
సమాజ శ్రేయస్సు భారత ధర్మం (వేద ధర్మం)తోనే ముడిపడి ఉంది. వేద పురాణ, ఇతిహాసాల కాలాల నుంచి లక్షల సంవత్సరాలుగా మన రుషులు మనకు ఇచ్చిన ఆర్ష ధర్మం భారతదేశంలో కొనసాగుతూనే ఉంది. భారతీయ ధర్మాన్ని సూర్యపుత్రుడైన మనువు రచించాడు. భారతీయ ధర్మాలలో పది ప్రధాన ధర్మాలు, మరో పది ఉప ధర్మాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రధాన ధర్మం- శౌచం. సకాలంలో విధి నిర్వహణ (తపస్సు) రెండవది. ఇంకా, సత్యవాక్పరిపాలన, మనో నిగ్రహం, పరాక్రమంతో కూడిన ఔదార్యం, అహింసా విధానం (మానవుని సమాజంలో )ఉత్తమ పౌరునిగా రూపొందించడమే కాక తాను స్వయంగా అహింసా ప్రవృత్తి కలిగి ఉండటం), ఇతరులకు కష్టం కలిగించకపోవడం, స్థితప్రజ్ఞత (సుఖ, దుఃఖాల పరాకాష్టలో మనసును సమస్థితిలో ఉంచుకోవడం), కోరకుండానే ఇతరుల అవసరాలను గమనించి గుప్తంగా దానం చేయడం, అపరిగ్రహం, సానుభూతి, జీవితాంతం ఏదో ఒక విషయమై అధ్యయనం కోసం తపన కలిగి ఉండటం, నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు నిస్వార్థంగా బోధించి విజ్ఞానవంతులను చేయడం- ఇటువంటి మరెన్నో ధర్మాలు ఉన్నాయి. మనిషిగా ఈ ధర్మాలను పాటించడం మన విధి. వేదవ్యాసుడు రచించిన పంచమ వేదమైన మహా భారతంలో ఈ పది ధర్మాలను పొందుపర్చి మనకు అందించాడు. ఆయన రచించిన భారతంలో మొదటి ఐదు పర్వాలు (ఆది పంచకం)లోని ఆది పర్వంలో తన కాలం నాటికి, అంతకుముందు ఉన్న స్మ•తి ఆధారంగా ఆనాటి ఆచార వ్యవహారాలు, సమాజ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు రాశాడు. ద్రౌపది నాడు పంచభర్త•క కావడం ధర్మ విరుద్ధం కానేరదు. ఆనాటి పాంచాల దేశమైన ఈనాటి కాశ్మీరు, ఆప్ఘనిస్తాన్, హిమాలయాల ప్రాంతాలలో అన్న గారి భార్యనే సోదరుడు కూడా భార్యగా స్వీకరించడం ఆచారంగా వస్తోంది. భారతీయ సమాజంలో ఐదు వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన మహాభారత కాలంలో జరిగిన ఆచార వారసత్వమే ఇదని అర్థమవుతోంది. అయితే, ఈ ధర్మం ద్వాపర యుగం వరకే అమలులో ఉన్నందున ఈ యుగంలో మనం దానిని అధర్మంగా భావిస్తున్నాం. అంతవరకు మనుధర్మం అమలులో ఉండేది. ప్రస్తుత కలియుగంలో యాజ్ఞవల్క్య ధర్మం అమలులోకి వచ్చింది. కాగా, మనుస్మ•తిలో మూల సూత్రాలే మనకు ఆదర్శం. భారతంలోని సభాపర్వంలో రాజధర్మాలు, అరణ్యపర్వంలో ఆనాటి సామాజిక కట్టుబాట్లు, రాజనీతి, సమైక్యతలను వ్యాసుడు వివరించాడు. విరాటపర్వంలో సేవా ధర్మాన్ని గురించి తెలిపాడు. కాలానుగుణంగా వివిధ విద్యలు ఉపకరిస్తాయి కనుక బహువిద్యలలో ప్రావీణ్యత అవసరమనే సందేశాన్ని ఈ పర్వంలో వివరించాడు. ఉద్యోగ పర్వంలో సైనిక విభజన, దౌత్యనీతి, రాజనీతి శాస్త్రాలు ఇమిడి ఉన్నాయి. కనుక విరాట్, ఉద్యోగ పర్వాలను ప్రతి భారతీయుడు తప్పనిసరిగా చదివి తీరాలి. ఇంకా, ఉద్యోగపర్వంలో విదురనీతిలో ఇతరుల భార్యలపైన, ధన, రాజ్యాలపైన కాంక్ష, ఈర్ష్య తగవనే నీతిని వ్యాసుడు బోధించాడు. సంపద వృద్ధిని సత్పాత్రదానం, సక్రమ వినియోగంతోనే సాధించవచ్చునని బోధించాడు. ఇక, సనత్సుజాత పర్వంలో మృత్యువు ఉనికిని గురించి, కర్ణపర్వంలో కర్ణుడి స్నేహధర్మం, ప్రభుభక్తి, దానశీలతను ఆదర్శాలుగా వ్యాస భారతం మనకు అందిస్తోంది. ఇలా భారత ధర్మం మనకు ఎన్నో ధర్మాలను నేర్పుతోంది. వాటిని అధ్యయనం చేయడంతో పాటు ఆచరణకు పూనుకున్నప్పుడే మానవ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది.
Review భారతీయత.