ఐదు రోజుల ఆనందం

దీపావళి పండుగ మన ఆచార, సంప్రదాయాల్లో విశేషమైనది.
కృతయుగం ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దీపావళి.
త్రేతాయుగం ప్రకారం శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళి.
ద్వాపరయుగం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చిన రోజు దీపావళి.

దీపావళి అయిదు రోజుల పర్వం
ఆశ్వయుజ మాసం బహుళ పక్ష త్రయోదశి నుంచి కార్తీక మాసం శుక్ల పక్ష ద్వితీయ వరకు గల ఈ ఐదు రోజులూ ఇంటి ముంగిట దీపం పెట్టాలి. లక్ష్మీదేవిని పూజించాలి.
ఆశ్వయుజ బహుళ పక్ష త్రయోదశి దీపావళి పండుగలో మొదటి రోజు. ఇదే ధన త్రయోదశిగా ప్రసిద్ధి. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయాలి.
రెండో రోజు నరక చతుర్దశి.
మూడో రోజు దీపావళి అమావాస్య. ఇదే పిల్లలు, పెద్దలు బాణసంచా కాల్చి ఆనందంగా జరుపుకునే పండుగ రోజు.
నాలుగో రోజు బలి పాడ్యమి. బలి చక్రవర్తి ఈరోజు తన రాజ్యాన్ని దానమిచ్చిన రోజు. ఈ రోజు వామనావతారుడైన విష్ణువును పూజించడం, బలి చక్రవర్తి కథను వినడం, చదవడం చేయాలి.
ఐదో రోజు యమ ద్వితీయ. దీన్నే భాతృ విదియగానూ, భగినీ హస్త భోజనమనీ అంటారు.

దీపావళికి సంబంధించి మన పురాణాల్లో ప్రధానంగా నాలుగు కథలున్నాయి. అవి-

రావణుడిని సంహరించి యుద్ధంలో విజయం సాధించిన రాముడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేసిన రోజు ఆశ్వయుజ మాసం అమావాస్య అని రామాయణంలో ఉంది.
నరకాసురుడిని సంహరించిన తరువాత ఆ రాక్షసుడి పీడ విరగడ కావడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండుగలా చేసుకున్నారని, అదే పరంపర నేటికీ కొనసాగుతుందని కొన్ని పురాణాల్లో ఉంది.
పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి దీపావళి నాడే ఉద్భవించినట్టు చెబుతారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం ఎంతో పుణ్యప్రదం.
పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చినటువంటి రోజును దీపావళిగా వర్ణించాయి ఇంకొన్ని పురాణాలు.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ చీకట్లు తొలగించి వెలుగులు నింపే పండుగ దీపావళి.
చీకటి నిరాశ, నిస్ప•హలకు, అజ్ఞానానికి గుర్తు.
వెలుగు ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక.
అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానపు వెలుగుల్లోకి పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలని చెప్పడమే దీపావళి పర్వం ఉద్దేశం.

అందరికీ దీపావళి పండుగ
శుభాకాంక్షలు,,,

– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review ఐదు రోజుల ఆనందం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top