
ఒక ఊరిలో శివదాసు అనే పూజారి ఉండేవాడు. తండ్రి నుంచి వారసత్వంగా మహదీశ్వరాలయంలో పూజాధికాలు నిర్వహిస్తుండే వాడు. కానీ, నిజానికి అతనికి ఏకోశానా భక్తి ఉండేది కాదు. భక్తులను తృణీకార భావంతో చూసేవాడు. పూజలు చేసే సమయంలో గోత్ర నామాలు సరిగా పలికే వాడు కాదు. పూజ కూడా తూతూ మంత్రంగా కొనసాగించే వాడు. భక్తులకు ఇదంతా తెలిసినా పూజారి అనే గౌరవంతో కిమ్మనే వారు కాదు.
ఒకసారి ఆ ఊరికి శివానందుడు అనే సాధువు వచ్చాడు. ఆయన అచ్చం శివుడినే తలపించేలా ఉండేవాడు. గ్రామస్తులంతా ఆయనను సాక్షాత్తూ శివుడిగా ఎంచి పూజించారు. యథారీతిన సత్క రించారు. ఆయన అక్కడి దేవాలయ మండపంలో ఆశీనులై భక్తుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారు. అక్కడకు శివదాసు కూడా వచ్చాడు. అంతలో కొందరు ధైర్యం చేసి శివదాసు తీరుపై శివానందుడికి ఫిర్యాదు చేశారు. వారు చెప్పినదంతా సావధానంగా విన్న శివానందుడు-
‘ఎందుకలా ప్రవర్తిస్తున్నావు?’ అని శివదాసును నిలదీశారు.
ఆయనలోని గాంభీర్యాన్ని చూసి శివదాసు గడగడా వణికిపోయాడు. భయంతో చేతులు కట్టుకుని-
‘నాకు దైవపూజలపై నమ్మకం లేదు. ఏదో వారసత్వంగా వచ్చిన బాధ్యత కాబట్టి చేయాలంటే చేస్తున్నాను’ అన్నాడు.
‘అంటే నువ్వు నాస్తికుడివా?’ అని శివా నందుడు శివదాసును ప్రశ్నించారు.
‘కాదు’ అని శివదాసు బదులిచ్చాడు.
‘మరెందుకు భగవంతుడంటే నమ్మకం లేదు?’ అని శివానందుడు రెట్టించాడు.
‘భగవంతుడు సృష్టి, స్థితి, లయకారకుడని అంటారు. ఈ సృష్టి సమస్తం ఆయనదే అయి నప్పుడు ఈ పూజలు, నైవేద్యాలతో ఆయనకేం పని? కేవలం ఆయనను మనసులో స్మరించు కుంటూ ధ్యానం చేస్తే చాలదా?’ అన్నాడు శివ దాసు.
‘నువ్వేం చదువుకున్నావు?’ అని శివానందుడు అడిగాడు.
‘స్మార్తం చదువుకున్నాను’
‘స్మార్త ప్రావీణ్యం ఒంటబట్టించుకోవడానికి నీకు ఎన్నేళ్లు పట్టింది.’
‘ఆరు సంవత్సరాలు’
‘ఆరు సంవత్సరాలు ఎందుకు? ఒక్కరోజులో నేర్చుకోవచ్చు కదా?’ శివానందుడి ఈ ప్రశ్నకు శివదాసు సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆయన అతనికి ఇలా బోధించారు.
‘దైవారాధన కూడా స్మార్త విద్యాభ్యాసం వంటిదే. అదొక ఆధ్యాత్మిక విద్య. మెట్టు తరువాత మెట్టు ఎక్కుతూ పైకి వెళ్లినప్పుడే కొండ మీద
ఉన్న కోవెలకు చేరుకోగలం. అందులోని దైవాన్ని సేవించగలం. అలాగే, నిగ్రహ శక్తి కోసం విగ్రహ పూజ చేయాలి. అటుపై ఆత్మవిద్య, ఆపైన ధ్యానం, తపస్సు అభ్యసించాలి. పూజలంటే భక్తిని ప్రకటించడం. నైవేద్యాలనే ఆహారం ఆయనకు మనకు సమకూర్చాడు కనుక ముందు ఆయనకే ఆ నైవేద్యాలను సమర్పించాలి. అది భగవంతునికి మనిషి తెలుపుకునే ఓ కృతజ్ఞతా రూపం. ఈ అవగాహనతో చేసే పూజలే సిద్ధిస్తాయి’.
శివదాసు శివానందుడి పాదాలపై పడ్డాడు. క్షమించాలని కోరాడు. ఇకపై ఎప్పుడూ భగవంతుని పూజలను నిర్లక్ష్యం చేయనని ప్రతినబూనాడు. అందరి మెప్పు పొందేలా పూజాధికాలు నిర్వర్తించే వాడు. చూశారా! ఒక్కోసారి మనం ప్రశ్నించడం మరిచిపోయి బాధ్యతారహితంగా ప్రవర్తించినా, భగవంతుడే ప్రశ్నలు వేసి మరీ సమాధానాలు రాబట్టి తత్వాన్ని బోధిస్తాడు. కళ్లు తెరిపించి ఆధ్యాత్మికతను ఆవిష్కరింప చేస్తాడు. రాళ్లు ప్రశ్నించలేవు. మొక్కలు ప్రశ్నించలేవు. జంతువులు ప్రశ్నించలేవు. మానవులు మాత్రమే ప్రశ్నించగలరు. ప్రశ్నతో సర్వాన్ని సాధించగలరు. తమ హక్కులను తాము నిలబెట్టుకోగలరు. తమ బతుకును తాము సుస్థిరం చేసుకోగలరు. ప్రశ్నించే తత్వం గలవారు ఈ భూమిపైనే కాకుండా విశ్వమంతా కూడా తమ ఉనికిని చాటగలరు. అవసరమైతే భగవంతుడినే ప్రశ్నించ గలరు. కానీ, ఏ ప్రశ్నా వేయని వారు, ప్రశ్నించి నేర్చుకోవాలనె తపన లేని వారు జీవితంలో ఏం సాధించలేరు. అటువంటి వారి ఉనికే ప్రశ్నా ర్థకమవుతుంది. కానీ, భగవంతుడు దయా మయుడు. తనను భక్తులు ప్రశ్నించినా, ప్రశ్నించ కున్నా తనే ఓ ప్రశ్నగా మారి వారిలో పరివర్తన తెస్తాడు. అందుకు పై శివదాసు ఉదంతమే నిదర్శనం.
Review ప్రశ్నతోనే ఫలం…. ఫలితం.