సరి ‘కొత్త’ క్రాంతి

ఒక రాజు తన రాజ్యంలో జ్ఞానులందరినీ పిలిచాడు.
‘విజయంలో, ఓటమిలో, ఆనందంలో, దు:ఖంలో.. ఎలాంటి సందర్భంలోనైనా ఓ మంత్రంలా పనిచేసే మాటల్ని మీలో ఎవరైనా సూచించగలరా? మీరెవరూ సలహా ఇవ్వడానికి నాకు అందుబాటులో లేనపుడు ఆ మాట నాకు సాయపడాలి’ అని అడిగాడు.
రాజు ప్రశ్నలకు జ్ఞానులందరూ మొదట అయోమయంలో పడ్డారు. చివరకు ఆలోచించగా, ఆలోచించగా, వారిలో ఒకరు చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి.
ఆ మాటల్ని వారంతా కాగితంపై రాసి రాజుకు ఇచ్చారు. ‘ఈ సమయం వెళ్లిపోతుంది’ అని రాసుంది ఆ కాగితంలో. దాన్ని రాజు తన ఉంగరం మీద రాయించి పెట్టుకున్నాడు రాజు.
అప్పటి నుంచి గెలుపోటముల్లో, సుఖదు:ఖాల్లో ఆ మాటల్ని రాజు గుర్తుంచుకునే వాడు.

‘కష్టం వచ్చినపుడు ఇది ఎంతో కాలం నిలవదు.. ఈ సమయం గడిచిపోతుంది’ అని తనకు తాను ఓదార్చుకుని దేని గురించీ అతిగా బాధపడటం మానేశాడు.
విజయం దక్కినపుడు- ఇది శాశ్వతం కాదు, కాలం సాగిపోతుంది అని గుర్తు తెచ్చుకుని మితిమీరి సంబరపడటం మానుకున్నాడు.
రాజుకే కాదు.. సామాన్యులకూ సరిపోయే మంత్రమిది.

2023.. వెళ్లిపోయింది. కాలగతిలో మరో కొత్త సంవత్సరం మన కళ్లెదుట నిలుస్తోంది.
ఈ కాలక్రమంలో ఎన్నో విజయాలు.. మరెన్నో అపజయాలు.. కొన్ని సుఖాలు.. మరికొన్ని దు:ఖాలు.. ఆటుపోట్లు.. ఒడిదుడుకులు.. ఇలాంటివే మరెన్నో అందరి జీవితంలోనూ మిగిల్చింది గడిచిన సంవత్సరం.
వాటిని తలుచుకుంటూ కుంగిపోవడం లేదా పొంగిపోవడం కాదు కదా మన పని.

కాలం అక్కడే నిలిచిపోదు. అన్నిటినీ తనలో ఇముడ్చుకుని వెళ్లిపోతుంది. మనం కూడా ఆనందమైనా, విషాదమైనా.. వాటికి సంబంధించిన అనుభవాలతోనే పొద్దుపుచ్చేయకూడదు.
ఈ ఆంగ్లమాన నూతన సంవత్సరం ముంగిటే ఒక సరికొత్త కాంతి మనమీద ప్రసరిస్తుంది. అదే- సంక్రాంతి.
ఇది ఒక దేవుడికో, దేవతకో సంబంధించిన పర్వం కాదు. రైతుల పండుగ. కళాకారుల పండుగ.

కొత్తల్లుళ్ల పండుగ. పెద్దల పండుగ. రంగవల్లుల పండుగ. వినోదాల పండుగ. మొత్తంగా ఇది మనందరి పండుగ.
సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడం కూడా ఒక సంప్రదాయం. ఆకాశంలో ఉండే దేవతలను స్వాగతించడానికి గాలిపటాలను ఎగురవేస్తారని అంటారు.
అదలా ఉంచితే, గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎంతో నేర్పు ఉండాలి. ఓర్పు కావాలి. చాకచక్యంగా పతంగిని ఎగురవేసిన వారికి జీవితాన్ని సమతుల్యంగా నిర్వహించే సామర్థ్యం కలుగుతుంది. తెగిన గాలిపటాలతో పాటు దురదృష్టం కూడా మనల్ని వీడి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు.

ఆంగ్లమాన కొత్త సంవత్సర వేళ అందరి జీవితాల్లో నూతనోత్సాహం నిండాలని..
సంక్రాంతి వేళ అందరి జీవితాల్లో సరికొత్త క్రాంతులు పండాలని ఆశిస్తూ..

– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review సరి ‘కొత్త’ క్రాంతి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top