కార్తీక మహాదేవుడు.. కార్తీక దామోదరుడు!

న కార్తీక సమో మాస:
మాసాలలో కార్తీకాన్ని మించినది లేదని అర్థం. ఇది స్కాంద పురాణోక్తి.
ఈ మాసంలో మహా విష్ణువుకు కార్తీక దామోదరుడని పేరు.
ఇక, పరమశివుడు కార్తీక మహాదేవుడిగా ఈ మాసంలో పూజలందుకుంటాడు.
‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్‍’ అనే విష్ణత్వ వైభవం, ‘శివతరాయచ’ అనే పరమశివ వైభవం అంటూ అంతర్యామికి చెందిన రెండు వైభవాలను వేదం వర్ణించింది.
హరిహర తత్వాల మధ్య ఉండే అన్యోన్యతను, ఏకత్వ భావనను అవగతం చేసుకోవడానికి, వారిద్దరూ ఒకటేనని సత్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞానదీపం వెలిగించే మాసం కార్తీకం.
వేకువజామునే చల్లని నీటితో స్నానం చేయడం కార్తీక స్నానాల్లోని ముఖ్యమైన అంశం. కార్తీకం తరువాత ప్రవేశించే శీతాకాలానికి అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసమే ఈ చన్నీటి స్నానాలను మన పెద్దలు ఆచారంగా నిర్దేశించారు.
ఒకసారి వశిష్టుడు సిద్ధాశ్రమానికి వెళ్తూ దారిలో జనక మహారాజును కలిశాడు. జనకుడు ఆయనను ఆదరించి, ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గాన్ని, అందులోనూ వినగానే పుణ్యం వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పాలని వశిష్టుడిని అడిగాడు. అప్పుడు వశిష్టుడు జనకుడికి కార్తీక మహాత్మ్యం గురించి వివరించాడు. కార్తీక పురాణాన్ని ఎవరైనా వింటే చాలు అది చెప్పిన వారికి, విన్న వారికి పుణ్యం కలుగుతుందన్నాడు.
కార్తీక మాసంలో వన భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
ఎందరో దేవతలు వనాలలో, కొండకోనల్లో వెలుస్తారు.
సుప్రసిద్ధ శైవ, వైష్ణవ క్షేత్రాలు కూడా చాలా వరకు ఇలా కొండకోనల్లో, దుర్గమారణ్యాలలో వెలసినవే.
అందువలన వనభోజనాలు చేయడం దేవతా ప్రీతికరమని ప్రతీతి.
మానవాళి మనుగడకు పత్రహరితమే కీలకమని చెప్పడంతో పాటు, వృక్షోరక్షిత రక్షిత అని పిలుపునివ్వడం కార్తీక వన భోజనాల వెనుక ఉన్న ఆంతర్యం.
విష్ణువుకు ప్రీతికరమైన ఉసిరిచెట్టు కింద పనస ఆకుల విస్తరిలో భోజనాలు చేయడం కార్తీక వన భోజనాల సంప్రదాయం. వన భోజనాల ఆంతర్యం ఏమిటంటే.. శ్రావణ, భాద్రపదాల్లో విశేషంగా వర్షాలు కురుస్తాయి. శరదృతువులో వచ్చే ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో భూమి నుంచి కొత్త మొలకలు మొలకెత్తుతాయి. వన భోజనాల సమయంలో ఆయుర్వేద మూలికా వైద్యం తెలిసిన అనుభవజ్ఞులు ఈ మొక్కల ఉపయోగాన్ని, వాటి వల్ల కలిగే ఫలితాలను విశదీకరించేవారు. ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడం వల్ల చదువు సంధ్యలు లేని పామరులు సైతం వైద్య మర్మాలను వన భోజనాల సమయంలో గ్రహించగలిగే వారు. మొక్కల వల్ల ఒనగూడే ప్రయోజనాన్ని తెలుసుకోవడం వల్ల, వాటి పట్ల గౌరవంగా మసులుకునే వారు. ప్రకృతిని, వృక్షాలను ప్రేమించే లక్షణాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేపట్టే కార్తీక వన భోజనాలు మనుషుల మధ్య సామరస్యానికి కూడా దోహదపడతాయి.
(దీపావళి, కార్తీక మాస శుభాకాంక్షలు)

– డాక్టర్‍ కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review కార్తీక మహాదేవుడు.. కార్తీక దామోదరుడు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top