విజయసోపానాలైన బుద్ధి, సిద్ధి ఉండేవి గణపతి ఆధీనంలోనే. లక్ష్యం విషయంలో స్పష్టత ఉన్నప్పుడే, మనం బుద్ధిని సమర్థంగా ఉపయోగిస్తాం. త్వరితంగా సిద్ధినీ పొందుతాం. ఏ పనినైనా ప్రారంభిస్తున్నప్పుడు ‘అవిఘ్నమస్తు’ అంటూ స్మరించే సిద్ధి-బుద్ధి సమేత విఘ్నేశ్వర రూపం మనకా స్పష్టతను ప్రసాదిస్తుంది.
అయినా కొన్నిసార్లు అజ్ఞానంతోనో, అహంకారం వల్లనో ఉమాసుతుడి ఉనికినే ప్రశ్నిస్తాం. అంతిమంగా ఫలితాన్నీ అనుభవిస్తాం. మహావిష్ణువుకే తప్పలేదా చేదు అనుభవం. మధుకైటభుల సంహారానికి బయల్దేరినపుడు విష్ణువు మాట మాత్రంగానైనా మహా గణపతిని స్మరించలేదట! దీంతో ఐదు వేల సంవత్సరాలు పోరాడినా శత్రువుల్ని గెలవలేకపోయాడు విష్ణువు. ఓ దశలో తీవ్రంగా అలసిపోయాడు కూడా. ఆ సమయంలో శివుడి సలహాతో విఘ్నేశ్వరుడిని ప్రార్థించాడు విష్ణువు. అంతే.. పరిస్థితులు మారిపోయాయి. ఒక్క దెబ్బకు ఇద్దరు రాక్షసులూ నేలకూలారు.
వ్యాసుడు సైతం పురాణ రచనకు పూనుకున్నప్పుడు సకల విద్యలకూ ఒజ్జ అయిన బొజ్జ గణపతిని చిన్నచూపు చూశాడట. దీంతో ఆయన కలం మొరాయించింది. భావధార ఆగిపోయింది. వెంటనే తప్పు తెలుసుకుని విద్యా గణపతి ప్రార్థనతో రచనకు ఉపక్రమించాడు. ‘బ్రహ్మవ్యాస సంవాదంలో’ వ్యాసుడే స్వయంగా ప్రస్తావించిన విశేషమిది. వినాయక కటాక్షం తరువాతే వ్యాసుడి కలానికి వెయ్యేనుగుల బలమొచ్చింది. చదువుల సారమైన దేవుడే రాయసకారుడి స్థానంలో కూర్చుని అష్టాదశ పురాణాలకూ అక్షరరూపమిచ్చాడు.
గణపతి స్తోత్రంతోనే ఘంటాన్ని కదిలించడం తరాల సాహితీ సంప్రదాయం. కవిత్రయం కూడా ఆ బాటలోనే నడిచింది. పోతన శ్రీభాగవతంలో ‘ఆదరమొప్ప మ్రొక్కిడుదు..’ అంటూ గణనాయకుడికి అక్షరాభిషేకం చేస్తాడు.
పిల్లలు కాసేపు అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతారు. కాసేపు నాన్న భుజానకెక్కుతారు. కొన్నిసార్లు ‘రా.. బంగారం’ అని తల్లి గోముగా పిలుస్తుంది. ‘నా దగ్గరికే వస్తాడు’ అంటూ నాన్న పోటీగా చేతులు చాస్తాడు. అటువంటప్పుడు ఎటువైపు మొగ్గాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తారు పిల్లలు. గణపతికి మాత్రం ఆ సమస్య లేదు. ఎందుకంటే ఆయన కన్నవారిది అర్థనారీశ్వర తత్త్వం కదా! అటు సగం అమ్మ.. ఇటు సగం నాన్న కాబట్టి.. ఒకేసారి ఇద్దరి అనురాగాన్నీ ఆస్వాదిస్తాడు బాల గణపతి. ఒక చేత్తో అమ్మ చనుబాలు చప్పరిస్తూ, మరో చేతితో నాన్న మెడలోని నాగుపాముతో ఆడుకుంటాడట! ‘మనుచరిత్ర’లో పెద్దన గారి వర్ణన ఇది.
గణపతిని కవిం కవీనాం.. అని కీర్తిస్తుంది వేదం.
ఆయన కవులకే కవి.
సాహితీవేత్తలకు, విద్యార్థులకు అక్షర సంపదతో పాటు అక్షయమైన సృజననూ ప్రసాదిస్తాడు.
వక్రాన్ తుండయతీతి వక్రతుండ:..
వక్రాలను, అంటే అవరోధాలను ముక్కలు చేసేవాడే వక్రతుండుడు.
వినాయక చవితి శుభ సందర్భాన ఆ ఏకదంతుడికి ప్రణమిల్లుదాం!
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు




































































Review విఘ్న గణపతి.