రుషి పీఠం

భృగువంశానికి చెందిన వారు హరీత మహర్షి. గొప్ప వేదవేదాంగవేత్త. బ్రహ్మజ్ఞాని గోతప్రవరుడు. ఈయననే ఆచార్య హరిత అని కూడా పిలుస్తారు.

ఈయన సూర్యవంశపు రాజుగా జన్మించి.. అనంతరం తన తపశ్శక్తితో బ్రాహ్మణత్వం పొందిన వాడు. ఈ సూర్యవంశం ఇక్ష్వాకు వంశానికి చెందినది. సూర్యవంశం రాజైన యౌవనాశ్వుడి కుమారుడే హరితుడు. యౌవనాశ్వుడు మాంధాత మనవడు. అంబరీషుడి కుమారుడు. హరీతుడు క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ అంగీరస మహర్షి మార్గదర్శకత్వంలో బ్రాహ్మణత్వం
పొందాడు

హరీత మహర్షి సంతానమే ‘హరితస’/హరిత గోత్రం వారిగా పేరొందారు. అంటే ఎవరైనా హరితస గోత్రం వారుంటే వారంతా భృగువంశానికి చెందిన వాళ్లన్న మాట. వీరినే వైఖానసులని కూడా అంటారు. శ్రీవైష్ణవ ఆచార్యులు శ్రీరామానుజాచార్యులు కూడా హరితస గోత్రానికి చెందిన వారే. పురాణాల ప్రకారం ఈ గోత్రానికి చెందిన వారు బ్రాహ్మణ హోదాను పొందడం వల్ల వీరికి బ్రాహ్మణ లక్షణాలతో పాటు క్షత్రియ తేజస్సు కూడా ఉంటుందని చెబుతారు. విష్ణు పురాణంలో చెప్పిన ప్రకారం- ‘మంధాత్రి కుమారుడైన అంబరీషుడి కుమారుడు యువనాశ్వ.. అతని కుమారుడు హరితుడు. అతని నుంచి అంగిరస హారితులు వంశస్థులు’.

పూజా కార్యక్రమాలలో అభివాదం చేసేటపుడు ఈ గోత్రానికి చెందిన వారు ప్రవరను పఠిస్తారు. ఇందులో రెండు రకాల ప్రవరలు వాడుకలో ఉన్నాయి.

మొదటి ప్రవర (ఇది ఎక్కువగా వాడుకలో ఉన్నది): అంగీరస, అంబరీష, యౌవనాశ్వ (త్రయార్షేయ ప్రవర).

రెండవ ప్రవర: హరిత, అంబరీస, యౌవనాశ్వ (త్రయార్షేయ ప్రవర).

హరీతుడు తపోదీక్షలో బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయిన గొప్ప శక్తి గలవాడు. గొప్ప జ్ఞాని.

ఒకసారి దిలీపుడు వేటకు వచ్చి హరీత మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అది మాఘ మాసపు సమయం. మహర్షి దిలీపుడికి అతిథి మర్యాదలు చేసి దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి రావాలని చెప్పాడు. అనంతరం దిలీపుడు వంశం వాళ్లందరూ మహా పురుషులు, ధర్మప్రభువులు అయిన చక్రవర్తులుగా పుట్టేటట్టుగా దీవించాడు. అలాగే మాఘ మాస గొప్పదనాన్ని తన గురువైన వశిష్ఠుడి వద్ద తెలుసుకోవాలని చెప్పి పంపించాడు.

హరీత మహర్షి ‘లఘుహరీతస్మ•తి’ అనే గొప్ప బృహత్‍ గ్రంథాన్ని రచించాడు. అందులో బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు, గృహస్త ధర్మ నిర్వహణ, వానప్రస్థ ధర్మాలు, సన్యాసం, యోగం మొదలైన వాటి గురించి లోతైన వివరణలు ఉన్నాయి.

హరీత మహర్షి ‘వృద్ధహరీత స్మ•తి’ పేరిట కూడా మరికొన్ని విషయాలు రాశారు. అందులోని ఎన్నో విషయాలను హరీతుడు అంబరీషుడికి వివరించారు.
‘వృద్ధహరీత స్మ•తి’లో హరీతుడు పేర్కొన్న ప్రకారం..

పురుషోత్తముడే అనాది అయిన దేవుడు. అందుకే ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం ఆ పురుషోత్తముడి పాదపద్మాల యందు భక్తి కలిగి ఉండటమే.
ఇంకా ఈ గ్రంథంలో మంత్ర విధానం, సమారాధన ఎలా చేయాలి?, విష్ణుమూర్తి యొక్క

పూజా విధానం, స్త్రీలు పాటించాల్సిన ధర్మాలు, ప్రాయశ్చిత్తం వంటి ఎన్నో విషయాల గురించి కూలంకషమైన వివరణలు ఉన్నాయి.
‘హరీతగీత’ అనే గ్రంథం కూడా భారతగీతలలో గొప్పది.

హరీతుడు ప్రవచించిన పలు ధర్మసూత్రాలను అనేక మంది మహర్షులు అనుసరించి, పాటించారు.

‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రం వింటుంటాం కదా! ఇది కూడా వృద్ధ హరీత స్మ•తి నుంచి వచ్చిన మంత్రమే.

వైద్య సంబంధమైన విషయాలను కూడా హరీత మహర్షి గ్రంథస్తం చేశారు. కౌమర్భ•త్య (శిశు సంరక్షణ) గురించి తెలిపే అష్టాంగ ఆయుర్వేద గ్రంథంలో ఒక భాగమైన హరిత సంహితను కూడా రచించినది వీరే.

ఇందులో శిశు, కౌమార దశలో పిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. భారతీయ సంప్రదాయంలో శిశువులకు నాయనమ్మలు, అమ్మమ్మలు.. కాళ్లపై పడుకోబెట్టుకుని స్నానం చేయించడం, స్నానానంతరం శిశువులకు సాంబ్రాణి ధూపం వేయడం తదితర పరిచర్యలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి. అవన్నీ హరీత మహర్షి రచించిన గ్రంథంలో పేర్కొన్నవే కావడం విశేషం.

Review రుషి పీఠం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top