ఆశించకు.. పని చేయడం మనకు!

శ్లోకం:
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూ: మా తే సంగోస్త్వ కర్మణి ।।
పదచ్ఛేదం:
కర్మణి – ఏవ – అధికార: – తే – మా – ఫలేషు – కదాచన – మా – కర్మఫలహేతు: – భూ: – మా – తే – సంగ: – అస్తు – అకర్మణి
ప్రతి పదార్థం:
తే= నీకు, కర్మణి ఏవ= కర్మాచరణలోనే, అధికార:= అధికారం ఉంది, ఫలేషు= దాని ఫలితాల మీద, కదాచన మా= ఎన్నడూ లేదు, మా కర్మఫలహేతు: భూ:= కర్మఫలానికి హేతువు కావద్దు, తే= నీకు, అకర్మణి= కర్మను మానడంలో, సంగ:= ఆసక్తి, మా అస్తు= ఉండకూడదు.
తాత్పర్యం:
‘‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు.
వివరణ:
భగవద్గీతలోని అద్భుతమైన శోక్లమిది. ఈ ఒక్క శ్లోకం చాలు.. మన నడవడిని, జీవనశైలిని విశ్లేషించడానికి. ఇక, ఈ శ్లోకం పూర్వాపరాల్లోకి వెళ్తే..
కర్మలను చేయడానికి మాత్రమే మనకు హక్కు ఉంది.
కర్మలను సదా అప్రమత్తతతో చేస్తూ ఉండాలి.
ఎప్పుడూ ‘కర్మిష్ఠి’గానే ఉండాలి.
‘అకర్మణ్యత్వం’ అన్నది ఎప్పుడూ ఉండ కూడదు. అంటే, కర్మ చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు.
నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తరువాతనే జీతం వస్తుంది.
ఫలితాన్ని తరువాత నెలలోనే అనుభవించ గలుగుతాం.
వర్తమానంలో దుక్కి దున్ని, విత్తు చల్లి, చేనుకు సంరక్షణ చేస్తేనే, భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది.
విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు.
అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా!
వర్తమానంలోని సుఖసంతోషాలు గత జన్మలలోని మంచి కర్మల ఫలితాలు..
కష్టాలు, నష్టాలు.. గత జన్మలలోని చెడు కర్మల ఫలితాలు.
అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవి ష్యత్తులో అనుభవిస్తాం.
ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమిత మైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మ ఫలాలు మన యొక్క అనేకానేక గత జన్మలలోని ఏ జన్మకు సంబంధించివి? ఏ కర్మ ఫలం అనేది అవగాహనకు రాదు. వాటిని మనం నిర్దేశించ లేము కూడా!.
అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడూ ‘లెక్కలు’ కట్టకూడదు.
‘లెక్కలు’ కట్టడానికి మన దగ్గర సరైన ‘విషయ జ్ఞానం’ ఏమీ లేదు.
లెక్కలనూ, ఫలితాలనూ పూర్ణ సృష్టికే వది లేయాలి.
సృష్టికి మాత్రమే తెలుసు.. ‘సరైన లెక్కలు కట్టడం’.
జన్మజన్మల లెక్కల ప్రకారం.. రావాల్సింది అంతా వచ్చి తీరుతుంది. జన్మజన్మల లెక్కల ప్రకారం.. పోవల్సిందంతా పోయే తీరుతుంది.
‘కర్మఫలాసక్తి’ ఉంటే.. ఫల ‘సిద్ధి, ‘అసిద్ధు’ల పట్ల రాగద్వేషాలను కలిగించి, కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు.
కర్మలు చేయడం మాని, అకర్ముడిగా మారి పోతే, భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే.. భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం.
కాబట్టి, మనం నిరంతరం కర్మలను ఆచ రిస్తూనే (చేస్తూనే) ఉండాలి.
అకర్ములుగా ఎన్నటికీ మిగలకూడదు.
దేనినైతే మనం ‘ధర్మం’ అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి.
ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి.
చివరకు నీకు దక్కేదే నీకు దక్కుతుంది.
ఆశలు పెంచుకుని, లెక్కలు వేసుకుని కర్మలు చేయడం విస్మరిస్తే చివరకు నిరాశే మిగులుతుంది.

Review ఆశించకు.. పని చేయడం మనకు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top