తెలుగుకు అంతర్జాతీయ ఖ్యాతి
వేగంగా కనుమరుగైపోతున్న భాషల్లో మన తెలుగు ఒకటి. దీనిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ, ఎలా? మన తెలుగు వారందరిలోనూ మాతృభాష క్షీణదశలో ఉందనే బాధ ఉంది. ఆవేదన ఉంది. కానీ, ఈ పోటీ ప్రపంచంలో, బతుకు పోరాటంలో పడి ఎవరికి వారే ఏమీ చేయలేని, కనీస సమయం కేటాయించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో బృహత్తర, గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది ‘తెలుగు పత్రిక’. ఇది మన తెలుగు వారి ఇంటి పత్రిక. ఇది మన తెలుగు వారి ప్రతి ఇంటి చిరునామా కావాలి. మన భాషను, మన ఆచారాలను, మన సంస్క•తీ సంప్రదాయాలను అక్షరబద్ధం చేస్తూ, వాటిని వెలికితీస్తూ భావితరాలకు ఒక ఘనమైన వారసత్వంగా అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ‘తెలుగు పత్రిక’కు అందరూ సహకరించాలి. ‘తెలుగు పత్రిక’ ప్రయత్నాలకు వెన్నుదన్నుగా నిలవాలి.
– తెలుగు ఎన్‍ఆర్‍ఐ మిత్ర బృందం, టెక్సాస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఆధునికం.. సంప్రదాయం..
తెలుగు పత్రిక ఆధునికత, సంప్రదాయాల మేళవింపుతో, మేటి శీర్షికలతో అద్భుతంగా వస్తోంది. ఇందులో పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ చదివించే, అందరూ చదవాల్సిన విషయాలను, విశేషాలను సవివరంగా అందిస్తున్నారు. ఈ పత్రిక నేటి అవసరం. మన తెలుగు వారి సమున్నత గౌరవాన్ని, మన తెలుగు సంస్క•తీ సంప్రదాయాలను అంతర్జాతీయంగా చాటుతున్న ఇటువంటి పత్రికలు ఈ రోజుల్లో ఎంతైనా అవసరం.
– పి.కిశోర్, నల్లగొండ, తెలంగాణ
తెలుగుకు వెలుగు…
ఇప్పటికే అనేక తెలుగు పత్రికలు ఉన్నాయి. పేరులో ‘తెలుగు’ అనే పదాన్ని తగిలించుకుని ఏవేవో ఇస్తున్న పత్రికలే ఎక్కువ. అయితే, అచ్చ తెలుగు అందాలకు అద్దం పట్టే రీతిలో ఒకపక్క సంప్రదాయాలను, మరోపక్క ఆధునికతను రంగరించి మకుటాయమానమైన శీర్షికలతో అలరిస్తున్న నిఖార్సయిన ‘తెలుగు పత్రిక’ ఇది.
– సతీష్, ఆన్‍లైన్ పాఠకుడు, యూఎస్‍ఏ
అవీ.. ఇవీ.. అన్నీ
‘తెలుగు పత్రిక’లో అందిస్తున్న శీర్షికలు విభిన్నంగా ఉన్నాయి. ఒకపక్క మన మాతృభాషకు సంబంధించి, మరోపక్క మన సంస్క•తీ సంప్రదాయాల గురించి, ఇంకోపక్క ఆధునిక సమాచారాన్ని అందిస్తూ అన్ని విధాలుగా అలరిస్తోంది. ఇదే ఒరవడిని మునుముందు కూడా కొనసాగించండి.
– శంకరప్రసాద్, హైదరాబాద్, తెలంగాణ
ఇంకా చాలా కావాలి..
‘తెలుగు పత్రిక’లో చాలా వివరాలు అందిస్తున్నారు. సంతోషం. అయితే, ఇంకా చాలా కావాలని అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా ప్రముఖ పర్యాటక ప్రాంతం, ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రం, మానసిక వికాసం కలిగించే శీర్షికలను కూడా ప్రవేశపెట్టండి. పాఠకుల యాత్రానుభవాలకు చోటివ్వండి. కథలు కూడా ఉంటే మంచిది. పురాణేతిహాస కథలు, ఇతరత్రా ఆధ్యాత్మిక సమాచారానికి, భాషా సంబంధమైన అంశాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చి విశేషాలు అందించండి.
– రామకృష్ణ.కె., ఆస్టిన్, అమెరికా సంయుక్త రాష్టాలు
Review ఉత్తరాయణ.