అమ్మ లేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం? ఎంతటి దౌర్భాగ్యం?.. అమ్మలేని కొందరి జీవితాలను పరిశీలిస్తే కళ్లలో నీళ్లు ఘనీభవించి కళ్లు మసకబారిపోతాయి. అమ్మ ఉన్న కొందరి ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలిపోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది.
రెండు సంవత్సరాల క్రితం అమ్మ సేవలకు గంటల ప్రకారం లెక్కలు కట్టారట. ఆమె సేవలకు కట్టిన విలువ ఎంత తెలుసా? సంవత్సరానికి డెబ్బై లక్షల రూపాయలు అని తేల్చారు. అంటే నెలకు ఐదు లక్షల రూపాయలన్న మాట. కానీ బిడ్డకు పెన్నిధి లాంటి అమ్మ ప్రేమకు వెల కట్టడం నిజానికి హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. అమ్మతో అనుబంధం ఉన్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. మెదడులో ఉండే హిప్నోకాంపస్ అనే భాగం మన జ్ఞాపకశక్తికి, తెలివితేటలకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి ఆధారభూతమైనది. అమ్మ ప్రేమ లభించేవారిలో అది దాదాపు పది శాతం పెద్దదిగా ఉన్నట్టు తేలింది.
అక్కున చేర్చుకుని తల నిమురుతూ నుదుట ముద్దు పెట్టుకునే అమ్మ అద్భుతమైన స్పర్శ ఎంత గొప్పది? అంతటి అనుభూతిని భావవ్యక్తీకరణ చేయడానికి పదాలు దొరుకుతాయా? అమ్మ గురించి రాయడానికి కలం కదులుతుందా? అమ్మ యావత్తు విశ్వమండలమంతా వెలిగే అఖండ ప్రేమ జ్యోతి అని తెలుపుటకు స్థాయి సరిపోతుందా? వీచే చల్లని గాలిలో అమ్మ పలకరింపులు పున్నమి నాటి చంద్రుని కాంతిలో అమ్మ దీవెనల వెలుగులు ఇలా అమ్మను వర్ణించడానికి భాష సరిపోతుందా?
అమ్మ ఉన్నంత కాలం తన విలువ తెలియదు. తను శాశ్వతంగా దూరమైతే తెలుస్తుంది నిజమైన ఒంటరితనం యొక్క ప్రభావం మనిషిని మనసును ఏ విధంగా ఎంతలా దు:ఖించేలా చేస్తుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది.
దేవతలాంటి అమ్మను అందరికీ ఇచ్చిన భగవంతుడు కొందరు పిల్లలు ఎదిగి ప్రయోజకులయ్యే వయసులో అకారణంగా అమ్మను తన వద్దకు తీసుకువెళ్లిపోతుంటాడు. గతి తప్పిన గమ్యాలై గూడు చెదిరిన పక్షుల వలే అందరూ ఉన్న అనాథలుగా మిగిలిపోతుంటారు.
అమ్మకు ఈ లోకంలో సరిసాటి రాగలవారెవరు? అమ్మ చూపే కల్మషమెరుగని ప్రేమను ఈ లోకంలో ఎవరు చూపగలరు? అమ్మలేని ప్రతి ఒక్కరి హృదయంలో కలిగే ఆవేదనను ఎవరు ఓదార్చగలరు? అమ్మ వదనం ప్రశాంత నందనవనం. అమ్మ హృదయం సూర్యచంద్రులు దాగిన నీలాకాశం. అమ్మ చిరు కోపం మెరిసే మేఘం. కురిసే వర్షం. అమ్మలేని జీవితం నిశిరాత్రి చీకటి శ్మశానం. అమ్మ ఒక గంభీరమైన నిరంతర ప్రవాహం. కొలవలేని లోతైన మహా సముద్రం. అమ్మ తన బిడ్డలపై స్వచ్ఛమైన, చల్లనైన ప్రేమామృత వర్షం కురిపిస్తూనే ఉంటుంది. ఎందరో మాతృమూర్తులు.. అందరికీ వందనాలు.
-కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review అమ్మ.. చల్లని పూలకొమ్మ.