కాన్క-కోవెల

మీ జీవితధ్యేయమేమిటి? అని అడిగితే మోక్షం పొందటం, లేదా తిరిగి దైవసన్నిధికి చేరడం అనే జవాబు సాధారణంగా చెబుతాం. ఎంతో ప్రేమను, మేధస్సును నింపి ఇంత అందమైన ఆనందమయమైన, ఆయన ప్రసాదించిన జీవితాన్ని దైవప్రసాదంగా అనుభూతి పొందుతూ, జీవితాన్ని అనుభవించి, ఆనందానుభూతిని పొందితే జీవితమంతా దైవసాన్నిధ్యాన్ని అనుభవించినట్లే. భగవంతుడు అనుగ్రహించిన అతి విలువైన కాన్క ఈ జీవితం. ఈ కాన్కలో కాపురమున్న ఆయనకనూ, కాన్కనూ అనుభవించడం ద్వారా, ఆనంద సంబరాల కనకాంబరాలను ఏరుకుని, ఆ తర్వాత కోవెలలో కొలువున్న ఆయనను కృతజ్ఞాతాభరిత హృదయంతో కొలిస్తే ఆయన ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు. ఆయన ఆయాచితంగా మనకిచ్చిన అద్భుతమైన ఈ జీవితమనే కాన్కను అనుభవించకుండా కాషాయాన్ని కట్టి కాననానికి చేరినా, కోవెల్లో కేవలం పూలతో, పండ్లతో పూజించినా భగవంతుడు అంతగా ఆనందించడు.
మీ అబ్బాయిని ఆస్ట్రేలియా పంపుతున్నారనుకోండి. అక్కడికి చేరిన వెంటనే తిరిగి రావాలని మీరు కోరుకుంటారా? ఎంతో డబ్బు ఖర్చు చేసి, ఎన్నో కష్టాలకోర్చి, పాస్‍పోర్ట్, వీసా వంటివి సమకూర్చి మీరు విమానం ఎక్కిస్తారు. అక్కడ మెల్‍బోర్న్ ఎయిర్‍పోర్టులో మీ అబ్బాయి దిగిన వెంటనే నీ లక్ష్యం ఏమిటని ఎవరో అడిగారు. మా నాన్న దగ్గరకు తిరిగి వెళ్లడమే అని సమాధానం చెప్పాడనుకోండి. వినేవారికి ఆ జవాబు ఎలా అనిపిస్తుంది?
ప్రకృతి ఎంతో శ్రద్ధతో ఇంత అద్భుతమైన శరీరాలను మనకిచ్చి ఈ లోకానికి పంపింది. సృష్టి సౌందర్యాన్ని తిలకించి పులకించడానికి నేత్రాలు, రుచులు ఆస్వాదించడానికి నాలుక, సుగంధాలు ఆఘ్రాణించడానికి నాసిక, ఇలా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అవయవం చక్కగా ఏర్పాటు చేశాడు దేవుడు. ఆకలికి ఆహారం, దాహానికి మంచినీరు ఇలా ప్రతి విషయంలోనూ మన పట్ల అపారమైన ప్రేమతో తగు జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇన్ని అందచందాలు, ఆనంద కారకాలు సృష్టించి అనుభవించమని మనల్ని ఇక్కడికి పంపితే, తిరిగి దైవసన్నిధికి చేరుకోవాలనుకోవడం అర్థంలేని ఆలోచన. ఆస్ట్రేలియాలో హాయిగా తిరుగు, సుఖంగా కాలక్షేపం చెయ్యి. అక్కడ నువ్వెంత ఆనందంగా ఉంటే ఇక్కడ నీ తండ్రి అంత సంతోషిస్తాడు ఆ తర్వాత ఎప్పుడైనా తిరిగి రావచ్చు.
ఆస్ట్రేలియాలో
ఉన్నప్పుడు నీ తండ్రిని, నీ దేశాన్ని మరచిపోవాలని మాత్రం అపార్థం చేసుకోకు. నీ తండ్రికి కొడుకునన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకొని ఆ దేశంలోని వింతలు, విశేషాలు వినోదించు. అంతేకానీ అక్కడున్నన్ని రోజులూ ఇంటి బెంగతో దిగాలుగా ఉండి తిరిగి వస్తే మీ నాన్న సంతోషిస్తాడా? ఆయన పంపిన లక్ష్యం నెరవేరుతుందా? జీవితమంటే ప్రకృతిలోని ఆనందాన్ని జుర్రుకోవడమే. ఇదే సహజమైన జీవనవిధానం. ఘుమఘుమలాడే వంటకం ముందు కూర్చొని, వండిన వారిని పొగడుతూ కాలక్షేపం చెయ్యం కదా! కమ్మగా తినాలి. రుచులు అనుభవించాలి. అప్పుడు వండిన వారిని అభినందించాలి. అలాగే సృష్టికర్తను ఆరాధించాలి. ఇదే జీవితధ్యేయం. ఇదే సహజమైన సరళమైన జీవనశైలి.

Review కాన్క-కోవెల.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top