ప్రకృతికాంత మెడలో చేమంతుల హారం.. హేమంతం!

తస్య తే వసంత: శిర: గ్రీష్మో దక్షిణ: పక్ష: ।
వర్షా: పుచ్ఛం, శరద్‍ ఉత్తర: పక్ష:, హేమంతో మధ్యం ।।
సంవత్సరమనే పక్షికి వసంతం శిరసు అయితే గ్రీష్మం కుడి రెక్క. వర్ష రుతువు తోక. శరదృతువు ఎడమ రెక్క కాగా, హేమంతం మధ్య భాగం అని చెబుతుందీ మంత్రం.
ప్రకృతిలో కలిగే మార్పులకు సాక్షి..
ఆధ్యాత్మిక సాధకులకు రక్ష..
కవులకు, కావ్యాలకు అక్షరమాలిక..
వేదం చెప్పిన కాల స్వరూపం..
పరమాత్మ ఉపదేశించిన గీతాసారం..
ఇవన్నీ తనలో ఇముడ్చుకున్న అందమైన రుతువు హేమంతం.
హేమంత రుతువు ఆధ్యాత్మిక కోణంలో ఆహ్లాదకరమైనదే కాదు.. అనంత సిద్ధులనూ ప్రసాదించే అద్భుత సందర్భం.
వానజాడలు పూర్తిగా కనుమరుగై.. అప్పటికే ప్రవేశించిన చలిని రెట్టింపు చేస్తూ ప్రకృతికాంతకు చేమంతుల హారం వేస్తుంది హేమంతం.
శరత్కాలానికి వీడ్కోలు పలికి.. ప్రకృతి హేమంతానికి స్వాగతం పలికే వేళకు అప్పటి వరకు వర్షాలతో నిండిన వాతావరణం నెమ్మదిగా శీతలంగా మారుతుంది.
పగటి కాల వ్యవధి తగ్గుతుంది. రాత్రి నిడివి పెరుగుతుంది.
శీతలగాలులు ప్రతాపం చూపుతాయి.
ఇతర రుతువులకు భిన్నంగా హేమంతం మనుషులను దగ్గర చేస్తుంది. ఆహ్లాదాన్ని పెంచుతుంది. అంతేకాదు.. అందరూ కలిసి ఒక్కటిగా నడిస్తే సమాజం ఎంత ఉన్నతంగా ఎదుగుతుందో చెబుతుంది.
వేదకాలంలో సంవత్సరారంభం మార్గశిర మాసంతోనే అంటే హేమంతంతోనే మొదలయ్యేదట.
ఆ కాలంలో మార్గశిర మాసాన్ని ‘అగ్రహాయణిక’ అనే పేరుతో వ్యవహరించే వారు.
ఆధ్యాత్మిక చింతనకు బీజం వేసే మాసం మార్గశిరం అయితే, అందుకు వేదికయ్యేది హేమంత రుతువు.
చంద్రుడు మన:కారకుడు. అంటే మన మానసిక స్థితి చంద్రుడి వృద్ధిక్షయాలను బట్టే ఉంటుంది. అటువంటి చంద్రుడు పూర్తిగా అనుకూలించే కాలం హేమంతం.
ఆదికవి వాల్మీకి నుంచి ఆధునిక కవుల వరకూ అందరికీ హేమంతం అంటే మక్కువ.
ఇక, ప్రబంధ కవులైతే హేమంత వర్ణనలతో తమ గ్రంథాలను రంగరించారు.
శ్రీరామచంద్రుడికీ హేమంతమంటే ఎంతో ఇష్టమట.
మనకూ అనుకూలిస్తానంటూ హేమంతం స్వాగతం పలుకుతోంది.
ఆధ్యాత్మిక సాధనకైనా, మంచి పని తలపెట్టడానికైనా ఇదే తరుణం.

– డాక్టర్‍ కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review ప్రకృతికాంత మెడలో చేమంతుల హారం.. హేమంతం!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top