అష్టోత్తర శతనామాలూ, సహస్ర నామాలూ జగన్మాత దుర్గాదేవి పేర్లనే కాదు.. ఆ నామాలతో ముడిపడిన సద్గుణాలనూ చాటి చెబుతాయి. అవన్నీ ఉత్తముల లక్షణాలు కూడా.
ఆ లక్షణాలు ఏమిటంటే..
సర్వ విద్యాధి దేవతాయై నమ:
అమ్మ అక్షర రూపిణి. అజ్ఞానానికి ప్రతీకలైన రాక్షసులను సంహరించి, జ్ఞానమే సర్వోన్నతమని చాటింది.
నిరహంకారాయై నమ:
అమ్మ అహంకారానికి అతీతురాలు. త్రిమూర్తులూ అహంకరించిన సమయంలోనూ తనదైన పద్ధతిలో ఆ ముగ్గురి మాయా పొరలను తొలగించింది.
హంసవాహిన్యై నమ:
హంస పాలనూ నీళ్లనూ వేరు చేస్తుంది. హంసవాహిని అయిన అమ్మకు మంచిచెడుల విచక్షణ అపారం.
ధర్మనిష్టాయై నమ:
దుర్గమ్మ నిలువెత్తు ధర్మస్వరూపం. రాక్షసులైనా సరే, ధర్మం తప్పనంత కాలం వాళ్ల జోలికి వెళ్లలేదు.
శుభ్రాయై నమ:
తల్లి మనసు పరిశుభ్రం. కల్మషాలకు అతీతం. ఆమె గుండెనిండా ప్రేమే. అసురులకు సైతం మాతృత్వ ప్రేమతో ముక్తినిచ్చింది.
వాణ్యై నమ:
జగన్మాత వాక్కుకూ అధిదేవతే. ప్రియభాషణను ఇష్టపడుతుంది. వాచాలతను గర్హిస్తుంది.
స్వతంత్రాయై నమ:
దేవి సర్వస్వతంత్రురాలు. ఎవరి మీదా ఆధారపడదు. ఎవరినీ యాచించదు. ప్రతిసారీ తనదే పైచేయి.
నిస్సంశయాయై నమ:
జగన్మాత ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ఆచరణలోనూ అంతే కచ్చితత్త్వం కనిపిస్తుంది.
పూర్ణాయై నమ:
శాంకరి పరిపూర్ణతకు మారుపేరు. ఏ కర్తవ్యాన్ని అయినా లోపరహితంగా పూర్తి చేస్తుంది.
తపస్విన్యై నమ:
ఆ నిత్యానంద స్వరూపిణి సర్వకాలాల్లోనూ తపోముద్రలో ఉంటుంది. తపస్సు ఏకాగ్రతకు చిహ్నం.
విజయదశమి శుభాకాంక్ష
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు





































































Review దేవీతత్త్వం.