మనలోని దీపం!

ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగిస్తాం.
అలాగే, జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి మనకు మనమే జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి.
అంటే, మనకు మనం కృషి చేసి ఆయా కష్టాల నుంచి గట్టెక్కాలి.
మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని ప్రయత్నపూర్వకంగా మనమే దూరం చేసుకోవాలి.
కష్టాలకు కంగారు పడకుండా ధైర్యజ్యోతులను నింపుకుని కష్టాలకు స్వస్తి పలకాలి.
ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూనే సాటి మనిషి కష్టంలో ఒక ఓదార్పుగా, దారిచూపే వెలుగుగా నిలుస్తూ జీవితానికి సార్థకతను చేకూర్చుకోవాలి.
మనలో ఉన్న దోషాలూ, బలహీనతలపై, భగవద్భక్తితో, సంపూర్ణ ప్రయత్నంతో వింయాన్ని సాధించి వ్యక్తిత్వ పరపక్వత పొందాలి.
దీపానికి తన, పర భేదాలు లేవు.
అది అందరికీ ఒకేవిధమైన వెలుగునిస్తుంది.
మన మనసులు కూడా అదే భావనతో ఉండాలి. ఆ భావనను పెంచేందుకు అనువైన మాసం అక్టోబరు.
ఇది ఆశ్వయుజం – కార్తీక మాసాల కలయికగా మన ముందుకొస్తోంది.
ఒకపక్క శరదృతువులోని వెండి వెన్నెల కాంతులు.. మరోపక్క దసరా వైభవం.. దీపావళి వెలుగులు..
ఇంకోపక్క కార్తీక దీప కాంతులు..
ఇవన్నీ మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుకునేందుకు ఇచ్చే సందేశాలెన్నో!
మన పండుగలు, పర్వాలన్నీ సామాజికంగా, నైతికంగా, ఆరోగ్యపరంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపుదిద్దుకున్నవే. వీటి నుంచే నేర్చుకోవాలనే వాళ్లకు నేర్చుకోవాల్సినంత ఉంది.
దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని శాస్త్రోక్తి.
మనం అంటే.. పైకి కనిపించే శరీరం కాదు. మనలోనే ఇంకొకరు ఉన్నారు. అదే మనం. ఆ లోపలి వ్యక్తిని కనుగొనేందుకు ఈ వెలుగుల మాసంలో దీపాన్ని వెలిగించుకుని.. మనల్ని మనం అన్వేషించుకుందాం.

అందరికీ దసరా, దీపావళి, కార్తీకమాస శుభాకాంక్షలు

– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review మనలోని దీపం!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top