరం, కళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు బాధపెట్టవచ్చు. తల్లితో కొన్ని విషయాలపై అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. 1-7 వారంలో విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది. ఇతర విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. వారం మొదట్లో మంచి లాభం కలుగుతుంది. వ్యాపార ప్రత్యర్థులతో జాగ్రత్త చేసే పనులలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పాతరోగాలు మళ్ళీ ఇబ్బంది పెడ్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. 8-14 రెండవ వారంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కావాల్సిన డబ్బు చేతికందుతుంది. కుటుంబానికి సంబంధించిన పెద్ద పని ఒకటి పూర్తవుతుంది. గొప్పవారి పరిచయం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. 15-21 ఈ వారంలో, ఉద్యోగస్థులకు పనిలో గొడవలు ఏర్పడవచ్చు, జాగ్రత్త. స్థలం మార్పు కనిపిస్తోంది. ఉద్యోగ మార్పు కూడా. ప్రత్యర్థులు మీ గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీద్దామని ప్రయత్నిస్తారు. ఉన్నతాధికారులతో అభిప్రాయభేదాలు వుంటాయి. వారం మధ్యలో, ప్రేమించే వ్యక్తులతో చక్కగా వుండాలి. 22-31 చివరి వారంలో దాంపత్య జీవితంలోను, భాగస్వామ్య వ్యాపారంలోను జాగ్రత్తగా వుండాలి. భాగస్వాములతో వాదవివాదాలు ఏర్పడే ప్రమాదముంది. దానివల్ల మనశ్శాంతి దూరమై ఆరోగ్యం తగ్గవచ్చు. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన చెందుతారు. వ్యక్తులు, ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ఈ నెల ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శుభదినాలు: 17,18,22,23,26,27 అశుభదినాలు: 1,2,3,11,12,13,20,21,29,30.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
ఈ నెలారంభంలో అనుకోని బాధలు చుట్టుముడతాయి. కాని తెలివితేటలతో వాటి నుంచి బయటపడతారు. డబ్బు అధికంగా ఖర్చు అవటం గురించిన చింత వుంటుంది. ధార్మిక యాత్ర చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత నిలవదు. దంపతుల మధ్య అనుకోని యిబ్బందులు వచ్చి పడతాయి. సంతానపరంగా మంచి వార్తలు వింటారు. 1-7 ఈ వారం ఆరంభంలో దాచుకున్న డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకోవటం కష్టం అవుతుంది. ప్రేమ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. ఇబ్బంది పడ్తారు. వారం మధ్యలో ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపారులకు, పూర్వం చేసిన అమ్మకాలపై ఇప్పుడు లాభం లభించటం మొదలవుతుంది. 8-14 ఈ వారంలో ఊగిసలాడే మనస్సు, పనులలో ఇబ్బందులు వున్నప్పటికీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. బహుమతులు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ పరిస్థితులు హాయిగా ఉంటాయి. 15-21 మూడవవారం ప్రత్యర్థులను, శత్రువులను బలహీనులని భావించకండి. వాద, వివాదాలు పెరిగి కోర్టుకు ఎక్కాల్సిన అవసరం రాకుండా చూసుకోండి. భార్య/భర్త ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వ్యాపారస్థులు కొత్త ఆదాయ మార్గాలు వెతుకుతారు. ధనం లాభిస్తుంది. పోటీ పరీక్షలు వ్రాసే విద్యార్థులు గట్టిగా చదివితే గానీ గట్టెక్కే అవకాశం తక్కువ. 22-31 ఈ చివరి వారంలో ఆలోచన, అభిప్రాయ భేదాలు రెండూ ఎక్కువవుతాయి. పెరుగుతున్న ఖర్చు వల్ల ఇబ్బంది పడ్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగంలో మార్పుగానీ, స్థల మార్పుగానీ కనిపిస్తున్నాయి. ఆగిన పనులు పూర్తి చేయటానికి గట్టిగా ప్రయత్నిస్తారు. విధిని నమ్ముకుని కూర్చోవటం మంచిది కాదు. విఘ్నేశ్వరుని, కుమారస్వామిని ఆరాధించండి. శుభదినాలు: 1,2,19,20,21,24,25,28,29,30 అశుభదినాలు: 4,5,13,14,15,22,23,31.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
మాసారంభంలో వ్యవహారం, వ్యక్తిత్వం సరళంగా వుంచుకుంటే, మేలు జరుగుతుంది. ధనార్జనలో ఆటంకాలుంటాయి. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉత్సాహంగా వుంటుంది. వ్యాపారులు సరైన పద్ధతిలో ముందుకు వెళ్ళి లాభాలు గడిస్తారు. నెల మధ్యలో ప్రేమ వ్యవహారాలకు అనుకూలం.
ఉద్యోగస్థులకు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 1-7 మొదటివారంలో ప్రేమ వ్యవహరాలలో ముందుకు సాగుతారు. అవివాహితులకు వివాహ అవకాశాలున్నాయి. పెళ్ళి సంబంధం కుదిరే అవకాశముంది. శారీరక శ్రమ చేసేవారు పనులలో జాగ్రత్తగా వుండాలి. వారం మధ్యలో ఇంటిలో
శుభకార్యాలు జరగటం కానీ, ధార్మిక విషయాలు చర్చకు రావటం గానీ జరుగుతాయి. పనుల ఒత్తిడి వల్ల కుటుంబ విషయాలు పట్టించుకోవటం జరగదు. 8-4 ఈ వారం మొదట్లో ఆత్మీయులతో పొరపొచ్చాలు వచ్చే అవకాశముంది. కానీ, వారం చివర్లో సర్దుకుంటాయి. వారం చివర్లో వాహనాలు, స్థిరాస్థులు కొనుక్కోవచ్చు. ఉద్యోగ మార్పు / వ్యాపారాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. వారం చివర్లో దెబ్బలు తినకుండా చూసుకోండి. 15-21 మూడవ వారం ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. డబ్బు కటకటగా వుంటుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపరు. చేసే పనులలో ఇతరుల సహాయం తక్కువ లభిస్తుంది. కొత్త ప్రయోగాలకు మంచి సమయం కాదు. ఆరోగ్యం ఇబ్బంది పెడ్తుంది. చింత ఎక్కువవుతుంది. 22-31 ఈ వారంలో కమ్యూనికేషన్‍ వ్యవస్థలో పనిచేసేవారు జాగ్రత్తగా వుండాలి. వినయంతో పని చేయాలి. సరదాలు మీద ఇష్టం పెరుగుతుంది. అనైతిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. ఈ నెలలో హనుమత్‍ ఆరాధన చేయండి. శుభదినాలు: 3,4,5,22,23,24,26,27,28,31 అశుభదినాలు: 6,7,8,15,16,17,24,25.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
ఈ మాసారంభంలో కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చ, ప్రస్తావన వస్తాయి. డబ్బు, పరపతి ఉపయోగించిన తరువాతే పనులు అవుతాయి. మంచి ఆలోచనలు పెరుగుతాయి. ఉద్యోగస్థులు చేసే పనిమీద మనస్సు నిలపలేరు. నెలంతా మనస్సు పరిపరివిధాల పోతూ వుంటుంది. ఒక విషయం నెలంతా ఇబ్బంది పెడుతుంది. కానీ, దానికి గల కారణాలు తెలుసుకోలేకపోతారు. 1-7 మొదటి వారంలో సాహస కార్యాలకు అనుకూలం కాదు. వారం మొదట్లో వాహనాలు, మెషీన్లు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆస్థులకు సంబంధించిన వివాదాలలో చిక్కుకోవద్దు. వారం మధ్యలో శుభవార్త వింటారు. వ్యాపారం బావుంటుంది. కొత్త శక్తి, కొత్త ఆలోచనలు ఉత్సాహాన్ని నింపుతాయి. 8-14 ఈ వారంలో పాత ఆగిపోయిన పనులను తిరిగి మొదలుపెట్టవద్దు. వ్యాపారపరంగా చిన్న యాత్రలు చేస్తారు. కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. స్నేహితుల వల్ల కూడా లాభం కలుగుతోంది. ప్రేమికులు ఆనందంగా కాలం గడుపుతారు. మాట చేత తర్కం చేత ఎదుటివారి మనస్సు గెలుచుకుని పనులు పూర్తి చేసుకుంటారు. 15-21 ఈ వారంలో కుటుంబ సమస్యలు అశాంతికి గురిచేస్తాయి. ఉద్యోగ పనులు వల్ల ఇంటికి దూరంగా వుంటారు. తప్పనిసరై మామూలు వస్తువులను అధిక ధరకు కొనాల్సి వస్తుంది. అన్నదమ్ములతో సరిగా వుండాలి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అనుకూలం. ఆకస్మిక ధనప్రాప్తి వుంటుంది. 22-31 ఆఖరివారంలో ఉద్యోగస్థులు ప్రణాళిక ప్రకారం పని చేస్తే గానీ సమయానికి పనులు పూర్తవ్వవు. పై వారి సహాయం లభిస్తుంది. పని ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులకు తగిన సమయం కేటాయించలేకపోతారు. శనివారం పూట వెంకటేశ్వరుని దర్శించి అనుగ్రహం పొందండి. శుభదినాలు: 1,2,3,6,7,8,24,28,29,30 అశుభదినాలు: 9,10,17,18,19,26,27.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసారంభంలో వ్యాపారస్థుల మనస్సులో రకరకాల ఆలోచనలు సాగుతాయి. పనులమీద అవసరాని••ంటే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. అనేక పనులను ఒకేసారి మొదలు పెట్టడం సరికాదు. కొన్నిసార్లు అసలు పనులంటేనే చికాకు వేస్తుంది. ఉద్యోగస్థులు చేసే పనులు పూర్తికాకపోవటంతో ఆందోళన పడ్తారు. వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం కష్టంగానే వుంటుంది. 1-7 ఈ వారం మొదట్లో సంతానానికి సంబంధించిన కష్టం వుంటుంది. కుటుంబానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన కాలం. స్నేహితుల నుంచి కావాల్సిన సహాయం అందదు. ఆరోగ్యం కూడా తక్కువగా ఉంటుంది. విద్యార్థులు చదువు కంటే ఇతర విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడ్తారు. అందరికీ పనికి వచ్చే పనులలో తిరుగుతూ వుండడం వల్ల కుటుంబ విషయాలకు దూరం అవుతారు. 8-14 రెండవ వారం సమయం ప్రతికూలంగా వుండడం వల్ల ఏ పని చేసినా లాభం తక్కువగానే ఉంటుంది. రావల్సిన బాకీ సొమ్ము బాగా కష్టపడితే తిరిగి వస్తుంది. తెలివితేటల్ని ఉపయోగించి నిదానంగా అడుగులు ముందుకు వేస్తారు. ఉద్యోగస్థులకు అంత బావుండదు. దగ్గరివాళ్ళే మోసం చేస్తారు, జాగ్రత్త. 15-21 ఈ వారంలో ఎప్పటినుంచో చేయాలనుకున్న పెద్ద పని ఒకటి పూర్తి చేయగలుగుతారు. అందరి దృష్టీ మీమీదే వుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల కోసం సమయం వెచ్చించాల్సి వుంటుంది. ప్రేమ విషయాలవైపు మనసు మళ్ళుతుంది. చాలా పెద్ద బాధ్యత మీమీద పడే అవకాశముంది. సంతానం వల్ల సుఖం, సహకారం తక్కువే ఉంటాయి. 22-31 ఆఖరివారం మంచి ఫలితాలు పొందటం కోసం కుటుంబంతో కలిసి ప్రణాళికలు వేస్తారు. వారం మొదట్లో పనులు నిదానంగా సాగినప్పటికీ ఫలితం తప్పక లాభిస్తుంది. సంతానంతో అభిప్రాయ భేదాలు వస్తాయి. చేసే పనిలో పురోగతి కనిపిస్తుంది. ఈ నెల గణపతి పూజ చేయండి. శుభదినాలు : 4,5,9,10,26,27,31 అశుభ దినాలు: 1,2,11,12,13,19,20,21,29,30.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
ఈ నెల వ్యాపారస్థుల ఆదాయంలో హెచ్చుతగ్గులుంటాయి. డబ్బు ఇచ్చిపుచ్చుకోవటాల వ్యవహారంలో జాగ్రత్తగా వుండాలి. ఉద్యోగస్థులు కుటుంబానికి దూరంగా వుండవలసి వస్తుంది. ఉన్నతాధికారుల ద్వారా పనిలో సహకారం లభిస్తుంది. కొనుగోలు, అమ్మకాలకు అనుకూల సమయం. ఉద్యోగార్థులకు మొదటి ఉద్యోగం దొరుకుతుంది. 1-7 ఈ వారంలో ప్రేమ వ్యవహారాలు అనుకూలం. ఊపిరితిత్తులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. దగ్గు ఇబ్బంది పెట్టవచ్చు. తల్లితో అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోవాలి. వారం మధ్యనుంచి ఏదో ఒక విషయం మనశ్శాంతిని దూరం చేస్తుంది. 8-14 ఈ వారం మానసిక ఆందోళన ఎక్కువ. ఇప్పటిదాకా వున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్థులకు, వ్యాపారస్థులకు అనుకూల సమయం. మంచి ఆలోచనలు పెంచుకోవాలి. సమయానికి పనులు పూర్తి చేయటానికి గట్టిగా ప్రయత్నించవలసిన అవసరం వుంది. వ్యాపారంలో కొత్త మార్పులు చేయాలన్న ఆలోచన పక్కన పెట్టడం మంచిది. 15-21 ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. కొంతమంది సమస్యలు మీకు సహాయపడటానికి ముందుకు వస్తారు. వారం మొదట్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అకస్మాత్తుగా కొన్ని సమస్యలు ముంచుకు వస్తాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాల వల్ల వ్యక్తుల మధ్య దూరం పెరుగుతుంది. వారం మధ్య నుంచి మానసికంగా, ప్రశాంతంగా వుండదు. 22-31 చివరి వారంలో స్థలం మార్పు గట్టిగా కనిపిస్తోంది. వ్యాపారస్థులకు కొత్త ఆదాయం ఏర్పడుతుంది. భూమికి సంబంధించిన విషయాలు అనుకూలంగా వుంటాయి. పని చేసేచోట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. శివున్ని, హనుమంతున్ని ఈ నెలంతా పూజించండి. శుభదినాలు: 1,2,6,7,8,11,12,28,29,30 అశుభదినాలు: 4,5,14,15,22,23,31.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఈ నెలంతా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్థులకు అనేక మార్గాలనుంచి ఆదాయం లభిస్తుంది. వ్యక్తుల ప్రతిభకు, అనుభవానికి తగిన గుర్తింపు, లాభం లభిస్తాయి. నెల మొదట్లో స్త్రీల ద్వారా మంచి సహాయం లభిస్తుంది. కొంత కష్టపడి ధైర్యం నింపుకుంటే వైవాహిక జీవితంలో గూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. 1-7 అభివృద్ధి పథంలో ముందుకు సాగటానికి ఈ వారం కొత్త అవకాశాలను ఇస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం చేతికి అందుతుంది. ఎప్పటినుంచో తీరని కోరిక ఈ వారం తీరుతుంది. కుటుంబంలో, వృత్తిలో మంచి వాతావరణం ఉంటుంది. కానీ, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ప్రభుత్వ పథకాల వల్ల లాభం కలుగుతోంది. 8-14 ఈ వారంలో, పిల్లలకు చాలా బావుంటుంది. విద్యార్థులు కూడా ఉత్సాహంగా చదువుతారు. దూర ప్రయాణం కనిపిస్తోంది. దానివల్ల అందరూ ఆనందంగా ఉంటారు. భార్య లేదా భర్త సహకరిస్తారు. ఆఫీసు విషయాలకు సంబంధించి ఆలోచనలు మనస్సుకు ఆందోళన కలిగిస్తాయి. 15-21లలో ఆరోగ్య పరంగా చాలా బావుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా పాతబాకీలు వసూలవుతాయి. వస్తువుల కొనుగోలుకు అధిక ఖర్చు చేస్తారు. వైవాహిక జీవితంలో ఆలోచనలోని తేడాలు బయటపడతాయి. వారం మధ్యనుంచి ధనం విషయంలో మంచి వార్తలు వింటారు. 22-31 చివరి వారం బావుంటుంది. పని భారాన్ని ఆఫీసులోనే వదిలేస్తే నిత్యజీవితంలో సుఖపడవచ్చు. సహోద్యోగితో ప్రేమలో పడితే జాగ్రత్త. ఇతరులు ఆట పట్టిస్తారు. వారం మొదట్లో ఆత్మీయుల సణుగుళ్ళను తట్టుకోవలసి వస్తుంది. కాల భైరవాష్టకమ్‍ లేదా దత్తాత్రేయ స్తుతి ఈ నెల చదువుకోవటం మంచిది. శుభదినాలు: 3,4,5,9,10,11,13,14,31 అశుభదినాలు: 6,7,8,16,17,24,25.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఉద్యోగులకు బాధలు తప్పవు. వ్యాపారస్థులకు కోరిన లాభం లభిస్తుంది. తెలివిగా మసలుకోండి. లేకుంటే నష్టం తప్పదు. తెలివితేటలు ఉపయోగించి చేయవలసిన పనులలో జాగ్రత్తగా వుండాలి. గొప్ప గొప్ప ప్రణాళికలు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ పరిశీలన చేసుకోవలసి వస్తుంది. ఈ నెలలో కష్టం ఎక్కువ ఉంటుంది. ప్రతి పని బాగా ప్రయాసపడితేగానీ, ముందుకు సాగదు. 1-7 ఉద్యోగస్థులు అతి జాగ్రత్తగా వుండవలసిన సమయం. డబ్బు వ్యవహారాలలో గూడా జాగ్రత్తగా వుండాలి. చేసే పనులను కష్టపడి చేయాలి. అదృష్టాన్ని నమ్మద్దు. కష్టం ఎక్కువ, లాభం తక్కువ. ఈ వారం ఆత్మవిమర్శ ఎక్కువ చేసుకుంటారు. కావాల్సిన సమయానికి పై అధికారుల సహకారం లభిస్తుంది. 8-14 ఈ వారం మొదట్లో పాత పరిచయాల వల్ల లాభం వచ్చే అవకాశాలున్నాయి. పోటీ పరీక్ష, రాసే విద్యార్థులు సరైన మార్గంలో ముందుకు వెళ్తారు. కొత్త స్నేహాలు మొదలవుతాయి. యాత్రలు సుఖంగా, లాభదాయకంగా ఉంటాయి. ప్రేమికులకు ఇవి మంచి రోజులు. విద్యార్థులు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 15-21 నీటిరోగాలు ఇబ్బంది పెట్టే అవకాశము ఉంది. ఇంటిలోను, వ్యాపారంలోను మార్పు చేయవలసిన అవసరం ఉంది. ఉద్యోగస్థులకు అనుకూల స్థలమార్పు కనిపిస్తోంది. కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టండి. వారం మధ్యలో గొప్ప నిర్ణయాలు తీసుకోవాలన్న ప్రయత్నానికి ఆటంకాలు ఎదురవుతాయి. ధృడసంకల్పంతో ముందుకు నడవాలి. ధైర్యంతోను సంయమనంతోను ముందుకు సాగాలి. 22-31 చివరి వారంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అతిగా ప్రయాసపడటం వల్ల శరీరం అలసిపోతుంది. కష్టపడి పనిచేసి విజయాన్ని సాధించాలని నిర్ణయించుకుంటారు. ఈ నెల శ్రీరామచంద్రున్ని పూజ చేయండి. శుభ దినాలు: 6,7,8,11,12,13,15,16 అశుభ దినాలు: 9,10,18,19,26,27,28.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top