చక్కని బుద్ధి.. లక్ష్మీసిద్ధి!

సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతోనే కలుగుతాయి.
దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి.
వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తారు.
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తారు.
కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు.
అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వ్రతం కూడా అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
జగన్మాత పార్వతి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా? అని శివుడిని అడిగిందట.
వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని ఆయన చెప్పారట.
దీనికి సంబంధించిన కథను కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడట.
పూర్వం మగధ రాజ్యంలోని కుంది అనే నగరంలో చారుమతి అనే వివాహిత ఉండేది.
ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించాలని కోరింది.
పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబసభ్యులకు ఆమె తెలిపింది.
దీంతో వారంతా వ్రతాన్ని ఆచరించాలని ఆమెకు సూచించారు.
పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది.
శ్రావణ శుక్లపక్షం, శుక్రవారం ప్రాత:కాల సమయంలో స్నానాదులు ఆచరించి, తోటి ముత్తయిదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్టించి వ్రతం నిర్వహించింది.
వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు తన దేవేరికి ఈ వ్రత వివరాలను వెల్లడించాడు.
సాక్షాత్తూ పరమేశ్వరుడే వెల్లడించిన వ్రతం- వరలక్ష్మీ వ్రతం.ఈ శుభదినాన పూజాదులు, వ్రతాచరణ సాగించే వారు అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు.
భృగు ప్రజాప్రతి ప్రాధాన్యం కలిగిన ‘భృగు(శుక్ర)వారం నాడు, ప్రతి మాసంలోనూ లక్ష్మీ ఆరాధనను శాస్త్రం నిర్దేశించింది. మాసాల్లో ఆర్ధ్రతకు ప్రధానమైన వర్షరుతువు మొదటి మాసమే శ్రావణం.
అందులో వృద్ధి చెందే చంద్రకళకు నెలవైన శుక్లపక్షం, శుక్రవారం అత్యంత ప్రధానమైనవని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ సంపదల సాకారమే మహాలక్ష్మి.
ఆ దేవిని శ్రావణ మాసంలో ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావనా కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ప్రకాశించాలని విజ్ఞులు ప్రబోధించారు.
వరలక్ష్మి వ్రతకథలో- సిద్ధి పొందిన కథానాయిక చారుమతి. మంచి మతి (బుద్ధి) మాతమ్రే దేవీకృపకకు పాత్రమవుతుంది.
సంపదలను అడిగే ముందు ‘చారు’ (చక్కని) ‘మతి’ (బుద్ధి) కలిగి ఉండాలనేదే వరలక్ష్మీ వ్రతకథలోని అంతరార్థం. ఈ సందేశం అర్థమైతే వ్యక్తికీ, సమాజానికీ సౌభాగ్యప్రదం.

అందరికీ వరలక్ష్మీ, మంగళగౌరీ వ్రత
శుభాకాంక్షలు

– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review చక్కని బుద్ధి.. లక్ష్మీసిద్ధి!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top