ద్వేషం..

ద్వేషంతో మనం చేసే పనిలో విజయం సాధించలేం. ప్రపంచాన్ని జయించలేం. అంతెందుకు మనల్ని మనం జయించలేం.
ద్వేషం.. బయటికి కనిపించని శత్రువు. మనసులో గూడు కట్టుకుని మనుష్యుల మధ్య అడ్డుగోడలు కడుతుంది. విభజన రేఖలు గీస్తుంది. వివక్షను నూరిపోస్తుంది. కులం, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా మనుషులను విభజిస్తుంది. సాటి మనిషి హక్కుల రెక్కలను నిర్దాక్షిణ్యంగా తెగ్గొడుతుంది.
ద్వేషం.. ఎల్లప్పుడూ విషాన్ని కక్కుతుంది. ద్వేషంతో మాట్లాడే ఒక్క మాట.. ఒక్క పదం.. వేనవేల జీవితాల్లో అంతులేని విషాదాలను సృష్టిస్తుంది. చరిత్రలో మానని గాయాన్ని రేపుతుంది. విద్వేషాగ్నిని రగిలిస్తుంది.
ద్వేషం.. పైకి మనిషిని మనిషిగానే ఉంచుతుంది. కానీ, లోపల మానవత్వాన్ని చంపేస్తుంది. దీనికి విరుగుడు మంత్రం- రెండక్షరాల ప్రేమ.
ద్వేషాన్ని జయించే ఏకైక అహింసా ఆయుధం.. ఈ ప్రపంచంలో ‘ప్రేమ’ ఒక్కటే. దీనితో లోకాన్ని జయించవచ్చు. మనం చేసే పనిలో విజయం సాధించవచ్చు. మనల్ని మనం జయించవచ్చు. ద్వేషం.. ప్రేమ.. ఈ రెండూ మనలోని స్వభావాలే. వీటిలో మనం ఏ స్వభావానికి లోబడితే.. ఆ స్వభావిగా మనం రూపుదిద్దుకుంటాం. ఈ రోజుల్లో మనం వాడే నిత్యావసరాలు, పరికరాలు, ఉపకరణాలు అత్యంత ‘స్మార్ట్’గా మారాయి. కానీ, వాటిని వాడే, వినియోగించే మనం మాత్రం ‘హార్డ్’ (కఠినం)గా మారిపోతున్నాం.
ప్రపంచం చిన్నదైపోయే కొద్దీ మనుషుల మధ్య అంతరాలు పెద్దగా మారిపోతున్నాయి. ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం అందనంత దూరమైపోతున్నాయి. వస్తువులను ప్రేమించి.. మనుషులను మనుషులు ద్వేషించుకునే ధోరణి ప్రబలిపోతోంది. వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మనుషుల్ని అప్పుడప్పుడు ‘వాడుకుని’ వదిలేస్తున్నాం. అందరిదీ అదే తీరు. ఇదే లోకం తీరుగా మారిపోయింది.

Review ద్వేషం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top