శ్రేష్ఠమైనది జేష్ఠ౦

1, మే మంగళవారం, వైశాఖ బహుళ పాడ్యమి నుంచి – 31, మే గురువారం, జ్యేష్ఠ బహుళ (అధిక) విదియ వరకు..
విలంబి నామ సంవత్సరం – వైశాఖం – జ్యేష్ఠం – గ్రీష్మ రుతువు – ఉత్తరాయన

ఆంగ్లమానం ప్రకారం ఐదవది మే నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం •వైశాఖ – జ్యేష్ఠ మాసాల కలయిక. వైశాఖ మాసంలోని కొన్ని రోజులు, జ్యేష్ఠ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే), రవీంద్రనాథ్‍ ఠాగూర్‍ జయంతి, అల్లూరి సీతారామరాజు వర్ధంతి, శ్రీ హనుమజ్జయంతి, మాతృ దినోత్సవం (మదర్స్ డే), అపర ఏకాదశి, సర్వేశాం ఏకాదశి, పద్మిని ఏకాదశి వంటి పండుగలు, పర్వాలు వచ్చేది మే మాసంలోనే. ఈ నెలలోనే అధిక మాసం కూడా ప్రారంభమవుతుంది. సాధారణంగా జ్యేష్ఠం అంతగా శుభమైనది కాదంటారు. కానీ, ఈ మాసంలోనూ చేయదగిన కొన్ని మంచి వ్రతాలు, పర్వాలు కొన్ని ఉన్నాయి.
ఆంగ్లమానం ప్రకారం వచ్చే మే నెలలో మే 1 మంగళవారం నుంచి మే 15 మంగళవారం వరకు వైశాఖ మాస బహుళ (కృష్ణ పక్ష) పక్ష తిథులు కొనసాగుతాయి. ఆపై జ్యేష్ఠ మాసం ప్రవేశిస్తుంది. వైశాఖ తిథుల్లోనే హనుమజ్జయంతి వస్తుంది. వాసు కర్తరి మే 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మే 11 నుంచి అగ్ని కర్తరి ప్రారంభమవుతుంది. ఇక, మే 15 నుంచి జ్యేష్ఠ మాస తిథులు ప్రారంభమవుతాయి. ఇది అధిక మాసం. మాసాలలో జ్యేష్ఠ మాసం శ్రేష్ఠమైనది. ఇది తెలుగు సంవత్సరాల వరుసలో మూడవది. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. అలాగే శుభ ముహూర్తాల పరంగా కూడా ఈ మాసం అంతగా అనుకూలం కాదని అంటారు. అయితే, ఈ మాసంలో వచ్చే పర్వాలు, వ్రతాలు విశేమైనవి ఉన్నాయి. ప్రధానంగా వట సావిత్రీ వ్రతం, కరవీర వ్రతం, ఏరువాక పున్నమి వంటివి ఈ నెలలో ఉద్ధిష్ట పర్వదినాలు. వీటిలో వట సావిత్రీ వ్రతం మహిళల పాలిట అత్యంత మహిమాన్వితమైనదని పంచాంగకర్తల ఉవాచ. ఇంకా ఈ మాసంలో రంభా వ్రతం, భద్ర చతుష్టయ వ్రతం, ఉమా చతుర్థి వంటి వ్రతాలు ఆచరణీయమై ఉన్నాయి. వైశాఖ, జ్యేష్ఠ మాసాల కలయికగా ఉన్న మే మాసంలో వచ్చే వివిధ తిథులు, పర్వాలు, పండుగలు, వ్రతాల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.

వైశాఖ బహుళ పాడ్యమి మే 1, మంగళవారం
ఈనాడు ‘భూతమాత్రుత్సవ’ అని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ రోజు మొదలు జ్యేష్ఠ పూర్ణిమాంతం వరకు శ్రీప్రాప్తి వ్రతం చేయాలని ఆ గ్రంథంలో రాశారు.

వైశాఖ బహుళ విదియ/ నారద జయంతి
మే 2, బుధవారం
ఈనాడు నారద జయంతి. ఈనాడు వీణాదానము చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. నారదుడు గాన విద్యా కుశలుడు. అతని వీణకు మహతి అని పేరు. ఆ వీణపై సదా విష్ణుగానము చేస్తూ త్రిలోకాలలో సంచరిస్తూ ఉంటాడు నారదుడు. ఒకసారి ఇంద్రసభలో రంభాదుల గానములో ఎవరు గొప్పవారో తేల్చవలసిందిగా ఇంద్రుడు నారదుడిని కోరాడు. అటువంటి నిర్ణయం చేయడానికి నారదుడే సమర్థుడని ఇంద్రుడి అభిప్రాయం. నారదుడు మాత్రం విషయాన్ని అటూ ఇటూ తేల్చకుండా చమత్కారంగా దుర్వాస మునిని తన గాన చమత్కారంతో లోబరుచుకున్న వారే గానవిద్యలో గొప్పవారు అన్నాడు.
నారదుడు గడిచిన కల్పంలో ఉపబర్హణుడు అనే గంధర్వుడుగా ఉండేవాడు. అతను నారాయణ కథలు గానము చేస్తుండే వాడు. తరువాత కల్పంలో అతను బ్రహ్మ మానస పుత్రుడైనాడని ప్రార్థివ కల్ప కథలో ఉంది. ‘నారాయణ.. నారాయణ’ అంటూ ఆయన నిత్యం హరినామాన్ని స్మరిస్తుంటాడట.

వైశాఖ బహుళ ఏకాదశి, మే 11, శుక్రవారం
వైశాఖ బహుళ ఏకాదశిని అపరైకాదశి అని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉంటే పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన ఫలం, పలు రకాల దానఫలం కలుగుతుందని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.

వైశాఖ బహుళ చతుర్దశి, మే 14, సోమవారం
ఈ తిథి నాడు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో స్నానం చేసి, తెల్లని వస్త్రాలు ధరించి, గంధం మొదలైన ఉపచారాలతో, మారేడు దళాలతో శివలింగాల్ని పూజించాలి. ఈనాడు శివరాత్రి, సావిత్రీ వ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు పిండితో శివలింగాన్ని తయారు చేసి పంచామృతాలతో స్నానం చేయించి కుంకుమ పూసి ధూప, దీప నైవేద్యాలతో పూజ చేయాలి. దీనికే లింగ వ్రతమని పేరు.

వైశాఖ బహుళ అమావాస్య, మే 15, మంగళవారం
ఈనాడు కృష్ణ పూజ చేయాలని, ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుని ఉవాచ. ఈనాడు సుజన్మ వాప్తి వ్రతం. సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. కర్షకులు వృషభ సంక్రాంతి నిర్వహిస్తారు. ఈ వైశాఖ బహుళ అమావాస్య గురువారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదం అంటారు. ఈనాడు ప్రయాగలో స్నానం పాపహరమని ప్రతీతి. త్రయోదశి నాడు ఆరంభించి ఈనాటితో సావిత్రీ వ్రతం పూర్తి చేయాలని పురుషార్థ చింతామణి గ్రంథంలో రాశారు. పితృదేవతలను పూజించడం, పార్వణ విధిలో శ్రాద్ధం దానం చేయడం ఈనాడు చేయాల్సిన ప్రధాన విధులు.

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి, మే 16, బుధవారం
ఈనాడు కరవీర వ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే భద్రచతుష్టయ వ్రతం కూడా చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.

జ్యేష్ఠ శుద్ధ తదియ మే 18, శుక్రవారం
జ్యేష్ఠ శుద్ధ తదియ నాటి వివరణలో మన పంచాంగ కర్తలు ‘రంభావ్రతమ్‍’ అని రాశారు. మరికొన్ని వ్రత గ్రంథాలు దీనినే ‘రంభాతృతీయ’ అని పేర్కొన్నాయి. రాజ్యవ్రతం, త్రివిక్రమ తృతీయ వ్రతం తదితర ఇతర వ్రతాలు కూడా ఈనాడు చేస్తారని ఉంది. వీటన్నిటిలో రంభావ్రతమే కొన్నిచోట్ల ఆచరణలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకసారి తపోనిష్టలో ఉన్న శివుడికి సపర్యలు చేసేందుకు హిమవంతుడు తన కుమార్తె పార్వతిని శివుడికి అప్పగించాడు. పార్వతిపై ప్రేమ కలగడానికి మన్మథుడు శివుడిపై తన బాణాలు ప్రయోగించాడు. శివుడికి చిత్తం చెదిరింది. ఆపై కోపంతో తన మూడవ కన్ను తెరిచి చూశాడు. దీంతో మన్మథుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడి నుంచి వెళ్లిపోగా, పార్వతి చిన్నబుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లి ఎదురుగా వచ్చి ఆమెను కౌగిలించుకుంది. పార్వతి బావురుమంది. తల్లి ఓదార్చి ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకెళ్లింది. ఇంతలో అక్కడికి సప్త మహా మునులు వచ్చారు. వారికి హిమవంతుడు తన కుమార్తె సంగతి చెప్పాడు. అప్పుడు ఆ మునులలో భృగువు- ‘బిడ్డా! ఒక వ్రతం ఉంది. దాన్ని ఆచరిస్తే నీకు శివుడే భర్త అవుతాడు’ అన్నాడు. అప్పుడు పార్వతి కోరిక మేరకు ఆ వ్రతాచరణ గురించి భృగువు ఇలా చెప్పాడు.
‘ఈ వ్రతాన్ని పెద్దలు రంభా వ్రతం అంటారు. రంభ అంటే అరటి చెట్టు. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు చేయాలి. ఆనాడు ఉఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి పంచవన్నెల ముగ్గు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కాబట్టి అరటి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించాలని వివరించాడు.
అందు మీదట పార్వతి- ‘మహర్షీ! అరటి చెట్టుకు సావిత్రి అధిష్ఠాన దేవత ఎలా అయ్యింది?’ అని ప్రశ్నించింది.
‘బిడ్డా! అడగదగిన ప్రశ్న వేశావు. సావిత్రి, గాయత్రి అని బ్రహ్మదేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రీదేవి సౌందర్య గర్వం చేత ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్లడం మానేసింది. గాయత్రి ఎంత చెప్పినా ఆమె వినలేదు. బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలి మానవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని ఆయన సావిత్రిని శపించాడు. అప్పుడు సావిత్రి పశ్చాత్తాప పడింది. అయినా బ్రహ్మ కరగలేదు. గత్యంతరం లేక సావిత్రి అరటి చెట్టుగా మారి ఐదేళ్ల పాటు బ్రహ్మ కోసం తపస్సు చేసింది. అప్పటికి బ్రహ్మ మనసు కరిగింది. ‘నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు. అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారికి కోరికలు తీరుతాయి. ఇక నీవు నాతో సత్యలోకానికి వచ్చేయవచ్చు’ అంటూ బ్రహ్మ ఆమెను తనతో తీసుకెళ్లాడు. సావిత్రికి శాప విమోచనం అయిన దినం కాబట్టి జ్యేష్ఠ శుద్ధ తదియ ఒక పర్వదినం అయ్యింది’ అని భృగువు వివరించాడు.
ఈ కథంతా విన్న పార్వతి- ‘మహర్షీ! అయితే ఈ వ్రతం నియమాలేమిటో దయచేసి తెలపండి’ అని కోరింది.
‘ముగ్గులు పెట్టిన అరటి చెట్టు కింద మంటపం వేయాలి. దానిని సరస పదార్థ సంపన్నం చేయాలి. అరటి చెట్ల నీడన పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్తోత్రం చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. మర్నాటి నుంచి రాత్రి జాగరణ అవసరం లేదు. పద్మాసనస్థ అయి పగలు సావిత్రి స్తోత్రం చేస్తూ రాత్రులు అరటి చెట్ల కిందనే విశ్రమిస్తూ ఉండాలి. ఇలా నెల రోజులు చేసి ఆ మీదట సరస పదార్థ సంపన్నమైన ఆ మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని గతంలో లోపాముద్ర చేసి భర్తను పొందింది’ అని భృగు మహర్షి వ్రత నియమాల గురించి వివరించాడు.
పార్వతి ఈ విధంగా రంభా వ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దీక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్లాడాడు. ఇదీ రంభా వ్రతకథ.

జ్యేష్ఠ శుద్ధ చవితి, మే 18, శుక్రవారం
జ్యేష్ఠ శుద్ధ తదియ గడియల్లోనూ చవితి తిథి కూడా ప్రవేశిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ చవితి తిథి నాడు ఉమా చతుర్థీ వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం చెబుతోంది. అలాగే, ఈనాడు ఉమా పూజ చేయాలని కూడా అంటారు. ఇంకా ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథి గణేశ చతుర్థి అని, శుక్లాదేవి పూజ చేయాలని కూడా ఉంది.

జ్యేష్ఠ శుద్ధ పంచమి/ శంకర జయంతి, మే 19, శనివారం
జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి పితృ దేవతలను పూజించడానికి మంచి ఉద్ధిష్టమైన దినమని పంచాంగకర్తల ఉవాచ. కాబట్టి ఈనాడు స్వర్గంలో ఉన్న పితృదేవతలను యథాశక్తి పూజించాలి.

జ్యేష్ఠ శుద్ధ షష్ఠి, మే 20, ఆదివారం
ఈనాడు అరణ్యాల్లో, కొండల్లో గౌరీదేవిని పూజించే వారికి సౌభాగ్యం సిద్ధిస్తుందని ప్రతీతి. ఈనాడు ఇంకా ఆరణ్యక షష్ఠి, స్కంద షష్ఠి, వింధ్యేశ్వర పూజ, అరణ్యగౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ వంటి వాటిని ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

జ్యేష్ఠ శుద్ధ సప్తమి, మే 21, సోమవారం
ఈ తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఇంకా వరుణ పూజ చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

జ్యేష్ఠ శుద్ధ అష్టమి, మే 22, మంగళవారం
ఇది దుర్గాష్టమి తిథి. ఈనాడు త్రిలోచనాష్టమి కూడా ఆచరిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ నవమి, మే 23, బుధవారం
జ్యేష్ఠ శుద్ధ నవమి తిథి నాడు బ్రహ్మణీ నామ్యా ఉమాయా పూజ, శుక్లాదేవి పూజ ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది.

జ్యేష్ఠ శుద్ధ దశమి, మే 24, గురువారం
దశమి తిథితో ముడిపడి మనకు రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. ఒకటి- జ్యేష్ఠ శుద్ధ దశమి. రెండు- ఆశ్వయుజ శుద్ధ దశమి. మొదటిది దశపాపహర దశమి. రెండవది విజయదశమి. రెండూ కూడా పది రోజుల పర్వాలే. పాడ్యమితో మొదలై దశమితో ముగుస్తాయి.
దశపాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. పది పాపాలను పోగొట్టడానికి సమర్థమైన ఈ వ్రతం జ్యేష్ఠ శుక్ల పాడ్యమి
నుంచి దశమి వరకు చేస్తారు. ఈనాడు ఏ నదిలో స్నానం చేసినా విశేష ఫలాన్నిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే ఇంకా గొప్ప పుణ్యప్రదం. కాశీలోని దశాశ్వమేథఘట్టంలోని గంగాస్నానం మరీ పుణ్యం. గంగావతరణ ఈనాడేనని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. జ్యేష్ఠ శుక్ల దశమి, బుధవారం హస్తా నక్షత్రం కాలంలో గంగావతరణ జరిగిందని వ్రతోత్సవ చంద్రికాకారుడు చెబుతున్నాడు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో కూడా ఉందని అంటారు. జ్యేష్ఠ శుక్ల దశమి సౌమ్యవారంతో హస్తా నక్షత్రంతో కలిసి వచ్చిన నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వపాపాలు సమసిపోతాయని నమ్మిక. కాగా, వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు గంగావతరణ జరిగినట్టు గ్రంథాంతరాల్లో ఉంది. మొత్తానికి జ్యేష్ఠ శుక్ల దశమి గంగావతరణ దినమైనా కాకున్నా ఈ పర్వం గంగానదిని ఉద్దేశించి చేయబడేది కావడం మాత్రం విశేషం. జ్యేష్ఠ శుద్ధ దశమి వ్రత విధానం గురించి స్కంధ పురాణంలో ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి కొందరికి సంవత్సరాది దినం కూడా. ఈనాడు స్నానం, దానం ముఖ్యమైనవి. పాడ్యమి మొదలు దశమి వరకు స్నానం చేయడం కూడా ఈ పర్వం విధులలో భాగమే. ఈ ఉత్సవాన్ని గంగోత్సవమని కూడా అంటారు.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, మే 25, శుక్రవారం
జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు గంగోత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో ఎండలు మెండుగా ఉంటాయి. భూమిలో నీటి మట్టం చాలా లోతుకు పోతుంది. అటువంటి గడ్డు వేసవిలో ఈ ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్లయినా పుచ్చుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుచేతనే దీనికి నిర్జలైకాదశి అనే పేరు వచ్చింది. ఈ నిర్జలైకాదశి ఆదిలో భీముని వల్ల ఏర్పడినట్టు పురాణగాథ ఉంది. భీముడు తిండిపోతు. ఒక్కపూట కూడా తిండి లేకుండా ఉండలేడు. అందుచేత దశమి నాడు ఏకభుక్తం మాత్రం చేసి ఏకాదశి నాడు ఒకపూట అయినా భోజనం లేకుండా అతడు ఉండలేడు. దీంతో అతను వ్యాసుడిని సంప్రదించాడు. అప్పుడు వ్యాసుడు అతనితో ‘నీవు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు నీళ్లు కానీ, అన్నం కానీ తినకుండా ఉండు. ఏడాదిలోని ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలను చేసిన ఫలితం నీకు సమకూరుతుంది’ అని చెప్పాడు. భీముడు అలాగే చేశాడు. ఏడాదికి ఒక వ్రతాన్ని చేసి భీముడు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాల ఫలాన్ని పొందాడు. ఈ ఏకాదశి అంత మహత్తయినది.
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, మే 26, శనివారం
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు చంపక ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు త్రివిక్రమ పూజ చేయాలని కూడా అంటారు. అలాగే, దీనిని రామలక్ష్మణ ద్వాదశి అని కూడా అంటారు. ఈనాడు కూర్మ జయంతి అని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీశంకరాచార్య కైలాసగమనం ఈ తిథి నాడే జరిగింది.

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, మే 27, ఆదివారం
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి మూడు వ్రతాలు చేసే ముహూర్త దినం. ఒకటి- దుర్గంధ దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం. రెండు- జాతి త్రిరాత్రి వ్రతం. మూడు- రంభా త్రిరాత్రి వ్రతం. చివరి రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రుల పర్యంతం సాగేవి. ఈ మూడు వ్రతాల రీత్యానే కాక ఈనాడు మరొక విషయం చేత కూడా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథి విద్యారణ్యారాధాన దినం కూడా. విద్యారణ్యుల వారు ఈ తిథి నాడే సిద్ధి పొందారని అంటారు.

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, మే 28, సోమవారం
జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నాడు చంపక చతుర్దశి. ఈనాడు వాయు వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, రుద్ర వ్రతం చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతున్నాయి.

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, మే 29, మంగళవారం
మన పంచాంగాలలో ఈనాటి తిథి వివరణకు సంబంధించి ‘వృషభ పూజ’, ‘హల ప్రవాహ’ వంటి పదాలు ఉన్నాయి. అంటే ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని తెలుస్తోంది. దీనినే తెలుగునాట ఏరువాక పూర్ణిమ అంటారు. ఏరువాక అనేది వ్యవసాయకులకు సంబంధించింది. వర్ష రుతువు ఆరంభంలో వచ్చే పర్వమిది. ఈ కాలంలో (పునర్వసు కార్తె) వర్షాలు కురిసి భూమి పదునెక్కగానే పునాస విత్తనాలు వేస్తారు. పునర్వసు కార్తెలో జరిగే ఈ పని కారణంగానే పునాస అనే పదం ఏర్పడింది. ఈ పండుగ నాడు ఎద్దులకు రంగులద్ది అలంకరిస్తారు. పొద్దునే పొంగలి వండి ఎద్దులకు పెడతారు. సాయంకాలం వాయిద్యాలతో ఊరేగిస్తారు. కర్షకులకు ఎద్దులే జీవిత సర్వస్వం. కాబట్టి వాటిని ఈనాడు పూజించడం ద్వారా కృతజ్ఞత చెప్పుకుంటారు. కన్నడ నాట ఈ ఏరువాక పున్నమినే కారుణి పబ్బమని అంటారు.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనే వట సావిత్రీ వ్రతం కూడా ఆచరిస్తారు. వివాహితులైన స్త్రీలు ఈనాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వటవృక్షానికి పూజ చేయడం ఈనాటి విధాయకృత్యం. అయితే సావిత్రీ వ్రతాచరణలో వివిధ ప్రాంతాలలో వివిధ విధానాలు ఆచరణలో ఉన్నాయి.

Review శ్రేష్ఠమైనది జేష్ఠ౦.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top