స్వాగతం కృష్ణా..

కృష్ణ..
ఈ రెండు అక్షరాలకు అష్టాక్షరీ మంత్రంతో సమానమైన మహత్తు ఉంది. కృష్ణ అనే మాటకు ఐదు రకాల అర్థాలు ఉన్నాయి.
ఒకటి- నల్లని వాడు.
రెండు- ఆకర్షణ శక్తి ఉన్నవాడు.
మూడు- సచ్చిదానంద స్వరూపుడు.
నాలుగు- చెడును నిర్మూలించే వాడు.
ఐదు- కాల స్వరూపుడు.
కృష్ణ అనే పేరుకు ఉన్న అర్థాల మాదిరిగానే కృష్ణుడి జీవితంలోనూ పలు పార్శ్వాలున్నాయి.
బాలకృష్ణుడు, భాగవత కృష్ణుడు, భారత కృష్ణుడు.. ఇలా ఆయన ఒకే జీవితంలో పెక్కు పాత్రలు పోషించాడు.
కృష్ణుడి వివిధ స్వరూపాల్లో బాలకృష్ణుడి రూపాన్ని కూడా ఉపాసనా దైవంగా ఎంచుకునే వారూ ఉన్నారు.
విష్ణుమూర్తి మిగతా స్వరూపాలతో పోలిస్తే బాలకృష్ణుడు ఇట్టే కరిగిపోతాడట.
అడిగినంతనే వరాలు కురిపిస్తాడట.
బాలకృష్ణుడి సాధకులు వటపత్రశాయి మూర్తిని ప్రతి నిత్యం ఆరాధిస్తారు.
కర్ణాటకలోని ఉడుపి బాలకృష్ణుడి భక్తుల దర్శనీయ క్షేత్రం.
శ్రీకృష్ణదేవరాయలు కూడా బాలకృష్ణుడి ఉపాసకుడే.
తన భక్తికి చిహ్నంగా ఆయన హంపీలో బాలకృష్ణుడికి ఓ ఆలయన్నీ కూడా నిర్మించారు.
‘నీలాంటి బాల్యాన్ని మాకివ్వు’ అని చేతులు జోడించి ప్రార్థించేంత అందమైన బాల్యం బాలకృష్ణుడిది.
బాలగోపాలుడు అచ్చమైన అమ్మకూచి.
రేపల్లెలోని ప్రతి ఇల్లూ బాలకృష్ణుడి పెంపకంలో పాలు పంచుకుంది.
అందుకే ఆయన అడ్డాల నాడే మొదలైన కష్టాలను బిడ్డగా ఉన్నపుడే ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
పుట్టీ పుట్టగానే వెదురుబుట్టలో కుదురుగా పడుకుని..
ఊంగాలు పాడుకుంటూ యమునను దాటింది మొదలు..
మళ్లీ మథురకు వెళ్లి కంసమామను కడతేర్చే వరకూ..
బాలకృష్ణుడి అనుభవాలు అందమైన అనగనగా కథలు.మనం అమ్మానాన్నలమైతే మన పిల్లలకూ..మనం తాతలూ నాన్నమ్మలమైతే మన మనవళ్లకూ, మనవరాళ్లకూ..ఇష్టంగా పంచాలనిపించే పంచదార చిలకలు చిన్నికృష్ణుడి లీలలు.ఏ బిడ్డనైనా అచ్చంగా అలానే పెంచాలనిపించే పేరెంటింగ్‍ సూత్రాలు.అందుకే మన పిల్లలకు.. ఈ తరం పిల్లలకు బాలకృష్ణుడి కథలు చెబుదాం.

వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి, రాఖీ పూర్ణిమ,
వినాయక చవితి శుభాకాంక్షలు

– డాక్టర్‍ కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review స్వాగతం కృష్ణా...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top