1892. స్టాన్‍ఫోర్డ్ యూనివర్సిటీ.. అందులో చేరాలనే తపన గల ఓ యువకుడు అంత ఫీజు కట్టలేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అతను తల్లిదండ్రులు లేని అనాథ.
అతనూ, అతని స్నేహితుడు కలిసి ఒక ఆలోచన చేశారు. వాళ్ల యూనివర్సిటీలో ఒక సంగీత కచేరి ఏర్పాటు చేద్దామనీ, అందులో ఖర్చులు పోను మిగిలిన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు.
ఇద్దరూ కలిసి అప్పట్లో గొప్ప పియానో వాద్యకారుడైన ఇగ్నేస్ జే పడెరెవిస్కి వద్దకు వెళ్లారు. ఆయన మేనేజరు ఫీజు రూపంలో రెండు వేల డాలర్లు కనీస మొత్తంగా ఇవ్వాలనీ, ఆ పైన ఇతర ఖర్చుల కింద మరికొంత మొత్తం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు యువకులు సరేనన్నారు. టికెట్లు అమ్మడం ప్రారంభించారు. అనుకున్న రోజు రానే వచ్చింది. పోగ్రాం అద్భుతంగా జరిగింది. అయితే వీళ్లు అనుకున్నట్టు వసూళ్లు మాత్రం రాలేదు. మొత్తం 1600 డాలర్లు మాత్రమే వచ్చాయి.
ఆ యువకులిద్దరూ పరెవిస్కి వద్దకు వెళ్లారు. వసూలైన మొత్తానికి మరో 400 డాలర్లు (మొత్తం 2000 డాలర్లు కదా)కు చెక్కు పట్టుకుని వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే మిగతావి ఇతర ఖర్చుల కింద మొత్తాన్ని చెల్లిస్తామని, క్షమించాలని కోరారు. వాళ్ల గురించి పడెరెవిస్కికి తెలియదు. ఆయన వాళ్లను అంతకు ముందు చూడలేదు. ఆయన ఆ చెక్కును చించేశారు. 1600 డాలర్లూ వాళ్ల చేతిలో పెడుతూ వాళ్లతో ఇలా అన్నాడు-
‘మీకైన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి. మీ ఫీజులకు ఎంత అవుతుందో అది కూడా ఇందులో నుంచి మినహాయించుకోండి. ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి’.
ఈ సంఘటన పడెరెవెస్కి మానవత్వాన్ని చాటుతుంది. తనకు తెలియని, తనకు ఏమీ కాని, వారి నుండి ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ, తన ఆదాయాన్ని ఇవ్వడం ఆయన హృదయ ఉదారతకు నిదర్శనం.
మనలో చాలామంది అనుకుంటాం- ‘నేను అతనికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం?’.
అవతలి వ్యక్తి అనుకున్నాడు- ‘నేను సహాయపడకపోతే వాళ్లకు ఎవరు సహాయపడతారు?’ అని.
అదే ఉత్తములకీ, మనకీ తేడా. ఇది ఇక్కడితో ఆగిపోలేదు.
పడెరెవెస్కి తరువాత కాలంలో పోలాండ్ ప్రధాని అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ సర్వ నాశనం అయిపోయింది. 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పడెరెవెస్కికి ఏం చేయాలో తోచలేదు. ఎవరిని అడగాలో తోచలేదు. చివరకు అమెరికా ఆహార, పునరావాస విభాగాన్ని సంప్రదించాడు. దానికి అధిపతి హెర్బెర్ట్ హూవర్. ఆయనే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు. అతను వెంటనే ప్రతిస్పందించాడు. టన్నుల కొద్దీ ఆహార పదార్థాలను పోలాండ్‍కు- పంపించాడు. పోలాండ్‍లో ఆహార సంక్షోభం సమసిపోయింది.
హెర్బెర్ట్ హూవర్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి పడెరెవెస్కి అమెరికా వెళ్లాడు. కృతజ్ఞతలు చెబుతుండగా హూవర్ అన్నాడు- ‘కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు. వారిలో నేను ఒకడిని’. పడెరెవెస్కికి నోట మాట రాలేదు. ఈ ప్రపంచం ఒక అద్భుతం.
‘నువ్వు ఏది ఇస్తావో దానికి అనేక రెట్లు పొందుతావు’ అనేది గీతా వాక్యం.
-కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review ఉత్తములు.