ఉత్తరాయణం

సంక్రాంతి సందడి
తెలుగు పత్రిక జనవరి సంచికలో సంక్రాంతి సందడి కళ్లకు కట్టింది. ఈ పర్వం విశేషాల గురించి మునుపు తెలియని విషయాలను తెలుసుకో గలిగాం. చాలా వివరంగా వివరాలు అందిం చారు. అలాగే, పుష్య మాసం గురించి అందించిన విశేషాలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాయన పుణ్య కాలం ప్రవేశించే వేళ చేయాల్సిన విధాయ కృత్యాలు, నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలుసుకోగలిగాం. ముఖ్యంగా సంక్రాంతి పుణ్య కాలంలో దాన ధర్మాలు చేయాలనే విషయాన్ని, తద్వారా పితృ దేవతల ప్రీతికి పాత్రులు కావాలని చెప్పడం బాగుంది. ప్రధాన కథనాన్ని ఇంత వివరంగా ఇవ్వడం వల్ల తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునే అదృష్టం కలుగుతోంది. తెలుగుపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు.
-ఎం. కృష్ణమోహన్రావు, శశిధర్, వినుకొండ ప్రతాప్రామ్, రాజేశ్.పి., నల్లమల వెంకటేశ్వరరావు, సీహెచ్. సూర్యనారాయణ- హైదరాబాద్, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
ఆధ్యాత్మికం.. ఆరోగ్యం
తెలుగు పత్రిక జనవరి సంచికలో కవర్స్టోరీ సంక్రాంతి పర్వం విశేషాలను విశ్లేషిస్తూనే.. అటు ఆధ్యా త్మికంగా కలిగే ప్రయోజనాలతో పాటు ఇటు ఆరోగ్య పరంగా ఒనగూరే ప్రయోజనాల గురించి వివరించడం బాగుంది. తెలుగు పత్రిక చదివితే ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. మన సంస్క•తీ సంప్రదాయాల్లో ఇమిడి ఉన్న ఆచారాలు.. వాటి వెనుక మన పెద్దలు విధించిన ఆరోగ్య నియమాలను మిళితం చేసి వివరించడం బాగుంది. మతం అంటే కేవలం మూఢ నమ్మకం కాదని, అది ఆయురారోగ్యాన్ని, సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే ఆత్మ విశ్వాసపు గుళిక అని నిరూపించేలా తెలుగు పత్రికలోని ఆధ్యాత్మిక శీర్షికలు ఉన్నాయి.
– వివేకానంద్- హైదరాబాద్, గుడిమల్లం ఆనంద్, ఆర్.భాస్కరరావు- చిత్తూరు, రంజిత్రెడ్డి, రామమూర్తి, వెంకటేశ్ మరికొందరు పాఠకులు ఈ-మెయిల్ ద్వారా..
ఆప్త వాక్యం
మృగా మృగై: సంగ మనువ్రజన్తి
గావ్చ గోభి స్తురగా స్తురంగై:
మూర్ఖాశ్య మూర్ఖై: సుధియ: సుధీభి:
సమాన శీలవ్య సనేషు సఖ్యమ్
మృగములు మృగములతో కలియును.
గోవులు గోవులతో కలియును.
గుర్రములు గుర్రములతో కలియును.
మూర్ఖులు మూర్ఖులతో కలియుదురు.
బుద్ధిమంతులు బుద్ధిమంతులతో కలియుదురు.
గుణ దోషములలో సమానత్వము గలవారికే సఖ్యము
కలుగును.
ఉత్తరాయణంలో తొలిగా వచ్చే గొప్ప పర్వదినం మహా శివరాత్రి. ఉత్త రాయణంతో దేవతలకు పగటి సమయం మొదలవుతుంది. రోజులో దేవతలు పాల్గొనే తొలి అర్చన శివరాత్రి. మొదటిగా ఆరాధించేది పరమేశ్వరుడినే. మహా శివరాత్రి ఆధ్యాత్మిక పరిమళాలనే కాదు.. వైజ్ఞానిక సుగంధాలనూ వెదజల్లు తుంది. ఈ పర్వదిన వేళలో ఉత్తర ధ్రువం నుంచి ఖగోళ అద్భుతాలను స్పష్టంగా చూడవచ్చు. సహజంగా ప్రతి నెలలో కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా చేసుకుంటాం. ఖగోళ దర్శనానికి ఇంతకు మించిన మంచి రోజు లేదంటారు. చంద్రుని వెలుగులో కనిపించని నక్షత్రాలు, అమావాస్య ముందు రోజైన చతుర్దశి నాడు స్షష్టంగా కనిపిస్తాయి. పైగా, మహా శివరాత్రి నాడు అయితే, ఆకాశాన్ని పరీక్షగా చూస్తే.. నక్షత్రాలన్నీ జ్యోతిర్లింగాకృతిలో దర్శనమిస్తాయి. ఉత్తర ధ్రువం నుంచి ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సృష్టి అంతా అండాకృతిలో ఉందని పెద్దలు చెబుతారు. లింగ స్వరూపం కూడా అదే ఆకృతిలో ఉంటుంది. శివుడికి స్థాణువు అనే పేరు కూడా ఉంది. స్థాణువు అంటే కదలలేనిది అని అర్థం. కదలడానికి వీలు లేనంతగా అంతటా నిండి ఉన్న శివతత్వమే స్థాణువు. అది సృష్టంతా నిండి ఉంది. ఖగోళమంతా పరివ్యాప్తి చెంది ఉంది.
ఆనందమే శివం.. శివమే ఆనందం..
ఏది సత్యమో.. ఏది నిత్యమో అదే నిజమైన ఆనందం. నిజమైన సుఖం. ఈ స్థితినే భగవద్గీతలో కృష్ణుడు- ‘దుఃఖసుఖాత్యయం’ అని నిర్వచిస్తాడు. అంటే దు:ఖానికి, సుఖానికి అతీతమైన స్థితి అని అర్థం. ఇంద్రియాల వల్ల వచ్చే హాయి కలిగినట్టే కలిగి అలాగే పోతుంది. అది ఎంత కలిగిందో అంతా ఉండదు. సున్నా అవుతుంది. చివరకు దుఃఖంగా కూడా మారిపోవచ్చు. ఒక రేఖకు చివర సుఖమైతే, మరో చివర దుఃఖం ఉంటుంది. రెండింటి మధ్య బిందువు దగ్గర అది సుఖ, దుఃఖాలను దాటిన స్థితి అవుతుంది. ఇక్కడ ఏ అలజడీ ఉండదు. ఇదే నిజమైన ఆనందం. దీన్నే శివం అంటారు. అందుకే స్వచ్ఛమైన ఆనందానికి ఒక రూపాన్ని ఊహిస్తే అదే శివ స్వరూపం. సుఖదుఃఖాల మధ్య బిందువుకు ఎలా చేరుకోవాలి? అనే ప్రశ్నకూ శివ స్వరూపమే సమాధానం చెబుతుంది. శివుడు యోగ ముద్రలో కూర్చోవడమే కాదు.. ఆయన మెడ చుట్టూ పాము కూడా చుట్టుకుని ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అదరకుండా, బెదరకుండా, కదలకుండా యోగముద్రలో కూర్చోవడమే ఆనందానికి మార్గమని శివుడు తన రూపంతో మనకు ఉపదేశం ఇస్తున్నాడు. చుట్టూ ఎన్ని కష్టాల పాములు చుట్టుకుని ఉన్నా క్షోభ పడకుండా, భయపడకుండా ఉండటమే ఆనందమంటే. అదే శివం.
శాంతచిత్తం.. అఘోర రూపం
శివుడికి గల అనేకానేక రూపాల్లో అఘోర రూపం ఒకటి. సాధారణంగా అఘోర రూపం భయంకరమైనదని అందరూ భావిస్తారు. కానీ, వాస్తవం దీనికి పూర్తిగా భిన్నం. శివుడు నిశ్చల శాంతి రూపుడని చెప్పడానికి ఆయన అఘోర రూపం ఒక ఉదాహరణ. అఘోరుడిగా శివుడు శివం అనే కల్పంలో అవతరించాడు. కల్పం ఆరంభంలో బ్రహ్మదేవుడికి సృష్టి ఎలా చేయాలో గుర్తు రాలేదు. అప్పుడు తనకు జ్ఞానం కావాలని తపస్సు చేసినపుడు శివుడు ఈ అవతారాన్ని ధరించి జ్ఞానబోధ చేశాడని చెబుతారు. అప్పుడు శివుడు నల్లని ఛాయలో ఉన్నాడు. ధరించిన వస్త్రాలు, యజ్ఞోపవీతం, కిరీటం కూడా నల్లనివే. శరీరానికి దివ్య సుగంధాది ద్రవ్యాలను అద్దుకుని ప్రశాంత వదనంతో ఆయన అఘోరిగా అవతరించాడు.
శివుడి విశ్వరూపం.. జగద్రూపం..
శ్రీకృష్ణుడు విశ్వరూపం ధరించి కర్తవ్య బోధ చేయడం గురించి మనకు మహాభారతంలో ఉంది. శివుడు కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించాడా?.. అవుననే అంటోంది శివ పురాణం. ఉమా సహిత మొదటి అధ్యాయంలో శివుని విశ్వరూపం గురించి వివరాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సంతానం కోసం ఈశ్వరుడిని ప్రార్థించేందుకు కైలాసానికి వెళ్లాడు. అక్కడ కృష్ణుడికి పరమ శివ భక్తుడైన ఉపమన్యు మహర్షి కనిపించాడు. మాటల మధ్యలో ఆ మహర్షి తాను దర్శించిన శివుడి దివ్య రూపాన్ని గురించి కృష్ణుడికి ఇలా వివరించాడు-
‘ఆ స్వామి నిత్యానంద స్వరూపుడు. ఎప్పటికీ నాశనం లేని వాడు. ఆయన ఒక అంశలో జగద్రూపంతో ఉంటాడు. అంటే జగత్తు అంతా ఆయన స్వరూపమే. ఆయనకు మరో రూపం కూడా ఉంది. పెద్ద కోరలు, మంటలను మింగే నోళ్లతో ఉంటాడు. రెండు వేల సూర్యుల కిరణాల కాంతితో ప్రకాశిస్తుంటాడు. ఆయన చేతుల్లో శ్రేష్ఠమైన అస్త్రాలన్నీ ఉంటాయి. అనేక నేత్రాలు, అసంఖ్యాక పాదాలు ఆయనకు ఉంటాయి. అలా ఉండే ఆయన ఎడమ పక్కన హంసలను పూన్చిన దివ్య విమానాన్ని ఎక్కి బ్రహ్మ, ఆ పక్కనే గరుడ వాహనాన్ని ఎక్కి నారాయణుడు ఉంటారు. ఇంకా పార్వతి, ప్రమధ గణాలను ఆయనతో పాటే ఉంటాయి. కల్పాంతంలో జగత్తునంతటినీ ఉపసంహరించేది శివుడికి సంబంధించిన విరాడ్రూపమే’ అని ఉపమన్యు మహర్షి శివుని విశ్వరూపాన్ని గురించి కృష్ణుడికి చెబుతాడు.
శివరూపావతారంలో చేత సుదర్శన చక్రం
సాధారణంగా శివుడి ఆయుధం త్రిశూలం.. విష్ణువు ఆయుధం సుద ర్శన చక్రం అని అందరికీ తెలుసు. కానీ, శివుడు కూడా సుదర్శన చక్రాన్ని ధరించాడు. శివ పురా ణంలో ఈ వివరాలు ఉన్నాయి. పరమేశ్వరుడి అవతారాల్లో ఒకటైన వామదేవ మూర్తిది సాక్షాత్తూ విష్ణు స్వరూపమే. ఆయన చేతిలో శంకు, చక్రాలు కూడా ఉంటాయి. శివకేశవ ఏకత్వాన్ని రూఢి చేస్తూ- ‘శివాయ విష్ణు రూపాయ.. శివ రూపాయ విష్ణవే’ అనే మంత్ర భాగం ఉండనే ఉంది. ఇది కాకుండా ఉపమన్యు మహర్షి శివుడు తనకు దర్శనమిచ్చిన అవతారంలో చేతిలో సుదర్శన చక్రం ఉందని చెబుతారు. ఇంకా రుద్రుడి చేతిలో ఓ మహత్తరమైన ఆయుధం ఉంటుంది. అదే- త్రిశూలం. దానిని ‘విజయం’ అని పిలుస్తారు. త్రిశూలాన్ని ధరించినందునే శివుడిని శూలి అని కూడా అంటారు. భూమిని బద్ధలు కొట్టి, సముద్రాలను ఎండగట్టి, నక్షత్ర సమూహాలను కూల్చేసే శక్తి ఈ ఆయుధానికి ఉంది. ఈ శూలం మూడు కొనలు కనుబొమ్మల్లా, నిలువెత్తున ఉండి భయంకరంగా కనిపిస్తుంది. అలాగే, శివుడి చేతిలో గండ్ర గొడ్డలి ఒకటి ఉంటుంది. వీటితో పాటు సుదర్శన చక్రం, వజ్రాయుధం, అమ్ముల పొదిలో పినాకం అనే ధనుస్సు, కత్తి, పాశం, అంకుశం కూడా ఉంటాయి.
బృందావనంలో శివలీల..
విష్ణువు మోహినీ అవతారం ధరించి దేవత లకు అమృతాన్ని పంచిన కథ మనందరికీ తెలుసు. మరి, శివుడు స్త్రీ వేషం ధరించి కృష్ణుడి కోసం తపించిన వైనాన్ని బృందావనంలో మనం చూడవచ్చు. పూతన తదితర రాక్షసులు రకరకాల వేషాలతో కృష్ణుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో శివుడు బృందావనానికి వెళ్లాడు. ఆయనను గోపాలకులు హెచ్చరించి వెనక్కి పంపారు. తాను సాక్షాత్తు పరమేశ్వరుడినని చెప్పినా వారు పట్టించుకోలేదు. అప్పుడు శివుడు గోపికగా మారి, బృందావనంలోకి ప్రవేశించాడు.
శ్రీకృష్ణుడు అది చూసి.. ‘స్వామీ! ఏమిటీ వేషం?’ అని అడిగాడు.
అప్పుడు శివుడు- ‘కృష్ణా! నీ లీలలు చూడ టానికి ఈ వేషం తప్పలేదు’ అని అన్నాడట.
శ్రీకృష్ణుడు స్వయంగా బృందావనంలో ఓ శివా లయం కట్టించాడట. సాయంత్రమైతే గోపికగా మారతాననీ, అందుకు అనుమతిస్తేనే తాను ఇక్కడ ఉంటానని శివుడు షరతు పెట్టి ఆ ఆలయంలో కొలువు దీరాడని అంటారు. నేటికీ బృందావనం లోని గోపీశ్వరాలయంలో సాయంత్రం ఆరు గంటల తరువాత భక్తులకు ప్రవేశం నిషిద్ధం. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పరి మళ ద్రవ్యాలు పూసుకుని స్వామిని దర్శించు కోవచ్చు.

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top