అమావాస్య ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి శివుడికి మహా ప్రీతికరమైన రోజు.
అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా వ్యవహరిస్తారు. ఆ రోజు శివుడిని భక్తితో కొలుస్తారు.
ఇక, ఏడాది పొడవునా వచ్చే శివరాత్రులలో మాఘ మాసంలో వచ్చే శివరాత్రి మహిమాన్వితమైనది.
కాబట్టి దీనిని మహా శివరాత్రి అంటారు. దీనిని పెద్ద పండుగలా జరుపుకుంటారు.
సాధారణంగా పండుగలంటే ప్రతి ఇంటా పిండివంటలు ఘుమఘుమలాడుతాయి.
కానీ, మహా శివరాత్రి మానసిక పర్వం. ఆ రోజున ఉండే ఉపవాస, జాగరణలతో మనసు శివ సాయుజ్యానికై తపిస్తుంది.
స్కంద పురాణం ప్రకారం- శివరాత్రులు ఐదు రకాలు-
1.నిత్య శివరాత్రి, 2.పక్ష శివరాత్రి, 3.మాస శివరాత్రి, 4.యోగ శివరాత్రి, 5.మహా శివరాత్రి.
వీటిలో మహా శివరాత్రి శివపూజకు ఉద్ధిష్టమైనది.
మనకున్న దైవాలలో, దేవుళ్లలో పరమశివుడు భోళా శంకరుడు.
పరమేశ్వరుడు సర్వవ్యాప్తమై ఉన్నాడు.
అందరు దేవతలను మనేం ఆలయాల్లో విగ్రహాల రూపంలో పూజిస్తాం. కానీ,
శివుడిని లింగ రూపంలో పూజిస్తాం.
శివుడిని లింగరూపంలో పూజించడానికి కారణం- శివుడికి ఒక ముఖం అంటూ లేదు. పంచభూతాల్లోనూ ఆయన ఇమిడి ఉన్నారు. అంటే, విశ్వమంతటా ఆయన రూపంలో వ్యాపించి ఉంది. అందుకే ఆయన ఉనికికి గుర్తుగా వాయులింగం, అగ్ని లింగం, జలలింగం, పృథ్వీలింగం, ఆకాశ లింగం.. రూపాల్లో ఆయనను కొలుస్తారు.
శివుడు శుభకరుడు… సుందరుడు.. సత్య స్వరూపుడు. శివం అంటే శుభం. చైతన్యం కూడా.
ఆధ్యాత్మిక సాధకుడికి నిత్య సుఖాన్ని, ఆనందాన్ని, అద్భుతమైన శక్తిని ఇచ్చే వాడు శివుడే. కాలకూటాన్ని కంఠంలో పెట్టుకున్న ఆయన కథలు, లీలలు మనసును ఆధ్యాత్మిక జగత్తులో విహరింప చేస్తాయి.
శివుడంటే కైలాసంలో కూర్చుండే వాడు కాదు. నీలో, నాలో, మనందరిలో చైతన్య రూపంలో ఉన్న వాడే శివుడు. అందుకే, ఈశావస్యోపనిషత్తులో- ‘ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్’ అని వర్ణించారు.
అందరికీ మహా శివరాత్రి
శుభాకాంక్షలు
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review విశ్వమంతా ఈశ్వర రూపమే!.