సినిమా బాక్సాఫీసు బరిలో నిలిచేందుకు అగ్రహీరోలు

బాక్సాఫీసు బరిలో నిలిచేందుకు అగ్రహీరోలు చెమటోడుస్తున్నారు. వచ్చే దసరా, సంక్రాంతి రేసులో పోటీ పడేందుకు తమ కొత్త సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు. నెలల వ్యవధిలో అభిమానులకు వినోదాల విందు వడ్డించేందుకు రెడీ అవుతున్నారు. పరిశ్రమలో అగ్రహీరోలుగా వెలుగొందుతున్న వారంతా వరుస సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. మరి దసరా, సంక్రాంతికి ముస్తాబవుతున్న స్టార్‍ హీరోల చిత్రాల విశేషాలేమిటో చదివేయండి..

‘మెగా’స్పీడ్‍..
‘మన శంకరవరప్రసాద్‍ గారు’గా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‍ దుమ్ము దులిపిన మెగాస్టార్‍ చిరంజీవి ప్రస్తుతం తన 158వ సినిమాను వడివడిగా పరుగులు పెట్టిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో మునుపెన్నడూ కనిపించని లుక్‍లో చిరంజీవి ఎంటర్‍టైన్‍ చేస్తారని చెప్పుకుంటున్న ఈ సినిమా 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. దీనికంటే ముందు ‘విశ్వంభర’తో ఈ దసరాకు సందడి చేయడానికీ చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. వీఎఫ్‍ఎక్స్ తదితర పనులతో ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరా పండక్కి రిలీజ్‍ చేయాలని చిత్ర యూనిట్‍ పట్టుదలగా ఉంది. అంటే మూడు నెలల వ్యవధిలోనే చిరంజీవి సినిమాలు రెండు వెండితెరపై కనువిందు చేయనున్నాయన్న మాట! ఈ రెండింటి తరువాత నేచురల్‍ స్టార్‍ నాని నిర్మాణ సారథ్యంలో శ్రీకాంత్‍ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమా రూపుదిద్దుకోనుంది.

వెంకీ.. తగ్గేదేలే!
చిరంజీవి బాటలోనే విక్టరీ వెంకటేశ్‍ కూడా జోరు చూపిస్తున్నారు. గడిచిన సంక్రాంతికి చిరంజీవితో కలిసి ‘మన శంకరవరప్రసాద్‍ గారు’లో సందడి చేసిన ఆయన తాజాగా త్రివిక్రమ్‍ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్‍ నంబర్‍ 47’ షూటింగ్‍ ముగింపు దశకు చేరుకుంది. వినోదం, యాక్షన్‍, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా రూపొందు తున్న ఈ చిత్రం అక్టోబరు 2న థియేటర్ల లోకి రానుంది. మరోవైపు, వెంకటేశ్‍, కల్యాణ్‍రామ్‍ కలయికలో అనిల్‍ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్‍ మూవీ షూటింగ్‍ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా 2027 సంక్రాంతికి రానుంది.

ప్రభాస్‍ జోరు..
ఈ ఏడాది ‘ది రాజాసాబ్‍’తో ప్రేక్షకులను పలకరించిన పాన్‍ ఇండియా స్టార్‍ ప్రభాస్‍.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’తో 2026 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలకడానికి సిద్ధమవుతున్నాడు. ఇది ఈ ఏడాది డిసెంబరు 3న థియేటర్లలోకి రానుంది. ఆ వెంటనే మరో మూడు నెలల వ్యవధిలో ‘స్పిరిట్‍’తో బాక్సాఫీస్‍ బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సందీప్‍రెడ్డి వంగా దర్శ కత్వంలో ముస్తాబవుతున్న ఈ యాక్షన్‍ థ్రిల్లర్‍పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందీ చిత్రం. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్‍ మొత్తం పూర్తి చేసుకుని 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫటాఫట్‍ రవితేజ..
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బాక్సాఫీస్‍ ముందు సందడి చేస్తుంటాడు రవితేజ. ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో నవ్వులు పంచిన ఈ హీరో ప్రస్తుతం ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్, పాటలు ఇప్పటికే తెలుగునాట మార్మోగు తున్నాయి. అయ్యప్పస్వామి నేపథ్యంలో సాగే ఈ సినిమా విడుదలకు సిద్ధం కాగా, వచ్చే సంక్రాంతి టార్గెట్‍గా మరో సినిమాను సిద్ధం చేసుకుంటు న్నాడు రవితేజ. హసిత్‍ గోలి దర్శకత్వంలో ముస్తాబు కానున్న ఈ చిత్రంలో మరో హీరోగా శ్రీవిష్ణు నటిస్తున్నాడు. ఈ కామెడీ ఎంటర్‍టైనర్‍ను డిసెంబరు నాటికి పూర్తిచేసి జనవరిలో తెరపైకి తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఉంది.

బరిలో యువ హీరోలు..
అగ్రహీరోలతో పాటు యువ హీరోలు కూడా వరుస సినిమాలతో హుషారెత్తించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో విజయాన్ని అందుకున్న శర్వానంద్‍.. త్వరలో ‘భోగి’తో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో సంక్రాంతి లక్ష్యంగా ఓ చిత్రం కోసం రంగంలోకి దిగాడు శర్వానంద్‍. అంటే నెలల వ్యవధిలోనే రెండు సినిమాలతో శర్వానంద్‍ పలకరించనున్నాడన్న మాట.
ఇక ఇటీవలే రష్మికను పెళ్లాడి కొత్త జీవితాన్ని ఎంజాయ్‍ చేస్తున్న విజయ్‍ దేవరకొండ ‘రణబాలి’, ‘రౌడీ జనార్దన’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివరి నాటికి తెరపైకి రావాల్సి ఉన్నా.. తేదీలు మారాయి. వీటిలో ‘రణబాలి’ని ఈ నవంబరులో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది చిత్ర బృందం. ఇక, ‘రౌడీ జనార్దన’ వచ్చే ఏడాదిలో వేసవి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్నగర్‍ వర్గాల టాక్‍.

ఇగ నుంచి ఈ జాగ ఎవరిది?
నాని ‘ది ప్యారడైజ్‍’ సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘దసరా’ తరువాత శ్రీకాంత్‍ ఓదెలతో కలిసి నాని చేస్తున్న రెండో సినిమా ఇది. చెరుకూరి సుధాకర్‍ నిర్మాత. కయాదు లోహల్‍ కథానాయిక. మోహన్‍బాబు, సంపూర్ణేశ్‍బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‍ ఆకట్టుకుంది. ‘ఇగ నుంచి ఈ జాగ ఎవరిది? ఈ దేశం ఎవరిది?’ అంటూ నాని చెప్పే డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ‘తూ అనిపించుకున్న కాకులు తల్వార్‍లు పడితే ఏమైతదో చూపిద్దాం’ అంటూ టీజర్‍ చివరిలో నాని చెప్పిన డైలాగ్‍ హైలైట్‍గా నిలిచింది.

దీపావళికి ‘రామాయణ’
దేశవ్యాప్తంగా సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ చిత్రం మొదటి భాగం ‘రామాయణ: పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఇప్పుడీ సంస్థ ద్వారానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ఉత్తరాదిలోనూ విడుదల కానుంది. నితేష్‍ తివారి దరక్శకత్వంలో ముస్తాబైన ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‍బీర్‍ కపూర్‍, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణుడిగా యశ్‍ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమా నిర్మాణంలో కూడా యశ్‍ ఒక భాగస్వామి కావడం విశేషం.
‘రాకా’.. క్లారిటీ లేదింకా!
అల్లు అర్జున్‍ ‘పుష్ప’ సినిమాల భారీ ఘన విజయం తరువాత తెరకెక్కుతోన్న చిత్రం ‘రాకా’. దీనికి అట్లీ దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది చివరి నుంచే చిత్రీకరణ జరుపుకుంటున్నా.. ఈ సినిమా గురించి బయటికొచ్చిన విషయాలు చాలా తక్కువ. అల్లు అర్జున్‍ లుక్‍, హీరోయిన్‍ దీపికా పదుకొణెను ప్రకటించడం మినహా మిగిలిన విషయాలేవీ బయటకు రాలేదు. అల్లు అర్జున్‍ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది మరో టాక్‍. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన ప్రచార చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కథ, షూటింగ్‍ విశేషాలు, తారాగణం తదితర విషయాలపై ఈ ప్రచార చిత్రం ద్వారా స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.

Review సినిమా బాక్సాఫీసు బరిలో నిలిచేందుకు అగ్రహీరోలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top