ఇద్దరు మిత్రులు ఒకరోజు అడవి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోకి ఒక సాధువు రొప్పుతూ వచ్చాడు.
‘ఎందుకలా భయపడుతున్నారు?’ అని ఆయనను అడిగారు వాళ్లిద్దరూ.
‘అదిగో.. అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది’ అన్నాడు సాధువు.
‘అంటే పులి ఉందా ఆ పొదలో’ అన్నారు వాళ్లిద్దరూ భయంగా.
‘లేదు. దానికంటే భయంకరమైనది. నేను మూలికల కోసం తవ్వుతుంటే బయటపడింద’న్నాడు సాధువు.
‘ఇంతకీ ఏమిటది?’ అని ఆదుర్దాగా అడిగారు ఇద్దరు మిత్రులు.
‘బంగారు నాణేల గుట్ట’ అని చెప్పాడు సాధువు.
అది వినగానే ఇద్దరు మిత్రుల ముఖంలో భయం పోయి సంతోషం కలిగింది. ‘ఎక్కడా?’ అని అడిగారు.
‘అదిగో.. ఆ పొదల్లోనే’ అని చూపించి తన దారిన పోయాడు సాధువు.
వాళ్లిద్దరూ ఆ పొద వైపు పరుగెత్తుకుని వెళ్లి చూస్తే, అక్కడ నిజంగానే పసిడి గుట్ట ఉంది.
‘ఆ సాధువు ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేంటి?’ అన్నాడొక మిత్రడు.
‘అతడి సంగతి వదిలెయ్. దీన్నేం చేయాలో ఆలోచించు’ అన్నాడు మరొకడు.
‘ఈ నిక్షేపాన్ని ఊళ్లోకి తీసుకెళ్తే అందరి కంటా పడుతుంది. వాటాలకు వస్తారు. కాబట్టి ఈ నిధికి నేనిక్కడ కాపలా ఉంటాను. నువ్వు ఊళ్లోకి వెళ్లి భోజనం తీసుకురా’ అన్నాడొకడు.
అనుకున్నట్టే ఒకడు కాపలా ఉన్నాడు. మరొకడు అన్నం తీసుకురావడానికి వెళ్లాడు.
ఇంతలో కాపలాగా ఉన్న వాడు- ‘నేనీ రోజు ఒక్కడినే వచ్చుంటే నిధి మొత్తం నాకే సొంతమయ్యేది కదా! అనవసరంగా రెండో వాడికి వాటా ఇవ్వాల్సి వస్తోంది. బంగారం కూడా ఏమంత ఎక్కువ లేదు. ఇదంతా నాకే దక్కాలంటే వాడు రాగానే కత్తితో పొడిచి చంపేయాలి’ అనుకుని కత్తిని సిద్ధం చేసుకున్నాడు.
ఊళ్లోకి వెళ్లిన వాడు- ‘వాడికి సగం వాటా ఎందుకివ్వాలి? మొత్తం నేనే తీసుకుంటే పోలా! అసలే ఊరి నిండా అప్పులున్నాయి. కాబట్టి నేను తీసుకెళ్లే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. అప్పుడు బంగారం మొత్తం నాకే సొంతమవుతుంది. దెబ్బకి అప్పులు తీరిపోతాయి’ అనుకున్నాడు. అనుకున్నట్టే అన్నంలో విషం కలిపి తీసుకెళ్లాడు.
రెండో వాడు అన్నం తీసుకురాగానే పొదల మాటున దాగున్న మొదటి వాడు ఒక్క ఉదుటున దూకి కత్తితో పొడిచి చంపేశాడు.
‘పిచ్చోడు. బంగారంలో సగం వాటా తనదేనని అనుకున్నాడు. చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎంచక్కా భోజనం చేసి ఈ బంగారమంతా ఇంటికి తీసుకెళ్తాను’ అనుకుని అన్నం మూట విప్పి తిన్నాడు. విష ప్రభావంతో కొద్దిసేపటికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
చనిపోయే చివరి క్షణాల్లో ‘సాధువు చెప్పింది ఎంత నిజమో కదా!’ అనుకున్నాడు.
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు




































































Review సంపాదకీయం ఎంత నిజమో కదా!.