పలుకు‘బడి’

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

కాలనేమి జపం
చేపలను పట్టడానికి నీళ్లలో నిశ్చలంగా నిలిచి, అవి దొరికినపుడు తటాలున పట్టే కొంగ జపాన్ని గురించి మనం చిన్ననాటి కథల్లో చదువుకున్నాం, విన్నాం. ఆ విధంగా మాటువేసి ఎదురుచూసి ఆహారం సంపాదించడాన్ని కొంగజపం, బక జపం, బక ధ్యానమని కూడా పిలుస్తారు. ఆహార సంపాదనకు ప్రకృతి నిర్ణయించిన మార్గమది కొంగలకు. అది స్వాభావికం, అస్వాభావికంగా తనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తిని చంపడానికి ఎదురుచూస్తూ దొంగవేషంలో జపతపాలు చేసిన వాడు కాలనేమి. సీతారాములను మాయలేడి వేషంలో మోసగించి మారీచుడికి ఇతడు పుత్రరత్నం. అసలు మోసగాడు అనడానికి ‘వాడు మారీచుడు’ అనే పేరు సంపాదించిన వాడు తండ్రి. అతడి కొడుకు రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా బతికే ఉన్నాడు. రావణుడి ప్రోద్బలం వల్ల హనుమంతుడిని మోసగించి చంపడానికి ప్రయత్నించిన వాడు కాలనేమి. అయితే అతడి ప్రయత్నం సఫలం కాలేదు. మాయ వేషంలో మోసగించదలచి దొంగజపం చేసే వాళ్లను కాలనేమిగాడంటారు. లోకవంచన కోసం చేసే తప్పుడు పూజా పురస్కారాలనూ జపతపాలనూ కాలనేమి జపమంటారు. ఆషాఢభూతి సొంత వేషంలోనే ఉండి మోసం చేయగలిగితే, కాలనేమి దొంగ వేషం వేసి.. సాధించలేకపోగా చచ్చి ఊరుకున్నాడు. అదీ భేదం.

కలగూరగంప
కలవేసిన (అంటే రకరకాల) కూరల (కూరగాయల) గంప (బుట్ట)ను కలగూరగంప అంటారు. కొందరు ఒకే కూరాకునో, ఒకే రకం కాయలనో, పళ్లనో అమ్ముతారు. మరికొందరు రకరకాల ఆకులూ, కూరలూ, కాయలూ, పళ్లూ అమ్ముతారు. భిన్నజాతులకు చెందిన కాయగూరలున్న గంప కలగూరగంప. గంప లేకపోయినా, కాయగూరల్లేకపోయినా రకరకాల వస్తువులుంటే కూడా కలగూరగంప అనే అంటారు. పదబంధంలో మొదట ఉన్న ‘కల’ అన్నది ‘కలిసేట్టు, కలగాపులగంగా ఉన్న’ అనే అర్థం గల విశేషణ పదం. ‘కలనేత’ చీరలో ఒకటికి మించిన రంగుల దారాలు కలిసి ఉంటాయి. కలగాపులగంలో తెల్ల, పచ్చ ఖాద్య ద్రవ్యాలు కలిసి ఉంటాయి. అలాగే కలగూరగంపలో భిన్న భావాలు, వస్తువులు ఏవైనా కలిసి ఉండవచ్చు. కాయలూ, గంపా మాత్రం ఖండితంగా ఉండనక్కర లేదు.

కవలవాడి తలనొప్పి
కవల పిల్లలు అన్నివిధాలా ఒకరినొకరు పోలి ఉంటారని అనుకుంటాం కానీ సయామీస్‍ కవలలు కూడా ఏదో చిన్న భేదం లేకుండా ఉండరు. లోకదృష్టిలో కవల పిల్లల్లో ఒకరికి తలనొప్పి వస్తే రెండో వారికీ వస్తుందనే నమ్మకముంది. తనకు ఆ బాధ రావడానికి కారణం లేకపోయినా రెండో వాడికి వచ్చినందు వల్ల తనకూ తప్పదనేది విశ్వాసం. అంటే నిష్కారణంగా వచ్చిపడ్డ బాధ అన్నమాట. స్నేహం వల్లనో, బంధుత్వం వల్లనో ఇతరులు చేసిన తప్పు వల్ల తాను కూడా బాధపడవలసి వస్తే ‘నా తప్పేం లేదండీ.. ఇదంతా కవలవాడి తలనొప్పి అని విచారపడటం కద్దు. ముడ్డి మీద తన్నితే మూతిపళ్లు రాలినట్టు, తోటివాడో, సాటివాడో చేసిన తప్పునకు తాను ప్రతిఫలం అనుభవించవలసి వస్తే అది కవలవాడి తలనొప్పి కింద లెక్క.

కశ్శన్న
‘కశ్చన’ అనే సంస్క•త పదానికి ‘ఎవడో ఒకడు’ అని అర్థం. ఆ మాటే తెలుగు వారి నోట ‘కశ్శన్న’గా మారిందని అంటారు. మరికొందరు పురాణార్థాలు కూడా చెబుతారు. పరశురాముడు రాజులను చంపి తాను సంపాదించిన భూభాగం అంతటినీ కశ్యప మహర్షికి దానమిచ్చాడు. ఆ కశ్యప మహర్షే కాలక్రమేణా కశ్శన్నగా మారాడని అంటారు. అందుకో ఉపపత్తి కూడా చెబుతారు. ‘గోత్రస్య’ అని ‘ఫలానా గోత్రానికి చెందిన నేను చేస్తున్న పూజ’ అని దేవుడికి చెప్పుకుంటారు. ఆయన రికార్డులో నమోదైతే పుణ్యం వస్తుందని సమయానికి స్ఫురించకపోయినా, దత్తత వంటి వాటి వల్ల కానీ, అనాథగా బతకడం వల్ల కానీ స్పష్టంగా తెలియకపోయినా, ‘కాశ్యప గోత్రస్య’ అని చెప్పుకోవచ్చు. కశ్యపుడు సంపాదించినది కాబట్టి ఈ భూమికి ‘కాశ్యపి’ అనే పేరు వచ్చిందట. ‘ఈ భూమండంలోనే పుట్టి పెరిగిన నేను’ అని అస్పష్టంగానైనా తన ప్రవర చెప్పుకోవాల్సిన వ్యక్తి కశ్యపన్న ఉరఫ్‍ కశ్యన్న ఉరఫ్‍ కశ్శన్న అని అనే వాళ్లున్నారు. అంటే, ఫలానా అని ఖండితంగా చెప్పడానికి వీల్లేని వ్యక్తి అన్న మాట. తనకంటూ చెప్పుకోదగిన ఊరుగాని, పేరుగాని లేని వ్యక్తిని గురించి ఈసడింపుగా మాట్లాడేటపుడు ‘ఎవడైతేనేం? ఎవడో ఒక కశ్శన్న గాడు నా సొమ్ము తీసుకుని ఎగేశాడయ్యా’ అని విదిలించి మాట్లాడతారు. కశ్శన్న ఒక అభాగ్యుడు. ఒక అనామకుడు. ఒక అడ్రస్‍ లేని వ్యక్తి. మనిషి ఉన్నా మనం గుర్తించని మనిషి. మనల్ని విసిగించే వ్యక్తి. మనకు సాటిగాని వాడు తక్కువ వాడు మనం అసహ్యించుకునే వాడు.

కాకదంత పరీక్ష
కాకికి పళ్లున్నాయో లేదో ఒక పెద్దమనిషి తేల్చుకుని లెక్కపెడదామనుకున్నాడట. పక్షులకు పళ్లుంటాయో లేదో కూడా అతగాడికి తెలియదు. పైపెచ్చు అనుమానం మనిషి. లేకపోతే పరవాలేదు కానీ ఉంటే ఎన్ని ఉన్నాయో తేల్చుకోవడం మంచిదని జాగ్రత్తగా పరీక్షించాడని అంటారు. లోకజ్ఞానం లేని వ్యక్తి అన్నీ తెలుసుకోవాలనే ఆరాటంతో హైరానా పడుతుంటే కాకదంత పరీక్ష చేస్తున్నాడని అంటారు. పది మందీ లేవన్నా ఉండక పోతాయా అన్న అనుమానంతో శ్రమించడాన్ని కూడా ‘కాకదంత పరీక్ష’ అంటారు. అంటే వృథా ప్రయాస పడటం అన్నమాట.

కాకతాళీయం
కాకి మీద పుట్టి బహుళ వ్యాప్తిలో ఉన్న జాతీయాల్లో ఇదొకటి. ఒకసారి ఓ కాకి చెట్టు మీద వాలింది. పరిపక్వమైన ఒక పండు మీద వాలే సరికి ఆ పండు రాలిపడింది. నిజానికి కాకి వాలకపోయినా ఆ పండు మరికాసేపట్లో రాలిపోయేదే. ఆ పండు రాలేటపుడు కాకి వాలాలని కూడా ఏమీ లేదు. అది వాలటం, ఇది రాలటం అనుకోకుండా ఒకేసారి జరిగిన పనులు. అలా జరుగుతుందని ముందుగా ఒకరు ఊహించనూ లేదు. ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధమూ లేకపోయినా, ఏదో పరస్పర సంబంధమున్నట్టు అనిపించే సంఘటన/దుర్ఘటన కాకతాళీయంగా జరిగిందంటారు. అనుకోకుండా జరిగిన పనిని కాకతాళీయం అనడం పరిపాటి. ‘కాక’మంటే కాకి. ‘తాళ’మంటే తాటిచెట్టు.

కాటికాపరి యేడ్పు
పెళ్లికన్నా సంతోషప్రదమైనదీ, చావుకన్నా దుర్భరమైనదీ లేదు, ఉండదు. వల్లకాడు దగ్గర కాపరిగా ఉండే వ్యక్తి నిత్యం చావులు చూస్తుంటాడు. గుండె రాయి చేసుకుని బతకాల్సిన వాడు కాబట్టి చచ్చిన ప్రతి మనిషి కోసం విచారపడలేడు. అలవాటై అతడు ఎవరి కోసమూ ఏడవలేడు. అయినా, మానవ శరీర ధర్మంగా ఏడ్పు సహజం అయితే, శవ సంస్కారమే అతడి వృత్తి ధర్మమూ, జీవనాధారమూ కాబట్టి అందుకు అవకాశం లేనపుడు ఏడ్చి తీరతాడు. తప్పదు. లోకమంతా చచ్చిన వాళ్లను తలుచుకుని ఏడిస్తే అతగాడు చావులు లేకపోతే ఏడుస్తాడు. రోగులూ, రోగాలూ లేవని వైద్యులు, ఔషధ విక్రేతలూ ఏడ్చినట్టు లోకదృష్టిలో అది అసహజమైనా అతడి బతుకుదెరువు దృష్టిలో అది అత్యంత సహజం. ఈ కారణంగా ‘కాటికాపరి యేడ్ప’ంటే లోకం సుఖంగా బతుకుతున్నందుకు ఏడ్చే ఏడ్పని అర్థం వచ్చింది. అది దొంగ ఏడ్పు కాదు. తన కష్టాలను తలచుకుని ఏడ్చే ఏడ్పు. లోకం కోసం ఏడ్చేదీ కాదు. లోకబాధలకూ స్పందించేదీ కాదు. కేవలం స్వప్రయోజన పరాయణం.

కామారపు జీడి
జీడి ఎక్కడున్న ఒకటే స్వభావం దానిది. అంటుకుంటే వదిలిపెట్టదు. కాకపోతే కామారపు జీడి మరింత ప్రశస్తం కాబట్టి గట్టి పట్టే పడుతుంది. ఒకపట్టాన వదలదు. బహుశా కల్తీ లేనందువల్ల కావచ్చు. ఏ మనిషైనా వెంటపడి వేధిస్తూ, వదిలి పెట్టకుండా బాధిస్తుంటే ‘కామారపు జీడిలా తగులుకున్నాడు. ఒకపట్టాన వదిలేట్టు లేడు’ అని విసుక్కోవడం కద్దు.

మాయ
బ్రతుకులన్నియు మాయ, భవబంధములు మాయ,
తెలివి మాయ, తన్ను దెలియ మాయ
మాయ తెలియువాడె మర్మజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ! వినుర వేమ!
అర్థాలు:
మాయ= భ్రాంతి, భవబంధములు= సంసార బంధములు, మర్మజ్ఞుడు= తత్త్వం తెలిసిన వాడు.
భావం:
భౌతికమైన జీవితాలన్నీ మాయ. పుట్టుకతో వచ్చే బంధాలన్నీ మాయ. తెలివి మాయ. తనను గురించి తెలుసుకోవడమూ మాయ. మాయను తెలిసిన వాడే తత్త్వ మెరిగిన యోగి.
వివరణ:
యా మా సా మాయా అన్నారు. ఏది లేదో అది మాయ. ఉన్నట్టుగా కనిపిస్తున్న నిజానికి లేనిది మాయ. మనుషుల బతుకంతా మాయే. జీవితం యథార్థంగా భావించి కష్టసుఖాలను అనుభవిస్తాము. అదంతా అసత్యమే. తల్లి, తండ్రి, భార్య, భర్త ఇత్యాదిగా ఉన్న బాంధవ్యాలు అసత్యం. నాకు తెలుసు అనుకునే విద్వత్తు కూడా యథార్థం కాదు. తెలుసుకున్న విషయం అసత్యం. నేనేంటో నాకు తెలుసు అనుకోవడం అసత్యం. అంతా మాయ అని తెలుసుకున్న వాడే తత్త్వం తెలిసిన యోగి. దృశ్యం- కనబడేదంతా నశించిపోయేదే. అంటే అసత్యమే. బయటకు చూస్తే మాయ. లోనికి చూడగలిగితే తత్త్వం. మాయను తెలుసుకుంటే తత్త్వం బోధపడుతుంది. అది తెలుసుకోవడమే యోగం. తెలిసిన వాడు యోగి.

Review పలుకు‘బడి’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top