మహత్తర మార్గశిరం
డిసెంబర్ నెల తెలుగు పత్రికలో మార్గశిర మాసం విశేషాలు చదివించాయి. ఆ మాసంలో వచ్చే దత్తాత్రేయ జయంతి, కోరల పున్నమి, మార్గశిర మాసంలో వచ్చే గురువారాల విశిష్టత, సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవాష్టమి గురించి ఎన్నో తెలియని విశేషాలను తెలియ పరిచారు. తెలుగు పత్రికలో మాకు బాగా నచ్చే శీర్షిక ‘మాసం – విశేషం’ అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఆ మాసంలో వచ్చే తిథుల వారీగా ఆయా పండుగలు, పర్వాల వివరాలను ఇవ్వడం చాలా బాగుంది. ఇటువంటివే మరిన్ని విలువైన శీర్షికలు మునుముందు కూడా తెలుగుపత్రికలో అందించగలరు.
-ఎమ్.కిరణ్కుమార్, నాగరాజేశ్, పల్లవి- హైదరాబాద్, ఆర్.రవికిరణ్, సిద్ధారెడ్డి, నాగేశ్వరరావు, సంతోష్, వసంత, సాయికిరణ్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
అయోధ్య రామయ్య
తెలుగు పత్రిక డిసెంబర్ సంచికలో అయోధ్యపై ఇచ్చిన కవర్స్టోరీ మొత్తం పత్రికకే హైలైట్. అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం ఎక్కడి నుంచి మొదలైంది?, ఎప్పుడెప్పుడు ఏం జరిగింది?, ఎవరెవరు కేసులు దా•లు చేశారు?, ఆది నుంచి తుది వరకు ఏమేం జరిగిందో చాలా వివరంగా, విపులంగా ఇచ్చారు. ఇది చదవడం ద్వారా ఈ అంశంపై సమగ్రమైన అవగాహన కలిగింది. అలాగే, అయోధ్య నగరం చారిత్రక, ఇతిహాస, వర్తమాన ప్రాశస్త్యాన్ని గురించి బాగా చెప్పారు. ఎప్పుడేం జరిగిందో సంవత్సరాల వారీగా ఇవ్వడం బాగుంది. మొత్తానికి భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద అంశంలో అత్యంత సామరస్య పూర్వక రీతిలో సయోధ్య కుదిర్చిన భారత అత్యున్నత న్యాయస్థానానికి అభినందనలు.
-కె.రామ్మోహన్, వివేకానంద్, రాఘవరెడ్డి, పి.శశికిరణ్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
హృదయ లేఖలు
తెలుగు పత్రికలో శ్రీరామ్ గారి పేరుతో ఇస్తున్న లేఖలు హృదయాలను తాకుతున్నాయి. అందులోని భావాలు, అభిప్రాయాలు, భావోద్వేగాలు ఎంతగానో కదిలిస్తున్నాయి. ఆయా సందర్భాలలో ఆయన తన బంధుమిత్రులకు రాసిన ఈ లేఖలు మమ్మల్ని పాత జ్ఞాపకాలలోకి తీసుకువెళ్తున్నాయి. ముఖ్యంగా ఆ లేఖల్లోని భావాలు ఎంతో బాగుంటున్నాయి.
– కేఆర్ సురేశ్, చంద్రశేఖరరావు, ఎండీ కరీముల్లా- హైదరాబాద్, భార్గవి- విజయవాడ
Review ఉత్తరాయణం.