బేతాళుడి ప్రశ్నకు రాజు చెప్పిన తెలివైన సమాధానం కన్నా రాజుకు మౌనభంగమైనందుకు బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు.. చిన్నప్పుడు మనం చదువుకున్న బేతాళుడు- విక్రమార్కుడి కథలోని ఈ ముగింపు వాక్యం మనకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది.
ఎందుకంటే బేతాళుడు తిరిగి చెట్టెక్కితేనే మనకు తిరిగి చదువుకోవడానికి మరో కథ దొరుకుతుంది మరి! కథలంటే మనిషికి ఎంతో ఇష్టం.
అవి మనిషి రాసిన కట్టు కథలైనా.. మనిషి జీవితాన్ని రాసిన నిజం కథలైనా!
అందుకే ఆ కథల్ని చెప్పే పుస్తకాలంటే మరీ ఇష్టం.
పుస్తకం ఆనందాన్నిస్తుంది. అలవాట్లను మారుస్తుంది.
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది.
తరాల మధ్య వారథీ, జ్ఞానాన్ని పంచే నిధీ అయిన పుస్తకం మనిషి జీవితంలో విడదీయరాని భాగం.
మంచితనాన్నీ, మానవత్వాన్నీ మనసులో నింపే నిజమైన నేస్తంలాంటి పుస్తకాలను చదవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత కొందరికే అనుకూలిస్తుంది.
మిగిలిన వారు ఆ అదృష్టానికి నోచుకోలేదని బాధపడకుండా పుస్తకాన్ని అందుబాటులోకి తేవడానికి నేడు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అరచేతిలోని స్మార్ట్ ఫోన్లో ‘ఈ-బుక్స్’ రూపంలో లక్షల పుస్తకాలు ఇమిడిపోతున్నాయి.
ఎప్పుడంటే అప్పుడు, ఏదంటే అది చదివేసుకోవచ్చు.
ఇందుకోసం వాట్సాప్, టెలిగ్రామ్లో చాలా చానళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంటర్నెట్ ఆర్చివ్స్తో చాలా పాత పుస్తకాలు కూడా చదువుకునే వెసులుబాటు ఉంది.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈమధ్య ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు దొరుకుతున్నాయి. ‘
బుక్ ఫెయిరీ’ ఉద్యమం ఫలితంగా కొందరు తాము చదివిన పుస్తకాలను ఈ నగరాల్లోని వేర్వేరు చోట్ల వదిలిపెడుతున్నారు. కావాలనుకున్న వారు వాటిల్లో నచ్చిన పుస్తకాలను చదివి.. తిరిగి అక్కడే వదిలిపెట్టవచ్చు. కొందరైతే ఎలాంటి పుస్తకం ఎక్కడ దొరుకుతుందో సోషల్మీడియాలో ‘క్లూ’ కూడా ఇస్తున్నారు. వీటిని అందిపుచ్చుకుని చదివిన వారు తమ ఆనందాన్ని తిరిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
ఓ మంచి పుస్తకాన్ని కానుకగా ఇస్తే.. చిన్నారి పాపాయి రంగుల కలలకు రెక్కలు తొడగొచ్చు.
ఎదుగుతున్న కుర్రాడికి సమాజ పోకడలను విప్పి చెప్పవచ్చు.
ఆవేదనలో ఉన్న ఆత్మీయ నేస్తానికి ఓదార్పునివ్వొచ్చు
పండు వయసులోని పెద్దలకు ధైర్యాన్ని ఇవ్వొచ్చు.
మన ప్రియతముల కోసం మొత్తం ప్రపంచాన్నే చాపలా చుట్టి చేతిలో పెట్టొచ్చు.
ఏప్రిల్ 23: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆ కానుక ఇస్తున్నారా మరి..?
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు




































































Review వెలకట్టలేని కానుక.