చిత్రం.. భళారే చైత్రం

ఈ సృష్టి ఎంత ‘చైత్ర’మైనదో కదా?
అటు సంవత్సరారంభ దినం ఉగాది..
ఇటు జగదానందకారమైన సీతారాముల కల్యాణం..
ఒకటి ఆనందోత్సాహాల పర్వం..
ఇంకొకటి ఆధ్యాత్మిక పరవశ ఘట్టం..
మనం మంచి పనులు చేసేటపుడు, శుభకార్యాలు తలపెట్టినపుడు చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా, శుభకరంగా ఉండేలా చూసుకుంటాం.

కానీ, ఇటువంటి ఏర్పాటును ఉగాదికి ప్రకృతే కల్పిస్తుంది.
కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా ప్రకృతి కొత్త రూపు సంతరించుకుంటుంది.

వసంత గాలులు.. కోయిలల మధుర గానాలు.. మావిచిగుళ్ల మిళమిళలు.. వేపపూల కళకళలు.. ఎటుచూసినా కొత్త రంగుల చీర కట్టుకున్నట్టు మురిసి.. మెరిసిపోయే ప్రకృతి.. ఇటువంటి ఆనందకరమైన వాతావరణంలో రోజును.. సంవత్సరాన్ని ప్రారంభించాలని ఎవరికి ఉత్సాహం ఉండదు?

మంచి కార్యాలు తలపెట్టడానికి ఇంతకుమించిన తరుణం మరొకటి లేనేలేదు. మానవ జీవితాలను పరిపూర్ణంగా సాఫల్యం చేయగలది రామాయణం. అందులోని కథానాయకుడు శ్రీరాముడు నిలువెత్తు మానవ ధర్మానికి నిదర్శనం. ఆయన వివాహ ఘట్టం ఈ జగతికి నయనానందకరం. ఉగాది.. శ్రీరామ నవమి.. ఈ రెండు ఘట్టాల వేడుకకు వేదిక.. చైత్ర మాసం.

చైత్ర శుద్ధ పాడ్యమి, ఏప్రిల్‍ 13న ఉగాది పర్వదినం..
సరిగ్గా దీనికి తొమ్మిదో తిథి రోజున.. అంటే చైత్ర శుద్ధ నవమి, ఏప్రిల్‍ 21న శ్రీరామనవమి. వసంత మాసం ఆరంభమైన సందర్భంగా ఆచరించే వసంత నవరాత్రులు ఉగాదితో ప్రారంభమైతే.. శ్రీరామ నవమితో ముగుస్తాయి.

ఈ జంట పర్వాలు మానవ జీవితంలో అద్భుతమైన గుణాత్మక మార్పునకు నాంది పలుకుతాయి. ఒకటి మానసిక వికాసాన్ని.. మరొకటి ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తాయి. ఉగాది అందరి జీవితాల్లో నవ వసంతాన్ని నింపాలని.. శ్రీరాముడు చూపిన మానవ ధర్మబాటలో నడిచి సంపూర్ణత్వాన్ని సాధించాలని కోరుకుంటూ..

అందరికీ
శ్రీప్లవ నామ సంవత్సర,
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Review చిత్రం.. భళారే చైత్రం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top